[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
మీథేన్
చెట్లు తమ మొదలు నుండి కొద్ది పరిమాణంలో మీథేన్ వాయువును వెలువరిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే హరితగృహ వాయువుల ఉద్గారాలపై విస్తృతంగా జరుగన్న పరిశోధనలు అనేక ఆసక్తికరమైన క్రొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం మీథేన్ వాయువు గ్లోబల్ వార్మింగ్‌కు ⅓ వ వంతు కారణం అవుతోంది. ఉద్గారాన్ని పట్టి ఉంచడంలో దీని సామర్థ్యం Co2 కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అయితే దీని జీవితకాలం 10 సంవత్సరాలు మాత్రమే. ఆ కారణం గానే Co2 గురించి జరిగిననన్ని చర్చలు దీనిపై జరగలేదు.
అయితే గ్లోబల్ వార్మింగ్‌ను కట్టడి చేయగల చర్యలలో మీథేన్ సైతం కీలకమైన పాత్ర పోషించగలదని పరిశోధనలు చెప్తున్నాయి. బర్మింగ్‌హామ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ విన్సెంట్ గౌస్, తన బృందంతో – లేజర్ ఆధారిత మీథేన్ ఎనలైజర్ విధానంలో చెట్ల మ్రానులను పరిశీలించనపుడు – మ్రాను మొదలు నుండి మీథేన్ వాయువు వెలువడుతున్నప్పటికీ, చెట్ల మ్రాను పై భాగాలు మీథేన్‌ను గ్రహిస్తున్నట్లు తేలింది. వాతావరణం నుండి మీథేన్‌ను గ్రహించే ప్రక్రియ చెట్ల కాండం పైకి వెళ్తున్న కొద్దీ మరింత ఎక్కువ సామర్థ్యంతో జరుగుతున్నట్లు తెలిసింది.
పర్యావరణ పరిరక్షణలో ‘టెరెస్ట్రియల్ గ్లోబల్ ఏరియా ఆఫ్ ట్రీ ట్రంక్స్’ అన్న అంశానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ లెక్కని బట్టే Co2 శోషణ సామర్థ్యాలను, విడుదల అంచనాలను లెక్కగడతారు.
అరణ్యాలు – మీథేన్ శోషణలోనూ కీలక పాత్ర:
అడవుల విధ్వంసం, కార్చిచ్చులు- వీటన్నిటికీ అతీతంగా ఇప్పటికీ అడవులు ఉద్గారాల శోషణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా జరుగుతూ వచ్చిన విధ్వంసం వాటి శోషణ సామర్థ్యాలను తగ్గించిన మాట వాస్తవం.
అలస్కా, కెనడా, రష్యా వంటి చోట్ల ఈ క్షీణత 36% ఉండగా, ఉష్ణమండల అరణ్యాలలో 31%. సాధారణ అరణ్యాలలో చాలా తక్కువగా ఉంది. చెదురు ముగురుగా ఇక్కడ Co2 శోషణ సామర్థ్యం పెరిగింది కూడా. చైనా వంటి దేశాల్లో అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుండటం దానికి కారణం కావచ్చు.
వివిధ దేశాలలో అడవుల విస్తీర్ణం పెరుగుతోంది, తరుగుతోంది కూడా. ఈ హెచ్చుతగ్గుల కారణంగా ఉద్గారాలకు సంబంధించిన అంచనాలలోనూ అప్పుడప్పుడూ తేడాలు రావడం జరుగుతోంది.
వివిధ మానవ కార్యకలాపాలు – వ్యవసాయం, పశువుల పెంపంకం వంటి వాటి కారణంగా వాతావరణంలో విడుదల అవుతున్న మరో హరితగృహ వాయువు మీథేన్. ఈ మీథేన్ వాయువును శోషించుకోవడంలో చెట్లు తమ వంతు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయన్న విషయం ఇటీవలి కాలం వరకు బయటపడలేదు. ఉద్గారాల నియంత్రణకై వివిధ దిశలుగా జరుగుతున్న అధ్యయనాలు, ప్రయోగాలు అనేక సరికొత్త అంశాలను వెలుగులోకి తెస్తున్నాయి.
ప్రపంచంలోని అరణ్యాలను అన్నిటినీ పరిశీలించి లెక్కలు కట్టగా, ‘టెరెస్ట్రియల్ గ్లోబల్ ఏరియా ఆఫ్ ట్రీ ట్రంక్స్’ మొత్తం పట్ట/బెరడు భూమండలంపైన ఉన్న నేల/భూ ఉపరితలాన్ని మొత్తంగా కప్పివేయగల స్థాయిలో/విస్తారంలో ఉందని అధ్యయనాలు చెప్పున్నాయి. ఉష్ణమండలారణ్యాల వాటా కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ మొత్తం మీద భూమిపై ఉన్న అన్ని రకాల అడవులు కలసి సాలీనా 25 నుండి 50 మిలియన్ టన్నుల మీథేన్‍ను గ్రహిస్తున్నాయని పరిశోధకులు వివిధ శాస్త్రీయ విధాలలో సాగించిన అధ్యయనాలలో వెల్లడయ్యింది. ‘భూతాపాన్ని నివారించండంలో అరణ్యాల పాత్ర ఇప్పటి వరకు అనుకుంటున్న దానికి మించి విశిష్టమైనది’ అన్న విషయం ఋజువయింది. ఇదొక మంచి పరిణామం.
ప్రకృతి మిత్ర విధానాలలోనే భూతాపాన్ని నియంత్రించే దిశగా చేపట్టగల చర్యలలో ‘అరణ్యాల పరిరక్షణ’ మరింత కీలకమైన అంశం కాగలదు.