సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
బహుముఖ ప్రజ్ఞాశాలి స్నేహప్రభా ప్రధాన్:
స్నేహప్రభా ప్రధాన్ (నటి, గాయని, స్క్రీన్ ప్లే రచయిత్రి, బయోగ్రాఫర్) 1930- 1940 లలో ప్రసిద్ధులైన సోషలిస్ట్ సినిమా మేధావుల బృందంలో ఒకరు. ఆమె 1921 అక్టోబర్ 20 న నాగ్‌పూర్‌లో జన్మించారు. ఆమె విఠల్‌రావ్ ప్రధాన్, తారాబాయి దంపతుల కుమార్తె. ఆమె నాగ్‌పూర్‌లోని అత్యంత గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చారు. ఆమె తండ్రి ప్రభుత్వ ఉన్నతాధికారి, ఎల్లప్పుడూ యూరోపియన్ దేశాలలో పర్యటిస్తూ ఉండేవారు. ఆమె తల్లి పూనాలోని ఫెర్గూస్సన్ కళాశాల నుండి మొదటి మహిళా గ్రాడ్యుయేట్. ఆమె అనేక పశ్చిమ భారత మహిళా సంఘాలకు నాయకురాలు. తన సమకాలీనుల (శాంతా ఆప్టే మొదలైనవారు) లాగా, స్నేహప్రభ సాంస్కృతికంగా వైవిధ్యభరితమైన బాల్యాన్ని గడిపారు. ఆమె జీవితంలో మొదటి 10 సంవత్సరాల కాలం – ఆమెను నాగ్‌పూర్, బొంబాయి, పూనా, ఢిల్లీ, కలకత్తా, లాహోర్, ఇంకా అనేక ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లింది. ఒక కథనం ప్రకారం, 18 సంవత్సరాల వయస్సు నాటికే, ఆమె 4 భాషలలో నిష్ణాతులు. జంతువుల పట్ల ఆమెకెంతో ప్రేమ. కుక్కలు, పిల్లులు, పక్షులు ఆమెకు ప్రాణ స్నేహితులు. డాక్టర్ అవ్వాలనీ, మనుషులను, జంతువులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె ఆశపడ్డారు. కానీ, దురదృష్టం, ఆమె రెండు సంవత్సరాల కళాశాల జీవితాన్ని దాటి ముందుకు వెళ్ళలేకపోయారు. బహుశా 30వ దశకం చివరిలో, ఆమెకు వాస్తవికత యొక్క మొదటి కుదుపు అనుభవంలోకి వచ్చింది. ఆమె తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబాన్ని విడిచిపెట్టారు, తల్లి తారాబాయి అనారోగ్యంతో బాధపడ్తూ కుటుంబాన్ని పోషించలేకపోయారు. స్నేహప్రభా బి.ఎస్.సి చదువుతూ మధ్యలో మానేశారు. కళాశాల రోజుల్లో ఆమె గొప్ప వక్త, అనేక పతకాలు, ప్రశంసాపత్రాలను గెలుచుకున్నారు. సినిమాల్లోకి ప్రవేశించేందుకు గాను బొంబాయిలోని సెయింట్ జేవియర్స్‌లో తన కళాశాల విద్యకు ముగింపు పలికారు. మామూలుగా అయితే సినిమాలు స్నేహప్రభ మనసులో చివరి విషయం, కానీ పరిస్థితుల వల్ల, మంచి పరిచయాల వల్ల అంటే బాంబే టాకీస్‌కు చెందిన చిమన్‌భాయ్ దేశాయ్ పరిచయం వల్ల, సౌభాగ్య (1940), సివిల్ మ్యారేజ్ (1940), సజని (1940) వంటి చిత్రాలలో నటించారు, ఇవి మరికొన్ని అసైన్‌మెంట్‌లకు దారితీశాయి.
ఈ మూడు చిత్రాలలో ‘సివిల్ మ్యారేజ్’ ఆమె తొలి సినిమా. ఇందులో హరీష్, అరుణ్ కూడా నటించారు. ఈ ముగ్గురూ కాలేజీ నుండి వచ్చినవారు, దర్శకుడు రామచంద్ర టాకోర్ సౌమ్యుడు. ఆమెకు సరైన దిశానిర్దేశం లేదు. అన్నింటికీ మించి ఆమె మొదటిసారి స్క్రీన్ మేకప్ వేసుకున్నప్పుడు దద్దుర్లు వచ్చాయి. అవి మాయమయ్యే వరకు ఆమె విశ్రాంతి తీసుకోవాలి. ఆమెకు అలెర్జీ పోవాలంటే తన సినిమా కెరీర్‌ను శాశ్వతంగా వదులుకోవాలని స్కిన్ స్పెషలిస్ట్ చెప్పారు. ఆయన మాట విననందుకు స్నేహప్రభ జీవితాంతం పశ్చాత్తాపపడ్డారు.
ఆమె రెండవ చిత్రం శోభన సమర్త్, ప్రేమ్ ఆదిబ్ నటించిన ‘సౌభాగ్య’. ఇందులో ఆమెకు సవాలుతో కూడిన పాత్ర లభిందింది. సినిమాలో ఆమె ప్రేమ్ ఆదిబ్ సోదరి. అతను ఆమెకి వివాహం చేయబోతున్నప్పుడు – ఎవరో ఆమె బాల వితంతువు అని చెప్తారు. అన్నకి ఈ విషయం తెలిసినా, చెల్లెలి జీవితాన్ని మార్చాలనుకుంటాడు. అన్న ఎంత వేడుకున్నప్పటికీ, చెల్లెలు (స్నేహ) వైధవ్యాన్ని స్వీకరిస్తుంది. ఆ చిత్రం విజయవంతమైంది. పత్రికల వాళ్ళు, ప్రేక్షకులు ఆమె నటనను చూసి ఆశ్చర్యపోయారు. కొంతమంది విమర్శకులు ఈ కొత్త నటి నుండి పెద్ద కళాకారులు ఎన్నో నేర్చుకోవచ్చని రాశారు!
చిమన్‌భాయ్ దేశాయ్ కృషి వల్ల, ఆమె తన కెరీర్‌లో తొలి ప్రధాన పాత్రను బాంబే టాకీస్ వారి ‘పునర్మిలన్’ (1940) సినిమాలో కిషోర్ సాహు సరసన పోషించారు. రామచంద్ర పాల్ సంగీతం అందించగా, సరస్వతి దేవి ఆర్కెస్ట్రా గైడెన్స్ అందించారు. స్నేహప్రభ సంగీత జీవితంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాట ‘నాచో నాచో ప్యారే మన్ కే మోర్’. షూటింగ్ హిమాన్షు రాయ్ సంప్రదాయానికి అనుగుణంగా జరిగేది. మునుపటి రోజు చిత్రీకరించిన సన్నివేశాలను తెర మీద వేసుకుని చూసేవారు, అందులోని తప్పులు గ్రహించి, ఏ దృశ్యాలను మళ్ళీ తీయాలో, వేటిని చేర్చాలో తెలుసుకునేవారు. స్టూడియో పరిశుభ్రంగా ఉండేది, మేకప్ గదులలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేవారు. క్యాంటీన్ ఆహారం శుభ్రంగా ఉండేది, అందరూ కలిసి తినేవారు.
ఈ సినిమాలో స్నేహప్రభ బిచ్చగత్తెగా నటించారు, గ్రామీణ దుస్తులైన లెహంగా, చోలి, ఇంకా ఓఢ్నీ వంటివాటిని ఇష్టపడ్డారు.
‘పునర్మిలన్’ ఆమె సినీ కెరీర్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది, ఆమెను కిషోర్ సాహుకు పరిచయం చేసింది. వారు కలుసుకున్నారు, ప్రేమలో పడ్డారు, వివాహం చేసుకున్నారు, కానీ ఆ వివాహబంధం సుమారు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నిలవలేదు. 1940ల ప్రారంభంలో, ఆమె మళ్ళీ నిలదొక్కుకోడానికి ప్రయత్నించారు. విడాకుల వార్తలు టాబ్లాయిడ్‌లుగా మారాయి. ఆమె కలత చెందారు, బాధ్యతాయుతమైన జర్నలిజం గురించి మాట్లాడారు, కానీ అంతకు మించి ముందుకు సాగలేదు.
ఈ సమయంలోనే, ఆమె మాస్టర్ వినాయక్ సర్కిల్‌తో కూడా కనెక్ట్ అయ్యారు. యాదృచ్ఛికంగా, 13 ఏళ్ల లతా దీనానాథ్ మంగేష్కర్ 1942 ప్రాంతంలో అవకాశాల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. వినాయక్ సహోద్యోగి (ఆర్.ఎస్. జున్నార్కర్), ‘పాహిలి మంగళాగౌర్’ (1942) సినిమాను నిర్మించే క్రమంలో ఉన్నారు, స్నేహప్రభ – షాహు మోదక్ సరసన కథానాయికగా సరిగ్గా సరిపోయారు. ఈ చిత్రం ఒక మైలురాయి. ఎందుకంటే ఇది సజెస్టివ్ బెడ్‌రూమ్ సీక్వెన్స్ (డార్క్ స్క్రీన్, నేపథ్యంలో శృంగారపరమైన మూల్గులు) కారణంగా A సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాను జనాలు పదే పదే చూశారు, మరికొందరు ఆ ఒక్క సన్నివేశం నుండి మరిన్ని పొందాలనే ఆశతో థియేటర్‌లోకి శక్తివంతమైన టార్చిలైట్‌లను కూడా తీసుకెళ్లారు! ‘పాహిలి మంగళాగౌర్’ బాలనటిగా లత నటించిన మొదటి సినిమా. స్నేహప్రభ, లత ఈ చిత్రంలో ఒక యుగళగీతం పాడారు, దీనిని వారిపైనే చిత్రీకరించారు. 90ల ప్రారంభంలో స్నేహప్రభ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో దీన్ని ధృవీకరించినందున – దాని గురించి ఎటువంటి సందేహమూ లేదు. అందువల్ల, స్నేహప్రభ లతతో కలిసి మొట్టమొదటి యుగళగీతం పాడటం ద్వారా చరిత్ర సృష్టించింది. 1946 క్రిస్మస్ రోజున, తీవ్ర అనారోగ్యం వలన బాగా అలసిపోయిన, కుమార్తె పురోగతి పట్ల గర్వంగా ఉన్న తారాబాయి మరణించారు.
స్నేహప్రభ తల్లిదండ్రులిద్దరూ తమ జీవితంలో ఎక్కువ భాగాన్ని సామాజిక కార్యక్రమాలకి, ముఖ్యంగా భారతదేశంలో అక్షరాస్యత కోసం అంకితం చేశారు. దాని వల్ల వారికి సాంసారిక జీవితానికి సమయం దొరకలేదు. కుమార్తె ఎల్లప్పుడూ తనంతట తానుగా, తీవ్రంగా స్వతంత్రంగా, పూర్తిగా రాడికల్‌గా, బహిరంగంగా మాట్లాడేది, సౌమ్యంగా ఉంటూనే దృఢంగా ఉండేది. అయితే తల్లి మరణం ఆమెను క్రుంగదీసింది. ఒక సందర్భంలో, ఆమె ఆత్మహత్యకి ప్రయత్నించి విఫలమయ్యారు.
స్నేహప్రభకి పెన్సిల్ డ్రాయింగ్, కథలు రాయడం ఇష్టం. ఆమె ‘లడాయి కే బాద్’ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా రాశారు. జీవితంలోని చివరి 40 సంవత్సరాలు ఆమెకు అత్యంత ప్రధానమైనవి. డాన్స్, మ్యూజిక్, కుకింగ్, పుస్తకాలు చదవడంతో కాలక్షేపం చేసేవారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ కూడా ఆడేవారు. ‘ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్’ అనేది ఆమె సదా పాటించిన నియమం. ఆమె ఎప్పుడూ రోగులకు సేవ చేయడానికి, వీధి కుక్కలను చూసుకోవడానికి సమయం కేటాయించారు. ఆమె సొగసు, సన్నని శరీరం, మెలికలు తిరిగిన నల్లటి కేశాలు, మెరిసే కళ్ళు పురుషులను ఆకర్షించేవి. 50వ దశకంలో, స్నేహప్రభా ప్రధాన్ డాక్టర్ శిరోద్కర్‌ను వివాహం చేసుకుని పూనాలోని శతారాం బంగ్లాలో స్థిరపడ్డారు. ఆమె జీవితంలో చివరి 40 సంవత్సరాలు ప్రశాంతంగా, హడావిడికి దూరంగా గడిపారు, పూర్తిగా సామాజిక సేవకి, రంగస్థలానికి అంకితమయ్యారు. ఆమె 1993లో మరణించారు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.