Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమెరికా!

[శిరీష పద్మ యర్రంశెట్టి గారు రచించిన ‘అమెరికా!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


లల్లో బంగారు కప్పు,
నిజంలో ఉక్కు గోడల జైలు.

పని కోసం పయనం,
వీసా ముద్రలోనే ఆగిపోయిన ఆశలు.
“జాబ్?” అడిగితే
వంకర వాక్యాలతో “లేటర్ మాన్” అనేసింది.

ఆంగ్లం నేర్చుకున్నా,
వారి యాస మాత్రం గాలి గర్జనలలా వినిపించింది.
“వాట్సప్ డ్యూడ్, లెట్స్ హ్యాంగౌట్” అన్నప్పుడు
అన్నం పెట్టే మాట ఎక్కడా వినిపించలేదు.

గగనచుంబి అద్దాల కట్టడాల్లో
నా ప్రతిబింబం మాత్రం కనిపించలేదు.
డాలర్ల తలుపు తట్టితే
ఋణపు కార్డులు మాత్రమే తలుపు తెరిచాయి.

భారీ వంతెనల క్రింద
నా లాంటి వలస కలలే వందలు పడుకున్నాయి.
ప్రతీ వీధి నీయాన్ వెలుగుల్లో మెరిసినా,
నా జేబు మాత్రం చీకటిగానే మిగిలింది.

వెనక్కి తిరిగి నడవగానే
నా స్వంత అడుగుల శబ్దమే
నన్ను ఎగతాళి చేసింది:
“డాలర్లలో కొలిచిన కలలకు
నీ పేద కడుపు సరిపోతుందా బిడ్డా?”

Exit mobile version