[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఫలితాలను రాబడుతున్న చైనా తీరు ఆదర్శం:
వాయవ్య చైనా ప్రాంతంలోని షాహు లేక్ చుట్టు ప్రక్కల అంతా ఎడారి వాతావరణం ఉండేది. ఇది నిన్‌గ్జియా హుయ్ (Ningxia Hui) అటానమస్ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. నీరు నిలబడిపోయి అక్వాటిక్ జీవులు, పెరిగిపోయిన పాథోజెన్స్ కారణంగా, అక్వాటిక్ ప్లాంట్స్ కారణంగా అవసాన దశకు చేరుకుంది.
2017 లో స్థానిక అధికారులు ఆ చెరువును ఆనుకుని ఉన్న 400 ఎకరాలను చిత్తడి నేలగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రచించారు. చెరువులోని నీరు స్వేచ్ఛగా ప్రవహించేలా, స్వచ్ఛంగా ఉండటానికి నీటిని చెరువు తనకు తానే శుద్ధి చేసుకోగలిగేలా వ్యవస్థీకరించారు. ఫలితంగా నీటి నాణ్యత బాగా పెరిగింది.
నిన్‌గ్జియా దాదాపు 40,000 హెక్టార్ల చిత్తడి నేలలను పునరుద్ధరించగగలిగింది. 26 వెట్‍లాండ్ పార్కులు, 4 ప్రకృతి పరిరక్షణ కేంద్రాలు మొదలైనవాటితో పక్షులకు ఆవాసయోగ్యమైన వాతావరణాన్ని సృష్టించగలిగింది. ఇప్పుడు నిన్‍గ్జియా పక్షులకు స్వర్గధామంలా విలసిల్లుతోంది.
ఇటీవలి కాలంలో గాలి నాణ్యత సైతం పెరిగింది. ‘ఎల్లో రివర్’ లో నీటి నాణ్యత నిన్‍గ్జియా ప్రాంతంలో ‘సెక్షన్ గ్రేడ్ 11’. గత 9 సంవత్సరాలుగా మనుషుల వినియోగానికి యోగ్యంగా మారింది. అటవీ విస్తీర్ణం 11%, పచ్చిక బయళ్లు 56.8% పెరిగాయి. ఎడారి ప్రాంతాల వాతావరణంగా మారిపోతున్న ప్రాంతాలు 86% నుండి 19.31% కి తగ్గాయి. నీలి గొర్రెలు, ఎర్ర లేళ్లు వంటి వన్యప్రాణులు మళ్ళీ వృద్ధి చెందుతున్నాయి. చాలా కాలంగా కనిపించకుండా పోయిన మంచు చిరుత వంటి ప్రాణులు మళ్ళీ కనిపించడం మొదలు పెట్టాయి.
జ్గిన్‍గ్జియాంగ్ లోనూ:
ప్రపంచంలోని పెద్ద ఎడార్లుల్లో ‘టక్లామకన్’ ఎడారి ఒకటి. దీని విస్తీర్ణం 3,37, 600 చదరపు కిలోమీటర్లు. రమారమి జర్మనీ భూభాగం అంత. ఇది పర్వత శ్రేణుల నడుమ ఉంది. వర్షపాతం చాలా తక్కువ. ఆ కారణంగా ఇక్కడ వాతావరణం బాగా పొడిగా ఉంటుంది. చెట్టు చేమలు కూడా చాలా తక్కువ. ఇసుక తుఫానులు ఇక్కడ చాలా ఎక్కువ. ఈ తుఫానులు పంటలకు, ఇళ్లకూ కూడా తీవ్రమైన నష్టాన్ని కలగ చేస్తూ ఉంటాయి. కారణం తుపాను సమయంలో ఇసుక 200 నుండి 300 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎగసిపడుతూ ఉంటుంది. ఆ వినురులో అతి సూక్ష్మమైన ధూళి కణాలు కూడా ఎగిరి గాలినీ కలుషితం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా పర్యావరణ పరిస్థితులనూ ఈ ఎడారి వాతావరణం ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ ప్రతికూల వాతావరణాన్ని నిలువరించడానికై –
చైనా దీని చుట్టూ ‘గ్రీన్ బెల్ట్’ ఇనీషియేటివ్‌ని చేపట్టింది. 3050 చదరపు కిలోమీటర్ల ఈ గ్రీన్ బెల్ట్‌ను అభివృద్ధి చేయడంతో ప్రజల సహకారమే కాక భాగస్వామ్యం కూడా ఉండటం విశేషం. దశాబ్దాల తరబడి ప్రజలు అక్కడి వేడిమిని తట్టుకోగల జాతుల చెట్లను, మొక్కలను పెంచడం మొదలుపెట్టారు. 40 సంవత్సరాల కృషి, లక్షలాది ప్రజల సహకారంతో ఈ బృహత్ లక్ష్యంలో మొదట దశ పూర్తి అయ్యింది. 2761 కిలోమీటర్ల బెల్ట్ అభివృద్ధి చేయబడింది. ఎడారి పట్టణాలన్నిటినీ కలుపుతూ రైలు మార్గం వేయబడింది. సోలార్ ఎనర్జీ, పవన విద్యుతు వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. సహజ ఉత్పత్తులుగా సోలార్ ఎనర్జీతో 8.5 గిగావాట్లు, పవన విద్యుత్తుతో 4 గిగావాట్లు విద్యుదుత్పాదనకు మౌలిక వసతులూ కల్పించబడ్డాయి.