గాడి తప్పిన బతుకులు
నోట చప్పటి మెతుకులు
బట్టల నిండా అతుకులు
దారి అంతా గతుకులు
వానాకాలం చదువులు
బొటాబొటీ కొలువులు
గతమంతా గాయాలు
భవిత చూస్తే భయాలు
ఎవరో వస్తారన్న ఆశ
ఏదో చేస్తారన్న అపేక్ష
ఆర్థిక స్థితి హార్దికంగా లేదు
ఎదురుచూపుకి అంతం లేదు
దిగువ తరగతిలో దిగబడిపోయి
లేమి ఊబిలో కూరుకుపోయి
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ
ఎల్లకాలమూ ఈ జీవనమే గడిపేస్తారు
అమాయకులు వీరు ఆశాజీవులు
మబ్బుల వంక చూస్తూ ఉంటారు
ఎప్పటికైనా వాన పడదా అనుకుంటూ
అవి మార్గశిర మేఘాలని
వారి మార్గం వారే చూడాలని
తెలుసుకోలేని అమాయకులు

భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.
1 Comments
వేమరాజు అనంత పద్మనాభం
శంకర ప్రసాద్ కవిత చాలా బాగుంది. అభినందనలు.