సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
నటి అమృతా సింగ్ ప్రేమలు – వివాదాలు:
80, 90వ దశకం నాటి ప్రముఖ నటి అమృతా సింగ్, బాలీవుడ్‌లో తన ధైర్యం నిండిన వ్యక్తిత్వానికి, దృఢమైన వైఖరికి ప్రసిద్ధి చెందారు. ఆమె 1983లో ‘బేతాబ్’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. మర్ద్, సాహెబ్, చమేలి కీ షాదీ, నామ్, ఖుద్‍గర్జ్, వారిస్, ఇంకా అనేక ఇతర చిత్రాలలో నటించారు.
ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆమె సంబంధాలు తరచుగా వార్తల్లో నిలిచాయి. కానీ ఆమె అత్యంత ముఖ్యమైన బంధం నటుడు సైఫ్ అలీ ఖాన్‌తో ఉంది. ఇద్దరి వయసులో 12 సంవత్సరాల అంతరం ఉన్నప్పటికీ, వారు 1991లో వివాహం చేసుకున్నారు. వారికి సారా, ఇబ్రహీం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ జంట 2004 లో విడాకులు తీసుకుంది.
బాలీవుడ్‌లో అత్యంత అద్భుతమైన నటి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అమృతా సింగ్ – సినీ పరిశ్రమలో ఉన్న సమయంలో తన ప్రేమ సంబంధాల గురించి విస్తృతంగా చర్చించుకునేలా ప్రేమ జీవితాన్ని గడిపారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి పురుషులతో ఆమె సంబంధాలు చాలా సంచలనం సృష్టించాయి. ఆమె జీవితంలోకి ప్రవేశించిన ముఖ్య వ్యక్తులను చూద్దాం..
1983లో వచ్చిన ‘బేతాబ్’ సినిమా షూటింగ్ సమయంలో అమృతా సింగ్, సన్నీ డియోల్ ప్రేమలో పడ్డారు. తెరపై వారి కెమిస్ట్రీ అందరికీ నచ్చినప్పటికీ, సన్నీ పూజా డియోల్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు అమృత తరువాత తెలుసుకున్నారు. అమృత తల్లితో సహా కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో వారి ఆ ప్రేమ వ్యవహారం ముగిసింది. తర్వాత వాళ్ళిద్దరూ మళ్లీ ఎప్పుడూ కలిసి కనిపించలేదు.
అమృత సింగ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 1980లలో నిశ్చితార్థం చేసుకున్నారని పుకార్లు వచ్చాయి. 1986లో సినీ బ్లిట్జ్ ముఖచిత్రంపై కనిపించిన తర్వాత వారి సంబంధం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, పెళ్ళయ్యాకా, అమృత సినిమాలు విరమించుకోవాలని రవిశాస్త్రి కోరారట. కానీ ఆమె అలా చేయడానికి ఇష్టపడలేదు. దాంతో వారి ప్రేమ ముగిసింది.
‘బట్వారా’ సినిమా సమయంలో అమృత సింగ్, వినోద్ ఖన్నా ప్రేమలో పడ్డారు, కానీ అమృత తల్లి నిరాకరించడంతో వారి సంబంధం ముగిసింది. వారి 12 సంవత్సరాల వయస్సు అంతరం, ఇంకా వినోద్ మునుపటి వివాహం కారణంగా ఆమె వారి పెళ్ళిని వ్యతిరేకించారు.
అమృతా సింగ్ 2004లో విడిపోయాక, సైఫ్ – కరీనా కపూర్‌ను వివాహం చేసుకున్నారు, తరువాత అమృత తనకి తానుగా అందరికీ దూరంగా ఉన్నారు.
సన్నీ డియోల్, రవిశాస్త్రి, వినోద్ ఖన్నాతో తనకున్న సంబంధాలలో తాను సర్వస్వం అర్పించానని అమృతా సింగ్ ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. విడిపోయినప్పటికీ, ఆమె వారిని జాగ్రత్తగా చూసుకున్నారు, వారికి శుభాకాంక్షలు తెలిపారు, ఐతే గతం గురించి ఆలోచించకుండా, ముందుకు సాగడంపై దృష్టి పెట్టారు.
అమృతా సింగ్ తల్లి రుక్సానా. ఆ రోజుల్లో ఆమె అత్యంత సౌందర్యవతి. సంజయ్ గన్షీకి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకునేవారు.. అది మరో కథ.
రుక్సానా – జరీనా హక్, మదన్ మోహన్ బింబెట్ దంపతులకు మీను బింబెట్ గా జన్మించారు. మదన్ మోహన్ హిందువు, భారత వైమానిక దళంలో అధికారి. అతని భార్య జరీనా ముస్లిం, బికనీర్ సంస్థానానికి ఒకప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మియాన్ ఎహ్సాన్-ఉల్-హక్ గారి కుమార్తె. ఎహ్సాన్-ఉల్-హక్ జలంధర్‌కు చెందిన భూస్వామ్య కుటుంబం నుండి వచ్చారు. మదన్ మోహన్ – జరీనాకు విడాకులు ఇచ్చిన తర్వాత, ఆశా బింబెట్‌ను వివాహం చేసుకున్నారు, వారికి మధుసూదన్, తాహిరా బింబాత్ అనే ఇద్దరు పిల్లలు కలిగారు.
రుక్సానాకు పుట్టింటి వైపు, అత్తింటి వైపు సినిమా వ్యక్తులతోనూ, మీడియా వ్యక్తులతోనూ సంబంధాలున్నాయి. ఆమె పిన్ని బేగం పారా – దిలీప్ కుమార్ తమ్ముడు నాసిర్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు.
రుక్సానా – కుష్వంత్ సింగ్ మేనల్లుడు, భారత సైన్యంలో అధికారి అయిన శివిందర్ సింగ్ విర్క్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, అమృతా సింగ్ జన్మించింది. తరువాత ఈ జంట విడాకులు తీసుకున్నారు. అమృతకి, సైఫ్ ద్వారా కలిగిన సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ (జ.2001) లకు రుక్సానా అమ్మమ్మ.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.