Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 298

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

నటి పుష్పలత:

పుష్పలత మహారాష్ట్రకు చెందినవారు. ఆమె తన కుటుంబంతో కడపలో నివసించారు. చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని కోరుకున్నారు. కర్నూలులో ఉన్న ఆమె స్నేహితురాలు అప్పుడప్పుడు మద్రాస్‌కు వెళ్లి చిన్న చిన్న పాత్రలలో నటించేది. పుష్పలత తన స్నేహితురాలితో పాటు మద్రాస్‌ వెళ్ళి సినిమాల్లోకి నటిస్తానని తల్లిని అడిగారు. ఆమె తల్లి “ఛీ మనం అలాంటి పనులు చేయకూడదు” అని కోపగించుకున్నారట. దాంతో ఆమె స్నేహితురాలు వెళ్ళిపోయింది. తర్వాత ఆ స్నేహితురాలు తనతో వచ్చి సినిమాల్లో చేరమని మరోసారి అడిగింది. పుష్పలత పెద్దవాళ్ళను అనుమతి అడగగా, మరోసారి ఇంట్లో గొడవ జరిగింది. దాంతో ఆ విషయం అక్కడితో ముగిసింది.

ఒకరోజు, పౌర్ణమి నాడు, వారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది. పూజకు అవసరమైన వెండి వస్తువులను తీసుకురమ్మని వాళ్ళమ్మగారు పుష్పలతకి చెప్పారట. పుష్పలత వెండి వస్తువులతో పాటు 2000 రూపాయలు తీసుకుని  ఆ డబ్బును జాగ్రత్తగా దాచుకున్నారు. ఆమె స్నేహితురాలు ఈసారి ఒక సేవకుడిని పంపి, తనతో పాటు మద్రాస్‌కు రమ్మని కోరింది. ఈసారి పుష్పలత ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి బయలుదేరారు. అప్పుడామె వయసు 12 సంవత్సరాలు మాత్రమే. పుష్పలతా, ఆమె స్నేహితురాలు మద్రాస్‌కు వెళ్ళారు. అక్కడ  ఉండటానికి మంచి ఇల్లు తీసుకున్నారు. వారిద్దరూ మంచి బట్టలు కూడా తెచ్చుకున్నారు.

ఆ సమయంలో కస్తూరి శివరావు ‘పరమానందయ్య శిష్యులు’ సినిమా చేస్తున్నారు. పుష్పలత స్నేహితురాలు ఆమెను తన వెంట తీసుకెళ్లి ఆ సినిమాలో అవకాశం ఇవ్వమని అడిగింది. పుష్పలత చాలా చిన్న పిల్ల అని, ఆమెకు నప్పే పాత్ర లేదని చెప్పారట శివరావు. అయితే ఆమె స్నేహితురాలు – కనీసం ఒక చిన్న పాత్ర అయినా ఇవ్వమని, పారితోషికం ఇవ్వాల్సిన అవసరం లేదని వేడుకుందట. దాంతో ఆయన సరే అన్నారు, అలా పుష్పలత గిరిజకు పనిమనిషిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఈలోపు ఆమె దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. పుష్పలత తన ఇంటికి ఉత్తరం రాసి తమ దుస్థితి వివరించారు. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే 3000 రూపాయలు తీసుకుని మద్రాసులో ఆమెను కలవడానికి వచ్చారు. వారు ఆమెను తమతో తిరిగి వచ్చేయని అడిగారు. కానీ అప్పటికి ఆమెకు ‘స్వప్న సుందరి’ సినిమాలో దేవకన్య పాత్ర లభించింది. తరువాత లక్ష్మీరాజ్యం ‘సంసారం’ సినిమాలో అక్కినేని సరసన నటించమని అడిగారు. ఆ తర్వాత కూడా ఆమె కుటుంబ సభ్యులు ఆమెను తమ ఊరికి తీసుకువెళ్ళాలని ప్రయత్నించారు కానీ ఆమెకు ‘పెళ్లి చేసి చూడు’ సినిమాలో మూడవ సినిమా అవకాశం లభించింది. దాంతో ఆమె కుటుంబసభ్యులు విచారంగా తమ ఊరు వెళ్లిపోయారు.

పుష్పలత, జోగారావు విజయ వాహిని సినిమాల్లో మాత్రమే నటించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ బ్యానర్‌లో వారికి ముఖ్యమైన పాత్రలు రాకపోవడంతో ఈ కాంట్రాక్టులు తమ కెరీర్‌లను నాశనం చేశాయని పుష్పలత వాపోయారు.

‘పెళ్లి చేసి చూడు’ సినిమాలో ఆమె పాత్ర ఉల్లాసభరితంగా, నవ్వుతూ, దూకుతూ నడిచే సంతోషకరమైన అదృష్టవంతురాలి పాత్ర. ఒక రోజు షూటింగ్ తర్వాత ఆమె ఇవన్నీ చేస్తూ రోడ్డుపైకి వెళ్ళారు. ఒక వ్యాపారవేత్త ఆమెను చూసి ఆమెను తన భార్యగా చేసుకోవాలని కోరుకున్నాడు. తాను పెద్ద ధనవంతుడననీ, ఆమెతో సినిమాలు తీస్తానని చెప్పి ఆమెను ఒప్పించాడు. ఆమెకు తెలియని చోట నుండి సాక్షులను రప్పించి ఆమె అతన్ని వివాహం చేసుకున్నారు. తరువాత ఆమె భర్తకు అప్పటికే పెళ్ళయి భార్య, పిల్లలు ఉన్నారనీ, తాను మోసపోయాననీ గ్రహించారు. అయితే అతను చివరి వరకు ఆమెను చాలా బాగా చూసుకున్నాడు. ఆ విషయంలో పుష్పలత చాలా అదృష్టవంతురాలు. బాగా జీవించడానికి తగినంత సంపదను ఇచ్చాడతను.

‘చంద్రహారం’ సినిమాలో పుష్పలత వ్యాంప్ పాత్రను చేయాల్సి ఉంది, ఆమె కాస్ట్యూమ్స్ కూడా సిద్ధమయ్యాయి. కానీ ఆమె గర్భవతి అయ్యారు, దాంతో ఆ పాత్ర సావిత్రికి దక్కిందిది. పుష్పలత రేలంగి సరసన ‘చెరపకురా చెడెదవు’లో నటించారు, రెండు పాటల్లో నటించారు. అప్పటికి ఆమె అందమైన శరీరం తన సౌందర్యాన్ని కోల్పోయింది. ఇంట్లో ఉండి కొడుకును చూసుకోవాలని ఆమె భర్త కోరుకోవడంతో ఆమె చాలా బాధతో సినిమాలను వదిలేశారు.

నేను ఆమెను ఇతర నటీమణుల గురించి ఏవైనా చిన్న విషయాలు చెప్పమని అడిగాను. ఆమె నాకు ఇలా చెప్పింది – ఒక రోజు ఆమె తమకు నమ్మకమైన నగల వ్యాపారి వద్దకు వెళ్ళారట. సావిత్రి దుకాణంలోకి రావడం ఆమె చూశారు. వెంటనే ఆమె లేచి లోపలి గదికి వెళ్ళారు. అక్కడి నుండి సావిత్రి చాలా సన్నని బంగారు గొలుసును తీసి ఆ నగల వ్యాపారికి అమ్మడం చూశారట. అతను ఇచ్చిన డబ్బు తీసుకొని సావిత్రి వెళ్లిపోయారు. ఇది 70 వ దశకం చివరలో జరిగింది.

పుష్పలత నన్ను చూడాలనుకున్నారు. నా ఫోన్ లిస్ట్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే నా ప్రొఫైల్‌ని వాట్సాప్‌లో చూడగలరని చెప్పాను. ఆమె తన అల్లుడి నంబర్ ఇచ్చి, తర్వాత నన్ను చూశారు. ఇదంతా నాకు ఇబ్బందిగా అనిపించి, అతని నంబర్ డిలీట్ చేశాను. ఎప్పుడైనా మద్రాసు వచ్చి తనని కలవమని కోరుకున్నారామె. నేను సరే అని ఊర్కునేదాన్ని.

ఒకరోజు నేను బయట ఉన్నప్పుడు ఆమె నాకు ఫోన్ చేశారు. ఆమె దిగులుగా ఉన్నట్టు అనిపించింది. నేను ఇంటికి వెళ్ళాక ఆమెకు ఫోన్ చేస్తానని సున్నితంగా చెప్పాను. కానీ నేను ఆ ఫోన్ కాల్ గురించి మర్చిపోయాను, త్వరలోనే ఆమె చనిపోయారని తెలిసింది. నాకు రెండు బాధలు ఉన్నాయి. నా దగ్గరున్న ఫోటోలు ఆమెకు చూపించకపోవడం, ఆమె కోరినట్లు ఫోన్ చేయకపోవడం.

Exit mobile version