Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 283

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

స్వరకర్త సి.ఆర్. సుబ్బరామన్:

సి. ఎస్. రామ్‍గా ప్రసిద్ధిగాంచిన స్వరకర్త సి.ఆర్. సుబ్బరామన్ 18 మే 1924 నాడు తమిళనాడు లోని తిరునెల్వేలి జిల్లాలోని చింతామణి గ్రామంలో జన్మించారు. ఆయన పూర్వీకులు నేటి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందినవారు, ఈ కారణంగా, ఆయన కుటుంబసభ్యులు తెలుగు బాగా మాట్లాడేవారు.

వారి 28 సంవత్సరాల స్వల్ప జీవితకాలంలో,  10 ఏళ్ళ సినీ ప్రస్థానంలో – దేవదాసు, రత్నమాల, చెంచులక్ష్మి, బాలరాజు, లైలామజ్నూ, ప్రేమ, ధర్మ దేవత వంటి సినిమాల ద్వారా ఆయనకి ఎనలేని కీర్తిప్రతిష్ఠలు లభించాయి.

సుబ్బరామన్ సంగీత గురువుల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. మొదట్లో ఆయన కుంభకోణంలోని నాదస్వరం వాయించేవారి నుండి సంగీతం నేర్చుకున్నారు. ఆయన, ఉదయం పూట సాధన చేసేది సాయంత్రం పూట వినిపించే అద్భుతమైన సాధకుడు. 14 సంవత్సరాల వయసులోనే ఆయనకు హార్మోనియంలో మంచి ప్రావీణ్యం ఉంది.

16 సంవత్సరాల వయసులో జి. రామనాథన్ సోదరుడు సుందర భాగవతార్ సిఫార్సు మేరకు సుబ్బరామన్ HMV సంస్థలో హార్మోనిస్ట్‌గా చేరారు. HMV ఒక గ్రామోఫోన్ ఉత్పత్తి మరియు పంపిణీ సంస్థ, దీని కింద ఆర్. చిన్నయ్య నేతృత్వంలో శాశ్వత ఆర్కెస్ట్రా ఉండేది. ఎస్. రాజేశ్వరరావు కూడా HMVలోనే ఉన్నారు. ఆ సమయంలో, రామసామి అయ్యర్, సుబ్బరామన్ మైలాపూర్‌లో నివసించేవారు. తన తండ్రితో కలిసి, తిరువల్లిక్కేణిలోని పియానో గురువు వద్ద  పియానో నేర్చుకోవడానికి సుబ్బరామన్ నడిచి వెళ్ళేవారు. సంగీతంలో కనబరిచిన ప్రతిభ, సంగీతం పట్ల మక్కువ కారణంగా, ఆయన చాలా త్వరగా HMVలో అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు.

పగటి పూట పని తర్వాత రాత్రులలో సుబ్బరామన్ కీర్తనలు పాడేవారు. HMVలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిన ఒక యువ వయోలిన్ విద్వాంసుడు అతనితో పాటు వచ్చేవాడు. ఆ ప్రతిభను గ్రహించిన సుబ్బరామన్, ఆ యువకుడిని HMVలో శాశ్వతంగా నియమించుకోవాలని సిఫారసు చేయడమే కాకుండా, అతనిని తన సహాయకుడిగా కూడా నియమించుకున్నాడు. ఆ ప్రతిభావంతుడైన యువ వయోలిన్ విద్వాంసుడు మరెవరో కాదు టి.కె. రామమూర్తి.

తమిళనాడు టాకీస్ బ్యానర్ కింద చెంచు లక్ష్మి (1943) అనే తెలుగు చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశం HMV కి వచ్చినప్పుడు, ఆర్. చిన్నయ్యకు సంగీత దర్శకుడిగా అవకాశం లభించింది. ఒకటి రెండు పాటలు పూర్తి చేసిన తర్వాత ఆర్. చిన్నయ్య అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికాగా, ఆ పనిని ఎస్. రాజేశ్వరరావు చేపట్టారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాజేశ్వరరావు పాటలను పూర్తి చేయలేకపోయారు. దాంతో ఆ అవకాశం సుబ్బరామన్ చేతికి వచ్చింది. సముద్రాల రాఘవాచార్య సహాయంతో సుబ్బరామన్ మిగిలిన పాటలను పూర్తి చేశారు. కర్ణాటక సంగీతంతో పాటు లాటిన్ అమెరికన్ సంగీతాన్ని పరిచయం చేయడం ద్వారా ఆయన ఆ రోజుల్లో సంగీత రంగంలో కొన్ని మార్పులను ధైర్యంగా ప్రవేశపెట్టి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. చెంచులక్ష్మి ఘన విజయం సాధించి, సుబ్బరామన్‌ను సినిమా సంగీత దర్శకుడిగా నిలబెట్టింది.

బిఎ సుబ్బారావు, భరణి రామకృష్ణ, వేదాంతం రాఘవయ్య తదితర ప్రముఖులతో సుబ్బరామన్

అదే సమయంలో ఆర్. చిన్నయ్య మరణించారు, సుబ్బరామన్ HMV ఆర్కెస్ట్రాకు నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు. వారి బాణీలకు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. కోల్‌కతాలో ఉన్న HMV ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందాయి, చక్కని సంగీత కూర్పు ఫలితంగా వచ్చిన అద్భుతమైన అమ్మకాలకు అభినందిస్తూ ఒక ఆంగ్లేయుడు సుబ్బరామన్‌కు లేఖ రాశాడు. కానీ జీతం అస్థిరంగా ఉండటం వల్ల, శాశ్వత వేతనం కోసం సుబ్బరామన్ HMVని విడిచిపెట్టాల్సి వచ్చింది.

చెంచులక్ష్మి సినిమా సంగీతాన్ని విని ఆనందించిన ఎం.కె. త్యాగరాజ భాగవతార్ (ఎం.కె.టి) తన తదుపరి చిత్రం ‘ఉథాయనన్’ (1945) కు సంగీతం సమకూర్చమని సుబ్బరామన్‌ను ఆహ్వానించారు. ఎం.కె.టి సినిమాలకు సంగీతం అందించడం ఆ కాలపు సంగీత దర్శకుల కల. ఉత్తమ బాణీలను రూపొందించడానికి సుబ్బరామన్ రాత్రింబవళ్ళు  కృషి చేశారు. ఎం.కె.టి. రికార్డింగ్ థియేటర్‌కు రాగా, పాటలపై ఆయనకు అవగాహన కలిగిద్దామని పాడబోతుండగా, మాముండి ఆచారి రికార్డింగ్‌కు అంతరాయం కలిగించాడు. దాంతో ఎం.కె.టి. వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం, లక్ష్మీకాంతన్ హత్య కేసులో ఎం.కె.టి. అరెస్టు అయ్యారు. ‘ఉథాయనన్’ సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది. అయితే ఎం.కె.టి.కి జైలు శిక్ష విధించగా, నిర్మాత – జి.ఎన్. బాలసుబ్రమణ్యంతో సినిమా నిర్మించడం ప్రారంభించాడు. సుబ్బరామన్‌ని దుశ్శకునంగా భావించి ఆయన స్థానంలో సి.ఎస్. జయరామన్‌ని ఎంచుకున్నారు.

లైలా మజ్ను పాటల కంపోజింగ్ సమయంలో భానుమతి, ఆమె భర్త రామకృష్ణ, స్వరకర్త సిఆర్ సుబ్బరామన్

1947లో తదుపరి సినిమా అవకాశం వచ్చింది, పి. భానుమతికి చెందిన భరణి పిక్చర్స్‌ వారి ‘రత్నమాల’ సినిమా కోసం ఘంటసాలతో కలిసి పనిచేయడం ప్రారంభించారు సుబ్బరామన్. అప్పటి నుంచి భరణి సంస్థ నిర్మించిన అన్ని చిత్రాలకు, తన మరణం వరకు – లైలా మజ్ను నుంచి ప్రేమ, చండీరాణి వరకు – సుబ్బరామన్ గారే సంగీతం అందించారు. 1953లో విడుదలైన తన చివరి మూడు హిట్స్ అయిన మరుమగల్, దేవదాస్, చండీరాణి చిత్రాలకు అతను అన్ని పాటలను ముందుగానే కంపోజ్ చేయగలిగారు, కానీ నేపథ్య సంగీతాన్ని కూర్చే సమయంలో మరణించారు, దాంతో వారి సహాయకులు ఎం.ఎస్. విశ్వనాథన్, టి.కె. రామమూర్తి ఆ పని పూర్తి చేయారు.

1948లో ఘంటసాల బలరామయ్యకు చెందిన ప్రతిభా పిక్చర్స్ కు స్వరకల్పన ప్రారంభించి – బాలరాజు, స్వప్న సుందరి, శ్రీ లక్షమ్మ కథ సినిమాలకు సంగీతం అందించారు సుబ్బరామన్.

1948లో కూడా, సుబ్బరామన్ ఎం. కె. త్యాగరాజ భాగవతార్ నటించిన ‘రాజ ముక్తి’కి సంగీతం అందించారు. సుబ్బరామన్ – ఎన్. ఎస్. కృష్ణన్‌తో కలిసి పైతియక్కరన్ (1947), నల్లతంబి (1949), మనమగల్ (1951) చిత్రాల్లో పనిచేశారు. జూపిటర్ పిక్చర్స్ మద్రాస్ కు తరలి వెళ్ళినప్పుడు, ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడుతో సహా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రతిభావంతుడైన ఎం.ఎస్. విశ్వనాథన్‌ను సుబ్బరామన్‌కు సహాయకుడిగా పరిచయం చేసి సిఫార్సు చేసింది సుబ్బయ్య నాయుడు, సుబ్బరామన్ కూడా ఆయనను అంగీకరించారు.

సుబ్బరామన్ – ఘంటసాల, ఎ. ఎం. రాజా, పి. సుశీల, తిరుచ్చి లోగనాథన్, వి.ఎన్. సుందరం, టిఎ మోతి, ఎం.ఎల్. వసంతకుమారి, పిఎ పెరియనాయకి, పి. లీల, టివి రత్నం, ఆర్. బాలసరస్వతి దేవి, ఎపి కోమల, కె. జమునా రాణి, కె. రాణి, కెవి జానకి వంటి గాయనీగాయకులతో కలిసి పనిచేశారు.

గాయక నటులైన ఎం.కె.త్యాగరాజ భాగవతార్, పి.యు.చిన్నప్ప, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, యు.ఆర్. జీవరథినం, టి.ఆర్.మహాలింగం, టి.ఆర్.రాజకుమారి, కె.ఆర్.రామస్వామి, చిత్తూరు వి.నాగయ్య, పి.భానుమతి, ఎన్. ఎస్. కృష్ణన్‌, టి.ఎ.   మధురం, ఎస్. వరలక్ష్మి వంటి వారు ఆయన సంగీతం దర్శకత్వంలో పాటలు పాడారు.

ఆయన గీత రచయిత సముద్రాల రాఘవాచార్య, దర్శకుడు/కూచిపూడి నృత్యకారుడు వేదాంతం రాఘవయ్య మరియు నిర్మాత డిఎల్ నారాయణ లతో భాగస్వామిగా చేరి 1950లో వినోద పిక్చర్స్‌ను ప్రారంభించారు.

వేదాంతం రాఘవయ్య, నిర్మాత డిఎల్ నారాయణ లతో సుబ్బరామన్

వారు స్త్రీ సాహసం, శాంతి, దేవదాసు  సినిమాలను నిర్మించారు. సుబ్బరామన్ అకస్మాత్తుగా మరణించినప్పటికే దేవదాసు సినిమా కోసం 6, 7 పాటలు స్వరపరిచారు. అప్పుడు, ఆయన శిష్యుడు ఎంఎస్ విశ్వనాథన్ – ఆ బాణీలలో పాటలను రికార్డు చేశారు. ఒక పాట (జగమే మాయ) ఎం.ఎస్. విశ్వనాథన్ కంపోజ్ చేశారు.

పైతియాకరన్ (1947) చిత్రం ద్వారా ఘంటసాలను తమిళ చిత్రానికి పరిచయం చేయడంలో సుబ్బరామన్ కీలక పాత్ర పోషించారు. రాజా ముక్తి (1948) చిత్రంతో ఎం.ఎల్. వసంతకుమారిని కూడా పరిచయం చేశారు. సుబ్బరామన్ పి. లీలకి పాఠాలు చెప్పి, తన సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం ఇచ్చారు, దాంతో ఆమెకు చక్కని పేరు వచ్చించి. ఆయన ఉచ్చస్థితిలో ఉండగా, సంగీత కూర్పులో ఒక ట్రెండ్ సెట్టర్.

సిఆర్ సుబ్బురామన్ మరణించిన తర్వాత ఘంటసాల ఆయన ఫోటోకు పూజ చేస్తున్న దృశ్యం. పి లీల ప్రార్థనా గీతం పాడారు.

సుబ్బరామన్ చాలా చిన్న వయసులోనే, 27 జూన్ 1952 నాడు అనుమానాస్పదంగా మరణించారు. వెంటనే ఆయన మృతదేహాన్ని వారి స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసేసి, సుబ్బరామన్ ఆకస్మికంగా మరణించారని – మర్నాడు ఉదయం ప్రకటించారు. ఏది ఏమైనా ఓ గొప్ప స్వరకర్త, మేధావి మనకి ఇకలేరని పరిశ్రమలోని ఓ వ్యక్తి వాపోయారు.

Exit mobile version