సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
నటి, నిర్మాత దేవికా రాణి:
భారతీయ సినిమా ప్రథమ మహిళగా విస్తృతంగా గుర్తింపు పొందిన దేవికా రాణి, నటిగా, చిత్రనిర్మాతగా 10 సంవత్సరాలకు పైగా విజయవంతమైన సినీ జీవితాన్ని గడిపారు. దేశంలో మొట్టమొదటి స్వయం సమృద్ధిగల సినీ స్టూడియో ‘బాంబే టాకీస్’ సహ-స్థాపకురాలు. ఆవిడ ఎన్నో రకాలుగా మార్గదర్శకురాలు, తన అసాధారణ వ్యక్తిత్వంతో, పోషించిన పాత్రలతో సామాజిక నిబంధనలను, స్టీరియోటైప్ ఆచారాలను బద్దలు కొట్టారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తొలి గ్రహీత ఆమె. ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆమె జీవితాన్ని, కృషిని క్లుప్తంగా పరిశీలిద్దాం.
దేవికా రాణి 1908 మార్చి 30న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలోని వాల్తేరులో అత్యంత సంపన్నులు, విద్యావంతులైన బెంగాలీ కుటుంబంలో దేవికా రాణి చౌదరిగా జన్మించారు. ఆమె తండ్రి, ‘కల్నల్ డాక్టర్ మన్మథనాథ్ చౌదరి’, రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరి సుకుమారి దేవి చౌదరి కుమారుడు. ఆమె తండ్రి ఒక ప్రముఖ వైద్య నిపుణుడు, మద్రాస్‌కు తొలి భారతీయ సర్జన్ జనరల్. వైద్య రంగానికి చేసిన కృషికి, ప్రజా సేవ పట్ల నిబద్ధతకు ఆయన ప్రసిద్ధి చెందారు.
ఆమె తల్లి లీలా దేవి చౌదరి తన తల్లి వైపు నుంచి, రవీంద్రనాథ్ ఠాగూర్‌కి సమీప బంధువు. రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరి సౌదామిని దేవి గంగోపాధ్యాయ గారి కుమార్తె ఇందుమతి దేవి చటోపాధ్యాయ. ఇందుమతి దేవి కూతురు లీలా దేవి.
దేవికా రాణి చక్కని సాంస్కృతిక వాతావరణంలో పెరిగారు, తొమ్మిదేళ్ల వయసులో ఇంగ్లాండ్‌లోని బోర్డింగ్ స్కూల్‌కు వెళ్ళి, అక్కడే చదువు పూర్తి చేశారు. ఆమె వివిధ సంస్థలలో ఆర్కిటెక్చర్, టెక్స్‌టైల్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, సంగీతం నేర్చుకున్నారు. నాటకరంగం, సినిమాలపై కూడా ఆసక్తిని పెంచుకున్నారు. తరువాత ఆమె లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (RADA) లోనూ, రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలలో ఉన్నత విద్యను అభ్యసించారు.
1928లో, ఆమె జర్మన్ చిత్రనిర్మాతలతో కలిసి, ప్రశంసలు పొందిన కొన్ని మూకీ సినిమాలను నిర్మించిన భారతీయ చలనచిత్ర నిర్మాత, నటుడు హిమాంశు రాయ్‌ను కలిసారు. కుటుంబం వ్యతిరేకించినప్పటికీ, ఆ మరుసటి సంవత్సరం దేవికా రాణి హిమాంశుని వివాహం చేసుకున్నారు.
తరువాత రాయ్ తన తదుపరి నిర్మాణంగా, ఇంగ్లీష్, జర్మన్, హిందీ భాషలలో ఒకేసారి నిర్మించిన త్రిభాషా చిత్రం ‘కర్మ’ (1933) తీశారు. ఇందులో ఆయనే హీరో కాగా హీరోయిన్‌గా దేవికా రాణిని ఎంచుకున్నారు. ఈ చిత్రం 1933లో ఇంగ్లాండ్‌లో ప్రదర్శించబడింది, నిజ జీవిత జంట నటించిన సుదీర్ఘ చుంబన సన్నివేశం (తెరపై అతి సుదీర్ఘమైన ముద్దుగా ప్రపంచ రికార్డు సాధించింది) అక్కడ ఆసక్తిని రేకెత్తించింది, కానీ ఈ సినిమా భారతదేశంలో ఘోరంగా విఫలమైంది.
ఈ జంట 1934లో భారతదేశంలోని బొంబాయికి తిరిగి వచ్చారు, అక్కడ హిమాంశు రాయ్ మరికొంతమంది భాగస్వామ్యంతో ‘బాంబే టాకీస్’ అనే నిర్మాణ స్టూడియోను స్థాపించారు. ఈ స్టూడియోలో అత్యాధునిక పరికరాలు మరియు సౌకర్యాలు ఉన్నాయి, భారతదేశం, ఇతర దేశాలకు చెందిన ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు, రచయితలు, దర్శకులు మరియు నటులను నియమించుకున్నారు. వినోదాన్ని సామాజిక ఔచిత్యంతో మిళితం చేసేలా నాణ్యమైన చిత్రాలను నిర్మించడం ఈ స్టూడియో లక్ష్యం. కర్మ (1933), జవానీ కీ హవా (1935), అఛూత్ కన్యా (1936), జీవన్ నయా (1936), సావిత్రి (1937), ఇజ్జత్ (1937), కంగన్ (1939), నిర్మల (1938), వచన్ (1938), దుర్గా (1939), అంజాన్ (1941) హమారీ బాత్ (1943) వంటి ఈ స్టూడియో నిర్మించిన అనేక చిత్రాలలో దేవిక రాణి ప్రధాన పాత్ర పోషించారు.
‘జీవన్ నయా’ (1936) సినిమాలో, ఆమె – ఆధునిక సంబంధాల సంక్లిష్టతలను ప్రదర్శించే లత అనే మహిళ పాత్రను పోషించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమె ఆ సినిమా హీరో నజ్మ్-ఉల్-హుస్సియన్ పట్ల ఆకర్షితులై అతనితో వెళ్ళిపోగా, ఆమె భర్త, చిత్ర నిర్మాత హిమాంశు రాయ్ కలత చెందారు. దేవికను తన సోదరిగా భావించే శశధర్ ముఖర్జీ, ఆమెను తిరిగి వచ్చేందుకు ఒప్పించారు. నజ్మ్ ఉల్ స్థానంలో అశోక్ కుమార్ వచ్చారు, రాత్రికి రాత్రే ఆయన స్టార్ అయ్యారు. నజ్మ్ ఉల్‌కి తర్వాత సినిమాల్లో మళ్లీ ఎక్కడా అవకాశం దొరకలేదు, చరిత్రలో కనుమరుగైపోయాడు.
ఆమె నటించిన అత్యంత ముఖ్యమైన చిత్రాలలో ‘అఛూత్ కన్య’ (1936) ఒకటి. ఇందులో ఆమె సామాజిక నిబంధనలను, కులం అడ్డంకులను సవాలు చేసే కస్తూరి అనే అంటరాని యువతి పాత్రను పోషించారు. ఆమె విలక్షణమైన వంపు తిరిగిన కనుబొమ్మలు, రాజస్థానీ-శైలి పూసలతో, మోకాళ్ల వరకు ఉండే దుస్తులు ఈ హిందీ సినిమాలో గ్రామీణ సుందరి యొక్క ఆదర్శాన్ని సూచిస్తాయి.
‘సావిత్రి’ (1937) సినిమాలో, ఆమె పౌరాణిక పాత్రలో భక్తిని, శక్తిని ప్రదర్శించారు. ‘ఇజ్జత్’ (1937) సినిమాలో మరాఠాలు, భిల్లుల సంఘర్షణ నేపథ్యంలో జరిగిన విషాద ప్రేమకథలో చిక్కుకున్న స్త్రీగా నటించారు. ‘నిర్మల’ (1938) సినిమాలో ఆమె పితృస్వామ్య సమాజంలో తన పోరాటం యొక్క సూక్ష్మ నైపుణ్యాలకు జీవం పోసే ఆధునిక మహిళగా నాయిక పాత్రలో కనిపించారు.
తెరపై అశోక్ కుమార్, దేవికా రాణిల జంట భారతదేశంలో ప్రజాదరణ పొందింది. దళిత అమ్మాయి నుండి ఆధునిక మహిళ వరకు అనేక రకాల పాత్రలను చక్కదనంతో, విశ్వాసంతో పోషించారు. కొన్ని చిత్రాలలో తన పాటలను తానే పాడుకున్నారు. అందం, గాంభీర్యం, శైలి, ఆకర్షణలకు ప్రశంసలు అందుకున్నారు.
1940లో క్షయవ్యాధి కారణంగా హిమాంశు రాయ్ మరణించిన తరువాత, దేవికా రాణి స్టూడియోను తన ఆధీనంలోకి తీసుకుని, తన దివంగత భర్త సహచరులైన శశధర్ ముఖర్జీ, అశోక్ కుమార్‌లతో కలిసి మరికొన్ని చిత్రాలను నిర్మించారు.
దిలీప్ కుమార్, లీలా చిట్నిస్, మధుబాల, రాజ్ కపూర్, అశోక్ కుమార్ వంటి కొత్త నటులను పరిచయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. యూసుఫ్ ఖాన్‌కు ‘దిలీప్ కుమార్’ అనే వెండితెర పేరు పెట్టింది దేవికా రాణి గారే.
అయితే, ఆవిడ స్టూడియో నిర్వహణలో ఆర్థిక నష్టాలు, చట్టపరమైన వివాదాలు, కార్మికుల అశాంతి, సెన్సార్‌షిప్ సమస్యలు, వ్యక్తిగత పోటీలు, వృత్తిపరమైన పోటీ వంటి అనేక సవాళ్లను, ఇతర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భర్తను కోల్పోవడం వల్ల కలిగే బాధతో పాటు – తన సహనటులతో సంబంధాల పుకార్లను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.
1944లో, ఆమె ప్రఖ్యాత రష్యన్ చిత్రకారుడు నికోలాయ్ రోరిచ్ కుమారుడు స్వెటోస్లావ్ రోరిచ్ అనే కళాకారుడిని కలిసారు. ఒక సంవత్సరం లోపు, ఆమె ‘బాంబే టాకీస్’లో తన వాటాలను వదులుకుని, నటనా వృత్తికి వీడ్కోలు పలికారు. 1945లో వారు వివాహం చేసుకున్నారు. రోరిచ్‌తో ఆమె వివాహం -చలనచిత్ర పరిశ్రమ వైభవం, ఆకర్షణలకు దూరంగా ప్రశాంతమైన, సంతృప్తికరమైన దశకు నాంది పలికింది.
భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను దేవిక రాణికి అనేక అవార్డులు లభించాయి. 1958లో పద్మశ్రీ, 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (తొలి గ్రహీత), 1990లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డును అందుకున్నారు. ఆమె 85 సంవత్సరాల వయసులో 1994 మార్చి 9 నాడు మరణించారు.
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా దేవికా రాణి గుర్తుండిపోతారు, తన అడుగుజాడలను అనుసరించిన అనేక మంది నటీమణులకు, మహిళా నిర్మాతలకు మార్గం సుగమం చేశారు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.