Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 294

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

నిర్మాత దర్శకుడు పలువాయి రామకృష్ణ:

రామకృష్ణ 1918లో కర్నూలులో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసరావు స్కూల్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్. రామకృష్ణ పాఠశాలలో తెలివైన విద్యార్థిగా గుర్తింపు పొందారు. స్కూల్ ఫైనల్ తర్వాత 1935లో బందరులో హిందూ కళాశాలలో చేరారు. కాలేజీ ఫీజు చెల్లించడానికి ఆయన బావ సహాయం చేశారు. 1937లో ఇంటర్మీడియట్ పాసయ్యారు, బి.ఎ. కోర్సు చేయాలని యోచించారు. కానీ బావ మరణించడంతో ఇంకా చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు రామకృష్ణ.

ఆయన విధి ఆయనను వేల్ పిక్చర్స్‌ కార్యాలయానికి తీసుకెళ్లింది, అక్కడ ఆయన సౌండ్ రికార్డింగ్ విభాగంలో చేరారు. కానీ ఆ ఉద్యోగం ప్రోత్సాహకరంగా లేకపోవడంతో మానేశారు. ఆ సమయంలో 1937లో దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి తమిళంలో మాతృభూమి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్కడ ఆయన ఎడిటింగ్ విభాగంలో అప్రెంటిస్‌గా చేరారు. ఆప్పుడు రామకృష్ణకు 19 సంవత్సరాలు. ఈ చిత్రం 1939లో విడుదలై ఘన విజయం సాధించింది. హెచ్.ఎం.రెడ్డి గారు రామకృష్ణ పనిని ఇష్టపడి, ఆయనను తన సొంత బ్యానర్ రోహిణి పిక్చర్స్‌లో ఎంపిక చేసుకుని అసిస్టెంట్ ఎడిటర్‌గా నియమించారు. బోండం పెళ్లి, తెనాలి రామకృష్ణ, సత్యమే జయం అనే మూడు చిత్రాలు రోహిణి బ్యానర్‌లో వచ్చాయి, వీటికి రామకృష్ణ ఎడిటర్‌గా పనిచేసి చాలా ప్రశంసలు అందుకున్నారు.

1942లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు హెచ్.ఎం. రెడ్డి – రామకృష్ణ మళ్ళీ తన బ్యానర్‌లో చేరుతారనే అవగాహనతో తాత్కాలికంగా సొంతూరికి వెళ్లిపోవాలని కోరారు. కానీ త్వరలోనే రామకృష్ణకు కృష్ణ ప్రేమ చిత్రానికి స్టార్ కంబైన్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. ఈ సినిమా నిర్మాణ సమయంలో నటి భానుమతి రామకృష్ణతో ప్రేమలో పడ్డారు, వారిద్దారూ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ చిన్నవారు, చాలా సంతోషంగా ఉండేవారు. భానుమతి సినిమాలలో నటించడం మానేశారు, కానీ బి.ఎన్. రెడ్డిగారు లింగమూర్తి ద్వారా తన ‘స్వర్గసీమ’ చిత్రంలో నటించమని ఆమెను ఒత్తిడి చేశారు. రామకృష్ణకు బి.ఎన్.రెడ్డి గారంటే చాలా గౌరవం ఉన్నందున ఆమె అయిష్టంగానే అంగీకరించారు. అదే సమయంలో వై.వి. రావు ఆమెతో ‘తహశీల్దార్‌’ అనే సినిమా చేశారు. ‘స్వర్గసీమ’ చిత్రీకరణ సమయంలో ఆమె గర్భం దాల్చింది. ఈ సమయంలో ఆమెకు మార్నింగ్ సిక్‌నెస్ వచ్చింది, దాంతో ఆమె సన్నగా, బలహీనంగా మారారు. ‘ఓ హో పావురమా’ పాటలో ఈ కారణంగానే ఆమె కొత్తగా కనబడ్డారు. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. వారు అతనికి తన జన్మనక్షత్రం భరణి అని పేరు పెట్టారు. తమ కొడుకు భవిష్యత్తు కోసం డబ్బు సంపాదించడానికి మరిన్ని సినిమాలు చేయాలని భానుమతి నిర్ణయించుకున్న సమయం అది. ఈలోగా రామకృష్ణ కొత్త బ్యానర్‌ను ప్రారంభించి దానికి తమ కొడుకు పేరు మీద భరణి అని పేరు పెట్టారు. భరణి సంస్థ వారి మొదటి చిత్రం 1948లో వచ్చిన ‘రత్నమాల’. వారి తదుపరి చిత్రం 1949లో వచ్చిన ‘లైలా మజ్ను’. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. దర్శకుడికి, స్వరకర్త సి ఆర్ సుబ్బరామన్‍కి, రచయిత సముద్రాలకి, నిర్మాణ బాధ్యతలు మోసిన డి ఎల్ నారాయణకి, సినిమాటోగ్రాఫర్‌ బి ఎస్ రంగాకు చాలా పేరు తెచ్చిపెట్టింది. సంస్థలో భానుమతి చురుకైన పాత్ర తీసుకోడంతో, వీరంతా భరణి సంస్థని విడిచిపెట్టి ‘వినోద’ బ్యానర్‌ను స్థాపించి ‘శాంతి’, ‘దేవదాసు’ మొదలైన సినిమాలు నిర్మించారు.

ఈ జంట నిరాశ చెందకుండా 1952లో ‘ప్రేమ’ అనే సినిమాని నిర్మించారు. ఆ సంవత్సరం వారి జీవితాల్లో ఒక మైలురాయి. వారు సాలిగ్రామంలో 15 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, తమ కొడుకు పేరు మీద భరణి స్టూడియో అనే స్టూడియోను నిర్మించారు. వారు ఆక్కడ నిర్మించిన మొదటి చిత్రం తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో తీసిన త్రిభాషా చిత్రం – ‘చండీరాణి’. రామకృష్ణ 1953లో ‘బ్రతుకు తెరువు’ అనే చిత్రానికి బయటి బ్యానర్ కోసం దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ జంట వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Exit mobile version