[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘అలుపెరుగని బాటసారి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
మదిలో తలుచుకున్నప్పుడల్లా
ఆయన చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది
దిగులు కొండలను
కూకటి వేళ్లతో సహా కూల్చివేస్తుంది
ఆయనతోని జ్ఞాపకాలు
స్నేహితుల్లా పలకరిస్తుంటాయవి
ఆయన అందించిన జ్ఞాన బీజాలు
దశ దిశలా విస్తరించాయి..!
ఉబికి వచ్చే కన్నీళ్ల సాక్షిగా
ఎన్నెన్నని చెప్పగలను
ఎన్నెన్నని రాయగలను
శిలాక్షరాల వలె చెక్కుచెదరవు
కాలం బహు విచిత్రమైనది
కలకాలం మనతో ఉంటారని
స్వప్నాలెన్నింటినో వాగ్దానం చేస్తుంది
అంతలోనే నిర్దయగా
మన వాళ్ళను దూరం చేస్తుంది..!
మాటలనే ఆయుధంలా ధరించిన
అలుపెరుగని బాటసారతడు
వేకువనే పలకరించే
సుందరమైన శీతల పవనమతడు
తొలకరిలో కురిసే
అపూర్వమైన వాన చినుకతడు
పచ్చదనంతో వికసించే
రణక్షేత్రమైన అడవి రాగమతడు
ప్రజల్ని ప్రభావితపరిచే
ఎరుపెక్కిన ఎర్రమందారమతడు..!
జీవన కాంక్షలు జ్వలించే
ఆ సహృదయుని చూపులే చాలు
ఉత్తేజపు సవ్వడులు ఉరకలేస్తాయి
ఆయనను కలిస్తే చాలు
ఒక హరివిల్లును చూసిన అనుభూతి
ఒక శిఖరాన్ని అధిరోహించిన సాహసం..!
