Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 299

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

జరీన్ ఖాన్‍కి నివాళి:

మాజీ నటి, ప్రముఖ నటుడు సంజయ్ ఖాన్ భార్య జరీన్ ఖాన్ 81 సంవత్సరాల వయసులో 07 నవంబర్ 2025న మరణించారు. వైద్యుల ప్రకారం, ఆమె వయోసంబంధిత ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ చివరికి గుండెపోటుకు గురై చనిపోయారు.

ఆమె అసలు పేరు జరీన్ కాట్రాక్. వివాహానికి ముందు, జరీన్ విజయవంతమైన మోడల్. ఒకప్పుడు మిస్ ఇండియా టైటిల్‌కు గట్టి పోటీదారుగా నిలిచారు. అయితే, సంజయ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె మోడలింగ్ వృత్తిని విడిచిపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో, జరీన్ తన ప్రస్థానం గురించి వివరించారు, సంజయ్‌తో తన తొలి రోజుల జ్ఞాపకాలను పంచుకున్నారు.

సంజయ్ నటనా జీవితం ఊపందుకుంటున్న సమయంలోనే తమ స్నేహం ప్రారంభమైందని ఆమె చెప్పారు. “అప్పట్లో, అతను బరువు తక్కువగా ఉండేవాడు, దాంతో, ప్రతిరోజూ ఎనిమిది అరటిపండ్లు, ఓ ప్యాకెట్ వెన్న తినమని వైద్యులు సలహా ఇచ్చారు” అని ఆమె చెప్పారు. తాను కూడా మోడలింగ్‌ వృత్తిలో అడుగిడానని, తాను తదుపరి మిస్ ఇండియాగా ఎంపికవుతానని అందరూ భావించేవారని జరీన్ చెప్పారు. అయితే, సంజయ్‌లో పెరుగుతున్న అభద్రత కొంత ఉద్రిక్తతకు దారితీసింది. “నేను ర్యాంప్‌పై నడిచినప్పుడు, ఆయన వెనుక కూర్చొని గుర్రుమనేవాడు. ఆ రోజుల్లో ఆయనకి ఉద్యోగం లేదు, అందుకే చికాకు మరింత ఎక్కువైంది” అని ఆమె గుర్తుచేసుకున్నారు.

జరీన్ తన జీవితాన్ని మార్చే అవకాశం గురించి కూడా గుర్తుచేసుకున్నారు, సూపర్ మోడల్ పెర్సిస్ ఖంబట్టా ఆమెను రెండేళ్ల మోడలింగ్ కాంట్రాక్ట్ కోసం లండన్‌కు తీసుకెళ్లడానికి ముందుకొచ్చారట. కానీ జరీన్ ప్రియుడు సంజయ్ ఆమెకు అల్టిమేటం ఇచ్చారట. “పెర్సిస్ ఖంబట్టా (సూపర్ మోడల్/ఫ్యాషనిస్ట్) నన్ను రెండేళ్ల కాంట్రాక్ట్‌పై లండన్‌కు తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ నా ప్రియుడు చాలా పొసెసివ్‌గా ఉండి, ‘లండన్‌కు వెళ్లడమో లేదా నాతో ఉండడమో నిర్ణయించుకో’ అని అన్నారు. నేను అతనితో ఉండాలని ఎంచుకున్నాను, ఇవాళ నేను సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది” చెప్పారామె.

వారి వ్యక్తిత్వాలు భిన్నమైనవే అయినప్పటికీ, జరీన్ ప్రశాంతంగా, స్థిరంగా ఉండటం; సంజయ్ మరింత ఆడంబరమైన రాక్ ‘ఎన్’ రోల్ వైబ్‌ను కలిగి ఉండటం వల్ల ఇద్దరూ సన్నిహితమయ్యారు. తమ రెండవ డేటింగ్ సమయంలో సంజయ్ తనకు ప్రపోజ్ చేశారని చెప్పారు జరీన్. సంవత్సరం గడిచిన తర్వాత ఆయన పట్ల తనకున్న భావాలు మారకపోతే, పెళ్ళి గురించి ఆలోచించవచ్చని ఆమె సమాధానమిచ్చారట. ఆమె ప్రశాంతమైన, ఆలోచనాత్మక ప్రతిస్పందన సంజయ్‌పై శాశ్వత ముద్ర వేసింది, ఆమే తనకు సరైన వ్యక్తి అని నిర్ణయించుకున్నారు.

వీరిద్దరూ వివాహం చేసుకుని నలుగురు పిల్లలను కన్నారు – సుస్సాన్ ఖాన్, ఫరా అలీ ఖాన్, సిమోన్ ఖాన్, జాయెద్ ఖాన్.

జరీన్ ఖాన్ తరువాత ఇంటీరియర్ డిజైనర్ అయ్యారు. హైదరాబాద్‌లోని కంట్రీ క్లబ్‌లో ఆమె  రూపొందించిన డిజైన్‌లను చూడవచ్చు. ఏనుగు కాలుతో తయారుచేసిన ఒక టీ స్టాండ్ అందరినీ ఆకర్షించింది.

పర్వీన్ బాబీతో జరీన్ ఖాన్

అప్పట్లో బెంగళూరు జీవనశైలికి గుర్రపు పందాలు పర్యాయపదంగా ఉండేవి. ఏళ్ళు గడిచేకొద్దీ ఈ క్రీడ బాగా అభివృద్ధి చెందింది. 70వ దశకంలో, బెంగళూరు డెర్బీ దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన రేస్ ఈవెంట్‌లలో ఒకటి! గుర్రపు యజమానులుగా ఉన్న చలనచిత్ర పరిశ్రమకి చెందినవారు ఈ కార్యక్రమానికి గ్లామర్‌ని, స్టైల్‌ను తీసుకువచ్చారు.

బెంగళూరుకు చెందిన బాలీవుడ్ నటుడు, నిర్మాత సంజయ్ ఖాన్ ఈ రేస్ పాట్రన్‌లలో ఒకరు. ప్రిన్స్ ఖార్టూమ్‌ అనే గుర్రంతో ఆయన 1971లో ప్రతిష్ఠాత్మక బెంగళూరు డెర్బీని గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా తీసిన ఓ ఫోటోలో సంజయ్ ఖాన్, ఆయన భార్య జరీన్ ఖాన్, బెంగళూరులోని ప్రముఖ ట్రైనర్ రషీద్ బైరాంజీ, విజేత జాకీ డబ్ల్యూ స్విన్‌బర్న్, గుర్రం ప్రిన్స్ ఖార్టూమ్‌‌ను చూడవచ్చు. ఈ సంఘటనలు కూడా స్టైల్ స్టేట్‌మెంట్‌లే; బెల్ బాటమ్స్, ఇంకా సైడ్ పార్టింగ్‌ల కాలం అది!

జరీన్ ఖాన్‌ ‘తేరే ఘర్ కే సామ్నే’ చిత్రంలో దేవ్ ఆనంద్ పాత్రకి ఆంగ్ల కార్యదర్శిగా జెన్నీ ఫెర్నాండెజ్ పాత్రను పోషించారు. నూతన్‌కు మద్దతు ఇచ్చే, ఆధునిక ఆలోచనాపరుడైన సోదరుడిగా నటించిన ఫన్ స్టార్ రాజేంద్రనాథ్‌తో ఆమె ప్రేమలో పడతారు. జరీన్ నటించిన ఏకైక చిత్రం ఇదే.

జరీన్ ఖాన్‌గారికి నివాళి!

Exit mobile version