సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.


~
సినీరంగపు ప్రముఖుడు, థియేటర్ల యజమాని జంషెడ్జీ ఫ్రామ్జీ మదన్:
జె.ఎఫ్. మదన్‌గా ప్రసిద్ధులైన జంషెడ్జీ ఫ్రామ్జీ మదన్ పార్శీ వ్యాపారవేత్త. ఫిల్మ్ మాగ్నెట్. అప్పట్లో దేశంలోని బాక్సాఫీసు కలెక్షన్స్‌ని 50% పైగా నియంత్రించేవారు, వందకుపైగా మూకీ సినిమాలకు, తొలినాటి టాకీ సినిమాలకు బాధ్యులు.
కర్టెన్ పుల్లర్ స్థాయి నుండి, ఎదిగి అద్భుతమైన ప్రయాణాన్ని సాగించారు. ఈ క్రమంలో భారతీయులకు పూర్తిగా కొత్త వినోద మాధ్యమాన్ని పరిచయం చేశారు. తన గొప్ప కెరీర్లో, ఆయన ఎన్నో సినిమా హాళ్లు, సినిమా టెంట్లకు యజమానిగా ఉన్నారు, భారతీయ చలనచిత్ర పరిశ్రమ తొలి సంవత్సరాల్లో 100 కి పైగా మూకీ చిత్రాలు, ‘టాకీల’కు బాధ్యత వహించేలా సినిమా పంపిణీ, నిర్మాణ వ్యాపారాన్ని నిర్మించారు.
1902లో ఎల్ఫిన్‌స్టోన్ బయోస్కోప్ కంపెనీగా ప్రారంభమైన మదన్ థియేటర్స్ ఒకానొక సమయంలో భారతదేశంలో – అతిపెద్ద చిత్రనిర్మాణ, పంపిణీదారు, థియేటర్ వ్యాపారంగా మారింది. చలనచిత్ర వ్యాపారాన్ని తొలిసారి కలకత్తాకు తీసుకురావడమే కాకుండా, మదన్ థియేటర్స్ ఉచ్చస్థితిలో ఉండగా 127 థియేటర్లను నియంత్రించిందని చెబుతారు.
***
జె.ఎఫ్. మదన్ 27 ఏప్రిల్ 1856 న గుజరాత్‌లోని నవ్సరిలో జన్మించారు. బొంబాయి (ముంబై)లో సాపేక్షంగా సంపన్న వాతావరణంలో పెరిగారు. వారి తండ్రి ఒక భూమి పథకంలో గణనీయంగా ధనాన్ని కోల్పోవడం వల్ల ఆర్థికంగా నష్టపోయారు. దీని వలన యువ మదన్ ప్రారంభంలోనే ఉద్యోగం వెతుక్కోవలసి వచ్చింది. దాంతో ఆయన 1868లో ఎల్ఫిన్‌స్టోన్ నాటక మండలి అనే అమెచ్యూర్ డ్రామా క్లబ్లో కర్టెన్ పుల్లర్‌గా చేరారు. తర్వాతి కాలంలో అదే సంస్థలో నటుడిగా చేరారు. నాటక క్లబ్‌తో పాటు మదన్ కూడా భారతదేశం అంతటా ప్రయాణించారు.
వయసు ఇరవైల చివరలో ఉండగా, ఆయన వైన్ వ్యాపారిగా, సాధారణ వస్తువుల సరఫరాదారుగా తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుని కలకత్తా (కోల్‌కతా) కి వెళ్లారు.
వ్యాపారంలో విజయం సాధించడం ద్వారా, ఆయన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి మద్యం, ఇంకా నిత్యావసరాలను సరఫరా చేసే ప్రముఖ సరఫరాదారుగా మారారు. కానీ తన వ్యాపారాల నుండి వచ్చే లాభాలను నాటకాలు నిర్మించడానికి, నృత్య మరియు థియేటర్ హాళ్లు, ప్లేహౌస్లను నిర్మించడానికి, కలకత్తాలోని ప్రసిద్ధ కొరింథియన్ థియేటర్, ఆల్ఫ్రెడ్ థియేటర్లను కొనుగోలు చేయడానికి ఉపయోగించారు.


20వ శతాబ్దం ప్రారంభంలో, పశ్చిమ దేశాల సినిమాలు భారతదేశంలో ప్రేక్షకులకు ప్రదర్శించబడుతున్నాయి. ఒక అవకాశాన్ని చూసి, మదన్ నగరంలో విదేశీ చిత్రాలను ప్రదర్శించడానికి ఎల్ఫిన్‌స్టోన్ బయోస్కోప్ కంపెనీని (మదన్ థియేటర్స్‌కు ముందరి సంస్థ) స్థాపించారు.
“1902 లోనే, ఆయన [ఫ్రాన్స్‌లోని] పాథే కంపెనీ ఏజెంట్ నుండి సినిమా పరికరాలను కొనుగోలు చేశారు, కలకత్తాలోని వివిధ కీలక ప్రదేశాలలో వేసిన గుడారాలలో ‘బయోస్కోప్’ ప్రదర్శనలను నిర్వహించడం ప్రారంభించారు. తన వ్యాపారం వృద్ధి చెందడం ప్రారంభించినప్పుడు, మదన్ తన వ్యాపారాన్ని విస్తరించడానికి, చలనచిత్రాల ప్రదర్శన కోసం ఏకీకృతం చేయడానికి శాశ్వత ప్రదేశాలు ఉండవలసిన అవసరాన్ని గ్రహించారు” అని భారతదేశంలోని సినిమాలను కవర్ చేసే స్వతంత్ర వేదిక అయిన upperstall.com లో కరణ్ బాలి రాశారు.
లైవ్ హిస్టరీ ఇండియా కాలమిస్ట్, కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్, లైవ్ హిస్టరీ ఇండియా రచనాకారుడు – దేవాసిస్ చటోపాధ్యాయ ప్రకారం, మదన్ 1905లో జ్యోతిష్ సర్కార్ రాసిన ‘గ్రేట్ బెంగాల్ పార్టిషన్ మూవ్మెంట్: మీటింగ్ అండ్ ప్రొసెషన్’తో సహా వరుస నిశ్శబ్ద చిత్రాలను నిర్మించడం, ప్రదర్శించడం ప్రారంభించారు.
తను సంపాదించిన చిత్రాల ప్రదర్శన కోసం, 1907లో, మదన్ భారతదేశంలో మొదటిసారిగా సినిమాల ప్రదర్శన కోసమే నిర్మించిన సినిమా హాల్ – ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్‌ను కోల్‌కతాలో నిర్మించారు (తరువాతి కాలంలో దాని పేరు చాప్లిన్ థియేటర్‌గా మారింది, ఇటీవల కూల్చివేయబడింది). “ఆయన అటువంటి గొలుసుకట్టు సినిమా హాళ్ళను నిర్మించడం ద్వారా విస్తరించారు, తక్కువ వ్యవధిలో, మదన్ సామ్రాజ్యం భారతదేశం, బర్మా మరియు సిలోన్ [శ్రీలంక] అంతటా విస్తరించింది” అని బాలి రాశారు.
1911లో కోల్‌కతాలో జరిగిన ఐఎఫ్ఎ షీల్డ్ ఫుట్‌బాల్ ఫైనల్‌ను మదన్ చిత్రీకరించడం ద్వారా మరో ప్రధాన మైలురాయిని సాధించారు. దిగ్గజ మోహన్ బగన్ ఫుట్‌బాల్ క్లబ్, పూర్తిగా ఇంగ్లీష్ ఫుట్‌బాల్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్ అది. భారతదేశంలో ఒక క్రీడా కార్యక్రమాన్ని చిత్రీకరించడం అదే మొదటిసారి.
అయితే, దాదాపు రెండు సంవత్సరాల తరువాత 1913లో, భారత తొలి స్వదేశీ చిత్రమైన ‘రాజా హరిశ్చంద్ర’ను ప్రముఖ దాదాసాహెబ్ ఫాల్కే విడుదల చేయడంతో భారతీయ సినిమాకు మార్గం సుగమం అయింది. ఇది స్థానికంగా నిర్మితమైన సినిమాలకు ద్వారాలు తెరిచింది.
1917లో, మదన్ కూడా ఈ రంగంలోకి దూసుకెళ్లి ఫాల్కే మార్గదర్శక చిత్రం యొక్క అబ్రిడ్జ్డ్ వెర్షన్ అయిన ‘సత్యవాది రాజా హరిశ్చంద్ర’ వంటి మూకీ చిత్రాలను నిర్మించారు. ఇది కలకత్తాలో చిత్రీకరించబడిన మొదటి పూర్తి-నిడివి చలనచిత్రం కూడా.
తన ఆదాయ వనరులకు జోడింపుగా, ఆయన భారత ఉపఖండంలో ప్రధాన ఫ్రెంచ్ చలనచిత్ర పరికరాల, నిర్మాణ సంస్థ అయిన పాథే ఫ్రెరెస్ చిత్రాలను ప్రదర్శించే ప్రత్యేక హక్కులను కూడా పొందారు.
అయితే 1914 – 1918 మధ్య (మొదటి ప్రపంచ యుద్ధం) కాలంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి ఆహార పదార్థాల సరఫరాదారుగా – ఇతర వ్యాపారంలో కూడా ఆయన అభివృద్ధి చెందారు. యుద్ధంలో ఆయన చేసిన సేవలకు గాను 1918లో ఆయనకి ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (OBE) బిరుదు లభించింది.


ఒక సంవత్సరం తరువాత, ఆయన భారతదేశంలో మొట్టమొదటి కార్పొరేట్ ఫిల్మ్ మేకింగ్ కంపెనీని ప్రారంభించారు. దేవాసిస్ చటోపాధ్యాయ వెల్లడించిన ప్రకారం, మదన్ తన పార్సీ థియేటర్, మిమిక్రీ ప్రొడక్షన్, మూకీ ఫిల్మ్ మేకింగ్ వ్యాపారాలను తీసుకొని మదన్ థియేటర్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఇది అధికారికంగా 1919 సెప్టెంబర్ 27న స్థాపితమైంది. కలకత్తాలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదు చేయబడింది.
“మదన్ థియేటర్స్ లిమిటెడ్ తన చిత్ర నిర్మాణ ప్రయాణాన్ని బిల్వమంగళ్ (1919) తో ప్రారంభించింది. ఈ చిత్రానికి రుస్తోంజీ దోతివాలా దర్శకత్వం వహించారు. దోరాబ్జీ మేవావాలా టైటిల్ రోల్లో ప్రముఖ రంగస్థల నటి మిస్ గోహర్తో పాటు, చింతామణి అనే ప్రలోభపెట్టే పాత్రను పోషించారు” అని బాలి రాశారు.
“మదన్ దాదాపుగా వారి సినిమా పిల్మ్ లన్నింటినీ ఒక పెద్ద అగ్నిప్రమాదంలో పోగొట్టుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఈ సినిమాలోని దాదాపు 20 నిమిషాల ఫిల్మ్ లభించటంతో, పారిస్‌లోని సినిమాథెక్ ఫ్రాంచైస్ నుండి తెప్పించి నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (NFAI)కి ఇచ్చారు. బిల్వమంగళ్ సినిమా ఆ కాలానికే చాలా అధునాతనమైన కళా దర్శకత్వం కలిగి ఉందనీ ఈ ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది, బిల్వమంగళుడు తన తండ్రితో వాదించడం, చింతామణి నృత్యం వంటి సన్నివేశాలను కూడా ఈ ఫుటేజ్ చూపిస్తుంది” అని ఆయన అన్నారు.
1929లో వాల్ స్ట్రీట్ క్రాష్ అయ్యే వరకు, వారి కంపెనీ మదన్ థియేటర్స్ భారతదేశంలో అతిపెద్ద చిత్రనిర్మాణ, పంపిణీదారుగా, థియేటర్ వ్యాపారంగా నిలిచింది. వారు భారతదేశంలో టాకీల మొదటి ప్రదర్శనకారులు. 1931లో, అర్దేషిర్ ఇరానీ భారతదేశపు మొట్టమొదటి టాకీ ‘ఆలం ఆరా’ దర్శకత్వం వహించి నిర్మించిన కొన్ని నెలల తర్వాత, మదన్ థియేటర్స్ మొదటి బెంగాలీ టాకీ ‘జమై షష్ఠి’ని నిర్మించింది.
ఒక సంవత్సరం తరువాత, ఆ కంపెనీ – జె.ఎఫ్. మదన్ గారి మూడవ కుమారుడు జెజె మదన్ దర్శకత్వం వహించిన ‘ఇంద్ర సభ’ అనే చిత్రాన్ని నిర్మించింది, ఈ రోజు వరకు ఒకే చిత్రంలో అత్యధిక పాటలు ఉన్న సినిమాగా, 71 పాటలతో ఇది ప్రపంచ రికార్డును సృష్టించింది.
“ప్రజాదరణ పొందిన ధోరణుల ప్రకారం, మదన్ చిత్రాలలో ఎక్కువ భాగం పౌరాణిక కథలే అయినప్పటికీ అవి వింతైన ఫాంటసీ లేదా సామాజిక అంశాన్ని కూడా అన్వేషించాయి. ప్రారంభంలో, వారి నటీనటులు రంగస్థలం నుండి వచ్చారు, ప్రధాన నటీమణులు సాధారణంగా భారతీయ మారుపేర్లను తీసుకున్న ఆంగ్లో-ఇండియన్ అమ్మాయిలు” అని బాలి రాశారు.
మదన్ మరణం, సంస్థ పతనం
అయితే, ఈ మైలురాళ్లను చూడకముందే మదన్ 1923 జూన్ 30న మరణించారు.
దారుణమైన విషయం ఏమిటంటే, ఆయన మరణించిన ఆరు సంవత్సరాల తరువాత, ఆయన నిర్మించిన చిత్ర నిర్మాణ సామ్రాజ్యం వాల్ స్ట్రీట్ క్రాష్ కారణంగా భారీగా నష్టపోయింది. 1930ల మధ్య నాటికి, ఆయన థియేటర్ నెట్వర్క్, ఆయన సినిమా వ్యాపారంలో ఒక పెద్ద భాగం పోయాయి. 1937లో, మదన్ థియేటర్స్ తన చివరి చిత్రాన్ని నిర్మించి, శాశ్వతంగా మూతపడింది.
జె.ఎఫ్. మదన్ భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు మార్గదర్శకుడు, కానీ- తమ నగరానికి ఎన్నీ ఇచ్చిన ఆయనను నేటి కలకత్తా (కోల్‌కతా) నగరం జనాలు మరచిపోయారు.
అయితే, మదన్ థియేటర్స్ రీసెర్చ్ గ్రూప్ ప్రకారం, “నేడు సెంట్రల్ కోల్‌కతాలోని మదన్ స్ట్రీట్ ఇప్పటికీ జె.ఎఫ్. మదన్ దాతృత్వాన్ని గౌరవిస్తుంది, ఇందులో కలకత్తాలోని పేద ప్రజలకు, పార్శీ సమాజానికి గణనీయమైన విరాళాలు ఉన్నాయి. కొన్ని సమయోచిత చిత్రాలు మిగిలి ఉన్నాయి. మదన్ నిర్మించిన రెండు చలనచిత్రాలలోని భాగాలను NFAI విజయవంతంగా తిరిగి పొందింది. సింగిల్-స్క్రీన్ యుగం ఇప్పుడు ముగిసింది, కానీ భారతీయ చలనచిత్రం యొక్క మూలాలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది, దేశ చరిత్రలో ఈ ముఖ్యమైన కాలాన్ని బాగా రికార్డ్ చేయడానికి మరియు సంరక్షించడానికి పని జరుగుతోంది.”
కోల్‌కతా వీధుల్లో జెఎఫ్ మదన్ జాడలను కనుగొనడం:
భారతదేశంలోని మొట్టమొదటి మూవీ మొఘల్, 1920లలో 127 సినిమా థియేటర్ల యజమాని, మదన్ థియేటర్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు.. అయిన జెఎఫ్ మదన్ జ్ఞాపకార్థం నేటి కోల్‌కతాలో – హోటల్‌గా మారిన ఒకప్పటి ఆయన కార్యాలయం, ఆయన పేరు పెట్టబడిన ఓ వీధి, ఆయన నిర్మించిన కొన్ని సినిమా హాళ్లు మాత్రం మిగిలాయి.

పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.