సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
కెమెరామెన్ జల్ మిస్త్రీ:
1923లో బొంబాయిలో జన్మించిన జల్ మిస్త్రీ, 1949 నుంచి 1998 వరకు భారతీయ చిత్రాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. లో-కీ హై-కాంట్రాస్ట్ లైటింగ్‌కు పేరుగాంచిన జల్, తన కెరీర్‌లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. బర్సాత్ (1949), హీర్ రంజా (1970), ఆఖ్రీ ఖత్ (1966), బహారోం కే సప్నే (1967) ఆయన ముఖ్యమైన సినిమాలలో కొన్ని. తన చివరి చిత్రం ‘ఝూట్ బోలే కౌవా కాటే’ (1998) చిత్రీకరణ తర్వాత కొద్దికాలానికే ఆయన అనారోగ్యానికి గురై ఏప్రిల్ 15, 2000న మరణించారు.
జల్ మిస్త్రీ స్వతంత్ర సినిమాటోగ్రాఫర్‌గా తన మొదటి సినిమా బర్సాత్ (1949) తీయడానికి దారితీసిన సంఘటనను రచయిత్రి రీతు నందా తన పుస్తకం ‘రాజ్ కపూర్ స్పీక్స్’లో వివరించారు. భారతదేశపు మొట్టమొదటి షోమ్యాన్, నటుడు-చిత్రనిర్మాత రాజ్ కపూర్, వి.ఎన్. రెడ్డిని కెమెరామెన్‌గా తీసుకుని బర్సాత్ సినిమాను చిత్రీకరించడం ప్రారంభించారు. ఆర్సన్ వెల్స్ తీసిన సిటిజన్ కేన్ (1941) లో అమెరికన్ సినిమాటోగ్రాఫర్ గ్రెగ్ టోలాండ్ వైడ్-యాంగిల్ లెన్స్‌ను ఉపయోగించడం బాగా నచ్చిన రాజ్ కపూర్, బర్సాత్‌లో రెడ్డి కూడా అదే చేయాలని కోరుకున్నారు.
“ఒక సంప్రదాయ కెమెరామెన్ అయిన రెడ్డి, పిల్లర్స్, కాలమ్‌లను కుదించాల్సి వస్తుందేమోనన్న ఆలోచనతో భయపడ్డారు, నిరాకరించారు. చివరికి, బర్సాత్ సినిమాను చిత్రీకరించే పనిని జల్ మిస్త్రీకి అప్పగించాల్సి వచ్చింది” అని నందా రాశారు.
ముంబైలోని సిరి సౌండ్ స్టూడియోస్‌లో అప్రెంటిస్‌గా తన సినిమా కెరీర్‌ను ప్రారంభించిన జల్ మిస్త్రీ 25 ఏళ్ల వయసులో బర్సాత్ సినిమా తీశారు. రాజ్ కపూర్‌తో అతని మొదటి పరిచయం ముంబైలోని ఫేమస్ సినీ లాబొరేటరీస్‌లో జరిగింది, ఆ సమయంలో జల్ క్లాష్ కెమెరామెన్‌గా మరో సినిమా షూటింగ్ పూర్తి చేశారు. సినిమాటోగ్రాఫర్ సికె మురళీధరన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ సమావేశాన్ని ఇలా వివరించారు:
“ఆయన (కపూర్) థియేటర్‌లోకి ప్రవేశించి నా రష్ ప్రింట్‌లను చూస్తున్నారు. అవి ఆయనకి చాలా నచ్చాయి. ఎవరు చేసారని అడిగారు. నేనే చేశానని చెప్పాను, ఆపై ఆయన తాను బర్సాత్ అనే కొత్త సినిమా ప్రారంభిస్తున్నానని చెప్పారు, మీరు ఛాయాగ్రహణం చేయగలరా అని అడిగారు. నేను చేయగలనని చెప్పాను”.
ప్రేమలోని అసంఖ్యాక ఛాయలను చిరస్మరణీయంగా దాటిన చిత్రం బర్సాత్, కొన్ని చెరగని చిత్రాలను కలిగి ఉంది. ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ హిందీ సినిమా ఇలా చెబుతోంది: “జల్ మిస్త్రీ గారి బర్సాత్ ఒకే సన్నివేశంలో అవుట్ డోర్, ఇండోర్ షాట్‌లను సరిపోల్చడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇందులో ఇన్‌డోర్, సెట్‌లలో చిత్రీకరించబడిన కొన్ని అందమైన అవుట్‌డోర్ సన్నివేశాలున్నాయి, అవి అచ్చం అవుట్‌డోర్ లోనే చిత్రీకరించిన భ్రమను కల్పిస్తాయి.” ఫిల్మ్ ఆర్కైవిస్ట్ పికె నాయర్ బర్సాత్ చివరి సన్నివేశాన్ని దాని వ్యక్తీకరణలో జార్జ్ స్టీవెన్ గారి షేన్ (1953) లోని ఐకానిక్ అంత్యక్రియల సన్నివేశంతో సమానంగా భావించారు. ప్రేమ్ నాథ్ తన ప్రియురాలి చితికి నిప్పంటిస్తున్నప్పుడు, దుఃఖంలో రగిలిపోతున్న అతని ముఖాన్ని లో-యాంగిల్ క్లోజప్‌లో తీశారు జల్.
“ఆ దృశ్యం అంత గొప్పగా రావడానికి కారణం ఆ కళాకారుడి నటనతో పాటు, జల్ మిస్త్రీ అద్భుతమైన ఫోటోగ్రఫీ, రాజ్ కపూర్ దర్శకత్వ ప్రతిభ.”
జల్ అన్నయ్య ఫాలి మిస్త్రీ బ్లాక్ అండ్ వైట్ కాలంలో హిందీ సినిమాల్లో ఒక గొప్ప వ్యక్తి. మిస్త్రీ సోదరులకు ఫోటోగ్రఫీ, సినిమా పట్ల ఆసక్తి తొలి దశలోనే పెరిగింది. వారి తండ్రి ధుంజీషా మిస్త్రీ స్థానిక మరియు అంతర్జాతీయ, ప్రసిద్ధ మరియు అరుదైన పుస్తకాలు, మ్యాగజైన్‌ల విస్తారమైన లైబ్రరీని కలిగి ఉన్నారు, ఇది సోదరులకు చాలా చిన్న వయస్సులోనే సినిమా, ఫోటోగ్రఫీ అనే పెద్ద ప్రపంచాన్ని పరిచయం చేసింది. బొంబాయిలో వారి మామకి భారతదేశంలోని ఇల్ఫోర్డ్ ఫిల్మ్స్ వారి మొదటి పంపిణీ అవుట్‌లెట్ ఉండేది. వారికి చెల్లెలు మెహ్రూ మిస్త్రీ, తమ్ముడు మిన్నో మిస్త్రీ ఉన్నారు. కుటుంబం చాలా సన్నిహితంగా ఉండేది. “ప్రతి రోజు రాత్రి పడుకోబోయే ముందు, సోదరులు ల్యాండ్‌లైన్ ఫోన్‌లో మాట్లాడుకునేవారు, వారి పనుల గురించి – వారు చేసిన లైటింగ్ లేదా ఆ రోజు వారు తీసిన ఒక నిర్దిష్ట షాట్ గురించి చర్చించుకునేవారు..” అని ఫాలి కుమారుడు సినిమాటోగ్రాఫర్ ఫరూఖ్ మిస్త్రీ అన్నారు. “ఆ కాలంలో, పరిశ్రమ బాగుండేది. ఫాలి, జల్ ఇతర సినిమాటోగ్రాఫర్‌లతో సన్నిహితంగా ఉండేవారు.. వారందరూ ఆలోచనలను పంచుకున్నారు, ఒకరినొకరు మద్దతిచ్చుకున్నారు.”
బ్యాక్‌లైట్, లో-కీ కాంట్రాస్ట్ లైటింగ్‌ను ఉపయోగించే హాలీవుడ్, యూరోపియన్ చిత్రాల నుండి ఈ సోదరులు ప్రేరణ పొందారు. ఒక ఇంటర్వ్యూలో, ఇంట్లో హాలీవుడ్ క్లాసిక్‌లను చూసి తనకు నచ్చిన చిత్రాల స్క్రీన్‌షాట్‌లను తయారు చేసుకున్నట్లు గుర్తుచేసుకున్నారు జల్. తరువాత, లైటింగ్‌ను వివరంగా అధ్యయనం చేయడానికి వాటిని పెద్దదిగా చేసేవారు. వెల్ష్ మైనింగ్ క్షేత్రాల నేపథ్యంలో 1941లో జాన్ ఫోర్డ్ నిర్మించిన ‘హౌ గ్రీన్ వాజ్ మై వ్యాలీ’ అనే నాటకాన్ని ఆర్థర్ సి మిల్లర్ అద్భుతంగా చిత్రీకరించిన చిత్రం ‘తన మనస్సులో చెక్కబడిన’ చిత్రంగా ఆయన ఉదహరించారు.
“ఇది సోర్స్ లైటింగ్‌ను ఉపయోగించి బాగా ఛాయాచిత్రాలు తీసిన చిత్రం, ఇది అప్పట్లో భారతీయ సినిమాటోగ్రఫీలో లేని టెక్నిక్” అని ఆయన అన్నారు.
జల్ సినిమాలలో, ముఖ్యంగా ఫాలి దర్శకత్వం వహించిన ‘సజా’ (1951) వంటి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో ఇలాంటి సౌందర్యాన్ని గుర్తించవచ్చు. ‘సజా’ ప్రారంభ సన్నివేశంలో, కెమెరా ఒక బంగ్లా లోని గ్రాండ్ లివింగ్ రూమ్‌లోకి కదులుతుంది, గాలిలో ఊగుతున్న ఒక పెద్ద షాండిలియర్ నీడ ద్వారా భయానక రూపంలోకి యానిమేషన్ చేయబడింది. కొన్ని సెకన్ల తర్వాత, ఒక అరుపు గాలిలో చొచ్చుకుపోతుంది, కానీ జల్ కెమెరా పనితనం వల్ల – కలలాంటి, వెంటాడే దృశ్యాల లోతు ద్వారా, ఆ సన్నివేశంలోని ఉద్రిక్తత గురించి ప్రేక్షకుడికి అప్పటికే అర్థమవుతుంది.
1968లో నాసిర్ హుస్సేన్ దర్శకత్వంలో నిరుద్యోగం మరియు కార్మికవర్గ పోరాటం గురించి తీసిన ‘బహరోం కే సప్నే’ సినిమా ద్వారా జల్ తన మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాకి యువ రాజేష్ ఖన్నా నాయకుడు. ఈ చిత్రంలోని చివరి సన్నివేశం అద్భుతమైనది, ఆందోళన చెందిన కార్మిక వర్గం ఒక మిల్లును తగలబెట్టి, హీరోను తీవ్రంగా గాయపరుస్తుంది, అతను తమకు ద్రోహం చేశాడని ఆరోపిస్తుంది. విస్మయం కలిగించే ఒక షాట్‌లో, ఖన్నా మండుతున్న నిర్మాణం ముందు అల్లరి మూక వైపు కుంటుతూ వస్తూ ఆకాశం వైపు పొగను వెదజల్లుతూ శాంతి కోసం పిలుపునిస్తాడు.
జల్ చేసిన గొప్ప సినిమాలలో కొన్ని రాజ్ కపూర్, జల్ సోదరుడు ఫాలి, 1950-1953 మధ్య మూడు చిత్రాలకు దర్శకత్వం వహించిన చేతన్ ఆనంద్‌వి నవకేతన్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ఆఖ్రీ ఖత్’ (ది లాస్ట్ లెటర్, 1966), రాజేష్ ఖన్నా తొలి చిత్రం, పెద్ద బొంబాయి నగరంలో తప్పిపోయే పసిపిల్లల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఇది చిన్న బడ్జెట్‌లో తీసిన ప్రయోగాత్మక సినిమా, చేతన్ ఆనంద్ తన కెరీర్‌లో దర్శకత్వం వహించిన ఇతర చిత్రాలకన్నా భిన్నమైనది. చిన్న కథానాయకుడు, ఒక సంవత్సరం వయసున్న బంటీ బెహ్ల్ పాల్గొన్న సన్నివేశాల కోసం అతను షూటింగ్ స్క్రిప్ట్‌ను ఉపయోగించలేదు, కానీ ఆ పసిపిల్లవాడిని మాహిమ్‌లోని రద్దీగా ఉండే రోడ్ల మీద, రైల్వే ట్రాక్‌ల గుండా స్వేచ్ఛగా తిరగనిచ్చాడు. జల్ మిస్త్రీ హ్యాండ్‌హెల్డ్ కెమెరాతో ఆ పిల్లవాడిని అనుసరించారు. ప్లేబ్యాక్ గాయకుడు భూపిందర్ సింగ్ జాజ్ సంగీతకారుడిగా కనిపించే ‘రూత్ జవాన్’ పాటలో, ట్రాలీ షాట్‌లను, లో-కీ లైట్‌ను ప్లే చేసి, తన పనిలో నూతనత్వాన్ని ప్రదర్శించారు జల్.
(‘రూత్ జవాన్’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=HWsfaGiIWlg )
“ఆఖ్రీ ఖత్, దాని ఇన్వెంటివ్ సినిమాటిక్ రూపంతో; దాని నాన్-లీనియర్ కథనాన్ని, సెమీ-డాక్యుమెంటరీ శైలిని, బోల్డ్ ఇమేజరీని, జాజీ సౌండ్‌ట్రాక్‌ని – అన్నింటినీ అధిగమిస్తుంది” అని రచయిత-చిత్రనిర్మాత హీలియో శాన్ ‘మిగ్యుల్ వరల్డ్ ఫిల్మ్ లొకేషన్స్: ముంబై’లో రాశారు.
తన సహచరుల కథనాలను పరిశీలిస్తే, నిశ్శబ్దంగా ఉండే జల్ ఒక పరిపూర్ణతావాది. నిజానికి, 60లలో హిందీ చిత్ర పరిశ్రమ ఆయన అద్భుతమైన లైటింగ్ శైలిని వివరించడానికి ‘జల్ కీ జాలీ’ (జల్స్ నెట్) అనే పదబంధాన్ని కూడా సృష్టించింది. “ఒకసారి, నేను సెట్‌లో లైటింగ్ అమర్చిన తర్వాత, అది అలాగే ఉంటుంది,” అని జల్ మురళీధరన్‌తో చెప్పారు. “నటీనటులు వచ్చే ముందు, నేను కొంతమందిని స్టాండ్-ఇన్‌లుగా ఉంచేవాడిని, సెట్‌ని చాలా పరిపూర్ణంగా చేసేవాడిని, నటీనటులు వచ్చి రిహార్సల్ చేసినప్పుడు, కొంచెం చిన్న మార్పు మాత్రమే ఉంటుంది” అన్నారు.
1952లో చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ఆంధియా’ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు జల్ మిస్త్రీ. నటి నిమ్మీ ప్రధాన పాత్ర పోషించారు. తుఫానుకు ముందు పరిపూర్ణమైన ఎర్రటి ఆకాశాన్ని చిత్రీకరించడానికి, తుఫాను సన్నివేశాన్ని చిత్రీకరించడానికి – దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఏడు రోజుల పాటు ఎలా వేచి ఉన్నారో ఒక ఇంటర్వ్యూలో నిమ్మి గుర్తుచేసుకున్నారు. రచయిత-పరిశోధకురాలు దేబాశ్రీ ముఖర్జీ తన పుస్తకం ‘ఎ మెటీరియల్ వరల్డ్: నోట్స్ ఆన్ యాన్ ఇంటర్వ్యూ’లో నటుడు మరియు మేకప్ ఆర్టిస్ట్ రామ్ టిప్నిస్‌ను ఉటంకించారు.
“కెమెరావర్క్, లైటింగ్ కూడా పెయింటింగ్ లాంటివి. జల్ మిస్త్రీ అనే కెమెరామెన్ ఉన్నారు. మేము నూతన్ గారిని క్లోజ్‌గా తీయాల్సి వచ్చింది, ఆ షాట్‌ని తీయడానికి ఆరు గంటలు పట్టింది! కానీ మేము స్క్రీన్ మీద ఫలితాలను చూసినప్పుడు, అది చాలా అందంగా వచ్చింది.”
కానీ, సమయం అంటే డబ్బు అనే హిందీ చిత్ర పరిశ్రమలో, ఖచ్చితత్వం పట్ల జల్‌కు ఉన్న మక్కువ ప్రతిసారీ అందరికీ నచ్చకపోవచ్చు. “భారతదేశంలో, కెమెరామెన్ మాత్రమే సమయాన్ని ఆదా చేయాల్సి ఉంటుంది, అతను త్వరగా పని చేయాలి” అని మురళీధరన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జల్ అన్నారు. “ఇక్కడ ఏమీ ప్లాన్ చేయబడదు. మీకు ఉన్న కొద్దిపాటి సమయంతోనే మీరు ముందుకు సాగాలి..” అంటూ మన్మోహన్ దేశాయ్ మల్టీస్టారర్ చిత్రం ‘నసీబ్’ లో పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు, అక్కడ ప్రధాన నటులకు లైటింగ్ చేయడానికి పది నిమిషాల సమయమే ఇచ్చారట. అప్పట్లో వారంతా చాలా టైట్ షెడ్యూల్‌లో ఉన్నారట, కాబట్టి కెమెరా బృందం పార్టీ సన్నివేశాల చిత్రీకరణకు రెండు రోజుల ముందు మొత్తం సెట్‌ని సిద్ధం చేసింది.
జల్ అద్భుతమైన ఫేస్ లైటింగ్ పద్ధతులకు ప్రసిద్ధి చెందారు. బ్లాక్ అండ్ వైట్ మీడియంలో, హీరోయిన్ల ముఖాలను చిత్రీకరించడానికి డిఫ్యూజర్‌లను ఉపయోగించారు – స్టిల్ ఫోటోగ్రాఫర్లు విస్తృతంగా ఆచరించే సాంకేతికత ఇది. ఈ టెక్నిక్ దట్టమైన నీడలను తొలగించడానికి, మందపాటి మేకప్‌ను దాచడానికి సహాయపడింది. క్లోజప్ షాట్‌లలో కళ్ళను కాంతిమంతం చేయడానికి కెమెరాపై అమర్చిన బ్యాటరీతో పనిచేసే పెన్-లైట్‌లను ఉపయోగించడం ఆయన చమత్కారమైన పద్ధతుల్లో ఒకటి. ‘కుద్రత్’లో, అతను లండన్ నుండి దిగుమతి చేసుకున్న సన్నని, తేలికపాటి గాజుగుడ్డ – సున్నితమైన నల్లటి షిఫాన్ ఫాబ్రిక్ తోనూ, హై కాంట్రాస్ట్‌తో మూడీనెస్‌ను సృష్టించడానికి ఫాగ్ ఫిల్టర్‌లతో ప్రయోగాలు చేశారు.
“నా కెమెరా ముందు మొదటిసారి హీరోయిన్ ఉన్నప్పుడు, షూటింగ్‌కి ముందు నేను కొన్ని పరీక్షలు చేస్తాను. ఆమెకు ఏది బాగా సరిపోతుందో తెలుసుకోవడానికి నేను బేబీ లైట్ ఆన్ చేసి, ఆమె ముఖం మీద వివిధ కోణాల నుండి ప్లే చేస్తాను. నూతన్ పై బేబీ లైట్‌ని ఆన్ చేసినప్పుడు, ఆమెలో అరుదైన విషయం, పరిపూర్ణమైన ముఖం ఉందని నేను గ్రహించాను” అని జల్ తన సోదరుడు ఫాలితో కలిసి రాసిన ఒక మ్యాగజైన్‌కు వ్రాసిన వ్యాసంలో అన్నారు. “నేటి వేగవంతమైన ఎమల్షన్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్‌కి – గతంలో నెమ్మదిగా ఎమల్షన్లతో పొందిన చర్మం యొక్క ప్లాస్టిక్ టెక్స్చర్ పొందడానికి లైట్ డిఫ్యూజన్ చాలా తక్కువగా కావాలి లేదా అస్సలు అవసరమే లేదు” అన్నారాయన. నటీనటుల హెయిర్ స్టైల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. మురళీధరన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో, ‘ప్రేమ్ గ్రంథ్’ చిత్రీకరణ సమయంలో మాధురి దీక్షిత్ ను సాధారణ హెయిర్ స్టైల్ ఉంచుకోమని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించిన ‘బొంబై కా బాబు’ (1960), సినీ నిర్మాణ రంగంలో జల్ మిస్త్రీ పోషించిన అరుదైన పాత్రని వెల్లడిస్తుంది. ఆయన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు. ఈ థ్రిల్లర్‌ని – హిందీ సినిమా యాంగ్రీ యంగ్ మ్యాన్ శైలికి ప్రారంభ బిందువుగా పరిగణిస్తారు సినీ చరిత్రకారుడు గౌతమ్ చింతామణి. ప్రధాన నటులు దేవానంద్, సుచిత్రా సేన్ ముఖాల యొక్క ప్రత్యేకమైన క్లోజప్ షాట్‌లను జల్ తీసిన విధానం చాలా గొప్పగా ఉంటుంది, వారి కళ్ళు ప్రదర్శించే హావభావాలను అద్భుతంగా చూపుతుంది.
సినిమాటోగ్రఫీకి గాను నాలుగుసార్లు ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు జల్. అవి బహరోం కే సప్నే (1968), హీర్ రాంఝా (1971), ఝీల్ కే ఉస్ పార్ (1974), కుద్రత్ (1982). తన చివరి చిత్రం ‘ఝూత్ బోలే కౌవా కాటే’ చిత్రీకరించినప్పుడు ఆయనకు 75 సంవత్సరాలు. “కెమెరావర్క్ ఒక మనోహరమైన కళ. నేను ఇప్పుడు కూడా కొనసాగించాలనుకుంటున్నాను, అయితే సరైన చిత్రంతో. విదేశాలకు చాలాసార్లు ప్రయాణించిన తర్వాత, వారి వద్ద ఉన్నవన్నీ మనకు ఉండాలని నేను భావిస్తున్నాను, కానీ అది ఎక్కడ ఉంది?” అని ఆయన డిసెంబర్ 1996లో మురళీధరన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. నాలుగు సంవత్సరాల తరువాత, ఏప్రిల్ 15, 2000న, వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో జల్ మరణించారు.
జల్ తన జీవితాంతం స్టిల్ ఫోటోగ్రఫీని కూడా అభ్యసించారు, అధ్యయనం చేశారు. “అయితే, నెగటివ్స్, ప్రింట్స్ శాశ్వతంగా అదృశ్యమయ్యాయి” అని ఫరూఖ్ చెప్పారు. “మా బాబాయి చాలా తక్కువగా మాట్లాడే మనిషి. తన పనే స్వయంగా మాట్లాడాలని ఆయన నమ్మారు. కానీ ఆయన చాలామంది తన సమకాలీనుల వలె తన కృషిని చాటేవాటిని భద్రపరచలేదు. ఇది దురదృష్టకరం.” అన్నారు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.