Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమెరికాలో శైశవం

[శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ రచించిన ‘అమెరికాలో శైశవం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

 

దేళ్ల మనవడి సహవాసంలో
బాల్యం తడిగా మెరిసింది!
అమ్మమ్మా అంటూ వెంట తిరుగుతూ
చెప్పే కబుర్లతో రోజులు క్షణాలుగా మురిపించేను!

అల్లిబిల్లి చేష్టలు
అంతులేని ఆటలు
అలుపెరుగని పరుగులు
ఆడే దాగుడుమూతలతో
విచ్చుకునేను మా చిన్ననాటి
స్మృతుల రేకులు!

వాడి పుస్తకాల ప్రపంచం
నుండి పలుకరిస్తాయి
డైనసోర్లు సింహాలు
పులులు ఎలుగుబంట్లు
గమ్మత్తైన మ్యాజిక్కులు
రాజుల రాణుల కథలు
పౌరాణిక గాథలు

కళ్ళు విప్పార్చుకు చూసే
చిన్నపిల్లల వీడియోలలోని
బ్లిప్పీ కేటీ మాట్లాడే పెప్పా పిగ్
చేరువయ్యేరు స్నేహితుల్లా!

వాడి అమెరికన్ యాసతో
పడతాము మేం తికమక!
మా ఇంగ్లీష్ ఉచ్చారణకు
నవ్వుతాడు వాడు పకపక!

వాడి సమ్మర్ క్యాంప్ స్కూలు నేస్తాలు
చైనీస్ గర్ల్
కొరియన్ అమెరికన్ బాయ్స్
ఇండియన్ ట్విన్స్‌తో
కలుగుతాయి పరిచయాలు!

స్పానిష్ టీచర్ల మాటలు
వల్లిస్తాడు చిలుకపలుకుల్లా
మిస్ నషాలీ అయింది వాడికి
ప్రియమైన ఇథియోపియన్ టీచర్
అంతర్జాతీయమయం అమెరికా చిత్రపటం!
దాన్ని ఛిద్రం చేసే ప్రస్తుత ప్రయత్నం అసహజం!

వాడి సమ్మర్ క్యాంప్ స్కూలు పేరు బహు ప్రత్యేకం!
వావ్! WOW! – అంటే world of wonder!
అది పసికందుల వెన్నెల ధామం!

Exit mobile version