సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
నటి రాగిణి:
రాగిణి (11 డిసెంబర్ 1923 – 27 ఫిబ్రవరి 2007) తొలుత భారతీయ సినిమాలలో, తరువాత పాకిస్తాన్ సినిమాలో నటించారు. హిందీ/ఉర్దూ, పంజాబీ చిత్రాలకు పనిచేశారు. రాగిణి తన కాలంలో అత్యధిక పారితోషికం పొందిన నటి అని చెబుతారు. ‘షాజహాన్’ (1946) సినిమాలో ఆమె పాత్రకు ఎ. ఆర్. కర్దార్ లక్ష రూపాయలు చెల్లించారని అంటారు. అందమైన జింక కళ్ళ లాంటి కళ్ళకు ప్రసిద్ధి చెందిన రాగిణిని ‘ఆహూ చాసమ్’ అని పిలుస్తారు.
రాగిణి 1923 సంవత్సరంలో అవిభక్త భారతదేశంలోని గుజ్రన్‌వాలాలో (ఇప్పటి పాకిస్తాన్) షంషాద్ బేగంగా జన్మించారు. రాగిణి చాలా చిన్నతనంలోనే ఆమె తల్లి మరణించారు, ఆమె తండ్రి సేథ్ దివాన్ పర్మానంద్ ఆమెను తనతో పాటు లాహోర్‌కు తీసుకెళ్లారు. లాహోర్‌లో చిత్రనిర్మాత రోషన్ లాల్ షోరే ఆమెను గమనించి, రాగిణిని సినిమాల్లోకి తీసుకురావాలని ఆమె తండ్రిని ఒప్పించారు.
రాగిణి తన నటనా జీవితాన్ని ఎం.డి. కన్వర్ సరసన పంజాబీ చిత్రం ‘దుల్లా భట్టి’ (1940) తో ప్రారంభించారు. ఆ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. దాంతో రాగిణి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. లాహోర్ కేంద్రంగా నిర్మితమైన – సేహ్తి మురాద్ (1941), నిషాని (1942), రవి పర్ (1942), పూంజి (1943), దాసి (1944), కైసే కహున్ (1945) వంటి అనేక హిందీ, పంజాబీ సినిమాలలో రాగిణి నటించారు.
నేక్ పెర్విన్ (1946) అనేది రాగిణి టాప్ స్టార్‌గా ఆమె స్థానాన్ని సుస్థిరం చేసిన మరో విజయవంతమైన చిత్రం. షాజహాన్ (1946) సినిమాలో ముంతాజ్ మహల్ పాత్రను పోషించడానికి చిత్రనిర్మాత ఎ.ఆర్. కర్దార్ రాగిణికి లక్ష రూపాయలు ఇచ్చారని, ఆ సమయంలో ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నిలిచారని చెబుతారు. దేశ విభజన తర్వాత రాగిణి పాకిస్తాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు, అయితే రెండు భారతీయ సినిమాలు కూడా చేశారు, కానీ అవి అంతగా ఆడలేదు.
రాగిణి గారి జింకలాంటి కళ్ళు ఆమెకు అతిపెద్ద ఆస్తి [తెలుగు నతి కాంచనమాల లాగా]. లాహోర్‌లోని భాటి గేట్ వద్ద ప్రదర్శించబడిన ‘సెహ్తి మురాద్’ సినిమా పోస్టర్‌పై, ఆమె కళ్ళకు గంతలు కట్టి, “ఈ కళ్ళు తెరిస్తే ఏం జరుగుతుంది?” అనే శీర్షికని కింద ముద్రించారు. ఆమె ఇతర చిత్రాలలో, ‘షిరిన్ ఫర్హాద్’ (1945) గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి, దీనిలో ఆమె జయంత్ ఫర్హాద్‌కు షిరిన్ పాత్రను ఆకర్షణీయంగా పోషించారు.
రాగిణి 1940ల ప్రారంభంలో మొహమ్మద్ అస్లాంను వివాహం చేసుకున్నారు, ఆ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. కానీ ఆమెకు మొదటి వివాహం ద్వారా ఇద్దరు పిల్లలు – సైరా, అబిద్ కలిగారు. ఆమె మళ్ళీ 1947లో పాకిస్తాన్లో ‘బేకరార్’ చిత్రంలో ఆమెతో కలిసి నటించి, నిర్మించిన ఎస్. గుల్‌ను వివాహం చేసుకున్నారు. రాగిణి తన జీవితంలోని చివరి రోజులను గుల్బర్గ్లో ఒంటరిగా గడిపారు, నిర్లక్ష్యానికి గురయ్యారు. ఆమె కుమారుడు అబిద్ అమెరికాలో మరణించాడు, ఆ తర్వాత ఆమె మంచి పొరుగువారి దయ వల్ల జివించారు. ఒకారా (లాహోర్ నుండి 120 కి.మీ)లో నివసిస్తున్న ఆమె కుమార్తె సైరాను – ఆమె తల్లి రాగిణిని చూడటానికి సైరా అత్తమామలు, భర్త అనుమతించలేదు.
రాగిణి (షంషాద్ బేగం) ఫిబ్రవరి 27, 2007న లాహోర్ (పాకిస్తాన్)లో మరణించారు.
షాజహాన్ (1946)) చిత్రంలో రాణి ముంతాజ్ మహల్‌గా రాగిణిని ఈ లింక్ లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=iXOrUCvn05I
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.
