[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
అరుదైన జీవజాతుల పరిరక్షణ
సుమారు 60 సంవత్సరాల క్రితం ‘డచ్ ఎల్మ్’ వ్యాధితో అంతం అయిపోయాయని అనుకుంటున్న తాబేలు డిప్ప సీతాకోకచిలుకలు ఈ ఏడాది కెంట్ ఉడ్‌లాండ్స్‌లో 30కి పైగా కనిపించాయి. ప్రకృతి వ్యవస్థలు తమకు తాము పునర్నిర్మించుకోగలవనటానికి ఇటువంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
సయామీస్ మొసళ్లు మనుషులకు హాని చేయవు. భీకరమైనవీ కావు. అయినప్పటికీ అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. దక్షిణ, తూర్పు ఆసియా ప్రాంతాల లోని చిత్తడినేలల్లో విరివిగా సంచరిస్తూ కనిపించే ఈ జాతి మొసళ్ళు ఇప్పుడు అసలు కనిపించటం లేదు. దశాబ్దాల వేట, ఆవాసాల ధ్వంసం వీటి మనుగడను ప్రశ్నార్థకం చేసి ప్రమాదంలోకి నెట్టివేశాయి.
ఈ మొసళ్ళ చర్మంతో చేసిన వస్తువులకు ప్యాషన్ ప్రపంచంలో బాగా గిరాకీ ఉండటం వీటి వేటకు కారణం. ఎలెక్ట్రిక్ ఫిషింగ్, గిల్ నెట్స్, హైడ్రో ప్రాజెక్ట్స్ – కారణంగా ప్రవాహాల వేగంలో మార్పులు వంటివన్నీ వీటి గూళ్ళు చెదిరిపోవడానికి కారణం. మేత దొరకకపోవటం వంటివి మరికొన్ని కారణాలు. ఇలా అనేక కారణాల ఫలితంగా అవి తమ సహజ సంఖ్యలో 99% కనుమరుగై పోయాయి. ఇండోనేసియా, బర్మా, థాయ్‌లాండ్, లావోస్, తూర్పు మలేసియాలలో, కంబోడియాలో మంచినీటి నెలవులలో ఇవి స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండేవి. కనుమరుగైపోయాయనుకుంటున్న ఆ మొసళ్ళ గుడ్లు 60 వరకు కంబోడియా నైరుతీ ప్రాంతంలో కనిపించాయి.
ఈ జాతి మొసళ్ళకు ప్రత్యేకించి ‘కార్డెమమ్’ పర్వతాలు ప్రసిద్ధి. వ్యవసాయం జరుగుతూ జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో కూడా ఇవి సంచరిస్తాయి. అయితే వాటి జోలికి ఎవరూ రారని వాటికి భరోసా కలగాలి. ‘ఫానా అండ్ ఫ్లోరా ఇంటర్నేషనల్’ ఒక స్వచ్ఛంద సంస్థ. కోహ్‌కాంగ్ ప్రావిన్స్‌లో 2012 నుండి ఈ జాతి మొసళ్లను 196 వరకు సంరక్షిస్తూ వస్తోంది. ఈ సంస్థ ప్రభుత్వం సహకారంతో వీటిని పరిరక్షించడానికి చేపట్టిన ప్రాజెక్టు ఫలితంగా ప్రజలలో అవగాహన పెరిగి వీటి వేట తగ్గింది. ఇప్పుడు అక్కడి ప్రజలే వాటి సంరక్షకులు. అలా స్థానిక జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రకృతి ప్రేమికులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సౌత్ ఆఫ్రికా లోని జులూ లేండ్ 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాంతం. బాబనాన్‌గో రక్షిత ప్రాంతానికి సింహాన్ని పునఃపరిచయం చేసిన ఒక ఏడాది లోనే ఆ సింహం మూడు పిల్లలకు జన్మనిచ్చింది. 150 సం॥ తరువాత ఈ విశేషం చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలం అనంతరం అక్కడ సింహం పిల్లలను కనడం ప్రకృతి ప్రేమికులను అపరిమితమైన ఆనందానికి గురిచేసింది. ఒక రైనో ఒక బుల్లి తెల్లని రైనోకి జన్మనీయగా మరిన్ని రైనోలు కడుపులో పిల్లల్ని మోస్తున్నాయి.
నార్తర్న్ బాల్డ్ ఐబిస్ పక్షులు గతంలో మూడు ఖండాల్లో ఉండేవి. 300 సంవత్సరాల నుండి కనిపించడం లేదు. 1900 నాటికే అరుదైపోయి రెడ్ లిస్ట్ లోకి వెళ్ళిపోయాయి. 2019 నాటికి మొరాకోలో 700 మిగిలాయి. సిరియాలో 2002 లో 10 కనిపించాయి. మొరాకోలో 59 జతలు మిగలగా మొరాకోలో పరిరక్షణ ప్రయత్నాలు ముమ్మరంగా జరగగా వాటి సంఖ్య 500 లకి పెరిగింది. రెడ్ లిస్ట్ నుండి ఎన్‌డేంజర్డ్ లిస్ట్ లోకి వాటిని తేగలిగారు.
300 సంవత్సరాల క్రిందట ఇవి యూరప్ నుండి మాయమైపోయాయి. వందల సంవత్సరాల తరువాత మళ్లీ ఈ పక్షులు కొన్ని యూరప్‌లో వలసవచ్చి కనిపించాయి.
పట్టదలతో కృషి చేసే ప్రకృతి వ్యవస్థలను కాపాడుకోగలమనటానికి ఇంతకు మించిన ఋజువులు ఏముంటాయి! ప్రమాదం అంచున ఉన్న జీవజాతులు అంతరించిపోకుండా పరిస్థితులను వెనకు మరల్చగలగడం వాటిని కాపాడుకోగలగడం చిన్న విషయం కాదు.
ప్రకృతికి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనం కోసం శ్రద్ధపెట్టాలి. అంతే.