Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మ గుర్తుకొచ్చినప్పుడు..

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

మధ్య ఇలా అర్ధరాత్రి మెలుకువ రావడం ఎక్కువైంది. ఈ రోజనే కాదు, కొన్ని రోజులుగా రాత్రుళ్ళు సరిగా నిద్ర పట్టట్లేదు అతనికి. చుట్టూ చూశాడు. గదంతా నిశ్శబ్దంగా ఉంది. ఏసీ మాత్రం చిన్నగా శబ్దం చేస్తుంది. అందరూ నిద్రలో ఉన్నారు. అంతా కొత్తగా అనిపిస్తోంది అతనికి. ఇక్కడికి వచ్చిన కొత్తలో కూడా ఇలా అనిపించలేదు. మరి ఇప్పుడేంటిలా?

***

చాలా మందిలాగే ఉద్యోగం కోసం ఇల్లొదిలి వచ్చిన వాళ్లలో తనూ ఒకడు. ఊర్లో అందరూ హైదరాబాద్, బెంగళూరు అంటూ వెళ్తే అతను మాత్రం ఇంకాస్త దూరంగా వేరే దేశం వెళ్ళాడు. ఆ రోజు ఇంట్లో నుండి బయలుదేరుతుంటే అందరూ అతన్ని చూసి బాధ పడుతున్నా అతనికేమీ అనిపించలేదు. ఎయిర్‌పోర్ట్ వెయిటింగ్ హాల్లోనూ అంతే! పక్కనున్న వాళ్ళు వీడియో కాల్స్‌లో వాళ్ళ వాళ్ళతో ఏడుస్తూ మాట్లాడుకుంటున్నారు. అదంతా డ్రామాలాగా, విచిత్రంగానూ తోచిందతనికి. ఇంతలా బాధపడుతూ అసలు వెళ్లడమెందుకని అనుకున్నాడు. ఫ్లైట్ లోపల పరిస్థితీ అంతే! అందరి మొహల్లో ఒక రకమైన బాధ. వెయిటింగ్ హాల్లో మొదలైన సంభాషణలు ఇంకా కొనసాగుతోనే ఉన్నాయి. ఎయిర్ హోస్టెస్ వచ్చి ఫోన్ ఆఫ్ చేయమని చెప్పినా ఒక్క నిమిషం, ఇంకొక్క నిమిషం అంటున్నారు. ఫోన్ ఆఫ్ చేయాలని లేకున్నా చేస్తున్నారు. తనేమో అరగంట ముందే ఫోన్ ఆపేసి కూర్చున్నాడు. అందరూ ఇంత బాధ పడుతున్నారు, తనకేమో కనీసం ఇంటిపై ధ్యాస కూడా పోవట్లేదు.

అప్పుడలా ఉన్న తను ఇప్పుడేమో ఇలా! ఆ తీరు తనకే కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలేమైంది తనకి? ఇంటి దగ్గర మంచంపై ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టేస్తుందే! ఇక్కడ మెత్తటి పరుపుపై కూడా నిద్ర రావట్లేదేందుకో?

‘కికిక్కిక్.. కికిక్కిక్..’

పక్క బెడ్ నుండి వస్తున్న చిన్న అలారం శబ్దం కూడా చిరాకు తెప్పిస్తోంది. టైం చూశాడు. ఉదయం 4 గంటలు. కాసేపైతే అందరూ లేస్తారు. గదంతా మళ్ళీ ఓ గంటపాటు గోలగోలగా ఉంటుంది. అందరూ డ్యూటీలకి వెళ్లిపోయాక మళ్ళీ మామూలే. ఈ నిశ్శబ్దం అతని జీవితంలో భాగమైపోయింది. ఆలోచనతో బుర్ర వేడెక్కిపోయి చిన్నగా తలనొప్పి మొదలైంది. అమ్మ చేతి టీ గుర్తొచ్చింది. ఇంటిదగ్గర ఎన్నిసార్లు తలనొప్పి అని అబద్ధమాడి చేయించుకొని తాగేవాడో! ఇప్పుడు నిజంగా తలనొప్పి వస్తుంది కానీ టీ చేయడానికి అమ్మ ఇక్కడ లేదు. పొద్దున లేవగానే పొగలు కక్కుతూ రకరకాల పేర్లతో ఎన్నెన్నో కాఫీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో దేనికీ అమ్మ చేతి రుచి లేదు. నాన్ వెజ్, వెజ్‌లో రోజుకో వెరైటీ. తిన్నోడికి తిన్నంత. తినబుద్ధేయట్లేదు. వచ్చేటప్పుడు తను వద్దంటున్నా వినకుండా అమ్మ పంపిన ఊరగాయ ఎక్కడ అయిపోతుందోనని దాచుకొని మరీ తింటున్నాడెందుకో!

తినడం అంటే ఇల్లు గుర్తొస్తుంది. ఎప్పట్లాగే ఆ రోజూ ఇంటికి ఆలస్యంగా వెళ్ళాడు. గడియ పెట్టకుండా దగ్గరికి మూసున్న తలుపుని చప్పుడు కాకుండా మెల్లగా తీశాడు. నేరుగా కిచెన్‌లోకి పోయి అన్నం పెట్టుకొని పళ్లెంతో తన రూంలోకి వెళుతున్నాడు.

“ఏరా! వచ్చావా? ఇప్పటికి తీరిందా అయ్యగారికి?” వెనకాల అమ్మ గొంతు. ఎప్పుడొచ్చిందో ఏమో?

తను ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏ లైటూ వెలగడం లేదు. తను రావడంలో చప్పుడు కూడా చేయలేదు. అయినా తనొచ్చినట్టు అమ్మకెలా తెలిసిందబ్బా!

“హా! కాస్త లేట్ అయిందమ్మా ఈ రోజు. నువ్వు పడుకోపో. నేను తినేస్తాలే” అన్నాడు.

అమ్మ వింటున్నట్టు లేదు. రోజూ చెప్పిందే చెప్తే ఎవరు మాత్రం వింటారు?

“నీకిష్టమని మజ్జిగ చారు చేశా. తొందరగా వస్తావేమో వేడిగా ఉన్నపుడే తింటావనుకుంటే అసలెంతకీ రావే! నీకోసం చూసి చూసి ఇప్పుడే పడుకున్నా. అయినా ఈ తినేదేదో అక్కడే తినొచ్చుగా? ఇంటిదాకా రావడమెందుకు? ఏం? పెట్టమంటారా మీ ఫ్రెండ్స్?” అంటూ నవ్వేసింది.

పైకైతే నవ్వుతుంది గాని ఆ నవ్వు వెనక బాధ అప్పుడు అతనికి అర్థమవ్వలేదు.

ఫ్రెండ్స్‌తో రోజంతా తిరుగుతూ తినడానికి మాత్రమే వెళ్తున్నట్లు వెళ్ళేవాడు ఇంటికి.

‘ఇంట్లో అన్నీ ఉన్నాయి. మేముంటే ఏంటి? లేకుంటే ఏంటి? ఎందుకిలా చేస్తుంది అమ్మ! ఎప్పుడూ ఇంట్లోనే ఉండమంటుంది’ అనుకునేవాడు.

అమ్మ అప్పుడన్న మాటలన్నీ ఒక్కొక్కటీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. తను ఇంట్లో ఒంటరవుతున్నానని చెప్పే ప్రయత్నం ఉంది ఆ మాటల్లో. ఇప్పుడు ఇక్కడా అంతే! అన్నీ ఉన్నాయి, అయినా ఏదో వెలితి. అమ్మ మనసు బోధపడింది.

అమ్మతో మాట్లాడాలనిపిస్తోంది. ఇక్కడి సంగతులన్నీ చెప్పాలనిపిస్తోంది. ఫోన్ అందుకున్నాడు.

“హలో అమ్మా”

“హలో.. హలో..” సిగ్నల్ సరిగా లేనట్టుంది అవతల.

“హా అమ్మ నేనే! బయటకి రా. నీ వాయిస్ సరిగా వినిపించట్లేదు.”

“హా! సరే ఉండు. ఇప్పుడు ఓకేనా చూడు. వినిపిస్తుందా?”

“హా! ఓకే అమ్మా! వినిపిస్తుంది.”

“ఏమైంది రా? ఇంత పొద్దున్నే చేశావ్? అంతా ఓకేనా?”

ఆలోచనల్లో పడి టైం ఉదయం నాలుగంటలన్న సంగతే మరిచిపోయాడు. అంటే ఇంటిదగ్గర ఆరున్నర అవుతుంటుంది.

“ఏం లే అమ్మా! ఊరికే చేశా. ఎలా ఉన్నావ్?”

“నా సంగతి సరేగానీ, నీకేమైంది రా గొంతు అంత చిన్నగా వస్తుంది? ఒంట్లో ఏమైనా బాలేదా?” అమ్మలంతే మన గొంతులో వచ్చే చిన్న తేడానీ ఇట్టే పసిగట్టేస్తారు.

“అలాంటిదేం లేదమ్మా! బానే ఉన్నా”

“సరే చెప్పు సంగతేంటి?”

“నీతో మాట్లాడాలనిపించింది. చేశా. ఏం? ఏదైనా పనుంటేనే చేయాలా?”

“అలా అని కాదు. నువ్వు ఇంత పొద్దున లేవవు కదా! ఏమైందా అని అంతే.”

అర్ధరాత్రి వరకు బయట తిరిగి వచ్చి, ఎప్పుడో తెల్లవారుజామున పడుకుని అమ్మ లేపితే గానీ లేచేవాడు కాదు ఇంటిదగ్గర.

 “సారీ అమ్మా”

“ఏంట్రా? ఏమైంది? ఎందుకు సారీ చెప్తున్నావ్? నాకవతల చాలా పనులున్నాయి. చెప్పు త్వరగా. కంగారు పెట్టకు.”

“ఒకటడుగుతా నిజం చెప్పు. ఇంటి దగ్గర ఉన్నపుడు నిన్ను చాలా బాధపెట్టా కదమ్మా”

“ఛఛ! నువ్వు నన్ను బాధ పెట్టడమేంట్రా? నువ్వు నా బంగారం రా! నీకెందుకలా అనిపిస్తుంది?”

“అలా కాదమ్మా, నువ్వేదో నాకు ముఖ్యమైన విషయం చెప్పాలని ప్రయత్నించడం. నేనేమో అది వినకుండా ఏదో పనుందంటూ బయటకెళ్ళిపోవడం, నువ్వు ఏదో చెప్తుంటే ఫోన్లో చూస్తూ నిన్నసలు పట్టించుకోకపోవడం. ఒకటనేంటి ఇలా చాలాసార్లు నిన్ను బాధపెట్టా కదా!”

“పిచ్చోడా! ప్రపంచంలో ఏ తల్లీ అలా అనుకోదు రా! చిన్న పిల్లలు, వాళ్ళకింకా తెలీదు అనుకుంటుందంతే.”

అమ్మలంతే! పిల్లలు తప్పు చేసినా, తమని బాధ పెట్టినా వాళ్ళ దృష్టిలో పిల్లలెప్పుడూ మంచివాళ్ళే.

ఇంట్లో అందరి పనులకి అమ్మ కావాలి కానీ అమ్మకి ఏం కావాలో ఎవరికీ తెలీదు. ఏనాడూ అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. అన్నీ ఉండడమంటే వస్తువులు, డబ్బులా?

డబ్బులు కడుపు నింపుతాయేమో కానీ మనసు నింపలేవు. వస్తువులు సుఖాన్నిస్తాయేమో కానీ ఆనందాన్ని పంచలేవు.

ఇంట్లో అందరి సమస్యలు ఓపిగ్గా విని తీర్చే అమ్మకీ సమస్యలుంటాయని ఎవరికీ తెలీదు. ఎవరూ అడగరు కూడా. నాన్నకేమో టైం లేదు. తనేమో ఇంట్లో ఉండడు. తమ్ముడు ఇంకా చిన్నవాడు. అక్క వస్తూనే తన మెట్టినింటి సమస్యల చిట్టా విప్పుతుంది.

అందరూ తన నుండి ఆశించడమే తప్ప తను ఎవరి దగ్గర ఎప్పుడు ఏమీ ఆశించదు. కొంచెం ప్రేమ, ఇంట్లో మనిషిగా కొద్దిపాటి గుర్తింపు తప్ప.

అందరి బాగోగులు చూసే అమ్మ బాగోగులు చూసేదెవరు?

“లేదమ్మా! నాకు ఇప్పుడు తెలుస్తుంది. అన్నీ అర్థమవుతున్నాయి. నిన్ను చాలా బాధపెట్టా. ఐయామ్ రియల్లీ సారీ మమ్మీ” అతని గొంతు గద్గదమవుతోంది.

“సరే రా! ఊరుకో. నిన్నెపుడైనా నేనలా అన్నానా? నువ్వేం ఆలోచించకు ఇదంతా. నాకు నీ మీదేం కోపం లేదు. రాదు కూడా! నా బాధ అంతా నీ గురించే. దేశం కాని దేశంలో, తెలియని చోట ఎలా ఉంటున్నావో, ఏం తింటున్నావో అని. జాగ్రత్తగా ఉంటూ టైంకి తిను. నీ ఆరోగ్యం జాగ్రత్త.. .. ..”

ఇంకా తను చెప్తూనే ఉంది. కొత్తచోట ఎలా ఉండాలి , ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటూ తనకు తెలిసిన జాగ్రత్తలన్నీ చెప్తుంది.

కాస్త చదివేసి కొద్దో గొప్పో జ్ఞానం సంపాదించుకొని అంతా తెలుసని భ్రమ పడుతుంటారు. కానీ పిల్లలకేం కావాలో వాళ్ల మనసుల్ని చదివిన అమ్మలకన్నా బాగా ఇంకెవరికి తెల్సు!

వాళ్ళ సంభాషణ సాగుతూనే ఉంది. అమ్మ గురించి అన్నీ అడిగి తెలుసుకుంటున్నాడు. ఎన్నడు లేనిది ఏకంగా రెండు గంటలు మాట్లాడాడు.

ఇప్పుడు అతనికి అమ్మకి నచ్చిన సినిమా, ఇష్టమైన ప్రదేశం.. ఇంకా చాలా తెలుసు. తను జీవితంలో కనీసం ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలనుకుందనే విషయంతో సహా. వెంటనే తన డైరీలో పెద్దగా రాసుకున్నాడు ‘అమ్మని ఎలాగైనా ఫ్లైట్ ఎక్కించాలి’.

అతని మొహంపై చిన్న చిరునవ్వు. చాలా రోజుల తర్వాత ఆ రోజు హాయిగా నిద్రపోయాడతను.

Exit mobile version