[శ్రీ రంగనాథ రామచంద్రరావు గారి ‘అమ్మ ఆటోగ్రాఫ్’ అనే అనువాద కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
కన్నడ యువ రచయిత శ్రీ శ్రీధర్ బనవాసి విలక్షణ సాహితీవేత్త. ఆయన చక్కని కవి, కథకుడు, కాలమిస్ట్, నవలా రచయిత, సంపాదకుడు, దర్శకుడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఉన్నత విద్యావంతుడు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత. ‘అమ్మన ఆటోగ్రాఫ్’ ఆయన వెలువరించిన మూడు కథా సంపుటాలలో ఒకటి. ఈ పుస్తకానికి అరళు సాహిత్య – కె. వాసుదేవాచార్ పురస్కారం లభించింది. ఈ కథాసంపుటిని ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ రంగనాథ రామచంద్రరావు ‘అమ్మ ఆటోగ్రాఫ్’ పేరిట అనువదించారు.
ఇందులో 9 కథలున్నాయి. “ఈ కథలు మనిషి క్రూరత్వపు నిస్సహాయతను వెక్కిరిస్తాయి. మరికొన్ని గాఢమైన చీకటిని ఛేదించడానికి ధైర్యాన్ని ఇచ్చే ప్రమిదలోని దీపంలా భరోసా ఇస్తాయి” అని వెనుక అట్ట మీద రాశారు.
~
‘ఒక్క క్షణం చీకటి మనసుకు ఇంత పెద్ద భారం కలిగిస్తుందని తాను కలలోనూ, మనసులోనూ ఆలోచించలేద’ని లారీ డ్రైవర్ కరిబసప్ప అనుకుంటాడు ‘క్షణిక చీకటి భయం’ కథలో. ఓ రోజు లారీలో సరుకు వేసుకుని బెంగుళూరు నుంచి పూనె బయల్దేరుతాడు రోజూ మితంగా తాగే కరిబసప్ప, ఆ రాత్రి ఎందుకో తనకి తెలియకుండానే కొంచెం ఎక్కువ తాగుతాడు. కొంచెం దూరం డ్రైవ్ చేశాకా, మత్తు అతనిపై ప్రభావం చూపుతుంది. ఆ రోజు దాభాలో భోజనం బాగుండడంతో కొంచెం ఎక్కువే తిన్న సహయకులు నిద్రలో జోగుతుంటారు. సరుకుతో పాటూ అదే లారీ ఎక్కిన సరుకు యజమానిది కూడా అదే పరిస్థితి. మెలకువగా ఉండి, తనను అలెర్ట్‌గా ఉంచనందుకు తన సహాయకులను తిడతాడు కరిబసప్ప. మత్తులో యాక్సిడెంట్ చేస్తాడు కరిబసప్ప. ‘అమ్మా’ అన్న ఆక్రందన విన్న సహాయకుడు చెప్తాడు, మనం ఎవరినో గుద్దేశాం అని. అందరూ వద్దంటున్నా వెనక్కి వెళ్ళి చూస్తాడు కరిబసప్ప. ఇద్దరు ఆడవాళ్ళు రక్తపు మడుగులో పడి ఉంటారు. వాళ్ళు బ్రతికున్నారేమో చూద్దాం అని వెళ్ళబోతుంటే, అందరూ వారిస్తారు. సరుకు యజమానీ, తన సహాయకులు ఎంతో ఒత్తిడి చేస్తే, తన బండి టైర్లకి అంటిన రక్తపు మరకలను కడిగేసి, బండిని బురదలోంచి పోనిచ్చి, ఆనవాళ్ళు లేకుండా చేసి ముందుకు సాగిపోతాడు. ఈ క్రమంలో, సహాయకుడన్న ఓ మాటతో అతనికి తను వదిలేసిన భార్య గుర్తుస్తొంది, ఆ సమయంలో ఆమెకు రెండేళ్ళ వయసు పాప ఉండేది. తాము విడిపోవడానికి తన మూర్ఖత్వమే కారణమని గ్రహిస్తాడు. చివరికి పూనె చేరి సరుకు దింపాకా, అక్కడ్నించి బరమఘడ తిరిగి వచ్చేస్తాడు. తర్వాతి రోజు భార్యాపిల్లల్ని చూసి వద్దామని, వీలైతే తనని క్షమించమని భార్యని అడగాలని అత్తగారి ఊరు వెళ్తాడు. ఊరు బాగా మారిపోతుంది. ఎట్టకేలకు అత్తగారిల్లు గుర్తు పట్టి లోపలికి వెళ్తాడు. కొద్ది సేపటికి అత్తగారు బయటకు వచ్చి అల్లుడిని గుర్తుపట్టి, గొల్లుమని ఏడుస్తుంది. బ్రతికుండగా వాళ్ళని చూడ్డానికి రానివాడివి, వాళ్ళు చచ్చిపోయాక వచ్చావా అని అడుగుతుంది. ఏం జరిగిందని అడిగితే, నీ కూతురుకి పెళ్ళి కుదిరింది, ఆ వార్త నీకు చెప్పి, ఎలాగైనా నిన్ను తీసుకొస్తానని చెప్పి బరమఘడ్ బయల్దేరారు. ఏదో లారీ గుద్దేసి చనిపోయారని చెప్తుంది. అంత్యక్రియలకి శవాలని శ్మశానానికి తీసుకువెళ్ళారనీ, ఎలాగో వచ్చావు, వెళ్ళి ఆఖరి చూపు చూసుకోమని చెప్తుంది. తన లారీ కింద పడి చనిపోయింది తన భార్యాకూతుళ్ళే అన్న నిజం గ్రహించిన కరిబసప్పకి మనసు మొద్దుబారిపోతుంది. ఎటో నడుస్తూ వెళ్ళిపోతాడు. వేదన నిండిన కథ.
అమ్మ పరిజ్ఞానం ఏమిటో, చాలా ఆలస్యంగా, ఎన్నో ఏళ్ళ తరువాత ఆమె రాసిన ఉత్తరాల వల్ల తెలుసుకుంటాడు కొడుకు ‘అమ్మ ఆటోగ్రాఫ్’ కథలో. అమ్మ దృష్టికోణం నుంచి ఆ ఉత్తరాలను చదువుతున్నప్పుడు కొడుకు తన బాల్యాన్ని గుర్తు చేసుకుని, అమ్మ అంతరంగాన్ని గ్రహిస్తాడు. చిన్నప్పుడు తనకి మార్కులు తక్కువ వచ్చాయని తాను రాసిన ఉత్తరానికి జవాబు రాస్తూ, చదువు ఎందుకు ముఖ్యమైనదో అమ్మ చెప్తుంది. అప్పుడు గ్రహించలేని సూక్ష్మాలని – అమ్మ కోరిక ప్రకారం బాగా చదువుకుని ఉద్యోగంలో రాణిస్తూ, పెళ్ళి చేసుకుని జీవితంలో స్థిరపడ్డాకా, తాపీగా పాత ఉత్తరాలను చదువుకుంటున్నప్పుడు గ్రహిస్తాడు సుభాష్. తన తల్లి మనసు అర్థమవుతుంది. కానీ ఒకప్పుడు తల్లి హృదయాన్ని గాయపరిచేలా తాను అన్న మాటల్ని గుర్తు చేసుకుని తీవ్రంగా దుఃఖిస్తాడు. తల్లి కోరుకున్నట్టుగా తన జీవితం సాగుతున్నప్పటికీ, తల్లి మనసుకి తాను చేసిన గాయం అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. దాన్ని మరచిపోయి, తన మీద చూపిన ప్రేమనే తన పిల్లల మీద కూడా చూపమని, ఈ లోకంలో లేని తల్లిని వేడుకుంటాడు. ఆర్ద్రత నిండిన కథ.
‘పాడు బతుకు నడుమ’ కథ ఓ హిజ్రా అంతరంగపు వేదన. పద్నాలుగేళ్ళ వరకూ అబ్బాయిలా ఉన్నా, ఆ తరువాత శరీరంలో సంభవించిన మార్పుల వల్ల స్త్రీ లక్షణాలు ఏర్పడుతాయి. ఫలితంగా జీవితమే మారిపోతుంది. గ్రామస్థుల హేళలను ఎదుర్కున్న తండ్రి కొడుకుని చావబాదుతూంటాడు. తల్లి ప్రేమగానే ఉన్నా, ఇక ఇంట్లో ఉండలేక, తండ్రి ఇంట్లోంచి తరిమేస్తే, నగరానికి వచ్చేస్తాడు. అక్కడి నుంచి అధోజగత్తులో సంచారం! జీవితాన్ని పునశ్చరణ చేసుకుంటుంటే, ఎన్నో ప్రశ్నలు! అసలు తనది జీవితమేనా అని అనిపిస్తుంది. తన మనసులోని నిస్సహాయతే అసలైన నపుంసకత్వం అని అనుకుంటాడు. ఉద్విగ్నత నిండిన కథ. ఈ కథ ద్వారా బెంగుళూరుకి ఒకప్పటి పేరు ‘బెందకాళూరు’ అని తెలిసింది.
పల్లెలు ఆధునికత సంతరించుకుంటున్న కొద్దీ, కొన్ని వేడుకలు, సంబరాలు మాయమవుతున్నాయి. ఒకటి రెండు తరాల తరువాత వారికి అసలు అలాంటి వేడుక తమ గ్రామంలో జరిగేదని, ఆ వేడుక అంతరార్థం ఇది అని తెలిసే అవకాశం ఉండడం లేదు. ఆ నేపథ్యంలో, ఆధునికత ఆచారాలను కబళిస్తున్న వైనం, అవకాశాలు లేక యువత గ్రామాలను వీడి పట్టణాలకో, గ్రామాలలో వలసపోవడం – గ్రామాలు బోసిపోవడం జరుగుతోంది. బనవాసి గ్రామం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆ ఊర్లో ఒకప్పుడు కామదహనం వేడుక ఘనంగా జరిగేది. కాల ప్రవాహపు ఉధృతిలో కొన్ని ఆచారాలు కొట్టుకుపోయాయి. కానీ బనవాసిలో ‘కామ దహనం’ మాత్రం ఎవరున్నా లేకపోయినా, ఇప్పటికీ కొనసాగుతోంది. ఆచారం ఒక సాకుగా మిగిలినా, ఎందుకు కొనసాగిస్తున్నారో ‘కామునివీధి కుర్రవాళ్ళు’ కథ చదివితే తెలుస్తుంది. బ్రతుకుపోతులో పల్లెని విడిచి పట్నం చేరిన తమవాళ్ళు తిరిగి ఎప్పటికైనా వస్తారని ఆశగా ఎదురుచూస్తుందా పల్లె. ఈ కథకి అత్యంత కీలకం డీటెయిలింగ్. కాముని దహనం వేడుకకి గ్రామంలోని ఎవరెవరు ఎలా, ఏమేమి కాంట్రిబ్యూట్ చేస్తారో రచయిత రాసిన వివరాలు చదువరులను ఆకట్టుకుంటాయి. నోస్టాల్జిక్ ఫీలింగ్ నిండిన కథ.
బాల్యంలో అల్లరిచిల్లరిగా తిరిగిన ఓ యువకుడు – తమ గ్రామంలో మృతిచెందిన రంగమ్మ అనే స్త్రీ శవపరీక్షని రహస్యంగా చూసింతర్వాత నుంచి, చదువుపై ఆసక్తి పెంచుకుని, మెడిసిన్ చదువుతాడు. “రకరకాల మలుపులు వచ్చినప్పుడు చాలామందికి జీవిత మార్గమే మారిపోతుంది” అనుకుంటాడు. లోతైన వాక్యాలివి. ఆ తరువాత అతను ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడై, పోస్ట్‌మార్టమ్ బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. ఒక రోజు తానొక్కడే పోస్ట్మాస్టమ్ చేయాల్సివస్తుది. విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఇరవై ఏళ్ళ ఆ యువతి శవాన్ని చూడలేకపోతాడు. సహాయకుడు భద్రయ్య ఆ యువతి శవాన్ని చీల్చి, శవపరీక్షకి అనువుగా చేస్తుంటే, ఆ వైద్యుడికి తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి, తమ ఊరివాడైన ‘ఎంక్టప్ప’ గుర్తొస్తాడు. శవపరీక్షల సందర్భాలలో, అతను శవాల తలలు పగలగొట్టే చప్పుడు గుర్తొస్తుంది. కొన్నాళ్ళకి అతని తండ్రి పలుకుబడి ఉపయోగించి, తమ ఊళ్ళోనే కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టింగ్ వేయిస్తాడు కొడుకుకి. ఆసుపత్రి భవనం బాగుంటుంది. ముఖ్యంగా పోస్ట్‌మార్టమ్ చేసే గది ఈ వైద్యుడికి బాగా నచ్చుతుంది. ఎంక్టప్ప తాగి తాగి చనిపోవడంతో అతని కొడుకు హాలేశి శవపరీక్షలలో సహాయకుడవుతాడు. ‘పోస్ట్‌మార్టమ్’ ప్రతీకాత్మకమైన కథ.
ఓ వ్యక్తి లోని బాహ్యాంతర సంఘర్షణని చిత్రించిన కథ ‘సౌదామిని అపార్ట్మెంట్’. ఈ కథ psychological fiction జానర్‌కి చెందినట్టు అనిపిస్తుంది. మామూలు చదువు ఒంటబట్టని రవి, విద్యార్థి జీవితమంతా అస్తవ్యస్తంగా గడుపుతాడు. ఆ దశలోనే జీవితాన్ని అనుభవించేయాలని ఎక్కడో చదివి, ఎన్నో అవలక్షణాలను అలవర్చుకుంటాడు. ఫలితంగా కాలేజీ నుంచి బహిష్కరించబడతాడు, ప్రేమించిన అమ్మాయి వదిలేస్తుంది. ఆమె జ్ఞాపకాలను వదిలించుకోడానికి రవి సాహిత్యంపై దృష్టి పెడతాడు. విపరీతంగా చదువుతాడు. కువెంపు, కారాంత్, భైరప్ప, అనంతమూర్తి, ఎ.కె. రామానుజన్, అనకృ, ఓషో, రజనీష్, జిడ్డు కృష్ణమూర్తి లాంటి వారి పుస్తకాలను చదివి జీర్ణించుకుంటాడు. సొంత భ్రమల లోకంలో, తాను కనుగొన్న అంతరంగపు ఉన్మాదం వల్ల దొరికిన ఏ ఉద్యోగం లోను స్థిరంగా ఉండడు. ఉద్యోగం మానేసిన తరువాత మరింత ఎక్కువగా చదవడం మొదలుపెడతాడు. కవులు, రచయితలు చిత్రించిన, ప్రశంసించిన, గొప్పగా వర్ణించిన స్త్రీల అంతరంగాన్ని, బహిరంగాన్ని పదే పదే చదివి ఆస్వాదించేవాడు. అలాంటి స్త్రీ తనకి తారసపడాలని గట్టిగా కోరుకునేవాడు. అనుకున్నట్టే సౌదామిని అనే రచయిత్రి పరిచయమవుతుంది. ఇద్దరి భావాలు, అభిప్రాయాలు కలుస్తాయి. తనదైన కల్పనా లోకంలో ఆమెతో స్వేచ్ఛావిహారం చేస్తాడు రవి. ఆమెతో స్నేహం గట్టిపడి, ప్రణయంగా మారుతుంది. చాలా దగ్గరవుతారు. ఓ రాత్రి ఆమె అపార్ట్మెంటులో ఇద్దరూ ఒకటవుతారు. కవులు, రచయితలు వర్ణించిన అనుభూతిని తానా ఆ రాత్రి పొందినట్టు రవి భావిస్తాడు. ఏంటి పలవరిస్తున్నావంటూ తల్లి వచ్చి లేపడంతో, ఇదంతా కల అని పాఠకులకు అర్థమవుతుంది. తాను సౌదామినితో తిరిగిన అన్ని ప్రదేశాలు ఆమె కోసం వెతుకుతాడు. ఎక్కడా ఆమె కనిపించదు. చివరికి ఆమె అపార్టుమెంట్ ఉన్న ప్రాంతానికి వెళ్తాడు. అసలక్కడ అపార్ట్‌మెంటే ఉండదు. అంతా ఖాళీ స్థలం! రవి విస్తుపోయినట్టే పాఠకులు విస్తుపోతారు. కథలో ఏది నిజం, ఏది భ్రమ అన్నది అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. విభిన్నమైన కథ ఇది.
‘ఊరు-దేవుడు’ కథ సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తుంది. హోస్కెర పట్టణంలోని శివాలయం పాలకమండలి ప్రవర్తన రీతుల నేపథ్యంలో అగ్రవర్ణాల దాష్టీకాలు, అణగారిన వర్గాల పీడన, సాంఘిక దురలవాట్లను ప్రస్తావిస్తారు రచయిత. ఊర్లో జరిగే గొడవలను సమర్థవంతంగా అణచివేసిన పోలీసు ఇన్ప్సెక్టర్ రామస్వామి ఆలయం పాలకమండలి చేసే అవకతవకలను ప్రశ్నించడానికి, ఊర్లో మార్పు తేవడానికి యువకులను కూడగట్టి రామేశ్వర యువజన సంఘం ఏర్పాటు చేయిస్తాడు. గుడి ద్వారా వచ్చే ఆదాయాన్ని కొందరే చేజిక్కించుకోడం, ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడం వంటి పాలకమండలి లోని లొసుగులపై ఫిర్యాదు చేయిస్తాడు. బెంగుళూరు నుంచి ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ కార్యదర్శి నాగరాజారావు స్వయంగా వచ్చి ఆలయ రికార్డులను పరిశీలిస్తారు, విచారణ చేస్తారు. పాలకమండలిపై వచ్చిన అన్ని ఆరోపణలు నిజమేనని తేలుతాయి. ప్రభుత్వం పాలకమండలికి ఎన్నికలు జరిపిస్తుంది. బ్రాహ్మణ వర్గం ఎంత వ్యతిరేకించినా, ఆలయంపై తమ పట్టు కోల్పోతారు. హోస్కెర పట్టణంలో కొత్త గాలులు వీస్తాయి. ఇక్కడ ఆధిపత్య భావనకు కులం/వర్ణం కన్నా, ఆర్థికాంశాలే కారణమయ్యాయని పాఠకులు గ్రహిస్తారు.
యక్షగానం ప్రాభవాన్ని కాపాడే లక్ష్యంతో పనిచేసే మంజయ్య హెగడేకి వృద్ధాప్యం ముంచుకొస్తుంది. యువకుడిగా ఉన్నప్పుడు ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ. చేసి, స్వర్ణపతకం పొంది, ఉద్యోగంలో చేరినా ఆయనకు తృప్తి లభించదు. వంశపారంపర్యంగా వస్తున్న యక్షగాన కళని కొనసాగించటానికి నిర్ణయించుకుంటాడు. ఎన్నో చోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకుంటాడు. ఈ కళలో తన వారసుడిగా కొడుకు చిదంబరాన్ని ప్రవేశపెట్టాలనుకుంటాడు. కానీ చిదంబరానికి ఇష్టం ఉండదు. తల్లికి జబ్బు చేసి, వైద్యం అవసరమైన సమయంలో తండ్రి ఊర్లో ఉండడు. తల్లి చనిపోతుంది. అందుకు కారణం తండ్రేనని, ఆయనపై అకారణ ద్వేషం పెంచుకుంటాడు చిదంబరం. ఒకే ఇంట్లో ఉంటున్నా, ఆయన పట్ల తిరస్కార భావంతో ప్రవర్తిస్తాడు. ఒకరోజు మంజయ్య హెగడేకి పక్షవాతం సోకుతుంది. యక్షగానం ప్రదర్శనలివ్వలేక, ఇంటికే పరిమితమవుతాడు. తల్లిని కోల్పోయిన తాను ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోతానేమోనన్న భయం చిదంబరంలో కలుగుతుంది. అతనిలో మార్పు వస్తుంది. పూర్వ స్వభావాన్ని విడిచి, తండ్రితో ఆప్యాయంగా మసలుకుంటాడు. యక్షగానం పట్ల ఆసక్తి పెంచుకుని తండ్రికి ఆనందం కలిగిస్తాడు. ‘యక్షప్రశ్న’ భావోద్వేగాలు నిండిన కథ.
దేవుడు లేడని ఎన్నో ఏళ్ళ పాటు నమ్మిన వ్యక్తికి, దేవుడు ఉన్నాడు అన్న సత్యం అవగతమైతే, అతని అంతరంగం ఎలా ఉంటుందో ‘దేవుని జోలె’ కథ చెబుతుంది. దేవుడు ఉన్నాడు అని గట్టిగా చెప్పిన ఓ సన్యాసి మాటలని నిర్ధారించుకోడానికి, చీకటి పడ్డాకా అమ్మవారి గుట్ట పైన ఉన్న గుడికి బయల్దేరుతాడా వ్యక్తి. ఆ గుట్టకు వెళ్ళే దారిలో అతనికి ఎదురైన అనుభవాలు – అతని నమ్మకాన్ని ప్రశ్నిస్తాయి. అతనిలో వచ్చిన మార్పుని హేళన చేస్తాయి. అంతరంగంలో ఎన్నో సందిగ్ధాలకు లోనయిన ఆ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడే అక్కడ జాతర ముగిసి ఉంటుంది, చుట్టూ ఒక రకమైన భీతావహ వాతావరణం ఉంటుంది. అక్కడి గుడిలో అమ్మవారు భీకర రూపంలో దర్శనమిస్తుంది. దేవుళ్లంటే ఇలా రౌద్రంగా ఉంటారా? ఫోటోలలో ఉన్నట్టు సుందరంగా, ప్రశాంతంగా ఉండరా, అసలైన దేవుడి భంగిమ ఏది? వంటి ఎన్నో ప్రశ్నలు అతని మనసులో గూడు కట్టుకుంటాయి. ఉదయం గుట్ట దిగివస్తూంటే రాత్రి కలిగిన భయాలేవీ ఉండవు. దారి మధ్యలో ఒక గంట చప్పుడు వినబడుతుంది. ఆ సన్యాసి కనబడతాడు. అతన్ని తన జోలెలో వేసుకుంటాడు. ఆ జోలెలో ఎందరో మహానుభావులు అతనికి కనబడతారు. మార్మికత, తాత్త్వికత నిండిన కథ.
ఈ అన్ని కథలకి రచయిత కూర్చిన బొమ్మలు/డిజైన్స్ బాగా నప్పాయి. విషయ సూచికలో కూడా కథతో పాటుగా కథకి సంబంధించిన బొమ్మ ఉంచడం వైవిధ్యంగా ఉంది. తొమ్మిద కతలే ఉన్నాయి కాబట్టి, ఇలా కథ పేరు, దాని బొమ్మ ఇవ్వడం సాధ్యమైంది.
రంగనాథ రామచంద్రరావుగారు నేరుగా కన్నడం నుండి అనువాదం చేయడం వల్ల ‘losses in translation’ ఏవీ లేవు. వస్తు వైవిధ్యం ఉన్న కన్నడ కథలకి విశిష్ట అనువాదం ఈ సంపుటి. పాఠకులను నిరాశపరచదీ కథాసంపుటి.
***
అమ్మ ఆటోగ్రాఫ్ (అనువాద కథలు) కన్నడ మూలం: శ్రీధర బనవాసి అనువాదం: రంగనాథ రామచంద్ర రావు ప్రచురణ: ఛాయా రిసోర్స్ సెంటర్, హైదరాబాద్ పేజీలు: 140 వెల: ₹ 150/- ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు ~ ఛాయా రిసోర్స్ సెంటర్ 7093165151 ఆన్లైన్లో https://www.amazon.in/Amma-Autograph-Shridhara-Banvasi/dp/9392968795
~ శ్రీ రంగనాథ రామచంద్రరావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ: https://sanchika.com/special-interview-with-mr-ranganatha-ramachandrao/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
You must be logged in to post a comment.
శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు గారి సమగ్ర కథా సాహిత్యం పుస్తక ఆవిష్కరణ సభ
బాల్యపు భావాలు
శ్రీవర తృతీయ రాజతరంగిణి-33
ఒగ మాట
మలిసంజ కెంజాయ! -16
ప్రాంతీయ దర్శనం -15: రాజస్థానీ – నాడు
గజల్ 5
శ్రమరత్న
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-5
ఆకట్టుకునే అలనాటి ప్రకటనలు
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®