Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగుల హేల 61: ‘మాయ’దేవుడు

[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]

‘మాయ’దేవుడు

“అయితే నా వల్లే! లేదంటే నీ కర్మఫలం వల్లే!”

ఈ స్టేట్‌మెంట్ ఎవరిదో తెలుసా! సాక్షాత్ భగవంతుడిది, కంపెనీవాడు అన్ని గ్యారెంటీలూ ఇస్తూ ‘కండిషన్స్ అప్లై’ అన్నట్టు. అసలు దేవుడి విషయంలో ఉన్నంత అయోమయం, గందరగోళం ప్రపంచంలోని మరే విషయంలోనూ లేదు.

ఆదిమానవుడు తను ఒంటరిగా జీవితం గడిపేరోజుల్లో బెదురుగా, బేలగా ఉండి క్రమంగా తనకు ఆత్మస్థైర్యం కలగడం కోసం, సహాయం కోసం ఒక శక్తిని సృష్టించుకుని (ఉందని)నమ్మడం ప్రారంభించి ఉండవచ్చనీ క్రమంగా అది అతనికి ఒక ఆలంబనగా మారి అదే భావన దేవుడిగా స్థిరపడి ఉంటుందని హేతువాదులు అంటారు.

మన కుటుంబ పెద్దలు చెప్పినదాన్ని బట్టి మనందరం చిన్నప్పటినుండీ గ్రహించిన విషయం ఒకటే! ‘భగవంతుడు మనందరినీ సృజించాడు. మనమంతా ధార్మికమార్గంలో నడవాలి అని పురాణేతిహాసాల ద్వారా పూర్వీకులు తెలియజేశారని పెద్దలు తెలియజేశారు’ అని. మనం కూడా ఎంతో కొంత దాని ప్రకారమే జీవనం సాగిస్తున్నాం. అన్ని మతాలవారూ కాస్త అటూ ఇటూగా ఈ దారిలో నడుస్తూ దైవసహాయం అందుకుంటూనే ఉన్నారు. ‘ఈ దేవుడనే వాడున్నాడా! నిజంగా! చూపించండి’ అనే మనలాంటి ‘కోణంగులకి’ కలిగే మీమాంస గ్రహించినవాడై “కలననువారికి కలననువాడను, లేడనువారికి లేననువాడను” అంటూ దేవుడు మరో స్టేట్‌మెంట్ మన తలపై ఒక మొట్టికాయలా ఇచ్చి నవ్వుతూ కూర్చున్నాడు.

దేవుడు బహు చమత్కారి! ఎవరికీ పూర్తిగా చిక్కడు. చిక్కిన వాళ్ళు మనకి చూపించడానికి అనేక దృష్టాంతాలు చూపిస్తూ పుస్తకాలు రాస్తారు. అవన్నీ చదివి నమ్మినా మనకి దేవుడు కనబడడు. మనలాంటి భక్తితక్కువవాళ్ళు “దేవుడెక్కడ?మాకెందుకు కనబడడు?” అనే సందేహానికి జవాబుగా “దేవుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు. మానవుడిలోని మంచితనమే దేవుడు. కష్టాల్లో, ఆపదల్లో ఇతరులకు ఆదుకునే ప్రతివాడూ దేవుడే!” అంటూ మనుషుల్లోనే దైవత్వం ఉందని విజ్ఞులు చెప్పారు మనల్ని మాట్లాడొద్దని ముక్కుమీద చూపుడు వేలు పెట్టి సైగ చేస్తూ.

“పాపపుణ్యములు చేనిపంటల వంటివి, పుణ్యకార్యములు చేసినచో ఈ జన్మలోనే సుఖం అనుభవిస్తాము. పాపకార్యములు చేసినచో కష్టం అనుభవిస్తాము” అంటూ మనం పాఠాలు చదువుకున్నాం. రోడ్లు, బ్రిడ్జిలు కట్టిన కాంట్రాక్టర్లు కోటీశ్వరులు అవుతారు. కాయకష్టం చేసేవాడు ఒక మంచి గుడిసె కూడా కట్టుకోలేకపోతాడు. ఈ సంగతులు ‘సూర్యుడు తూర్పున ఉదయించును’ అన్నంత సహజంగా అందరికీ తెలుసు. అయితే వారు చేసేవి పుణ్యకార్యములు అనుకున్నా వీరు చేసేవి పాపకార్యములు కాదు కదా! అన్న ప్రశ్నకు జవాబు ఎవ్వరూ చెప్పరు అడిగినా!

కొందరు దేవుళ్ళకి బంగారు సింహాసనాలు, వజ్రాల కిరీటాలు సమర్పించ గలుగుతారు ఏసీ కారులో వచ్చి స్పెషల్ దర్శనం క్యూలో ఓ ఐదు నిమిషాలు నిలబడి, వారిని అంత స్థాయికి దేవుడే తీసుకెళ్లాడు కాబట్టి. సామాన్యులు ఓ వందో, వెయ్యో మాత్రమే ఇచ్చి దండం పెడతారు. అది కూడా వారి శక్తికి మించినదే. అయితే వాళ్ళేమీ పాపాలు చేయలేదు. అయినా తప్పదు కష్టం. సర్వదర్శనం కోసం నలభైఎనిమిది గంటలు అక్కడే కూర్చుని, పడుకొని శరీరాన్ని అలవబెడితే తప్ప వారికి దర్శనం దొరకదు. అన్యాయంగా సంపాదించిన సొమ్ము నిలబడదు, అంటూ అరుగు మీద కూర్చుని అయ్యవారు చెప్పే మాటలు నిజం కాదని నిత్యం నిరూపణ అవుతూనే ఉంటుంది. అయినా దీనికి ఎవరూ లాజిక్ చెప్పరు.

ఎవరైతే కుటుంబాన్ని, తనవారిని గౌరవించకుండా నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తారో వాళ్ళకే అదృష్టం కలిసి వస్తుంది. వేలలో పెట్టిన పెట్టుబడి లక్షలు, కోట్లవుతుంది. భగవన్నామస్మరణతో, పాపపుణ్యాల చింతతో, మంచిగా ఉండే వాళ్ళవైపు అదృష్టలక్ష్మి తల తిప్పి కూడా చూడదు. తల్లిదండ్రులని ఆదరిస్తూ, అక్కచెల్లెళ్లకి పెళ్లిళ్లు చేసి తమ్ముళ్ళను చదివించిన వారి జీవితం ఇబ్బందులు ఇక్కట్లతో నడుస్తుంది తప్ప వారికి గొప్ప గొప్ప విజయాలు, కలిసి వచ్చే సిరిసంపదలూ ఉండవు.

‘నిరంతరం నా మీదే ధ్యాస నిలిపిన వాడిని నేను కనిపెట్టుకొని ఉంటాను’ అంటాడట దేవుడు. ఇంత క్లిష్ట భూయిష్ట లోకంలో మానవుడు అలా ఉండడం బహు కష్టం కాబట్టి, భక్తులను గాచే పని ఆ విధంగా కాస్త తగ్గుతుందని కూడా దేవుడిగారి ఎత్తు కావచ్చు.

ఒకోసారి మన కోరికలు తీరతాయి. మనం అందరికీ ఈ సంగతి చెప్పి మురిసిపోయి మరో పనికి ముడుపు కట్టగానే ఆ పని వికటిస్తుంది. అప్పుడు మనం నిరాశతో దుఃఖపడి, రామదాసులా దేవుణ్ణి గాట్టిగా నిలదీద్దాం అంటే మనమేమీ ఆయన స్థాయి భక్తులం కాము కాబట్టి, దొంగకు తేలు కుట్టినట్టు ఊరుకోవల్సిందే! “ఏంటండీ మాకీ ఇబ్బందులు! మేమేం పాపం చేసాం?” అని ఒకోసారి మనం కష్టాల కడలిలో కొట్టుకుపోతూ వాపోయినప్పుడు ‘ఈ సమస్యలు ఈ జన్మలో చేసిన పనుల వల్ల వచ్చినవి కావు నాయనా! మనం గత జన్మలలో చేసిన పనుల ఫలితం కావచ్చు. భరించాలి తప్పదు’ అంటారు ‘ప్రవచనిస్టులు’ మన దగ్గరనుంచి మళ్ళీ ఇంకో మాట రాకుండా.

అయితే ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. దేవుడు నిస్సందేహంగా మానవజాతి హోల్ మొత్తానికి ఒక్కగానొక్క సైకియాట్రిస్ట్. ‘నా కోరిక తీరితే నీ గుడికి వస్తాను’ అని మొక్కుకుని, నా కోరిక తీరుతుంది అన్న నమ్మకంతో మనిషి పూర్తిగా శ్రమిస్తాడు. అది ఫలిస్తుంది. మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి మన మనోవ్యథని వివరించినప్పుడు అతను మన మనసుని విశ్లేషణ చేసి మనకి ధైర్యం చెప్తాడు. మరీ సంఘర్షణ ఎక్కువగా ఉంటే నిద్రకి మందులు కూడా ఇస్తాడు. మన ఆరోగ్యం చక్కబడుతుంది. ఆ విధంగానే మనం దేవుడికి మొక్కుకోవడం వల్ల గొప్ప ధైర్యం పొందడం అనేది మానసిక వ్యాధుల నిపుణుడు చేసే పనే కదా!

దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకునే వాళ్ళందరూ కోరికలు తీరిన వాళ్ళు కాకపోవచ్చు. మెజారిటీ మాత్రం, తీరినవాళ్లే ఉంటారు. పరీక్ష పాస్ అయిన వాళ్ళు వెళుతూ, వెళుతూ ఫెయిల్ అయిన వాళ్ళని కూడా తీసుకెళ్తారు లేదా మనం రాయబోయే సప్లిమెంటరీ పరీక్షలో పాస్ అవుతామని ఆశతో మరికొందరు రావొచ్చు. ‘నువ్వు మాట తప్పినా మేం తప్పలేదు’ అని దేవుడికి స్వయంగా చెప్పాలని కూడా వెళ్లే వాళ్ళు ఉండొచ్చు.

కొన్ని గుళ్లలోని దేవుడికి గొప్ప మహత్యం ఉంటుంది. ఆయన కష్టపడి భక్తుల కోరికల్ని, పరిస్థితుల్ని అనుకూలింపచేసి తీరుస్తాడు. అందుకే ఆయన రిచ్ గాడ్ అవుతాడు. మానవుల కష్టాల్లో భరోసా ఇచ్చి వాటిని తొలగించి కోరిన కోర్కెలు తీర్చే దేవుడికి భక్తులు కోట్లలో ఉంటారు. మరికొన్ని గుళ్లలోని దేవుడి మహత్యం యావరేజిగా ఉంటుంది కాబట్టి ఆయన మధ్యతరగతి జీవిలా మిడిల్ గాడ్. ఇంకొన్ని గుళ్లలోని దేవుడు ‘అబ్బే! ఈ భక్తుల కోర్కెలు తీర్చే పని నావల్ల కాదు’ అన్నట్టుగా బద్దకిష్టుగా ఉంటాడు. అంచేత ఆయన పూర్ గాడ్‌గా ఉంటాడు. నిత్యపూజలు కూడా కనాకష్టం, అక్కడ కష్టే ఫలే అన్న మానవుల రూల్ వర్తిస్తుంది.

తోటి మానవులపై ఏ మాత్రం కనికరం లేని కొందరు, భక్తుల గెటప్ వేసుకుని మహాభక్తులుగా చలామణీ అయిపోతూ ఉంటారు. వీరు ‘మేం నిత్యం భజనలు చేసే వీరభక్తులం! దేవుడు మమ్మల్ని సదా కాచుకొని ఉంటాడు.’ అని అహంకరిస్తూ ఉంటారు. నిజంగానే కోరిన వరాలిస్తూ, వారిని గారంగా చూసుకుంటూ ఉంటాడు దేవుడు ధృతరాష్ట్రుడికి మల్లే! దీనికి రీజనింగ్ ఎవరినడగ్గలం!

బుజ్జాయిలు అమ్మ చెప్పిన మాట వినకుండా, మొండితనం చేసి, అమ్మ చేత రెండు చిట్టి దెబ్బలు తిని బాగా ఏడ్చి, మళ్ళీ అమ్మ ఒడిలోనే నిద్రపోయినట్టు మనం దేవుడితో చాలా, చాలా వాదనలు చేసి, వేదనలు వినిపించి, కోరిన కోరికలు తీరక కోప్పడి, అలిగి చివరికి అతని వైపే ఆర్తిగా చూస్తూ నిలబడిపోతాం. ఇదంతా దేవుడి ‘పెనుమాయ’ కదా!

Exit mobile version