సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
మధుబాల విషాద ప్రేమ గాథ:
1933లో ముంతాజ్ జెహాన్ బేగం దెహ్లావిగా జన్మించిన మధుబాల జీవితం ఆమె నటించిన సినిమాల మాదిరిగానే సినిమాటిక్‌గా, విషాదకరంగా ముగిసింది, మరపురానిదిగా మిగిలింది. చాలామంది ఆమెను ఆరాధించినప్పటికీ, కొద్దిమంది మాత్రమే ఆమెను నిజంగా అర్థం చేసుకున్నారు. తన అందంతో ఆమె జగత్ప్రసిద్ధి చెందారు కానీ ఆ సౌందర్యమే ఆమె కోరికలను, నిరాశలను, భగ్న హృదయాన్ని మరుగుపరిచింది.
మధుబాల తొమ్మిదేళ్ల వయసులోనే సినిమాల్లో నటించడం ప్రారంభించారు. తన కుటుంబానికి ఏకైక సంపాదకురాలిగా, ఆమె ఎప్పుడూ సాధారణ బాల్యాన్ని అనుభవించలేదు. ఆమె టీనేజ్ వయసు నాటికి, ఆమె ఒక సంచలనంగా మారారు, తన ఆకర్షణతో దర్శకులను, నటులను సమ్మోహితులను చేసింది. బాక్సాఫీస్ ఆమెదే అయినప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం స్టూడియో తలుపుల వెనుక, నిశ్శబ్ద గాయాల వెనుక మూసివేయబడింది. తెరపై ఆమె ఉనికి చాలా ఆకర్షణీయంగా ఉండేది, అది తరచుగా ప్రశంసకీ, మోహానికీ మధ్య రేఖను అస్పష్టంగా మార్చింది. షమ్మీ కపూర్‌తో సహా ఆ కాలంలోని అనేక మంది ప్రముఖ వ్యక్తులు ఆమె మాయలో పడ్డారు. షమ్మీ స్వయంగా “ఆమెతో పిచ్చిగా ప్రేమలో పడకుండా ఉండలేకపోయాను” అని ఒప్పుకున్నారు, కానీ మధుబాల భావోద్వేగపరంగా అందుబాటులో లేరని కూడా ముందుగానే గ్రహించారు. ఆమె హృదయం అప్పటికే మరొకరికి అర్పితమైందని అర్థం చేసుకున్నారు.
“మొహబ్బత్ మే జరా ఆంసు బహా కర్ హమ్ భీ దేఖేంగే.” సలీం (దిలీప్ కుమార్) ఆస్థానంలో అనార్కలి (మధుబాల) పాడిన పాట ఇది. బహుశా ఈ పాట వారి ప్రేమ గాథని చిత్రీకరించి ఉండవచ్చు. మధుబాల ప్రేమకథలోని అత్యంత ప్రసిద్ధ, విషాదకరమైన అధ్యాయం దిలీప్ కుమార్‌తో ఆమెకున్న సంబంధం. వారి కెమిస్ట్రీ కేవలం నటన కంటే ఎక్కువ, అది చాలా వ్యక్తిగతమైనది. 1951లో ‘తరానా’ చిత్రీకరణ సమయంలో వారు ప్రేమలో పడ్డారు, వారి ప్రేమ దాదాపు ఒక దశాబ్దం పాటు సినీరంగంలో చర్చనీయాంశమైంది. ఆయన ‘ట్రాజెడీ కింగ్’, మరి ఆమెమో ‘వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా’. వారి సంబంధం కాలాతీతమైన ఇతిహాసపు అన్ని లక్షణాలను కలిగి ఉంది. కానీ సినిమా వలె కాకుండా, జీవితం చాలా అరుదుగా సుఖాంతాలను అందిస్తుంది. ‘నయా దౌర్’ చిత్రీకరణ సమయంలో కుటుంబ జోక్యం, అహంకారపు ఘర్షణలు, సివిల్ కోర్టు కేసు కారణంగా వారి ప్రేమకథ బయటపడింది. మధుబాల తండ్రి అతుల్లా ఖాన్, దిలీప్ కుమార్‌ను తిరస్కరించారు, ఆమె కెరీర్‌నూ, ఆమె వ్యక్తిగత జీవితాన్ని నియంత్రించాలనుకున్నారు. దిలీప్ కుమార్ కోర్టులో ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పుడు, అది వారి చట్టపరమైన సంబంధాలను మాత్రమే కాకుండా వారు పంచుకున్న భావోద్వేగ బంధాన్ని కూడా విచ్ఛిన్నం చేసింది. దిలీప్ కుమార్ తన ఆత్మకథలో, ఆమెను ప్రేమించడం ఎప్పుడూ ఆపలేదని ఒప్పుకున్నారు. మధుబాల కూడా చివరి వరకు తన మంచం పక్కన దిలీప్ కుమార్ ఫోటోను ఉంచుకున్నారని అంటారు. కొన్నిసార్లు ప్రేమ, విడిపోయిన తర్వాత కూడా, చాలా కాలం పాటు ఉంటుంది.
హృదయం బద్దలైన మధుబాల, బహుశా, జీవింతంలో ముందుకు సాగాలని నిర్ణయించుకుని, 1960లో గాయకుడు కిషోర్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఆ వివాహం, జనాలు ఊహించిన అద్భుత కథకు భిన్నంగా ఉంది. కొందరు దిలీప్ మీది ద్వేషంతో, ఆమె కిషోర్కుమార్ని వివాహం చేసుకున్నారని చెబుతారు; మరికొందరు ఆమె కొత్త ప్రారంభాన్ని కోరుకున్నారని నమ్ముతారు. ఏదైనా సరే, అది శాశ్వత ప్రేమపై నిర్మించిన బంధం కాదు. అప్పటికి, మధుబాలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బు ఉన్నట్లు నిర్ధారణ అయింది. మొదట్లో ప్రేమగా ఉన్న కిషోర్, ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తనను తాను దూరం చేసుకున్నట్లు సమాచారం. ఆమె తన చివరి సంవత్సరాలను ఎక్కువగా మంచం మీద గడిపారు, ప్రజల దృష్టికి దూరంగా, తనను వెంటాడుతున్న ప్రేమ కోసం ఆరాటపడ్డారు. అనారోగ్యంతో ఆమె జరిపిన పోరాటం, ఆమె ప్రేమ కథలానే విషాదకరంగా ఉంటుంది. సకాలంలో చికిత్స కోసం విదేశాలకు వెళ్లడానికి అనుమతి లభించలేదు, ఆమె పరిస్థితి మరింత దిగజారింది. అయినప్పటికీ ఆమె వాటన్నింటినీ దయతో ఎదుర్కున్నారు, ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు, నిందించలేదు, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. జీవితం తాను పరిపూర్ణం చేసుకోవలసిన మరొక పాత్రలా మారింది.
మధుబాల కథ ఆమె ప్రేమించిన పురుషుల గురించి మాత్రమే కాదు; ప్రేమ, కీర్తిల మధ్య తరచుగా సంఘర్షణ ఎలా చెలరేగుతాయనే దాని గురించి కూడా. మహిళలకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు తిరస్కరించిన కాలంలో, ఆమె తన స్వంత నిబంధనల ప్రకారం ప్రేమించడానికి ధైర్యం చేశారు. ప్రపంచం ఆ ప్రేమని వాణిజ్యమయం చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె తన హృదయం కోసం పోరాడారు. తరువాత ఆమెను కొందరు ‘భారతదేశపు మార్లిన్ మన్రో’ అని పిలిచినప్పటికీ, విమర్శకులు మాత్రం ‘కేవలం అందమైన ముఖం’ అని తోసిపుచ్చారు. ఆమె ప్రదర్శనలు స్పష్టంగా వ్యక్తపరిచే భావోద్వేగ లోతును తిరస్కరించారు. మన్రో లాగానే ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ప్రజల ఆరాధన, వ్యక్తిగత ఒంటరితనం మధ్య ఎంతో ఎడం ఉండేది. ఆమె నటించిన సినిమాలలా కాకుండా, ప్రేమికులు తిరిగి కలిసే, సంగీతం ఉప్పొంగి బాధ ఆనందంగా మారడమనే చివరి సన్నివేశం లేనే లేదు. మధుబాల 36 సంవత్సరాల వయసులో మరణించారు, కానీ నలుపు-తెలుపు వర్ణాలలో లాలిత్యం నిండిన ఆమె వారసత్వం కొనసాగుతుంది, అసంపూర్ణమైన ప్రేమకథ లోని చేదైన తియ్యటి బాధ కొనసాగుతుంది.
చివరగా, మధుబాల అందం, కీర్తి, ప్రతిభ, ప్రశంసలు అన్నీ పొందారు. కానీ ఆమె కోరుకునే సాధారణ ఆనందం ఆమెకు ఎప్పుడూ లభించలేదు: శాశ్వత ప్రేమ, తనతో ఉండే భాగస్వామి, షరతులు లేని జీవితం – ఇవి మాత్రం ఆమెకు ఎన్నడూ దొరకలేదు. బహుశా అందుకే ఆమె కథ తరతరాలుగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆమె తను నటించిన పాత్రల కంటే, ప్రేమల కంటే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నారు. ఆమె గాఢంగా ప్రేమించి, నిశ్శబ్దంగా ఓడిపోయి, అందంగా జీవించిన స్త్రీ. ఆమెను మరువలేకపోవడానికి, కారణం, బహుశా ఆమెది పరిపూర్ణమైన జీవితం కానందు వల్ల కాదు; కానీ గాఢమైన వేదన నిండిన, హృదయ విదారక వాస్తవ గాథ కాబట్టి.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.