అమెరికాలో ఉన్న కందాళం వెంకట రామానుజాచార్యులు గారినీ, ప్రస్తుతం ఇండియాలో ఉంటున్న అమెరికన్ అప్పాజోస్యుల సత్యనారాయణ గారినీ తెలుగు సాహితీ రంగంతోనూ, నాటక రంగంతోనూ ఏమాత్రం సంబంధం ఉన్నవాళ్లకీ పరిచయం చెయ్యవలసిన అవసరం లేదు. పేపరు చదివే అలవాటున్నవాళ్లకి ఏడాదికి ఒకసారి అజో-కం-విభొ సంస్థ జరిపే వార్షికోత్సవాల గూర్చి పేపర్లో ఒక మూలగా చిన్న వార్తా, కొద్దిగా పెద్ద నగరాల్లో ఆ ఉత్సవాలు జరిగినప్పుడు మూడు రోజుల్లో ప్రతిరోజూ చిన్న సమీక్షా గత ఇరవై అయిదేళ్లుగా చదివిన గుర్తు ఉండే ఉంటుంది. కానీ, మిగిలినవాళ్లకి మాత్రం పరిచయం అవసరం. దానికి ముఖ్య కారణం, మనుషులకి కాక సంస్థకి ప్రాధాన్యత నివ్వడం అన్న నమ్మకంవల్ల వీరిద్దరూ టీవీల్లో ఏమాత్రం కనిపించకపోవడం! వారిని సరయినవాళ్లు టీవీలో ఇంటర్వ్యూ చేస్తే వారి గూర్చి ఎక్కువమందికి తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి దీన్ని చదివేవాళ్లకి మాత్రం వాళ్ల గూర్చి కొద్దిగా చెప్పుకుందాం.
నాకు సత్యనారాయణ గారితో పరిచయం పెంపొందడంలో చారిగారికి ప్రముఖ స్థానమున్నది. నాలుగు దశాబ్దాల క్రితం బాచెలర్స్ డిగ్రీ కోసం నా చదువూ, పి.హెచ్.డి. కోసం చారిగారి పరిశోధనా ఒకేసారి ఐఐటి మద్రాసులో మొదలయ్యాయి. తరువాత నేను ఉన్నత విద్యకోసం అమెరికాలో న్యూ జెర్సీ రాష్ట్రంలోని రట్గర్స్ యూనివర్సిటీకి వస్తే అక్కడ ఆయన పోస్ట్ డాక్టరల్ ఫెలోగా కనిపించారు. రెండు, మూడు రోజుల తేడాలో మేమలా వస్తున్నట్లు మా ఇద్దరిలో ఎవరికీ తెలియదు. తరువాత న్యూ జెర్సీలోని తెలుగు సంఘం జరుపుకునే కార్యక్రమాల్లో నాటకం వెయ్యడానికి అప్పాజోస్యుల శ్రీనివాసరావుగారితో కలిసి ఆయన బాబాయి గారు సత్యనారాయణ గారింటికి ఇద్దరం వెళ్లడం ఈనాడు ఈ పరిచయం చెయ్యడానికి నాంది పలికించింది.
చారి గారు (ఎడమ పక్క), సత్యనారాయణ గారు
చారి గారూ, సత్యనారాయణ గారూ ఇద్దరూ కూడా డాక్టరేట్ పట్టాని చేపట్టిన తరువాత బోధకులుగా (ప్రొఫెసర్లుగా), పరిశోధకులుగా (రీసెర్చెర్లుగా) విద్యా రంగంలో ప్రముఖ స్థానాన్ని అలంకరించినవాళ్లే. చారి గారు కెమిస్ట్రీ స్పెషలిస్ట్ అయితే, సత్యనారాయణ గారిది కంప్యూటర్ సైన్స్. విద్యార్థులకు బోధన చెయ్యడమే గాక వారి పరిశోధనలను తిన్ననైన మార్గాన్ని పట్టించినవాళ్లు కూడా. చారి గారు ప్రపంచమంతా కాన్ఫరెన్సులని కండక్ట్ చేస్తూ, భారతదేశంలో విద్యార్థుల రీసెర్చ్ ని అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా తీర్చి దిద్దుతూ, ఎప్పుడూ అమెరికాలో కన్నా బయటే ఎక్కువ కాలం ఉంటున్న ట్లనిపిస్తారు. ఇవే కాదు వారి ప్రత్యేకతలు. చారి గారు కీబోర్డ్ అద్భుతంగా వాయిస్తారు. “స్వరలహరి” అన్న పేరుతో ఆర్కెస్ట్రాని కొన్నేళ్లపాటు న్యూ జెర్సీలో నడిపారు. తెలుగు, హిందీ పాటలతో ప్రేక్షలని అలరించేవారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి కుమారుడు చరణ్ గారు వారి బృందంలో పాడారు కూడా. సత్యనారాయణ గారు న్యూ జెర్సీలో వేసిన నాటకాల కన్నింటికీ చారిగారు నేపథ్య సంగీతా న్నందించారు. కొన్నింటిలో నటించారు కూడా. తన కీబోర్డ్ సహకారాన్ని చాలామంది నాట్య అరంగేట్రం కార్యక్రమాల్లో అందించేవారు. ఇప్పటికీ అలా చేస్తూనే వున్నారు. వీటికి తోడు తెలుగు కథా, నాటక, పద్య సాహిత్యం మీద ఆసక్తితో చదువుతూనే వుంటారు.
సత్యనారాయణగారు కొంతకాలం క్రితం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గిరినించీ విరమించి ప్రస్తుతం భారతదేశంలో ఉంటున్నారు. వారికి నాటకానుభవమూ, నటనానుభవమూ, సాహిత్యం మీద మక్కువా పుష్కలంగా ఉన్నాయి. ఆయన అమెరికా వచ్చే ముందు ఇండియాలో తెలుగు నాటకాలు ప్రదర్శించారు. వారు నిర్మాతగా అప్పటికే ఒక సినిమా విడుదల అయింది కూడా. న్యూ జెర్సీ, న్యూ యార్కుల్లో నాటకాలు ఆయన దర్శకత్వంలో ప్రదర్శింపబడ్డాయి. ఆయన అమెరికాలో వేసిన తొలి నాటకంలో నేను, చారిగారు నటించాం. 1986 నుండీ నేను ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రానికి 1989 లో వెళ్లేదాకా వారి దర్శకత్వం వహించిన ప్రతి నాటకంలోనూ నాకొక పాత్ర ఉన్నది. తరువాత దాదాపు పదిహేనేళ్లు ఆయన నాటకాలు న్యూ జెర్సీ, న్యూ యార్కుల్లో ప్రదర్శిస్తూనే ఉన్నారు. అన్ని నాటకాలకూ చారి గారి సంగీత సహకారం ఉండేది.
ఈ నాటకాలల్లో ఒకదాన్ని మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది, “ఇదేమిటి” అన్న మూడు గంటల నాటకం. స్వర్గీయ యర్రగుంట్ల రఘునాధరావుగారిది ముఖ్య పాత్ర, నాది కీలక పాత్ర. చారి గారు నాటకంలో ఒక పాత్ర ధరిస్తూనే కీబోర్డు మీద సంగీత సహకారాన్ని అందించారు. దాదాపు నాలుగు నెలల పాటు ప్రతీ వారాంతం రిహార్సల్స్ జరిగాయి. వారి ఆతిథ్యం మరవలేనిది. కుటుంబసభ్యుని స్థాయికి మించి ఆదరణ. ఆ వారాంతం అంతా హాయిగా వారి శ్రీమతి శ్రీలక్ష్మి గారు ఆదరంతో, ఆప్యాయంగా వండి వడ్డించిన మంచి తిండి తిని కూర్చోవడమే అక్కడ నాకూ, చారిగారికీ పని మరి. దాదాపు అన్ని రిహార్సల్స్ సత్యనారాయణగారి ఇంట్లోనే. కొన్నిసార్లు శని, ఆది రెండు రోజుల్లోనూ! ఒక శనివారం మధ్యాహ్నం కేవలం ఈ నాటక ప్రదర్శనని చూడడానికి తెలుగువాళ్లు టిక్కెట్టు కొనుక్కుని మరీ వచ్చి చూశారంటే ఈనాడు అది నమ్మబుద్ది కాదు. అప్పటికీ, ఇప్పటికీ, అమెరికాలోవున్నవాళ్లు ప్రదర్శించిన మూడు గంటల నిడివి ఉన్న తెలుగు నాటకం అదే! నాటకం రిహార్సల్స్ అయిన తరువాత భోజనాలకు ముందూ, తరువాతా కూడా సత్య హరిశ్చంద్ర నుండో, పాండవోద్యోగవిజయాలలో నుంచో, లేదా పోతన భాగవతం నుంచీనో పద్యాలు పాడి వినిపించేవారు. ఆ తరువాత అమెరికాలో జరిగిన కొన్ని అవధానాలకి ఆయన పృఛ్ఛకునిగా వ్యవహరించారు. ఇవ్వన్నీ ముందుముందు ఆయనకి ఎలాంటి ప్రేరణని కలిగిస్తుందో నన్న ఆలోచన ఆనాడు నా కేమాత్రం కలుగలేదు. ఈ మధ్యనే ఆయన స్వయంగా రచించిన గుణాఢ్య శతకాన్ని ప్రచురించారు అని తెలిసినప్పుడు మాత్రం ఆయన గూర్చి ఎంత తెలుసుకున్నా గానీ ఈయన ఇంకా నివురు గప్పిన నిప్పే అని అనిపించింది.
వీరి ప్రత్యేకతలు ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యపోయేటంతలో మీకు ఇంకొక సమాచారం. సత్యాగారికి తెలుగు సాహిత్యం మీద, నాటకం మీద చాలా మక్కువ. నాటకాన్ని, ఆ సాహిత్యాన్ని నిలపడానికి ఆయన తన వంతు కృషి చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. దానికి చారిగారు చేయూత నిచ్చారు. దాని ఫలితమే పంధొమ్మిది వందల తొంభై దశకంలో మొదలయి ఈనాడు అందరికీ పరిచయమున్న “అజో-కం-విభొ ఫౌండేషన్”. అమెరికాలో ఉన్నవాళ్లకు అది తెలుగు పుస్తకాలు ఇండియా నుండీ తెప్పించుకునే వెసులుబాటు కల్పించే వెబ్సైట్ ని నడిపే సంస్థగా పరిచయం. ఇండియాలోని రెండు రాష్ట్రాల తెలుగువాళ్లకు, అది ఇరవై ఆరేళ్లపాటు ప్రతియేటా నాటకపోటీలని నిర్వహిస్తూ, ఉత్తమ నాటకానికే గాక రచయితకూ, ప్రదర్శనకు ఎంపిక అయిన ప్రతీ నాటకానికీ పారితోషికం ఇవ్వడాన్ని మొదలుపెట్టిన సంస్థగానూ, ఒక ప్రతిభామూర్తి జీవిత పురస్కారాన్నీ, దానితోబాటు సాహితీమూర్తులకు, సేవామూర్తులకు విశిష్ట సత్కారాలనీ అందీస్తున్న సంస్థగానూ బాగా పరిచయం. లాభాపేక్షలేని ఫౌండేషన్లు ఎన్నో ఉన్నాయి గానీ అవన్నీ సాధారణంగా చందాలని అర్థించి ఖర్చులకోసం వనరులని పోగుచేసుకుంటూ ఉంటాయి. బిల్ గేట్స్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ లాగా ఈ ఫౌండేషన్ ఖర్చులు మాత్రం పూర్తిగా ఈ చారి గారివీ, సత్యనారాయణ గారివీ మాత్రమే! బిల్ గేట్స్ ఫౌండేషన్ కు మైక్రోసాఫ్ట్ స్టాక్ ఇంధనం. వీరి ఫౌండేషన్ కి మాత్రం అలాంటి సుళువు మార్గం ఏదీ లేదు. అంతా సొంతంగా పెట్టే ఖర్చే!
ఈ ఫౌండేషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో నంది పురస్కారా న్నందుకున్న శ్రీనాథుడు పద్యనాటక బృందాన్ని అమెరికాకు 2004లో రప్పించి దేశమంతటా ఆ నాటక ప్రదర్శన నిప్పించడానికి వీలు కల్పించారు. వాషింగ్టన్, డి.సి., లో ఆ నాటకానికి లభించిన ఆదరణ మరువలేనిదని శ్రీనాథుడు పాత్రధారి గుమ్మడి గోపాలకృష్ణ గారు అనడం నా కిప్పటికీ గుర్తుంది. పూర్తి నటీనట బృందం ఇండియా నుండీ వచ్చి వేసిన మొదటి తెలుగు పద్యనాటకం అదే; తరువాత ఇంకెవరూ ఆసక్తి చూపకపోవడం వల్ల అదే చివరిదీ కూడా. ఆ విధంగా కూడా ఈ ఫౌండేషన్ విజయాలు చిరకాలం నిలిచిపోతాయి.
సాహితీ సేవలో భాగంగానే తెలుగు పుస్తకాల ప్రచురణకు కూడా పూనుకుని ఇప్పటిదాకా ఎనభైకి పైగా పుస్తకాలను ప్రచురించారు. వాటి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. వాటిల్లో నా రెండు కథా సంకలనాలూ, ఒక చిన్న నవలా కూడా కనిపిస్తాయి.
సేవాతత్పరత, అంకితభావంతో తెలుగు నాటకాన్నీ, సాహిత్యాన్నీ నిలపడానికి పాతికేళ్లుగా కృషి చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలులు చారిగారి సత్యనారాయణ గారి మిత్రబృందంలో నేనుండడం నా అదృష్టంగా భావిస్తాను.
ఈపాటికి మీకు ఒక సందేహం తలెత్తి వుండాలి. అంతా బాగానే ఉన్నది గానీ, వీరి పరిచయం ఈ శీర్షికకు ఎలా నప్పింది అని. ఐఐటి మద్రాసు రోజుల్లో ఒకే కాలేజీలో చదవడంవల్ల, “చారిగారు” నేను సహాధ్యాయులం. మేము ఒకే తరగతి గదిలో కూర్చోలేదు గానీ ఒకే కాలంలో అక్కడ ఉన్నాం గదా! అలాగే, నేను రట్గర్స్ యూనివర్సిటీలో గడిపిన అన్ని సంవత్సరాలూ చారిగారు, టీచింగ్ అసిస్టెంట్ పొజిషన్లో నేను ఇద్దరం అదే యూనివర్సిటీ ఉద్యోగులమే. అంటే, సహోద్యోగులం!
***
ముక్తాయింపు:
ప్రతిభావంతులూ, తమకంటూ ప్రత్యేక, విశేష వ్యక్తిత్వా లున్నవాళ్లూ ఎందరో ఉన్నారు. కానీ, నా విద్యార్థిదశతో మొదలుపెట్టి, ముఫ్ఫై ఏళ్లకు పైగా సాగుతున్న ఉద్యోగపర్వంలో అలాంటివాళ్లు ఇంతమంది నాకు చేరువలో ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. అమెరికన్లన్నా, వారి జీవన విధానాలన్నా ఒక రకమైన వక్రాభిప్రాయాలని భారతీయుల మెదడులలో ముద్ర వెయ్యడానికి ఒకనాడు పత్రికలు ఇతోధికంగా సహాయం చేస్తే, ఈనాడు అన్నిరకాల ప్రసార మాధ్యమాలూ, సోషల్ నెట్వర్కులూ ఆ బాధ్యతని తమ భుజస్కంధాలపైన మోస్తున్నాయి. ఏటికి ఎదురీదినట్లుగా నేను చేసిన పరిచయా లన్నీ విశిష్ట వ్యక్తుల ప్రత్యేకతలని ఆశ్చర్యంతో, ఆనందంతో ఎత్తి చూపినవే. ఈ సహాధ్యాయుల, సహోద్యోగుల మధ్య మనగలగడం ఏనాటి నోము ఫలమో తెలియదు గానీ, ఆ పరిచయాలని మీతో పంచుకోగలగడం మాత్రం సంచిక సంపాదకులకి ఈ శీర్షిక నచ్చడం వల్ల. వారికి, సహృదయంతో ఆదరించిన మీకూ హృదయపూర్వక ధన్యవాదాలని తెలుపుకుంటున్నాను.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
తల్లివి నీవే తండ్రివి నీవే!-5
శ్రీ శిరిడీ సాయినాథుని దివ్యలీలలు
మహతి-64
యువభారతి వారి ‘ఉపనిషత్సుధ’ – పరిచయం
మనోవీధిలో..
మిర్చీ తో చర్చ-19: ప్రేమ – మిర్చీ… ఒకటే
‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-22 – మైనే చాంద్ ఔర్ సితారోం కీ
రంగుల హేల 15: బైట నుంచి ప్రేమిద్దాం
కనువిప్పు
వారెవ్వా!-16
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®