[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
ప్రకృతికి ఒక లయ ఉంది. ఆ లయకు కారణం ఋతువులు. కాలానుగుణంగా మారే ఋతువులను అధ్యయనం చేయడం ద్వారా మనిషి కాలాన్ని నిశితంగా పరిశీలిస్తూ, ప్రకృతితో కలసి జీవించేవాడు. కారణం ఋతువులకూ జీవ వైవిధ్యానికీ సైతం విడదీయరాని బంధం ఉంది. అరిజోనాకూ, ఫీనిక్స్‌కూ సీజన్లలో పెద్దగా భేదం లేదు. అక్కడికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘టస్కన్’ లో వర్ష ఋతువు వేసవిలో వస్తుంది. ఉపగ్రహ వ్యవస్థల నుండి ప్రకృతిని అధ్యయనం చేయగల సాంకేతికతలు ఈనాడు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ‘ప్రకృతితో మమేకమై జీవించిన మనిషి, ఈనాడు ప్రకృతికి దూరమై తనకు తానుగా వినాశనం దిశగా పరుగులు తీయడమే కాక సమస్త జీవకోటి మనుగడకూ ప్రమాదకరంగా పరిణమించాడు’ అన్న సత్యాన్ని చాటి చెప్తున్నాయి.
చెట్లను నరికి ఉపాధికై నేలను సేకరించే విధానం 1950 నాటికి చెట్ల మ్రానులకు విషాన్ని ఎక్కించి చంపటం, 80ల నాటికి మట్టిని విషపూరితం చేసి అడవులను నాశనం చేయడం, ఆకాశం నుండి ‘స్ప్రే’ ల ద్వారా క్రమేపి అడవులను నశించిపోయేలా చేయడం, ‘కేటిల్ లాండరింగ్’ ఇలా – మనిషి ధ్వంస రచనకు అంతమే లేకుండా పోయింది. పారిశ్రామికీకరణ, వ్యవసాయం, పశువుల పెంపకం ఇలా కారణం ఏదైనా అవసరం, ఆచరణ మనిషిది. బలికి గురవుతున్నది మాత్రం ప్రకృతి వ్యవస్థలే.
అతి పురాతనమైన ‘పాండో’ – ఎన్నో వైపరీత్యాలను తట్టుకొని ఇప్పుడు ముప్పు ముంగిట్లో:
‘పాండో’ (లాటిన్‍లో ఈ మాటకు I Spread అని అర్థం) అతి పూతనమైన ఈ వృక్ష వ్యవస్థ అమెరికాలోని అట్టావాలో ఉంది. 16000 – 80000 సంవత్సరాల నడుమ దీని వయసు ఉంటుందని అంచనా. ప్రపంచంలో అత్యంత పురాతనమైన, విస్తృతమైన ఈ వృక్షం 106 ఎకరాలలో విస్తరించి ఉంది. తెల్లటి పట్ట, చిన్న ఆకులతో ఉండే ఈ చెట్టుకు అదే నమూనాలో ఉండే 47000 కాండాలు అంతర్గతంగా భూమిలో అనుసంధానితమైన మూలవ్యవస్థ/వేర్లవ్యవస్థను ఆధారంగా చేసుకోని వృద్ధి చెంది ఉంటాయి. చెట్టు మొత్తం ఒక ‘Woodlands’ లాగా విస్తరించి ఉంటుంది. ఈ చెట్టు బరువు రమారమి 6,000 మెట్రిక్ టన్నులని అంచనా. చెట్టును ఇంకా విస్తరింప చేస్తూ, చిన్న చిన్న పిలకలు పుడుతూనే ఉంటాయి.
ఈ ‘పాండో’ ప్రపంచం మొత్తం మీద ఉన్న పెద్ద జీవులన్నిటి కంటే పెద్దదైన ప్రాణి. ఈ వృక్షాన్ని, దాని నీడను ఆధారంగా చేసుకొని అనేక జాతుల మొక్కలు, జంతువులు పెంపొంది మనుగడ సాగిస్తున్నాయి. ఇప్పుడు ఈ అద్భుతమైన వృక్షరాశి మనుగడ ప్రమాదంలో పడింది. U.S. నేషనల్ ఫారెస్ట్ ప్రొటెక్షన్‌లో ఉన్నప్పటికీ వివిధ కారణాలుగా దీని మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. వాతావరణ మార్పులు ఒక కారణం అయితే పాత మొక్కలను లేళ్లు వంటి జంతువులు ఆహారంగా తింటుండడం మరొక కారణం. బాగా పెద్దవైపోయిన చెట్లు సహజంగా మరణిస్తుండగా, ఆకుమచ్చ, బూజుతెగులు, కేన్సర్ వంటి తెగుళ్ళు మిగిలిన చెట్ల పట్టలకు సోకుతున్నాయి.
ఏది ఏమైనా చెట్లకు వాటి వ్యవస్థలో సహజసిద్ధంగానే ఉండే రక్షణ వ్యవస్థ వివిధ కారణాలుగా దెబ్బతింటోంది. సృష్టి లోని కదిలే ప్రాణులన్నిటిలో వలె చెట్లు కూడా సజీవ వ్యవస్థలే. అచరాలే అయినప్పటికీ వాటికీ స్పందనలు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రసిద్ధ శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ ఏనాడో శాస్త్రీయంగా బుజువు చేశారు. అనంతరం ఆ దిశగా అధ్యయనాలు సాగుతూనే ఉన్నాయి.
1997 లో కెనడాకు చెందిన శాస్త్రవేత్త సుజానే షిమార్డ్ (Dr. Suzanne Simard) భూమిలో ఉండే మైక్రో రైజల్ ఫంగస్ ద్వారా చెట్లు విపత్తులు, ఆహార అవసరాలు మొదలైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంటాయని కనుగొన్నారు. ఆయన దీనిని (ఈ సమాచార వ్యవస్థని) ‘ఉడ్ వైడ్ వెబ్’గా ప్రస్తావించారు. చెట్ల వేర్లు వ్యవస్థలను కలుపుతూ ఉండేఈ వ్యవస్థ ద్వారా చెట్ల నడుమ సమాచార మార్పిడి/ప్రసారం జరుగుతుందన్నది ఆయన అధ్యయనాల సారాంశం.
పేపర్ బిర్చ్ (భోజపత్ర) – డగ్లస్ ఫిర్‌ల నడుమ కార్బన్ ట్రాన్స్‌ఫర్/బదలాయింపుని రేడియో ఐసోటోప్స్‌తో ట్రేస్ చేయడం తెలిసినదే. ‘బిర్చ్’ అధిక కార్బన్ ద్వారా ‘ఫిర్’కి సంకేతం పంపితే ‘ఫిర్’ తిరిగి ‘బిర్చ్’కి కార్బన్‌ని పంపింది. మరొక పరిశోధనలో ఫిర్ చెట్లుకు తీవ్రమైన గాయాలు అయిన సందర్భంలో అది సమీపంలోనే ఉన్న ‘పాండెరోసాపైన్’కి సంకేతాలు పంపింది. రక్షణ ఎంజైమ్ కోసం ‘బిర్చ్’ పంపిన సంకేతాలకు ‘పైన్’ ప్రతిస్పందించింది.
సూర్యగ్రహణం వంటి ప్రత్యేక సందర్భాలలో సన్నద్ధం కావడానికి సైతం భోజపత్ర చెట్లు అతి వేగంగా బయో ఎలక్ట్రికల్ సంకేతాలను పంపుతాయని తెలిసింది. ఈ సంకేతాలు కంటికి కనిపించవు. చాలా తక్కువ పవర్ ఉన్న సెన్సర్స్‌తో ఈ బయోలాజికల్ పల్సెస్‌ని రికార్డు చేయడం జరిగింది.
మనిషి ప్రమేయం ఏ మాత్రం లేకుండానే ఎప్పటికప్పుడు – ఎక్కడికక్కడ ప్రకృతి వ్యవస్థలన్నీ తమకు తామే సహకరించుకుంటూ పరిస్థితులు అదుపు తప్పి తీవ్రమైన నష్టం వాటిల్లిన సందర్భాలలో తమను తాము పునర్మించుకొంటూ మనగడ సాగిస్తుండగా మనిషి మాత్రం ప్రకృతిని నాశనం చేయడానికే నన్నట్లు మేధోన్మత్తునిలా సాగిపోతున్నాడు. ఇది అత్యంత దయనీయమైన పరిణామం.