Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆమె మన హృదయాలనూ, ఆత్మనూ అల్లుకుంది

“నాం గుం జాయేగా, చెహరా యే బదల్ జాయేగా, మేరీ ఆవాజ్ హీ పహచాన్ హై, అగర్ యాద్ రహే” అని పాడుకున్న లతా మంగేష్కర్ జన్మదినం సందర్బంగా వ్యాసరూపంలో కొన్ని అనుభూతులు పంచుతున్నారు పరేష్ ఎన్. దోషి.

గానలత

తుకు తరువును పాటలా అల్లుకుంటావు
దాని వెచ్చదనాలను సారూప్యం చేస్తావు

నువ్వు అల్లుకుంటే
తెగయేడ్చే పసిపాప స్తన్యమంది నవ్వులు చిందిస్తుంది
ఆత్మహననానికి పూనుకున్న మనిషికి అమాంతంగా
జీవితం మీద వల్లమాలిన మమకారం కలుగుతుంది
లోపల్లోపలే నరాల వేళ్ళు విస్తరించుకున్న మానవ మహీరుహంలో
రక్తం పరుగులెత్తి వేనవేలు మత్తుపూలు పూయిస్తుంది
మరపు పరదాలు తొలగి కసక్ లాంటి జ్ఙాపకమేదో రగులుకుంటుంది
జననానికి ముందు మరచిపోయినదేదో తలపుకొస్తుంది
శతాబ్దాలుగా తిరుగాడుతున్న ఆత్మకు శరీరం దొరుకుతుంది

నక్షత్రఖచిత ఆకాశాన్ని కప్పుకున్న పసివాడు
తెల్లారి లేచి చూస్తే ఆ సరికే ఎవరో ఆకాశాన్ని వెల్లవేసి వుంటారు
ప్రాచీరేఖలా ప్రయాణించి ఆశ్చర్యంలా అతన్నల్లుకుంటావు

ఆకాశాన్ని చుట్టచుట్టి గొంతులో దాచిపెట్టి
నువ్వు పాడే పాటలన్నీ మనిషిని నాజూకుగా పెనవేస్తాయి
నాజూకు పదమంత నాజూకు నీ పాట
దైనందిన కాలుష్యాలకు సొమ్మసిల్లిన మానవ మహీరుహం మీద
పాటలా వర్షించి ప్రక్షాళనా పులకింతలకు గురిచేస్తావు.

ఇది అప్పట్లో నేను వ్రాసుకున్న కవిత. ఇది ఆమె గురించీ, ఆమె పట్ల నాకున్న భక్తి గురించీ యేకకాలంలో చెబుతుంది. నా చిన్నప్పట్నుంచీ నేస్తురాలామె మరి!

బెజవాడలో వో హాలు, వో వంటగది వున్న ఇంట్లో గడిచింది నా బాల్యం. అప్పట్లో వున్న స్థలమంతా గదులుగా కట్టేసే “తెలివితేటలు” లేవు ప్రజలకు. ఇంటి వెనుక విశాలమైన దొడ్డి, ఇంటి ముందు విశాలమైన వసారా, చెక్క మెట్లు, బాల్కనీ కి ఆ వసారాకి నడుమ గోడ. ఆ రెంటి మధ్య సన్నటి సందు. దసరాలో దసరా వేషాల బళ్ళు అక్కడినుంచే చూసేవాళ్ళం. యెండాకాలపు రాత్రులు ఆ సందులోనే యెవరో వొకరు పడుకునేవాళ్ళం. ఆ చల్లటి గాలికి అక్కడ పడుకున్న వ్యక్తి అదృష్టవంతుడే. వొకో సారి నాకు దొరికేది చాన్సు. ఇంత సోది యెందుకంటారా? మా ఇంటికి యెదురుగా, రోడ్డు దాటితే వో కిళ్ళీ కొట్టు. దాన్ని ఆనుకునే వో చిన్న హోటలు. అలాగే పది బిల్డింగుల అవతల రోడ్డు చివర కోమల విలాస్, దాన్ని ఆనుకుని మరో కిళ్ళీ కొట్టు. రాత్రి పన్నెండు దాకా సందడే. అలా ఆ చల్లని గాలులతో పాటు ఆ కిళ్ళీ కొట్టువాని రేడియో నుంచి వచ్చేవి లత పాటలు. వొకో సారి నిద్ర పుచ్చితే, ఒకోసారి అలా మేల్కొని వింటూ వుండిపోయేలా చేసేవి. అలాగే, తెల్లవారు జాము నాలుగైదు గంటలకే లత గానం నిద్ర లేపేది! ఇప్పుడు చెప్పండి అదంతా రాజయోగం కాదూ?

తనకు ఆటవిడుపు కోసం సైగల్ ని వినడమంటుంది లత. నాలాంటి వారికి కష్టాలన్ని మరచి, ఆనందంలో ముంచేసే స్వరం లత. నాకున్న భోగం ఆమెకెక్కడిది! 🙂

ఈ ఎనిమిదో వింత కోసమే ప్రపంచమంతా విస్తుపోతూ వుంటుంది. యెంతవరకు నిజమో, అతిశయోక్తో తెలీదు గాని పాకిస్తాను కూడా లత తమ దేశంలో లేకపోవడం లోటుగా భావిస్తుందంటారు.

ఆమె జీవిత విశేషాలు అందరికీ తెలిసినవే. ఈ వ్యాసం లో కేవలం ఆమె స్వరానికీ నా హృదయానికీ మధ్య వున్న బంధాన్ని వివరిస్తాను. ఇన్ని భాషలలో ఇన్ని వేల పాటలు పాడిన ఆమె, హిందీ, గుజరాతి, తెలుగు (తర్వాతి రెంటిలో వేళ్ళమీద లెక్కపెత్త తగ్గ, రెండు పాటలు) మాత్రమే తెలిసిన నేను! అయినా ఈ సాహసం.

అప్పట్లో మనదేశానికి స్వాతంత్ర్యం కూడా రాలేదు. నూర్జహాన్ గాయనిగా చాలా యెత్తైన సింహాసనంలో వున్నది. అప్పటికి లత వో బాలిక. తండ్రి అకాల మరణానంతరం, జ్యేష్ఠ సంతానం గా ఆమె ఇంటి బాధ్యతను ఆడుకునే వయసులోనే తలకు యెత్తుకుంది. వొక చిత్రంలో ఆమె బాల నటి, అదే చిత్రంలో నూర్జహాన్ గాయని. యెవరో లతను తీసుకెళ్ళి పరిచయం చేశారు బాగా పాడుతుందని! యేదీ వినిపించూ అన్నది ఆ సామ్రాజ్ఞి. లత పాడింది. మెచ్చుకోలు. మీ ముందు నా పాట యెంతలెండి అన్నది లత. “అలా అనకూడదు, అల్లా నీకు వొక బహుమతి వొక కళను ప్రసాదించినప్పుడు ఇలా అనడం అతన్ని అవమానపరచడమే. ఇన్షా అల్లా (మన దగ్గర సమానార్థకం కృష్ణార్పణం అనో అంతా ఆ పైవాడి దయ అనో అర్థం చేసుకోవచ్చు) అనాలి” అన్నదా అక్క. అది మొదటి పాఠం. తర్వాతొకసారి అక్కను కలవడానికెళ్ళినప్పుడు ఆమె వో మూల మోకాళ్ళ మీద కూర్చుని, కళ్ళు మూసుకుని తల అటూ ఇటూ తిప్పుతూ యేమిటేమిటో అంటున్నది, మధ్య మధ్య కన్నీరు కారుస్తూ. అది నమాజుగా అర్థం కాని వయసు. అడిగింది యెందుకేడ్చావక్కా అని. అది యేడుపు కాదు దయగల అల్లా నన్ను సదా కనిపెట్టుకుని వున్నాడని నా మనసు తెలిపే కృతజ్ఞత. నువ్వు పెద్దయ్యాక నీకు అర్థమవుతుందిలే. ఇది రెండో పాఠం. ఆమె ఈ రెండు పాఠాలూ యెన్నడూ మరచిపోలేదు. ఆ వినమ్రతే ఆమెను ఇప్పుడున్న స్థాయికి తీసుకెళ్ళింది. యెన్ని ఇంటర్వ్యూలు చూసినా ఆమె మాటలు వొకేలా వుంటాయి : ఇదంతా ఆ దేవుడు ఇచ్చిన వరం, నా తల్లిదండ్రుల ఆశ్శీస్సులు, నా అభిమానుల ప్రేమ. అందుకే వొక ఇంటర్వ్యూ లో మీకు బాగా కష్టమనిపించిన పాట యేది అని అడిగితే యేదీ లేదు అంది.

మహారాష్ట్రలో పుట్టిన మరాఠీ పిల్ల. ఆమె హిందీలో కూడా కాస్త ఆ మరాఠీ వాసనొచ్చేది. ఇక ఉర్దూ గురించి చెప్పేదేముంది? అందులో ఆ రోజుల్లో ఉర్దూ అనేది హిందీ సినెమా సంభాషణలలో, పాటలలో బాగా విస్తరించి వున్నది. వొకసారి దిలీప్ కుమార్ ఆమె ఉచ్చారణ గురించి ఆట పట్టించాడంట. ఆమె నొచ్చుకోకపోగా దాన్ని వో సవాలుగా తీసుకుని, వో ట్యూటర్ ని పెట్టుకుని తన ఉర్దూ ఉచ్చారణను మెరుగుపరచుకుంది. తన పని పట్ల అంత భక్తి ఆమెకు.

ఇన్ని దశాబ్దాలుగా హిందీ చిత్రరంగంలో నిలబడగలిగిందంటే అది కేవలం ఆమె నైపుణ్యమే, ఆమె శ్రమాభక్తులే. వోసారి ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ లత పాట “యే జిందగీ ఉసీకీ హై జో కిసీకా హో గయా” వింటూ అన్నాట్ట “కంబఖ్ట్ కభీ బేసురీ నహీఁ హోతీ”. (వొక్కసారి కూడా అపస్వరం పలకదు అని). సూర్యుడికి దివిటీలు చూపించడానికి నేనెంత!

అయితే వో మాట చెప్పుకోవాలి. లత లతగా మారడానికి అంతమంది సంగీత దర్శకులూ కారణమే. వొక రకంగా ఆమె సరైన చోట సరైన సమయంలో పుట్టిన అదృష్టవంతురాలు. మిగతా ప్రాంతీయ చిత్ర రంగాలలో లాగా కాకుండా హిందీ సినెమ రంగంలో సంగీత దర్శకులు రకరకాల ప్రాంతాలనుంచి వచ్చిన వారున్నారు. అందుకే ఆ సంగీతంలో అంత వైవిద్యం. తెలుగు రాష్ట్రం నుంచి ఆది నారాయణ రావు, గుజరాత్ నుంచి వసంత్ దేశాయి, కళ్యాణ్జీ ఆనంద్జీ, అస్సాం-బంగాల్ నుంచి బర్మందా, సలిల్ దా, మహారాష్ట్రనుంచి చితళ్కర్ రామచందర్….ఇలా యెందరో మహానుభావులు. వీళ్ళందరూ కలిసి మలచిన గాయని లత. ఈ మాట తనే చెప్పుకుంటుంది. వొక్కో సంగీత దర్శకుడిది వొక్కో రకమైన అనితర సాధ్యమైన నైపుణ్యం. మదన్ మోహన్ ఘజళ్ళలో నైతే నౌషాద్ శాత్రీయ రాగాలమీద పాటలు కట్టిన స్వరకర్త. బర్మందా బంగాల్ లోని ఫోక్ చాయలు తెస్తే, అతని కొడుకు భారతీయ శాస్త్రీయ సంగీతం, వెస్టన్, ఇక చెప్పలేనన్ని ప్రయోగాలు చేసిన మాయావి. రోషన్, ఘులాం ముహమ్మద్, అనిల్ బిస్వాస్, శంకర్ జైకిషన్, లక్ష్మీకంత్ ప్యారేలాల్,ఇళయరాజా… ల నుంచి ఇప్పటి ఏ ఆర్ రహ్మాన్ వరకూ యెందరో ఆమెను ఆమెగా మలిచారు.

అలాగే అప్పట్లో వచ్చే పాటలు కూడా సాహిత్య సువాసనలతో వుండి, సంగీతం తో సమానంగా ప్రజలను ఆకర్షించేవి. మరి అవి గుర్తుండిపోయేలాగా పాట రావాలంటే అంతే భావయుక్తంగా పాడేవాళ్ళు కూడా కావాలి కదా. కొంతమంది లత దగ్గర mathemetical precision వుంది, కాని భావం ఆశా, గీతా దత్ లాంటి వారిలో మెండు అని నమ్ముతారు. నేనైతా నమ్మననుకోండి. “అయ్ మేరే వతన్ కే లోగోఁ” లో దేశభక్తి, “ఆ జానే జా” లో కెబెరే కవ్వింపు, “మై కా కరూఁ రాం ముఝె బుడ్ఢా మిల్ గయా” లో అల్లరి, “రూఠా హై తో మనా లేంగే” లో అనునయింపు, “అల్లా తేరో నాం” లో భక్తి, “లగజా గలే” లో ఘజలు నడక ఇలా యెన్నైనా చెప్పుకోవచ్చు. ఇవన్నీ భావాన్ని ప్రకటించలేపోతే నిలిచేవా? సాహిత్యాన్ని కూలంకుషంగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా తన స్వరాన్ని, దాని స్థాయినీ, అవసరమైనప్పుడు తీవ్రస్థాయిలో, అవసరమైన మరొకప్పుడు గుసగుసగా పాడటం మామూలు విషయమా? వయసు తన చాయను ఆమె స్వరంపై విస్తరించినప్పుడు ఆమె పాడటం తగ్గించేసింది. సరిగ్గా అదే కాలంలో పాటలలో సాహిత్యపు విలువలు కూడా పడిపోయాయి. అలాంటివి పాడటం ఇష్టం లేకపోవడం మరొక కారణంగా ఆమె సినెమా నుంచి నిష్క్రమించింది.

ఆమె జీవితంలో చాలా వివాదాలు చూసిన మనిషి. యెవరినీ పైకి రానివ్వలేదనీ, స్వంత చెల్లెల్ని కూడా పైకి రాకుండా చేసిందనీ. వీటిని వొక పక్కన పెడితే ఆమె ఇప్పటి వరకూ పాడిన పాటల్లోని తీయదనం, వైవిద్యం మనకు ఇతరులలో యేమన్నా కనిపించిందా? రాయల్టీ ని తీసుకుని ఆమెకూ రాజ్ కపూర్ కు మధ్య కూడా గొడవలొచ్చాయి. కాని లత లేకుండా రాజ్ కపూర్ సినెమా పాట బోసిపోతుంది. తర్వాత లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వీళ్ళిద్దరి మధ్యా సయోధ్య కుదిర్చితే ఆమె స్టుడియోకొచ్చి ఆ టైటిల్ సాంగ్‌ను వొక్క టేక్ లో పాడి వెళ్ళిపోయిందట. అలాగే కొన్నాళ్ళు రఫీ లతల మధ్య కూడా యెడం వచ్చింది. ఆ జంట పాడేదే డ్యూయెట్టు అని నమ్మే ప్రేక్షకులు బాధ పడ్డారు. మళ్ళీ సయోధ్య కుదిరి వాళ్ళ ద్యూయెట్లు మనకు దక్కాయి. వాళ్ళు పాడేటప్పుడు కూడా నొటేషన్‌కు అతీతంగా వాళ్ళ మార్కు ముర్కీలు వాడేవాళ్ళట. వొకసారి రఫీ తో దెబ్బలాడిందట నువ్వు ఈ పాటలో ఈ చోట ఇలా పాడావు, నాకు తెలిస్తే నేనూ అలాంటిదేదో పెట్టేదాన్నిగా అని. అలాంటి కాంపిటీషన్, పాట పట్ల శ్రధ్ధ వుండేవి వాళ్ళకి.

ఇక ఈ సరస్వతిదేవి గురించి యెన్ని మాటలు వ్రాసినా తక్కువే. ఆమె వేర్వేరు సంగీత దర్శకులకు పాడిన పాటలు తలచుకుంటూ ముగిస్తాను.

“నైన్ మిలే నైన్ హువే బావరే” “తరానా” లో తలత్ తో కలిసి అనిల్ బిస్వాస్ బాణీ.

“ఆయెగా ఆనేవాలా” “మహల్” లో ఖేంచంద్ ప్రకాశ్ బాణీ.

“జరా సామనే తొ ఆవూ చలియే” రఫీ తో “జనం జనం కే ఫేరే”లో ఎస్ ఎన్ త్రిపాఠి బాణీ.

“ప్యార్ కియా తో డర్నా క్యా” “ముఘల్-ఎ-ఆజం” లో నౌషాద్ బాణీ.

“ఏ మేరే వతన్ కే లోగోఁ” ప్రదీప్ రచన సి. రామచందర్ బాణీ.

“అయె మాలిక్ తేరే బందే హం” “దో ఆంఖేఁ బారహ్ హాథ్” లో వసంత్ దేశాయి బాణీ.

“చుప్ చుప్ ఖడే హో జురూర్ కోయీ బాత్ హై” “బడీ బహన్” లో హుస్నలాల్ భగత్రాంల బాణీ.

“కాంటోన్ సే ఖీంచ్ కే యే ఆంచల్” “గైడ్”లో ఎస్ డి బర్మన్ బాణీ.

“పియా కైసే మిలూఁ తుఝసే” రఫీతో “సారంగా”లో సర్దార్ మల్లిక్ బాణీ.

“ఆజ్ హం అపనీ దువాఓంకా అసర్ దెఖెంగే” “పాకీజా”లో ఘులాం ముహమ్మద్ బాణీ.

“రెహతే థే కభీ జినకే దిల్ మేఁ” “మమతా”లో రోషన్ బాణీ.

“హవా మేన్ ఉడతా జాయే” “బరసాత్” లో శంకర్ జయ్ కిషన్ ల బాణీ.

“ఏయ్ దిల్-ఎ-నాదాఁ” “రజియా సుల్తానా” లో ఖయ్యాం బాణీ.

“లగజా గలే” “వో కౌన్ థీ” లో మదన్ మోహన్ బాణీ.

“వందే మాతరం” “ఆనంద్ మఠ్” లో హేమంత్ కుమార్ బాణీ.

“జాగో మోహన్ ప్యారే” “జాగతే రహో”లో సలిల్ చౌధరి బాణీ.

“మిలతీ హై జిందగీ మే ముహబ్బత్ కభీ కభీ” “ఆంఖెఁ” లో రవి బాణీ.

“యే దిల్ ఔర్ ఉంకీ నిగాహోన్ కే సాయే” “ప్రేం పర్బత్”లో జయదేవ్ బాణీ.

“ఫూల్ తుమ్హేఁ భేజా హై ఖత్ మేఁ” “సరస్వతీ చంద్ర”లో కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీ ల బాణీ”

“బాహోఁ మేఁ చలే ఆవో” “అనామికా” లో ఆర్ డి బర్మన్ బాణీ.

“హఁస్తా హువా నూరానీ చెహరా” “పారస్మణి” లో కమల్ బారోట్ తో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ బాణీ.

“చిఠ్ఠివే దరద్ ఫిరాక్ వాలియే” “హినా” లో రవీంద్ర జైన్ బాణీ.

“కుహు కుహు బొలే కోయలియా” “సువర్ణ సుందరి” లో రఫీతో ఆదినారాయణరావు బాణీ.

“దిల్ క్యా కరే జబ్ కిసీసే” “జూలి” లో కిషోర్ తో రాజేష్ రోషన్ బాణీ.

“తెల్ల చీరకు తకధిమి తపనలు” “ఆఖరి పోరాటం”లో ఇళయరాజా బాణీ.

“జియా జలే జాన్ జలే” “దిల్ సే” లో ఏ ఆర్ రహమాన్ బాణీ.

“నిదురపోరా తమ్ముడా” “సంతానం” లో సుసర్ల దక్షిణామూర్తి బాణీ.

“దిల్ తో పాగల్ హై” అదే సినెమా పేరూ, ఉదిత్ తో ఉత్తం కుమార్ బాణీ.

“దర్ద్ సే మేరా దామన్ భర్ దే యా అల్లా” జగజిత్ సింఘ్ బాణీ

“యారా సిలీ సిలీ” “లేకిన్” లో హృదయ్నాథ్ మంగేష్కర్ బాణీ

“జో తుం తోడో పియా” “సిల్సిలా” లో శివ్-హరి ల బాణీ.

ఇలా తలచుకుంటూ వుంటే కాలం తెలీట్లేదు. నేను ఇంకా చాలా తప్పక మరచి పోయి వుంటాను. తర్వాత వేరే భాషల్లో పాటలు నాకు తెలీవు కాబట్టి అంత మేరా చీకటే. కాబట్టి మీ మనసుల్లో వాటిని మీకు తెలిసినంత మేరా జోడించండి.

ఆమె పాటే చివరి పలుకు గా : “నాం గుం జాయేగా, చెహరా యే బదల్ జాయేగా, మేరీ ఆవాజ్ హీ పహచాన్ హై, అగర్ యాద్ రహే”. అంటే మరేం లేదూ : పేరు యెక్కడో ఉనికిలో లేకుండా పోతుంది, ఈ ముఖ కవళికలూ మారిపోతాయి, నా గాత్రం మాత్రమే నా గుర్తింపు, మీరు గుర్తుపెట్టుకుంటే గనుక!

ఆమె మరిన్ని పుట్టినరోజు పండగలు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా వుండాలని ప్రార్థన.

Exit mobile version