[శ్రీ కోరాడ అప్పలరాజు రచించిన ‘అంబరాన్ని తాకింది..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
అప్పుడు
ముగ్గు బుట్ట వంటి తలలు
ముడతలు తేలిన దేహాలు
నాపై మమతల వర్షం కురుపించి
నన్ను కథల వనంలో కలియ తిప్పేవి.
భారతంలో సారాన్ని
ఘనసారంలా పరిమళింపజేస్తూ
రామాయణంలో రమ్యతను
రమణీయంగా పంచేవాళ్ళు..!
నడి సంద్రంలో
చిక్కుకున్న నావకి
చుక్కానిలా మారి
గమ్యానికి చేర్చిన సందర్భాలెన్నో..!
విలువలుకి వలువలు
ఊడదీస్తున్న ఈ రోజుల్లో..
వాటి విలువని విశదీకరించి
నీతిని నేతి మిఠాయిలా తినిపించి
అనుభవ సారాన్ని..
ఆపాదమస్తకం
నాకు అలంకరించే వాళ్ళు..!
కొన్ని ముగ్గు బుట్టలు..
ముసిరికి తడిసిన గువ్వల్లా
మూలకు చేరి రోదిస్తున్నాయి.!
మరి కొన్ని వృద్ధ విహంగాలు
శ్రీరాముని రాకకై నిరీక్షిషించిన
రెక్కలు తెగిన జటాయువులా
ఆక్రోశిస్తున్నాయి..!
ఇంకొన్ని నెరిసిన తలలు..
ఆత్మీయ ఆలింగనం కోసం
అష్ట దిక్కుల్లో అన్వేషిస్తున్నాయి.
సుద్దులు బుద్దులు చెప్పే పెద్దరికం
కనుమరుగు అవడంతో..
అక్ష ద్వయం..
కన్నీటి చెలములవుతున్నాయి..!
వెండి రంగును..
దండిగా తలకు పులుముకున్న
ఆ గుండె సవ్వడులు వినాలని
నా పాద ద్వయం
పల్లె బాట పట్టింది.!
ఇప్పుడు కదా..
మనసు చింత నొదిలి
కొత్త చిగురు తొడిగింది..!
సంతసం సంబరమై..
అంబరాన్ని తాకింది..!!