సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
వైవిధ్యమైన ప్రతిభ – అస్రానీ:
అస్రానీ జనవరి 1, 1940న జైపూర్‌లోని ఒక మధ్యతరగతి సింధీ కుటుంబంలో గోవర్ధన్ అస్రానీగా జన్మించాడు. తండ్రిది కార్పెట్ వ్యాపారం. కానీ అస్రానీ ఆ వ్యాపారంలో ఆసక్తి చూపలేదు. సెయింట్ జేవియర్స్ స్కూల్ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, జైపూర్‌లోని రాజస్థాన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. చదువుకయ్యే ఖర్చులను భరించేందుకు, ఆయన జైపూర్‌లోని ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు.
అస్రానీ 1960 నుండి 1962 వరకు సాహిత్య కల్భాయ్ ఠక్కర్ వద్ద నటనలో శిక్షణ పొందారు. కిషోర్ సాహు, హృషికేశ్ ముఖర్జీ సలహా మేరకు, అస్రానీ 1964లో పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) లో చేరి, 1966లో పట్టభద్రుడయ్యారు.
1971లో, ఆయన గుల్జార్ దర్శకత్వం వహించిన ‘మేరే అప్నే’ చిత్రంలో నటించారు, ఆ సినిమాలో ఆయన మీనా కుమారి, శత్రుఘ్న సిన్హాతో కలిసి పనిచేశారు. గుల్జార్ ‘కోషిష్’లో ఆయన ప్రతికూల పాత్రలో నటించారు, ఆ పాత్ర ఆయన ఇమేజ్‌కి పూర్తిగా వ్యతిరేకం. ఆయన హృషికేశ్ ముఖర్జీ తీసిన ‘బావర్చి’, ‘నమక్ హరామ్’, ‘అభిమాన్’, ‘మిలి’, ‘చైతాలి’, ‘అలాప్’, ‘జుర్మానా’ వంటి చిత్రాలలో నటించారు.
1970వ దశకంలో, అస్రానీ ‘ఆజ్ కీ తాజా ఖబర్’, ‘పరిచయ్’, ‘మెహబూబా’, ‘పల్కోఁ కీ చావోన్ మే’, ‘బాలికా బధు’, ‘దో లడ్కే దోనో కడ్కే’, ‘బందీష్’, ‘ఖబరజా, తాపీ’, ‘ఛోటీ సి బాత్’, ‘రఫూ చక్కర్’, ‘బాలికా బధు’, ‘ఫకీరా’, ‘అనురోధ్’, ‘ఛైల్లా బాబు’, ‘చరస్’, ‘ఫాన్సీ’, ‘దిల్లాగి’, ‘హీరాలాల్ పన్నాలాల్’, ‘పతి పత్నీ ఔర్ వో’, ‘హమారే తుమ్హారే’ వంటి చిత్రాలలో తన అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
1975లో ‘షోలే’ సినిమాలో, అస్రానీ జైలర్‌గా కలకాలం నిలిచిపోయే పాత్రను పోషించారు. బ్రిటీష్ కాలం నాటి జైలర్‌గా హాస్యం పండించారు. ‘హమ్ ఆంగ్రెజోన్ కే జమానే కే జైలర్ హై’ అనే ఆయన డైలాగ్ మారుమ్రోగింది. అదే సంవత్సరం ఆయన హృషికేశ్ ముఖర్జీ గారి ఐకానిక్ కామెడీ ‘చుప్కే చుప్కే (1975)’లో తన షోలే సహనటులు ధర్మేంద్రతోనూ, అమితాబ్ తోనూ కలిసి నటించారు. మళ్లీ ‘ఖూన్ పసినా’లో అమితాబ్‌తో జతకట్టారు.
షోలేలో జైలర్ పాత్రతో పాటు హృషికేష్ ముఖర్జీ, గుల్జార్, బిఆర్ చోప్రా, బసు ఛటర్జీ చిత్రాలలో పోషించిన పాత్రలతో అస్రానీ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. ఆయన రాజేష్ ఖన్నాకు సన్నిహిత మిత్రుడు. బావర్చి (1972)తో ప్రారంభించి ఆయనతో దాదాపు 25 సినిమాలు చేశారు అస్రానీ.
1977లో, అస్రానీ – విమర్శకుల ప్రశంసలు పొందిన ‘చలా మురారి హీరో బన్‌నే’ సినిమాకి కథ వ్రాసి దర్శకత్వం వహించారు, ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించారు. అస్రానీ ‘సలామ్ మేమ్‌సాబ్’ (1979), ‘హమ్ నహిన్ సుధ్రేంగే’ (1980), మరియు ‘దిల్ హై తో హై’ (1992) సినిమాలకి కూడా దర్శకత్వం వహించారు. ప్రసిద్ధ గుజరాతీ చిత్రం ‘అమ్దవద్ నో రిక్షవాలో’ (1990)కి కూడా దర్శకత్వం వహించారు. దర్శకుడిగా అస్రానీ చివరి చిత్రం రేఖ, సైఫ్ అలీ ఖాన్ నటించిన ఉడాన్ (1997).
1980లు, 90లలో, అస్రానీ – ఖాదర్ ఖాన్, శక్తి కపూర్, జితేంద్ర, గోవింద వంటి సహచర నటులతో ఒక బలీయమైన జట్టును రూపొందించారు. ఖాదర్ ఖాన్‌తో కలిసి 50కి పైగా చిత్రాల్లో నటించారు. ‘హమారీ బహు అల్కా’, ‘ఏక్ హాయ్ భూల్’, ‘యే కైసా ఇన్సాఫ్’, ‘కామ్‌చోర్’, ‘అగర్ తుమ్ నా హోతే’, ‘ఆశాజ్యోతి’, ‘మక్సద్’, ‘మెయిన్ ఇంతేక్వామ్ లూంగా’, ‘లవ్ 86’, ‘జో జీతా వహీ సికందర్’, ‘గార్దిష్’, ‘తక్దీర్వాలా’, ‘ఘర్‌వాలీ బహర్‌వాలీ’, ‘బడే మియా చోటే మియా’, ‘హీరో హిందుస్తానీ’ చిత్రాల లోనూ, ఇంకా మరెన్నో సినిమాలలో అస్రానీ చిరస్మరణీయ నటన కనబరిచారు.
2000ల తర్వాత, అస్రానీ చిరస్మరణీయమైన పాత్రలు చేస్తూనే ఉన్నారు, ముఖ్యంగా ప్రియదర్శన్ గారి హాస్య చిత్రాలలో. ‘హేరా ఫేరీ’, ‘ఆమ్దానీ అఠానీ ఖర్చా రూపాయా’, ‘యే తేరా ఘర్ యే మేరా ఘర్’, ‘ఆంఖియోఁ సే గోలీ మారే’, ‘బాగ్‌బాన్’, ‘ఆవారా పాగల్ దీవానా’, ‘చుప్ చుప్ కే’, ’హూగ్ చుప్ కే’, ’పగ్ చుప్ కే’, ’దుల్చుల్’ వంటి అనేక దిగ్గజ చిత్రాలను చేసారు. ‘మసాలా’, ‘మలామాల్ వీక్లీ’, ‘బిల్లు’, ‘స్వాగతం’, ‘ధమాల్’, ‘ధోల్’, ‘భాగమ్ భాగ్’, ‘దే దానా డాన్’, ‘బోల్ బచ్చన్’, డ్రీమ్ గర్ల్ 2 తదితర సినిమాలో భాగమయ్యారు.
‘ఆజ్ కీ తాజా ఖబర్’, ‘నమక్ హరామ్’ వంటి చిత్రాలలో కలిసి పనిచేస్తున్నప్పుడు పరిచయమైన నటి మంజు బన్సాల్‌ను అస్రానీ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అహ్మదాబాద్‌లో దంతవైద్యుడుగా పనిచేస్తున్న నవీన్ అస్రామో అనే కుమారుడు ఉన్నాడు.
***
అమితాబ్ బచ్చన్, జయ బాధురిల వివాహం జరగడంలో అస్రానీ పాత్ర:
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) లో శిక్షణ పొందిన అస్రానీ మొదట్లో బొంబాయిలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డారు. తనను తాను పోషించుకోవడానికి, ఆయన అదే ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా చేరారు, అక్కడ జయా బచ్చన్‌కు నటన నేర్పించారు. ఆమె స్క్రీన్ యాక్టింగ్ కోర్సులో చేరారు. ఆ సమయంలో, ‘గుడ్డి’ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది, చిత్రనిర్మాత హృషికేశ్ ముఖర్జీ అస్రానీని సంప్రదించారు. గుల్జార్ – హృషీకేశ్ ముఖర్జీ గారికి జయ బాధురి పేరు సూచించారు.
“జయ ఎక్కడ అని హృషిదా నన్ను అడగడంతో, నేను వెంటనే ఆయన జయ టీ తాగుతున్న క్యాంటీన్‌కు తీసుకెళ్లాను. అనిల్ ధావన్, డానీ (డెంజోంగ్పా) కూడా అక్కడే ఉన్నారు. హృషిదా తనను కలవడానికి వచ్చారని చెప్పినప్పుడు జయ తన టీ కప్పుని కింద పడేసింది! ఆయన జయతో మాట్లాడుతుండగా, నేను నాకూ ఒక పాత్ర ఇవ్వమంటూ గుల్జార్‌ను వేధించాను. ఒక పాత్ర ఉందని గుల్జార్ చెప్పారు, కానీ తాను చెప్పానని ఆ విషయం హృషిదాకు తెలియకూడదని అన్నారు”, అని అస్రానీ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘గుడ్డి’ సూపర్ హిట్ అయింది, టీచర్ అస్రానీని, అతని శిష్యురాలు జయని వెలుగులోకి తెచ్చింది. జయ అస్రానీల మధ్య బంధం సంవత్సరాలుగా కొనసాగింది.
అమితాబ్ బచ్చన్‌తో జయ వివాహంలో కూడా అస్రానీ ప్రత్యేక పాత్ర పోషించారు. ఫిల్మ్‌ఫేర్‌తో మాట్లాడుతూ, “ఇప్పటికి కూడా జయ నన్ను కలిసినప్పుడు, ఆమె నన్ను ‘సర్’ అని పిలుస్తుంది ఎందుకంటే నేను ఒకప్పుడు ఆమె గురువుని. జయ, అమితాబ్ బచ్చన్‌ల్ వివాహంలో నలుగురు ‘వధువు సోదరులలో’ నేను ఒకడిని. గుల్జార్ సాబ్, రమేష్ బెహ్ల్, ఇంకా ఒక బంధువుతో పాటు. సంజయ్ గాంధీ కూడా ఆ ప్రైవేట్ సమావేశంలో ఉన్నారు.” అని చెప్పారు అస్రానీ.
***
తన తొలినాళ్ళను అస్రానీ గుర్తు చేసుకున్నారు:
యువకుడిగా ఉన్నప్పుడు, ముంబైకి వచ్చి, సంగీత దర్శకుడు నౌషాద్ కోసం వెతుకుతూ ఒక నెల రోజులు గడిపారు, సినిమాలలో వేషాలు సంపాదించడంలో ఆయన సహాయం చేస్తారేమోనని ఆశపడ్డారు. ఆ ప్రణాళిక విఫలమైనప్పుడు, అతను తన స్వస్థలమైన జైపూర్‌కు వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు కుటుంబ కార్పెట్ వ్యాపారం చూసుకోమని ప్రోత్సహించారు. కానీ అస్రానీకి వేరే కలలు ఉన్నాయి. ఆయన FTIIకి దరఖాస్తు చేసుకుని, మొదటి బ్యాచ్‌లో చేరారు.
అయితే, త్వరలోనే కఠిన వాస్తవాలు అర్థమయ్యాయి. FTII సర్టిఫికెట్ కలిగి ఉండటం బాలీవుడ్‌లో అంత గొప్ప విషయం కాదని అస్రానీ గ్రహించారు. జీవనోపాధి కోసం ఆయన తిరిగి FTII కి ప్రొఫెసర్‌గా వెళ్లారు. అప్పటి సవాళ్లను గుర్తుచేసుకుంటూ, “నేను నా సర్టిఫికెట్ పట్టుకుని తిరిగేవాడిని, వాళ్ళేమో నన్ను దూరంగా గెంటేసి, ‘నటనకు సర్టిఫికెట్లు అవసరమని అనుకుంటున్నారా? పెద్ద స్టార్లకు ఇక్కడ శిక్షణ లేదు, మరి మీరేమో ప్రత్యేకమైనవారని మీరు అనుకుంటున్నారా? తప్పుకోండి.’ అనేవారు.”
మళ్ళీ మాట్లాడుతూ, “రెండు సంవత్సరాలు పాటు నాకు అవకాశాలు దొరకలేదు. ఒకరోజు ఇందిరా గాంధీ పూణే వచ్చారు. అప్పట్లో ఆమె సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. మేము ఆమెను కలిసి ఫిర్యాదు చేసాము. సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ఎవరూ మాకు అవకాశం ఇవ్వడం లేదని మేము ఆమెకు చెప్పాము. తర్వాత ఆమె ముంబైకి వెళ్ళినప్పుడు – మాకు అవకాశాలివ్వలని నిర్మాతలకు చెప్పారు. ఆ తర్వాత నుంచి, అవకాశాలు రాసాగాయి. జయ భాదురి ‘గుడ్డి’లో నటించింది, నేను కూడా నటించాను. ‘గుడ్డి’ హిట్ అయ్యాకా, జనాలు FTII ని సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించారు.” అని చెప్పారు అస్రానీ.
***
రాజస్థాన్‌లోని ఒక చిన్న పట్టణం నుండి భారతీయ సినిమాల్లో అత్యంత ప్రియమైన హాస్యనటులలో ఒకరిగా ఎదగడానికి ఆయన చేసిన ప్రయాణం – ఆయన ప్రతిభ, అంకితభావం, దృఢసంకల్పానికి నిదర్శనం.
2025 అక్టోబరు 20 నాడు ముంబైలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందిన అస్రానీగారికి నివాళులు!
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.
