సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
లతా మంగేష్కర్ మద్రాసు రాక, ఓ ఇంటర్వ్యూ:
1954 నవంబర్‌లో వాహిని రికార్డింగ్ థియేటర్ సినీ ప్రియులతో నిండిపోయింది. అత్యంత ప్రసిద్ధ నేపథ్య గాయని లతా మంగేష్కర్‌ను చూడటానికి వారంతా అక్కడికి వెళ్లారు. ఇది మద్రాసులో ఓ అపూర్వమైన సంఘటన.
చాలామంది ఆమె తమిళ పాట పాడటానికి మద్రాసు వెళ్ళారని అనుకుంటారు కానీ వాస్తవానికి ఆమె ‘సదాసులంగ్’ అనే సినిమా కోసం సింహళ పాట పాడటానికి మద్రాసు వచ్చారు. 1950 నుండి, ఆమె జూపిటర్, జెమిని, ఎవిఎం వారి సినిమాలకు పాటలు పాడటానికి చాలాసార్లు మద్రాసుకు వచ్చారు.
(పక్క గదిలో ఉన్న తెలుగు స్వరకర్త సుసర్ల దక్షిణామూర్తి గారు ఆమె పాడటం విని చాలా సంతోషించారు. తన తెలుగు సినిమా ‘సంతానం’ నిర్మాతని దాదాపుగా ఆ గదిలోకి నెట్టి, తమ సినిమాలో పాడమని ఆమెను అభ్యర్థించారు.)
ఆమెకు ఉడ్‌ల్యాండ్స్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఆమె తన గదిలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆమె ఏం చెప్పారో, ఆమె మాటల్లోనే..
~
“నేను 1929లో సెప్టెంబర్ 28న ఇండోర్‌లో పుట్టాను. మా పూర్వీకులు సాంగ్లికి చెందినవారు. మేము నలుగురు అక్కాచెల్లెళ్లు, ఒక తమ్ముడు. మేమందరం పాటలు పాడేవాళ్ళం. ఐదేళ్ళ వయసులో మా నాన్నగారు నాకు సంగీతం నేర్పించారు. నా 8 ఏళ్ళ వయసు నుండి నాన్న వెళ్ళిన అన్ని కార్యక్రమాలకు నేను కూడా వెళ్ళాను, ఆయనతో పాటు వేదికపై పాటలు పాడటం ప్రారంభించాను.
(ఆమె 1954లో ‘మీరా కే ప్రభు’ సినిమాలో కూడా నటించాల్సి ఉంది. ఈ సినిమా గురించి నాకు తెలియదు).
మాస్టర్ వినాయక్ మరణం తర్వాత మేము 1947లో బొంబాయికి వచ్చాము. అదే సంవత్సరం ఆగస్టు నుండి నేను సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించాను.
‘ఆహ్’ సినిమా పాటలను తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్లలో నేనే పాడాల్సి ఉంది. కానీ నాకు ఆరోగ్యం బాలేదు, అందుకని జిక్కీ ఆ పాటలు పాడారు.
నాకు తెలుగు భాష అంటే ఇష్టం, అది మరాఠీ భాషకు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు నాకు ‘సంతానం’ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది.
నేపథ్య గాయకులందరికీ శాస్త్రీయ సంగీతంలో పరిజ్ఞానం ఉండాలని నేను భావిస్తున్నాను. లేకుంటే అవి ఎక్కువ కాలం ఉండవు. నాకు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఎం.ఎల్. వసంత కుమారి పాడిన పాటలు చాలా ఇష్టం. గాయని పి. లీల పాటలు వినాలనిపిస్తుంది. నేను గంటల తరబడి వీరి పాటలు వినగలను.
నాకు కె.ఎల్. సైగల్ పాడిన పాటలు చాలా ఇష్టం. ఆయన కూడా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. ఈ రోజు మనం ఆయన పాటల గురించి మాట్లాడుకుంటున్నది కూడా ఈ కారణం వల్లనే.
కేస్కర్ చెప్పింది నాకు నచ్చలేదు. అందుకే నేను రేడియోలో పాడటం మానేశాను. అది స్వచ్ఛమైన శాస్త్రీయ గాయకుల కోసం. (కేస్కర్ అప్పటి సమాచార శాఖా మంత్రి. రేడియోలో సినిమా పాటల ప్రసారాన్ని నిశేధించాడు..)
శాస్త్రీయ గాయకులను ప్రోత్సహించడానికి వసంత్ దేశాయ్, రఫీ, హేమంత్ కుమార్, నేను కలిసి సంగీత భారతిని ఏర్పాటు చేసాము. 1949 – 1950లో నేను ‘రామ్ రామ్ పాహ్వణ’ అనే మరాఠీ చిత్రానికి సంగీతం సమకూర్చాను.. నేను నిర్మించిన రెండు చిత్రాలకు కూడా సంగీతం అందించాను.
~
ఇంటర్వ్యూ చివరలో ఫోటోగ్రఫీ తన హాబీ అని చెప్పారు.
1954లో ఆమె ఇంటి చిరునామా – టార్డియో రోడ్, నానా చౌక్, బొంబాయి.
***
ఈ లింక్‌లో ‘నిదురపోరా తమ్ముడా’ పాట వినవచ్చు:
https://www.youtube.com/watch?v=E4uu53v3Yak
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.