[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
మానవ మేధస్సు – రెండు వైపులా పదును ఉన్న కత్తి:
శాస్త్రజ్ఞులు 1200 ప్రాంతాల నుంచి మట్టి శాంపిల్స్, 46 గ్లేసియర్స్ నుండి శాంపిల్స్ తీసుకొని లేబొరేటరీలో విశ్లేషించారు. ఆయా ప్రాంతాలలో గతంలో ఉనికిలో ఉండిన, ప్రస్తుతం ఉన్న జీవ/జంతు వైవిధ్యాన్ని అంచనా వేయటానికి – దొరికిన ఆనవాళ్ల ఆధారంగా డి.ఎన్.ఎ. జాడలు ఏవైనా లభించగలవన్న ఆశతో ఈ పరిశోధనలు జరిగాయి. అట్లా దొరికిన డి.ఎన్.ఎ. జాడల శాంపిల్స్‌తో ఏ స్పీషిస్ ఎప్పుడు వచ్చాయి? ప్రకృతి వ్యవస్థలు ఎట్లా ఏర్పడ్డాయి అన్న అంచనాలకు రావడానికి రమారమి 10 సంవత్సరాల పాటు ఈ అద్యయనాలు సాగాయి. ఈ పర్యావరణ డి.ఎన్.ఎ. శాంప్లింగ్ టెక్నిక్‌తో ఏ గ్లేసియర్ ఎప్పుడు కరగడం మొదలుపెట్టింది? ఎందుకు కరగడం మొదలు పెట్టింది అన్న అంశాలకు సంబంధించి ‘క్రాస్ రిఫరెన్స్’తో ఒక అవగాహనకు రావడం జరిగింది.
సంక్లిష్టమైన ప్రకృతి వ్యవస్థలు ఏర్పడే విధానం చాలా సరళంగా ఉంటుందని తేలింది. ముందు చిన్న జీవులు బాక్టీరియా, ఆల్గే వంటివి సూక్ష్మజీవులు చేరతాయి. ఇవి తమకు తామే సుసంపన్నమైన కాలనీలుగా వృద్ధి చెందగలవు. తరువాత పెద్ద జీవులు ప్రవేశిస్తాయి. అప్పటకే సూక్ష్మజీవులు తదితరాలు సేకరించుకున్న ఆహరం వీటికి ఒక దారి చూపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో సేంద్రియాలతో మట్టి సారవంతం అవుతుంది. మొక్కలు పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. మొక్కల వ్యవస్థ రూపుదిద్దుకోవడం మొదలవుతుంది. వాటిని అనుసరించి జంతువులు ప్రవేశిస్తాయి. జీవులు మొక్కలకీ, మొక్కలు జంతువులకీ అలా క్రమానుగతంగా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది.
క్రమేపి క్రొత్త జాతులు వచ్చి చేరతాయి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన/కీలకమైన అంశం కాలం. కాలక్రమేణా పరస్పర ప్రతిచర్యలతో పరస్పరాధారితమైన సంక్లిష్టమైన, సుసంపన్నమైన ప్రకృతి వ్యవస్థలుగా అవి రూపుదిద్దుకుంటాయి.
ప్రవాహాలు, చిత్తడి నేలలు, పర్వత సానువులు, ఎడారి వసంతాలు ఇవన్నీ ప్రకృతి లోని జీవ వైవిధ్యానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆలవాలాలే. ఈ ప్రకృతి వ్యవస్థలన్ని భూగర్భ జలాల ఆధారంగా రూపొంది కొనసాగుతున్నవే. భూగర్భ జలాలు భూఉపరితలాన్ని చల్లగా/సమశీతోష్ణస్థితిలో ఉంచగలిగే కారణంగానే ఈ వ్యవస్థలన్నీ వివిధ రకాల వృక్ష సంపదకు, జీవజాతులకు ఆవాసయోగ్యం కాగలుగుతున్నాయి.
మధ్య ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల వంటి కొన్ని ప్రాంతాలలోని ప్రకృతి వ్యవస్థలు ఈ భూగర్భ జలాల ఎద్దడిని ఎదుర్కుంటున్నాయి. ఈ ప్రాంతాలలో భూగర్భ జలాలు మొక్కల వేళ్ళు అందుకోలేని మట్టానికి పడిపోయాయి. వ్యవసాయం, పశువుల పెంపకం ఈ జీవికలన్నీ నీరు ఆధారంగా సాగేవే. వాతావరణ మార్పులు ఈ రంగాలనూ ప్రభావితం చేస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది.
మొక్కల ఆకులలో ఉండే నీటి పరిమాణం, భాష్పీకరణం, పత్రహరితం, ఆ ప్రాంతంలోని భూమి ఉష్ణోగ్రత వంటి అంశాల ఆధారంగా నీటి లభ్యతకు సంబంధించి అంచనాలు కట్టబడతాయి.
ఉపగ్రహ వ్యవస్థల ద్వారా నాసా సాగించిన అధ్యయనాలకు సంబంధించిన 6 సంవత్సరాల డేటా, నేచర్ కన్సర్వెన్స్ అండ్ డెజర్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనాలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి.
ఆండీస్ పర్వత శ్రేణుల్లోని గ్లేసియర్స్ విపరీతమైన వేగంతో కరిగిపోతున్నాయి. షెర్మా ఫ్రాస్ట్ సైతం కరుగుతోంది. క్రొత్త లాగూన్స్ ఏర్పడ్డాయి. సింక్ హోల్స్ ఏర్పడుతున్నాయి. పెళ్ళలు విరిగిపడే ప్రమాదం ఎటూ ఉండనే ఉంది. అవలాంచీలు తేలికగా బయలుదేరి కాళ్ళ క్రింది మంచును లాగేసి దొరికినవాటిని తమతో ఈడ్చుకునిపోతాయి. అలా ఈడ్చుకుని పోయినపుడు బగిసిన/గట్టిగా ఉన్న చెత్త ఆగినప్పుడు అది చాలా త్వరగా గట్టిపడిపోతుంది. అది కాంక్రీట్ కంటే దృఢంగా మారిపోతుంది.
ఎప్పటినుండో ఆచూకీ లేకుండా పోయిన పర్వతారోహకుల దేహాలు మంచు కరిగి ప్రవహించినప్పుడు బయటపడటం ఇటీవలి సంగతే.
సునిశితమైన, సుసంపన్నమైన ఇటువంటి ప్రకృతి వ్యవస్థ మనుగడకు ముప్పుగా పరిణమించిన వాతావరణ మార్పులకు బుద్ధిజీవినని విర్రవీగే మానవుడే కారణం కావటం అన్నిటికంటే విచిత్రమైన విషయం.