[‘అమాస సంద్రము’ అనే శీర్షికతో పద్య కవితని అందిస్తున్నారు శ్రీమతి పారనంది శోభాదేవి.]
చంద్రునెత్తుకుపోయిరేమో,
ఎవ్వరైనను! అనెడి క్లేశ
ధ్వనుల ఘూర్ణితధూమముల నా
కాశవదనము కాలిమమ్మై;
కానరారా చంద్రునంతః
పురపులేమలు దాగుకొనిరో
మేఘప్రాసాదముల లోలో
పలి రహస్యాగారములలో?
కరిగి పోసినవెండి కొలిమిన్
తీగలై యవి, యన్ని యొకటై
యల్లుకొన్నవి పలితకేశపు
పాశబంధన చిత్రగతులన్.
నిలిచియుండిన నా పదమ్ముల
నుండి వ్యోమాంతమ్ము వరకును
పాముకుబుసపు వెండిరేకుల
చుట్టలెన్నో విప్పినట్లుగ;
నయనసామర్థ్యంపు గరిమకు
కొలతలై సంద్రమ్మునంతటి
నాక్రమించిన ఫేనసర్పా
కృతులు ధరపై సల్పు ధాటిన్!
తరుముకొని నను వచ్చునట్లుగ
పేరు తెలియని శ్వేతరక్కసి
మూకలొక్కుమ్మడిగ నూపున
ముంచగా సంద్రమ్ము లోనన్.
నేను నిల్చినదిశకు నురుకుల
పరుగులన్, దరిజేరి సురిగల
సురిగలగుచు సురుంగునంతలొ
నెటకొ నెటులో తెలియరాకన్.
ఏమి,యా కసి! ఎవరిపైననొ?
తరుముకొని పట్టగ నలవియై
అందినన్ నలిపి నలినలి చూ
ర్ణమ్ము చేసెడి క్రూరరావము !
వెలుగులేశము లేని నీరో
త్తుంగ గర్జాధ్వనులు ముట్టడి
చేయ సర్వశరీరకణమూ
లాగ్రపర్యంతమ్ము భయమగు!