సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
వైజయంతిమాల – వదంతులు – వాస్తవాలు:
ప్రముఖ సినీనటి వైజయంతిమాలపై ఎన్నో వదంతులున్నాయి. సహనటులతో సంబంధాలు, ప్రేమ వ్యవహారాలపై పుకార్లకి అంతులేదు. వాటిలోని నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
~
వైజయంతిమాలకు దిలీప్ కుమార్‌తో ప్రేమ వ్యవహారం ఉందని, ఆమె రాజ్ కపూర్‌తో కలిసి నటించిన సంగం (1964) సినిమాకి సంతకం చేసిన తర్వాత ఆ ప్రేమ వ్యవహారం అకస్మాత్తుగా ముగిసిపోయిందని పుకార్లు వచ్చాయి. దిలీప్, వైజయంతిమాల కలిసి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించినప్పటికీ, తరువాతి సంవత్సరాల్లో వారి సంబంధం బెడిసికొట్టడం బాధాకరం.
ఆమె ప్రధానంగా బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టడం వల్ల తమిళనాడులో సినీ అవకాశాలను కోల్పోయారు. దాంతో తమిళ ప్రేక్షకులు ఆమె గురించి పూర్తిగా మర్చిపోయారు. ఆమె వివాహం తర్వాత తమిళ సినీరంగం నుండి వైజయంతికి ఎటువంటి ఆఫర్లు రాలేదు. డాక్టర్ బాలితో వైజయంతి వివాహానికి ఒక సంవత్సరం ముందు 1967లో వివాహం చేసుకున్న ఆమె సమకాలీనురాలైన సరోజా దేవి హర్షతో వివాహం తర్వాత కూడా మంచి పాత్రలను పొందుతునే ఉన్నారు.
‘సంగం’ సినిమా షూటింగ్ సమయంలో కపూర్ ఆమెకు మత్తుమందు ఇచ్చి, ఆమెను లోబర్చుకున్నారని పుకార్లు వినబడతాయి. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న ఆమె అమ్మమ్మ కోపగించుకున్నారనీ, తన మనవరాలు పెళ్ళి కాకుండానే గర్భం దాల్చిందని తెలిసి మరింత బాధపడ్డారని పుకార్లు వ్యాపించాయి. ఇందులో వాస్తవం ఎంతో, కల్పన ఎంతో ఎవరికీ తెలియదు. కానీ ఆ వ్యవహారం బయటపడినప్పుడు, వైజయంతిలోని మహిళ జీవితాన్ని వదులుకోవడానికి నిరాకరించి, సొంత నిర్ణయం తీసుకుంది. రాజ్ కపూర్‌తో తన అనుబంధం గురించి తెలిసిన రాజ్ కపూర్ కుటుంబ వైద్యుడు డాక్టర్ బాలిని ఆమె వివాహం చేసుకుంది.
రాజ్ కపూర్, వైజయంతి కలిసి నటించిన మరో చిత్రం ‘నజరానా’. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ ‘కళ్యాణ పరిసు’ (1959) కి రీమేక్.
డాక్టర్ బాలికి అప్పటికే వివాహితుడు. ఆయన మొదటి భార్య రూబీకి వైజయంతిమాల భారీ భరణం చెల్లించారని, మొదటి భార్యకి ముగ్గురు కుమారులు ఉన్నారని చెప్పుకునేవారు. డాక్టర్ బాలి పట్ల ఆమె ఎలా, ఎందుకు ఆకర్షితురాలయ్యారనేది ఇప్పటికీ ఒక రహస్యం. ప్రేమ గుడ్డిదనేది స్పష్టం!
డాక్టర్ బాలితో వైజయంతి వివాహం కేవలం 18 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. ఆయన మరణం తరువాత, ఆమె ఆయన కుమారులతో తీవ్రమైన చట్టపరమైన వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడులో (ఊటీలో) డాక్టర్ బాలి పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి, అలాగే బొంబాయిలో ఒక రాజభవనం లాంటి ఫ్లాట్ కూడా ఉంది. తమ తల్లి అడిగిన భరణాన్ని తండ్రి భరించలేడని పూర్తిగా తెలిసిన తర్వాత కూడా డాక్టర్ బాలి కుమారులు న్యాయ పోరాటం చేయడం వింతగా ఉంది. వైజయంతిమాల భావోద్వేగపరంగా తెలివైనవారు. అందుకే ఆమె అన్ని చట్టపరమైన అడ్డంకులను అధిగమించగలిగారు.
వైజయంతి తన హృదయాన్ని, ఆత్మను ‘ఆమ్రపాలి’ (1966) చిత్రంలో పెట్టారు. ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం బౌద్ధమతం వైపు మళ్లిన వేశ్య గురించి ఈ చిత్రం వచ్చింది. ఆ చిత్రంలో ఆమె నృత్యాల గురించి, ఆ చిత్రంలో ఆమె ధరించిన దుస్తుల గురించి కూడా చర్చలు జరిగాయి. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.
‘ఆమ్రపాలి’ సినిమాలో తన నటనకు వైజయంతి జాతీయ అవార్డు ఆశించారు కానీ ‘రాత్ ఔర్ దిన్’ సినిమా గాను నర్గీస్‌కు ఆ అవార్డు దక్కింది. గాంధీలతో నర్గీస్‍కు ఉన్న సాన్నిహిత్యం ఆ అవార్డును ఆమెకు అనుకూలంగా మార్చిందంటారు. నర్గీస్ అమ్మమ్మ దిలీపా బాయి జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూకు బంధువు.
తరువాత సరోజ్ ఖాన్ ‘ప్యార్ హి ప్యార్’ కోసం కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు, వైజయంతిమాల “నా శరీరాన్ని వేరే విధంగా వంచితే నాకు అవార్డు వస్తుందా?” అని కంగారుపడేవారట. బాలీవుడ్ పట్ల ఆమెకున్న నిరాశ ఆమె అకాల నిష్క్రమణకు దారితీసింది. కథానాయికగా తనకు అవకాశాలు తగ్గుతున్నాయని ఆమె గ్రహించారు (సినీరంగాన్ని వీడినప్పుడు ఆమెకు కేవలం 34 సంవత్సరాలు!).
నెమ్మదిగా ఆఫర్లు తగ్గిపోవడంతో, వైజయంతి తన కెరీర్ ముగింపు దశకు చేరుకుందని గ్రహించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే – మాలా సిన్హా, షర్మిలా ఠాగూర్ ఇద్దరూ వైజయంతి వివాహం జరిగిన సంవత్సరం (1968) లోనే వివాహం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ వివాహం తర్వాత చాలా సంవత్సరాల పాటు బాలీవుడ్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు కొనసాగించారు. మరి వైజయంతి ఇంత త్వరగా ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? తన చుట్టూ జరుగుతున్న ప్రతిదానితో ఆమె నిరాశ చెందారా? బహుశా ఆమె అనుభవాలు బాలీవుడ్‌లో చురుకుగా ఉండటం పులిని దాని తోకతో పట్టుకోవాలని చూడడం లాంటిదని ఆమెను నమ్మించి ఉంటాయి.
‘చోటీ సీ ములాకాత్’ లోని నృత్య సన్నివేశాలను నేర్చుకునే సందర్భంలో ఉత్తమ్ కుమార్ నిరుత్సాహపడినప్పుడు, వైజయంతిమాలలోని నృత్యకారిణి అతన్ని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఉత్తమ్ కుమార్ యొక్క హాస్యాస్పదమైన నృత్య భంగిమలు సినిమాలో వైజయంతిమాల యొక్క చురుకైన నృత్య కదలికలకు సరిపోలలేదు.
‘ప్రిన్స్’ సినిమాలో షమ్మీ కపూర్‌తో కలిసి నటించినప్పుడు ఆమె సోమరితనంతో ఉన్నట్లు అనిపించింది, కానీ షమ్మీ తన గురించి దురుసుగా వ్యాఖ్యలు చేసినప్పుడు, అతన్ని పట్టించుకోకపోవడంలో అరుదైన ధైర్యాన్ని ప్రదర్శించారు.
తన సహ నటుల వేధింపులకు గురైనప్పుడు కూడా ఆమె తన దృఢత్వాన్ని పదే పదే ప్రదర్శించారు. ఆమె బిఆర్ చోప్రా, యష్ చోప్రా లకు గొప్ప స్నేహితురాలిగా కొనసాగారు. 1988లో రాజ్ కపూర్ మరణించే వరకు, ఆమె రాజ్ కపూర్‍కు దూరంగా ఉన్నారు, భర్త డాక్టర్ బాలీని కూడా రాజ్ కపూర్‌కి దూరంగా ఉండమని కోరారు.
శత్రుఘ్న సిన్హా తనపై చేసిన వ్యాఖ్యలకు ఆమె తిట్టిపోస్తూ, “అతనెవరు?” అని వ్యాఖ్యానించారు, బిగ్గరగా మాట్లాడే బిహారీ బాబును ‘ఖామోష్’గానే ఉంచారు. తరువాత ఆమె రాజకీయ నాయకురాలిగా మారారు; ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో సైద్ధాంతిక విభేదాలను చూపుతూ రాజకీయాలను విడిచిపెట్టారు.
నాట్యంపై వైజయంతిమాల ఆసక్తిని, మీద పడుతున్న వయసు తగ్గించలేకపోయింది. ఆమె అప్పుడప్పుడు వేదికపై కనిపిస్తారు, తన చురుకైన నృత్య కదలికలతో తన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు. ఒక నటి, వయసు పెరిగినా కూడా గ్లామరస్‌గా కనిపించడంలో తప్పు లేదని ఆమె నమ్ముతారు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.