[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘అమాయకుల నరమేధం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అమానుషం అరాచకత్వం
నులివెచ్చని సూర్యకిరణాల వేడిమితో
ఆకుపచ్చని పచ్చిక మెరిసేకొండలలో
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ
చేయి చేయి జత కలిపి
ఆనందిస్తున్న సమయాన
ఆకాశం రాగ రంజితమైన వేళలో
రుధిర ప్రవాహంతో
భూమాత అరుణారుణగ్రస్తమైనది.
ఎక్కడుంది లోపం
ఎవరి మీద ఆగ్రహం
మానవత మంటగలిసిన
ఉగ్రవాద కిరాతకదానవ చర్యలకు
ఫలితం సామాన్యుల నరమేధం
కాశ్మీరంలో పర్యాటకులపై దాడి
కారణంలేకుండా అమాయకుల మరణం
ప్రజాస్వామ్యం అంటే ఇదేనా?
శాంతి కాముక దేశమని
విశ్వమంతా జేజేలుపలికే కర్మభూమి
త్యాగమూర్తుల బలి దానాలతో
పునీతమైన పుణ్యభూమి
మానవత్వం మంట గలిసిన వేళలలో
కాళ్ళపారాణి ఆరని నవవధువుల రోదనలతో
దేశాన్ని కాపు కాచేవారున్నారు
అయిన వారందరూ కలిసి
ఎక్కడెక్కడి నుంచోవచ్చి సేద తీరుతూ
ఆనందాలు పంచుకుంటున్న జంటలను
అందరిని అడిగి మరీ తూటాలతో కాల్చారు
కుటుంబాలన్నీ చెదిరిపోయాయి
భూతలస్వర్గమని పేరుపొందిన
అందాల కాశ్మీరలోయ నేడు రక్తమోడింది
కుంకుమపువ్వుతో కనువిందు చేస్తూ
భరతమాతసిగపువ్వని భావించే
సుందర కాశ్మీరం జేగురువర్ణంతో
విగతజీవులై పడిన జీవులతో
శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తూ
భయకంపితులను చేస్తున్నది.