సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
నటి నళిని జయవంత్ విషాదాంత జీవితం:
1926లో బొంబాయిలో జన్మించిన నళిని జయవంత్ విద్యావంతులైన కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. చిన్నతనంలోనే గుర్తించబడిన రూపసి ఆమె. 14 సంవత్సరాల వయస్సులో ఆమె ‘రాధిక’ (1941) అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత, ఆమె మెహబూబ్ ఖాన్ తీసిన ‘బెహెన్’లో నటించారు; ఇది ఆమె నటిగా ఆమెకు కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్తింది. 1940ల చివరి నాటికి నళిని జయవంత్ – బలరాజ్ సాహ్ని, త్రిలోక్ కపూర్ వంటి ప్రతిభావంతులతో కలిసి నటించారు.
దేవ్ ఆనంద్, అశోక్ కుమార్, దిలీప్ కుమార్ వంటి సూపర్ స్టార్ నటులతో సమానమైన విజయాలని అనుభవించారామె. రిలాక్స్‌డ్ స్క్రీన్ ప్రెజెన్స్, భావాలను అద్భుతంగా వ్యక్తీకరించే కళ్ళు ఆమెను తెరపై అద్భుతంగా చూపేవి, దాంతో నళిని జయవంత్ 1950లలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరయ్యారు.
భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకరైన దిలీప్ కుమార్, తన సుదీర్ఘ సినీ జీవితంలో తాను కలిసి పనిచేసిన ‘గొప్ప నటి’ నళిని జయవంత్ అని అన్నారు. భారతదేశపు అత్యుత్తమ నటులలో ఒకరి నుండి ఈ వ్యాఖ్య రావడమంటే నటిగా జయవంత్ ప్రతిభను గుర్తించినట్లే.
అశోక్ కుమార్ సరసన నటించేటప్పుడు ఆమె అద్భుతమైన నటనను కనబరిచారు. నళిని, అశోక్ కుమార్‌ల ఇతర చిత్రాల విజయాలని వారిద్దరూ కలిసి సాధించిన విజయాలతో పోల్చడం దాదాపు అసాధ్యం. వీరి ప్రస్థానం ‘సమాధి’, ‘సంగ్రామ్’ సినిమాలతో ప్రారంభమైంది. తరువాత ‘జల్పారి’ (1952), ‘కాఫిలా’ (1952), ‘నౌ బహార్’ (1952), ‘లకీరేం’ (1954), ‘నాజ్’ (1954) వంటి హిట్ చిత్రాలను అందిచిందీ జోడీ. నళిని, అశోక్ కుమార్ 1950ల చివరి వరకు కలిసి సినిమాలు చేశారు, వాటిలో ‘మిస్టర్ ఎక్స్’, ‘షెరూ’ మరియు ‘తూఫాన్ మే ప్యార్ కహాఁ’ చిత్రాలు ఉన్నాయి. 1959లో, రాజ్ ఖోస్లా తీసిన ‘కాలా పానీ’ చిత్రంలో నటుడు దేవ్ ఆనంద్‌తో కలిసి నటించినందుకు జయవంత్ ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.
నళిని తన వ్యక్తిగత జీవితం తరచుగా ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించేవారు. ఆమె యుక్తవయసులో ఉన్నప్పుడు చిత్రనిర్మాత వీరేంద్ర దేశాయ్‌ను వివాహం చేసుకున్నట్లు ఓ పత్రిక వెల్లడించింది. కానీ త్వరలోనే ఆమె కుటుంబం నుండి దూరమై దేశాయ్ నుండి విడిపోయారు. తరువాత, నళిని అశోక్ కుమార్‌తో ప్రేమలో పడ్డారు, నేపాల్‌లో కిడ్నాప్ కోసం జరిగిన ఓ ప్రయత్నం విఫలమైన సందర్భంలో వీరి ప్రేమ చిగురించిందని అంటారు. తన సమీప బంధువు, నటి కాజోల్ అమ్మమ్మ అయిన నటి శోభన సమర్థ్‌తో నళినికి అంత పొసిగేది కాదు.
1960 దశకం మధ్య నాటికి, ‘బాంబే రేస్ కోర్స్’ (1965) తర్వాత నళిని నటన విరమించుకున్నారు. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత, మళ్ళీ ఆమె అమితాబ్ బచ్చన్ ‘నాస్తిక్’ (1983)లో అతని తల్లి పాత్రలో నటించారు. ఆ పాత్ర ఊహించిన విధంగా లేకపోవడం వల్ల తాను సంతృప్తి చెందలేదని ఆమె తరువాత తెలిపారు. అది ఆమెను బాధపెట్టింది.
నళిని జీవితంలో చివరి సంవత్సరాలు వేదన నిండినవి. ఒంటరితనం, మద్యపానం, వివాహాలు విఫలమవడం, పిల్లలు లేకపోవడం వంటివి ఆమెను బాధించాయి. ఆమె కుటుంబానికి, సహ నటీనటులకు దూరంగా ఉన్నారు, దాంతో ఆమె ప్రజల దృష్టి నుంచి పూర్తిగా తప్పుకున్నట్లయింది. డిసెంబర్ 2010లో, నళిని మరణించారు. అయితే, మూడు రోజుల తర్వాత గాని ఆమె చనిపోయినట్టు ఎవరికీ తెలియలేదు. ఆమె చివరి అధ్యాయంలోని అసలైన ఏకాంతాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తుంది.
1950లలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంలా వెలిగి, అనామకంగా మరణించడం వరకు సాగిన నళిని జయవంత్ ప్రస్థానం, స్టార్‌డమ్ యొక్క దుర్బల స్వభావాన్ని సూచిస్తుంది. ఆమె మరణించినప్పటికీ, దిలీప్ కుమార్ వంటి దిగ్గజాలు గతంలో నళిని ప్రతిభను ప్రశంసించారు, ఇది ఎల్లప్పుడూ భారతీయ సినిమా స్వర్ణయుగాన్ని గుర్తు చేస్తుంది.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.