Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మ@నా లైఫ్ గురు..!!

[శ్రీమతి బి. కళాగోపాల్ రచించిన రచించిన ‘అమ్మ@నా లైఫ్ గురు..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

లోకం వద్దన్న తన గర్భకుహరంలో నేను పెనుగులాడుతున్నప్పుడు
పసరుమందును జయించిన నా పుట్టువడిని
నిర్ణయించిన సృష్టికర్త మా అమ్మ
తండ్రెవరో తెలీని జోగినోల్ల పిల్లని లోకులు ఆడిపోసుకుంటున్నపుడు
నా బుడిబుడి అడుగులను బడివైపు మళ్లించి
హాజరు పుస్తకంల తన పేరు పక్కన
సగర్వంగా నా పేరు ఎక్కించి
అ- అమ్మ అన్న వర్ణమాలను బతుకు పలకలో దిద్దించిన ఆదిగురువు మా అమ్మ
జోలపాట పాడకున్నా చందమామను చూపెట్టకున్నా
నేనున్నానంటూ ఆనెలు గట్టిన మెరటు చేతుల్తో
తలనిమిరిన ఆత్మవిశ్వాసపు దీవనైంది మా అమ్మ
కుండల్లో ధాన్యం నిండుకున్నా గురుగుల్లో కాసులగలగల్లేకున్నా
రాట్నం కండె లెక్క కరిగిపోతూ
చేదుకున్న బాయికాడి కైకిల్లతో
కూరాడికుండలో తేరుకున్న తేటఅంబలోలె
బతుకు దూప తీర్చిన జీవన చలివేంద్రం మా అమ్మ
గాంధీ బొమ్మ దుక్నాంల చేపయిలు గుబులురేపుతున్నా
కట్టాల్సిన ఫీజుల ఆఖరితేదీలు హెచ్చరిస్తున్నా
తన మదిపొరల కదలికలు తెలియనీయని ఒంటి నిట్టాడి గుంజ మా అమ్మ
గుడిశెల కంతలు వెక్కిరిస్తున్నా
షానీపోరీల స్టేఫ్రీలు కొనీయకున్నా
తన కోటిమాసికల చీర బొత్తులో
నా సిగ్గుల తొలినెలసరిని దాచేసిన జిగ్రీ దోస్తుమా అమ్మ
నే కోరిన కలలను సాకారపర్చిన విజయపు కొవ్వొత్తి మా అమ్మ
భుజాల పై మోశిన బిడ్డ గెలుపుకు సంబురపడే
దిగిపోని సూరీడసొంటి మా
అమ్మ ఋణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది
కన్కకీరమ్మ బిడ్డ పెద్ద ఆఫీసరైందని
ఇప్పుడు అందరూ అనుకుంటుంటే పాడుజిష్టి తగలకుండా
కాలిగ్గట్టిన నల్లగొంగడి దారమై మురిశేటి
అతి (అ) సాధారణ మనిషి గాక
మరేమీ గాని అమృతమూర్తి మా అమ్మ..!!

Exit mobile version