Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 281

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

గాయక నటి నూర్జహాన్:

బ్రిటిష్ ఇండియా, పాకిస్తాన్‌లలో ఒక ప్రముఖ గాయని, నటి అయిన నూర్జహాన్ లేదా నూర్జెహాన్ (సెప్టెంబర్ 21, 1926 – డిసెంబర్ 23, 2000) అసలు పేరు అల్లా వాసాయి. ఆమె కెరీర్ ఏడు దశాబ్దాలకు పైగా కొనసాగింది. ఆమె దక్షిణాసియాలో తన కాలంలోని గొప్ప, అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. ఆమెకు మాలికా-ఎ-తరన్నమ్ (క్వీన ఆఫ్ మెలొడీ) అనే బిరుదు లభించింది.

పంజాబీ సంగీతకారుల కుటుంబంలో జన్మించిన వాసాయిని ఆమె తల్లిదండ్రులు – తమ అడుగుజాడల్లో నడిచి సంగీత రంగం ఎంచుకుని గాయనిగా మారాలని ఒత్తిడి చేశారు, కానీ ఆమె సినిమాల్లో నటించడంపై ఎక్కువ ఆసక్తి చూపారు. తన నటనతో తొలి పాకిస్తానీ చిత్రాలకు హంగు చేకూర్చారు. భారతదేశం, పాకిస్తాన్‌లోని ఉర్దూ, హిందీ, పంజాబీ, సింధీ భాషలతో సహా వివిధ భాషలలో 10,000 పాటలు పాడి అద్భుతమైన రికార్డును సృష్టించారామె. అహ్మద్ రష్దీతో పాటు, ఆమె పాకిస్తాన్ సినిమా చరిత్రలో అత్యధిక సినిమా పాటలు పాడిన రికార్డును కలిగి ఉన్నారు. ఆమె పాకిస్తానీ తొలి సినీ దర్శకురాలిగా కూడా పరిగణించబడ్డారు.

1957లో, నూర్జెహాన్ నటనకు, గాన ప్రతిభకు గాను భారత రాష్ట్రపతి అవార్డు పొందారు. ఆమె ఐదు లేదా ఆరు సంవత్సరాల వయస్సులో పాడటం ప్రారంభించారు. సాంప్రదాయ జానపద రంగం, ప్రసిద్ధ నాటక రంగం వంటి వివిధ శైలులపై తీవ్రమైన ఆసక్తిని కనబరిచారు. ఆమె లోని పాడే సామర్థ్యాన్ని గ్రహించిన ఆమె తల్లి, ఆమెను కసూర్‌కు చెందిన ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ వద్ద శాస్త్రీయ గానంలో తొలి శిక్షణకు పంపారు. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతపు పాటియాలా ఘరానా సంప్రదాయాలు, ఠుమ్రీ, ధ్రుపద్, ఖ్యాల్ వంటి శాస్త్రీయ సంగీత రూపాలను ఆయన ఆమెకు బోధించారు. తొమ్మిదేళ్ల వయసులో, వాసాయి పంజాబీ సంగీతకారుడు గులాం అహ్మద్ చిష్తి దృష్టిని ఆకర్షించారు, తరువాత ఆయన ఆమెను లాహోర్‌లో రంగస్థలానికి పరిచయం చేశారు. ఆమె నటన లేదా నేపథ్య గానంలో ప్రవేశించడంలో ఎక్కువ ఆసక్తి చూపినప్పటికీ, ఆమె పాడటం కోసం ఆయన కొన్ని గజల్స్, నాజ్, ఇంకా జానపద పాటలను స్వరపరిచారు. వృత్తి శిక్షణ పూర్తయిన తర్వాత, వాసాయి లాహోర్‌లో తన సోదరీమణులతో కలిసి గాయకవృత్తిని కొనసాగించారు. సాధారణంగా సినిమా థియేటర్లలో సినిమాల ప్రదర్శనలకు ముందు ప్రత్యక్ష గానం, నృత్య ప్రదర్శనలలో పాల్గొనేవారు.

వాసాయి, ఆమె సోదరీమణుల సినీ కెరీర్‌లను అభివృద్ధి చేయాలనే ఆశతో కుటుంబం కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) కు తరలివెళ్లింది. కలకత్తాలో ఉన్న సమయంలో, ప్రఖ్యాత గాయని ముఖ్తార్ బేగం – వాసాయి, ఆమె ఇద్దరు అక్కలను సినిమా కంపెనీలలో చేరమని ప్రోత్సహించింది. వారిని వివిధ నిర్మాతలకు సిఫార్సు చేసింది. ఆమె తన భర్త అఘా హషర్ కాశ్మీరీకి కూడా వారిని సిఫార్సు చేసింది, అతను ఒక మైదాన్ థియేటర్ (పెద్ద ప్రేక్షకులను ఉంచడానికి ఒక టెంట్ థియేటర్) కలిగి ఉన్నాడు. ఇక్కడే వాసాయికి బేబీ నూర్జెహాన్ అనే రంగస్థల పేరు వచ్చింది. ఆమె అక్కలకు సేథ్ సుఖ్ కర్నాని కంపెనీలలో ఒకటైన ఇందిరా మూవీటోన్‌లో ఉద్యోగాలు లభించాయి, అవి పంజాబ్ మెయిల్‌గా పిలువబడ్డాయి. తరువాత వాసాయి ముఖ్తార్ బేగం నటనా విధానాన్ని, చీరలు కట్టే పద్ధతిని స్వీకరించారు.

1935లో, కె.డి. మెహ్రా దర్శకత్వం వహించిన ‘పిండ్ ది కుడీ’ చిత్రంలో నూర్జెహాన్ తన సోదరీమణులతో కలిసి నటించారు. తరువాత ఆమె అదే కంపెనీ ద్వారా ‘మిస్సర్ కా సితార’ (1936) అనే చిత్రంలో నటించి, సంగీత దర్శకుడు దామోదర్ శర్మ ఆధ్వర్యంలో పాట పాడారు. బేబీ నూర్జెహాన్ ‘హీర్-సయ్యాల్’ (1937) చిత్రంలో హీర్ అనే బాల పాత్రను కూడా పోషించారు. కలకత్తాలో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత, నూర్జెహాన్ 1938లో లాహోర్‌కు తిరిగి వచ్చారు. 1939లో, గులాం హైదర్ ఆమె కోసం పాటలు స్వరపరిచారు, ఇది ఆమె తొలి ప్రజాదరణకు దారితీసింది. ఆ తర్వాత ఆమె దల్సుఖ్ ఎం. పంచోలి చిత్రం ‘గుల్ బకవ్లి’ కోసం తన మొదటి పాట ‘షాలా జవానియాఁ మానే’ రికార్డ్ చేశారు.

ఖాన్‍దాన్ సినిమాకి ముందు నూర్జెహాన్ బాలనటిగా నటించారు. 1942లో ఆమె ప్రాణ్ సరసన ప్రధాన పాత్ర పోషించారు. ఖాన్‌దాన్ విజయంతో ఆమె బొంబాయి (ఇప్పుడు ముంబై)కి మారారు, అక్కడ ఆమె ‘దుహాయ్’ (1943) అనే సినిమాలో శాంతా ఆప్టేతో కలిసి శ్రావ్యమైన గీతాలు పాడారు. ఈ చిత్రంలోనే నూర్జెహాన్ రెండవసారి హుస్న్ బానో అనే మరో నటికి తన గాత్రాన్ని అందించారు. 1945లో నూర్జెహాన్, లతా మంగేష్కర్, ఆశా భోస్లేతో కలిసి ‘బారి మా’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.

1945లో, ఆమె జోహ్రాబాయి అంబాలేవాలి, అమీర్బాయి కర్ణాటకిలతో కలిసి ‘ఆహెన్ నా భరీన్ శికవే నా కియే’ అనే ఖవ్వాలీని పాడి ఒక ఘనతని సాధించారు. ఇది దక్షిణాసియా చిత్రాలలో మహిళా గాత్రాలలో రికార్డ్ చేయబడిన మొట్టమొదటి ఖవ్వాలీ.

భారతదేశంలో నూర్జెహాన్ చివరి చిత్రం ‘మీర్జా సాహిబాన్’ (1947). ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కపూర్ సోదరుడు త్రిలోక్ కపూర్ నటించారు. నూర్జెహాన్ భారతీయ చిత్రాలలో 127 పాటలు పాడారు, 1932 నుండి 1947 వరకు ఆమె చేసిన టాకీ సినిమాల సంఖ్య 69. మూకీ చిత్రాల సంఖ్య 12. ఆమె యాభై ఐదు చిత్రాలు బొంబాయిలో, ఎనిమిది కలకత్తాలో, ఐదు లాహోర్‌లో మరియు ఒకటి బర్మాలోని రంగూన్ (ఇప్పుడు యాంగోన్)లో నిర్మించబడ్డాయి.

1947లో పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత, నూర్జెహాన్ తన భర్త షౌకత్ హుస్సేన్ రిజ్వితో కలిసి పాకిస్తాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆమె బొంబాయిని వదిలి తన కుటుంబంతో కలిసి కరాచీలో స్థిరపడ్డారు. పాకిస్తాన్‌లో స్థిరపడిన మూడు సంవత్సరాల తర్వాత, నూర్జెహాన్ పాకిస్తాన్‌లో తన మొదటి చిత్రం ‘చాన్వే’ (1951)లో సంతోష్ కుమార్‌తో కలిసి నటించారు, ఇది  కథానాయికగా ఆమె మొదటి పంజాబీ చిత్రం కూడా. షౌకత్, నూర్జెహాన్ కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, నూర్జెహాన్ పాకిస్తాన్‌కు తొలి మహిళా దర్శకురాలిగా నిలిచారు. పాకిస్తాన్‌లో నూర్ జెహాన్ రెండవ చిత్రం ‘దుపట్టా’ (1952), ‘చాన్వే’ (1951) కంటే పెద్ద విజయాన్ని సాధించింది. నటి/గాయనిగా ఆమె చివరి చిత్రం ‘మీర్జా గాలిబ్’ (1961). ఇది ఆమె ఐకానిక్ స్థాయిని బలోపేతం చేయడానికి దోహదపడింది. ఆమె తనకంటూ కొందరు ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ గారి ‘ముఝే  పెహ్లి సి మొహబ్బత్ మేరే మెహబూబ్ నా మాంగ్‌’ పాటను ఆమె పాడటం – కవిత్వాన్ని పాటగా పఠించడం అనే తర్రానమ్ పద్ధతికి ఒక ప్రత్యేక ఉదాహరణ. నూర్జెహాన్ చివరిసారిగా 1963లో ‘బాజీ’ చిత్రంలో నటించారు, అయితే ప్రధాన పాత్రలో నటించలేదు. నూర్ జెహాన్ 33 సంవత్సరాల (1930 నుండి 1963) కెరీర్ తర్వాత 1963లో నటనకు వీడ్కోలు పలికింది. ఆరుగురు పిల్లల తల్లిగా ఉండటం, ఒక హీరోకి (ఎజాజ్ దుర్రానీ) భార్యగా ఉండటం వల్ల ఆమె తన కెరీర్‌ను వదులుకోవలసి వచ్చింది. నూర్జెహాన్ పాకిస్తాన్‌లో 14 సినిమాలు, ఉర్దూలో పది, పంజాబీలో నాలుగు సినిమాలు చేశారు.

నటన మానేసిన తర్వాత ఆమె నేపథ్య గాయనిగా కొనసాగారు. 1960లో ‘సల్మా’ చిత్రంతో ఆమె నేపథ్య గాయనిగా అరంగేట్రం చేశారు. ఆమె పాకిస్తానీ చిత్రానికి తొలి నేపథ్య గాయని. ‘జాన్-ఎ-బహార్’ (1958) సినిమా కోసం, ముసరత్ నజీర్‍పై చిత్రీకరించిన ‘కైసా నసీబ్ లాయీ థీ’ అనే పాటను పాడారు. 1966లో వినోద రంగంలో అత్యున్నత పాకిస్తానీ గౌరవం, తమ్ఘా-ఎ-ఇంతియాజ్ (ది ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్)తో సహా అనేక అవార్డులను అందుకున్నారు. ఆమె అహ్మద్ రష్దీ, మెహదీ హసన్, మసూద్ రాణా, ముజీబ్ ఆలంలతో కలిసి పెద్ద సంఖ్యలో యుగళగీతాలు పాడారు.

ఆమెకు ఆసియాలోని అనేక మంది గొప్ప గాయకులతో, ఉదాహరణకు దివంగత గొప్ప గాయకుడు ఆలం లోహర్ తో సహా, మరెందరో గాయకులతో గొప్ప అవగాహన, స్నేహం ఉండేవి. 1990లలో నూర్జెహాన్ అప్పటికి తొలిసారిగా నటిస్తున్న నీలి, రీమా కోసం కూడా పాడారు. ఈ కారణంగానే, సబిహా ఖానుమ్ ఆమెను ప్రేమగా సదాబహార్ (సదా ఆకుపచ్చ) అని పిలిచారు. 1965లో పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య జరిగిన యుద్ధ కాలంలో ఆమె పాడిన దేశభక్తి గీతాలతో ఆమె ప్రజాదరణ మరింత పెరిగింది. భారతీయ టాకీ చిత్రాల స్వర్ణోత్సవాన్ని జరుపుకోవడానికి నూర్జెహాన్ 1982లో భారతదేశాన్ని సందర్శించారు, ఆమె భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని న్యూఢిల్లీలో కలిశారు. బొంబైలో దిలీప్ కుమార్, లతా మంగేష్కర్ ఆమెకు స్వాగతం పలికారు.

1986లో, ఉత్తర అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు, నూర్జెహాన్ ఛాతీ నొప్పితో బాధపడ్డారు, ఆంజినా పెక్టోరిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆమెకు పేస్‌మేకర్‌ను అమర్చడానికి శస్త్రచికిత్స జరిగింది. 2000లో, నూర్జెహాన్ కరాచీలో ఆసుపత్రిలో చేరగా గుండెపోటు వచ్చింది. డిసెంబర్ 23, 2000 శనివారం మధ్యాహ్నం, నూర్జెహాన్ గుండెపోటుతో మరణించారు. ఆమె అంత్యక్రియలు కరాచీలోని జామియా మసీదు సుల్తాన్‌లో జరిగాయి. ఆమెను కరాచీలోని సౌదీ కాన్సులేట్ సమీపంలోని గిజ్రీ స్మశానవాటికలో ఖననం చేశారు.

ఆమె పాటల్లో కొన్ని వినండి..

https://www.youtube.com/watch?v=QIz5cMIXw1Q

https://www.youtube.com/watch?v=3chfTqWJHhw

https://www.youtube.com/watch?v=AYtRfbmczxs

https://www.youtube.com/watch?v=UFl0UGvwT9A

Exit mobile version