Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మ కడుపు చల్లగా-61

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

మారుతున్న గ్లేసియర్‍ల పరిమాణం – మ్రోగుతున్న ప్రమాద ఘంటికలు

గ్రీన్‌లాండ్ మంచు ఫలకాలు ప్రపంచం లోని అతి పెద్ద మంచు ప్రాంతాలలో రెండవది. శాస్త్రజ్ఞులు ఈ ప్రాంతంలో ముదురు రంగు ఆల్గేని కనుగొన్నారు. అయితే అక్కడి అతి శీతల వాతావరణం ఆల్గేని విస్తరించజేయనీయదని వారు భావించారు. కానీ ఇటీవలి పరిశోధనలు ఆ అంచనాలు సరికాదని తేల్చాయి. ఈ ఆల్గే తన మనుగడలో భాగంగా పోషకాలను గ్రహించడంతో బాటుగా శక్తి/ఎనర్జీని దాచుకోగలిగాయి. ఆ కారణంగా అవి విస్తరిస్తున్నాయి.

గతంలో గ్రీన్‌లాండ్‌లో సంవత్సరం పొడవునా మంచు దట్టంగా విస్తరించి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కువ ప్రాంతం సూర్యరశ్మి తాకిడికి బహిర్గతమౌతోంది. ఇది ఆల్గే కాలనీలుగా విస్తరించడానికి అనుకూలంగా ఉండే వాతావరణమౌతుంది.

గత 30 సంవత్సరాలలో సముద్ర మట్టాలు 5″ వరకు పెంగటానికి గ్రీన్‌లాండ్ మంచు ఫలకాలు కరగటం కూడా కారణమని ఇటీవలి పరిశోధనలు చెప్తున్నాయి. అవి ఇంకా పెరగవచ్చు కూడా. ఈ ముదురురంగు ఆల్గే ఇంకా విస్తరిస్తూ పోతే, గ్రీన్‍లాండ్ మంచు ప్రాంతం స్వచ్ఛమైన తెలుపు రంగును కోల్పోయి సూర్యరశ్మికి మరింత అధికంగా గురికావడం ద్వారా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను మరింత పెంచగల అవకాశం అధికం కాగలదు.

‘ఎర్త్ కామ్’ నివేదికల ప్రకారం చాలా క్లయిమేట్ నమూనాలు ఆల్గే లేదా మరే మైక్రోబియల్ జీవులకు వర్తించవు. ఆ కారణంగా ఇప్పటి వరకు మంచు కరగడాన్ని గురించి వేసిన అంచనాలు వాస్తవ స్థితిగతులకు సరిపోలకపోయే అవకాశం ఉంది.

ప్రపంచంలోని అతి పెద్ద ఐస్‍బర్గ్ A 23a 1986లో దాని స్వస్థలం నుండి విరిగిపోయింది. సుదీర్ఘ కాలం పాటు స్థిరంగానే ఉన్న ఆ మంచుకొండ క్రమంగా ఉత్తరం వైపుగా కదిలి 2023లో అంటార్కిటిక్ ద్వీపకల్పాన్ని దాటి దక్షిణ జార్జియాలోని దక్షిణ అట్లాంటిక్ వైపు కదులుతోంది. ఇది లండన్ నగరానికి రెండు రెట్టు పెద్దది పరిమాణంలో. బరువు 1 ట్రిలియన్ టన్నులు. అయితే మార్గమధ్యంలో అది తన మంచును కొద్ది కొద్దిగా కోల్పోతూ వస్తోంది.

‘జాకబ్ షావన్స్’ గ్లేసియర్ – దీనికి టైటానిక్ ఓడను ముంచివేసిన చరిత్ర ఉంది. ఈ గ్లేసియర్ పరిమాణం ఇటివల కాలం కొంచెం కొంచెంగా పెరిగింది. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ పెరుగుదలలో నిరంతరం కొనసాగుతాయనుకోవటానికి వీలు లేదు.

పశ్చిమ అంటార్కిటికాలోని త్వైట్స్ హిమనీ నదం అత్యంత విస్తారమైనది. ఇది 1970 నుండి వేగంగా కరిగిపోతూ వస్తోంది. మంచుకొండలు గాని, ఫలకాలు గాని మెరైన్ కార్యకలాపాలు అధికంగా ఉన్న ప్రాంతాలలో బీటలు వారటం సాధారణం అయిపోయింది. బీటలు వారిన తరవాత వాటి నుండి చిన్న చిన్న ముక్కలు విడిపోయి మంచు కరగిపోయి సముద్రంలో కలసిపోతుంది. ఆ రకంగా వీటి పరిమాణం తగ్గిపోతూ వస్తోంది. సెప్టెంబర్ 2022 నుండి ఆగస్టు – 2023 నడుమ కాలంలోని 196 బిలియన్ టన్నుల మంచును నష్టపోవడం జరిగిందని అధ్యయనాల చెపున్నాయి. దానిని బట్టే సముద్రమట్టాల పెరుగుదలకు మంచు కరగిపోవడం ఏ రకంగా దోహనం చేస్తోందో అర్థం అవుతుంది.

Exit mobile version