[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
వెలుగుతున్న దీపం, ఎన్ని దీపాలనైనా వెలిగించగలదు -షేక్‌స్పియర్
50 సంవతరాలు క్రితం సాట్ (Sot) నది ఉత్తరప్రదేశ్‌లో 70 గ్రామాల గుండా ప్రవహిస్తూ, సంబల్‍కు ప్రధాన నీటివనరుగా ఉండేది. ఉత్తరాన ‘అమ్రోహా’ జిల్లా నుండి దక్షిణ దిశగా ప్రవహించే ఈ నది వరి పంటలకు ఆధారంగా ఉండేది. 2022 నాటికి ఈ నది ఇంచుమించుగా ఎండిపోయింది. ఆక్రమణల కారణంగా ఉన్న కాస్త ప్రవాహం అక్కడక్కడ చెలమలుగా, కుంటలుగా మారిపోయింది. రైతులు గొట్టపు బావులపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తుండడంతో, భూగర్భ జలాలు కూడా తగ్గిపోయాయి. 50 అడుగుల లోతున కూడా నీరు పడటం కష్టమైపోయింది.
అటువంటి పరిస్థితులలో సంబల్ జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన మనీష్ బన్సాల్ తన ఫీల్డ్ విజిట్‌లో ఒక ప్రాంతాన్ని నదీ ప్రవాహ ప్రాంతంగా గుర్తించారు. నిజానికి ఆనవాళ్ళే తప్ప నది ఉనికి మిగలలేదు. అక్కడి నీటి ఎద్దడి, నీరు నిలిచిపోవడం వంటి సమస్యలకు క్షుణ్ణంగా పరిశీలించాక మనీష్ బన్సాల్ ‘సాట్’ నదిని పునరుద్ధరించాలని నిశ్చయించుకున్నారు. మొదటగా నదీ ప్రవాహం, నిడివి మొదలైన అంశాలను అంచనా వేయటానికై సర్వే నిర్వహించారు. సర్వేలో ‘సాట్’ నది ‘అమ్రోహా’ జిల్లా నుండి ‘బదావున్’ వరకు 110 కిలోమీటర్ల నిడివిలో ఉన్నట్టు తేలింది. నదిలోనికి నీరు చేరే అనేక దారులు రైతుల వ్యవసాయ ఆక్రమణలతో మూసుకు పోయాయి. ఆ ఆక్రమణలను తొలగించకుండా నదీప్రవాహాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని తేలిపోయింది.
మొదటగా స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో రెవెన్యూ రికార్డుల ఆధారంగా సంబంధిత రెవెన్యూ బృందాలు ఆక్రమణలను తొలగించడం జరిగింది. తరువాత నదీ ప్రాంతంలోని పూడిక తీయించడం జరిగింది. పూడికతీత, నదిలోనికి నీరు వచ్చే దారులను క్లియర్ చేయడంలో ‘మహాత్మ గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్’ (MGNREGA) గ్రూప్ లోని వారిని భాగస్వాములను చేయడం జరిగింది. నది కాచ్‌మెంట్ ఏరియాస్ అన్నీ పునురుద్ధరించబడటంతో నది పూర్వవైభవాన్ని సంతరించుకుంది. నీటి సహజ ప్రవాహం నదుల వైపే ఉంటుంది. దానిని అడ్డుకున్నప్పుడే ఎక్కడికక్కడ నీరు నిలచిపోవడం జరుగుతుంది. అవరోధాలు తొలగిపోవడంతో నీరు నిలిచిపోవడం సమస్య సైతం తీరిపోయింది. పునరుద్ధరణ మాత్రమే కాదు. నది నీటి సమృద్ధితో కొనసాగేలా పలు చర్యలు చేపట్టడం జరిగింది.
యథాతథ స్థితి కొనసాగింపు చర్యలలో భాగంగా – నది ప్రవాహ వేగాన్ని నియంత్రించడానికి అనేక ‘మైక్రో చెక్ డామ్స్’ నిర్మించబడ్డాయి. భవిష్యత్తులో మట్టి కోసుకుపోకుండా 10,000 వరకు వెదురు పిలకలను నాటడం జరిగింది. నీటి కష్టాలు తీరడంతో అక్కడి స్థానికులలోనూ/రైతులలోనూ అవగాహన కలిగింది.
డిసెంబర్ 2022 లో మొదలుపెట్టబడిన ఈ ప్రాజెక్టు జూన్ 2023 నాటికి పూర్తి అయి ఆ వర్షబుతువు లోని నీటిని నది ఒడిసిపట్టి పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా చేసింది.
సహారన్‌పుర్ బదిలీ అయినా బన్సాల్ తన జలయజ్ఞాన్ని ఆపలేదు.
కారణం –
శివాలిక్ కొండలలో బయలుదేరి సహరన్‌పూర్ జిల్లాకు పారే అనేక చిన్న నదులు ఋతుపవనాలపై ఆధారపడి ప్రవహించేవి.
IIT ఢిల్లీ నుండి వచ్చిన మనీష్ బన్సాల్ UPSC ‘53’ వ రాంక్ హోల్డర్ కూడా. ఈయన కృషి ప్రధాన మంత్రి ప్రశంసలను సైతం అందుకున్నది.
‘సాట్’ నది పునరుద్దరణలో పాలుపంచుకున్న అమ్రోహా, బుదౌన్ జిల్లాల అధికారులు ప్రాజెక్ట్ అందించిన అనూహ్యమైన ఫలితాలతో స్ఫూర్తి పొంది ఇరు జిల్లాలలో నది ఎగువ దిగువ ప్రాంతాల పునరుద్ధరణ దిశగానూ పనులు ప్రారంభించడం విశేషం.
IAS హిమాంశు నాగ్‌పాల్ – ఛీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్. వారణాసిలో అనేక కంపెనీలు రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ చేయక భూర్భజలాలు వాడేసేవి. ఆ కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడమేకాక, వాననీరు ఎక్కడి కక్కడ నిలిచిపోవటం, నీటి కటకట వంటి సమస్యలతో ప్రజలు సతమతం అయ్యేవారు.
చీఫ్ డెవెలప్‍మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన హిమాంశు నాగ్‌పాల్ అన్ని సమస్యలకు చక్కని పరిష్కార మార్గం అమలు చేశారు. అవి – సబ్‌మెర్సిబుల్ పంపులు బిగించుకునేవారు జిల్లా అడ్మినిస్ట్రేటిన్ అధికారుల నుండి అనుమతి తీసుకోవాలి. తాము భూమి నుండి తోడిన నీటిని సంవత్సరం లోపున రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా చెల్లు వేయాలి. ఆయన ఆ విధానాన్ని పటిష్టంగా అమలు చేశారు.
స్థలాభావం కారణంగా వర్షపు నీటిని సాగు చేయలేని పరిస్థితులలో ఉన్నాయి అనేక కంపెనీలు! సమస్యకు పరిష్కారంగా ఆయన విస్తారంగా స్థలం ఉన్న పబ్లిక్ బిల్డింగ్స్‌లో ‘వాననీటి సాగు’ (R.W.H) వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ చర్యతో భూగర్భ జలమట్టాలు పెరిగాయి.
‘మినిస్ట్రీ ఆఫ్ జల్‌శక్తి’ (MOJS) నియమావళి ప్రకారం – బోర్‌వెల్స్, సబ్‌మెర్సిబుల్ పంప్స్ వంటివి బిగించుకునే ప్రజలు, వ్యవస్థలు జిల్లా అధికార యంత్రాంగం నుండి అనుమతి తీసుకోవాలి. ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తే, భూగర్భ జలాలను రీఛార్జి చేసుకోవడం సహజ ప్రక్రియగా సాగిపోతుంది. అయితే వాస్తవానికి ఏటా 30 వరకు NoC దరఖాస్తులు వస్తే వారిలో కూడా చాలా మంది ‘వాననీటి సాగు’ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవటం లేదు. చట్టవిరుద్ధంగా వేయబడుతున్న బోర్ వెల్స్ 700 వరకు ఉంటున్నాయి.
వర్క్‌షాప్స్ నిర్వహించడం ద్వారా, నీటి నిర్వహణ గురించి అవగాహన కల్పించడంతో 400కు పైగా సంస్థలు NoC లు పొందడానికి రాజమార్గంగా తమ ప్రాంగణాలలో ‘వాననీటి సాగు’ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. అనుమతులను పట్టించుకొని నియమాలను ఉల్లఘించిన చోట్ల పంప్స్ సీల్ చేయడం ద్వారా మరికొందరిని దారికి తేగలిగారు. పటిష్ఠంగా నియమావళిని అమలు చేయడంతో ఏడాది తిరగకుండా ‘డార్క్ జోన్స్’ జాబితాలో నుండి ఒక జోన్ బయటపడడం జరిగింది. నిరంతర కృషి ఫలితంగా భూగర్భ జలమట్టం క్రమేపి పెరుగుతూ గత మూడు సంవత్సరాలలో 8/9 అడుగుల వరకు పెరగడం మరొక సత్ఫలితం. జీవధారలైన ‘వరుణ’, ‘నాడ్’ నదులను పునరుద్ధరించడంతో మొదలైన ప్రస్థానం అనేక నీటి సమస్యల పరిష్కారంతో ముందుకు సాగుతోంది. హిమాంశు నాగ్‌పాల్‌కు గల అధికారపు హంగు (C.D.O.) కు ఆయన చిత్తశుద్ధి కూడా తోడవడంతో మాత్రమే ఇదంతా సాధ్యపడింది.
ఒక మనీష్ బన్సాల్, ఒక హిమాంశు నాగ్‌పాల్, వెలుగు లోకి రాని మరెందరో స్ఫూర్తిప్రదాతలు. ఇటువంటి వారి వలన ప్రజలలో చైతన్యం పెరిగి, ఒకరు ఇద్దరై, ఇద్దరు నలుగురై, అలా ఎందరో స్ఫూర్తిమంతులైనా కూడా చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. తద్వారా నేల తల్లి ఆవేదన తీరే మార్గం లభిస్తుంది.