సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
నటి కుల్దీప్ కౌర్:
అలనాటి నటి కుల్దీప్ కౌర్ 1927లో లాహోర్‌లోని ఒక జాట్ కుటుంబంలో, ఒక సంపన్న భూస్వామికి రెండవ కుమార్తెగా జన్మించారు. రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టడం ఆమె తండ్రికి నిరాశ కలిగించినా, ఆయన చిన్న కూతురిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. నిజానికి ఆయన అతి గారాబం వల్లే ఆమె చెడిపోయిందని కుటుంబసభ్యులు అనుకునేవారట. ఆమె బాల్యంలోనే తండ్రి మరణించారు. తల్లి తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని తన సోదరుడితో కలిసి ఉండటానికి వెళ్ళారు. కొంత కాలం గడిచాకా, ఆమె అక్క పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవడంతో కుల్దీప్ ఒంటరి అయ్యారు. ఆమెను ఇంటి దగ్గరే ఉన్న ఒక చిన్న వీధి పాఠశాలలో చదివించారు. కానీ ఆమె చాలా అల్లరిపిల్ల, మొండి. పైగా చదువుకోవడానికి నిరాకరించారు. ఎప్పుడూ ఇతరులపై కథలు చెప్పేవారు, అతి వేగంతో చెట్టును ఎక్కేవారు, అందరితో గొడవలు పెట్టుకునేవారు. కూతురుని ఎలా అదుపులో పెట్టాలో తెలియక, ఆమె తల్లి తల పట్టుకునేవారట.
కుల్దీప్ తోటి ఆడపిల్లలతో ఒక చిన్న ముఠాను ఏర్పాటు చేసే, ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ, ఆ పిల్లల్ని కూడా చెడగొట్టారు. ఇది చాలా మందికి తెలియదు, నటి సులోచనా ఛటర్జీ కూడా ఈ ముఠాలో సభ్యురాలు. కాలం గడిచేకొద్దీ వారు విడిపోయారు. ఆ వయసులో కుల్దీప్కి మంచి చెడు తేడా లేదు, ఆమె తనకు నచ్చినది చేసేవారు. ఆమెకు చాక్లెట్లన్నా, చైనీస్ ఫుడ్ అన్నా చాలా ఇష్టం, వాటిని తరచూ తినేవారు. ఆమె వాటిని ఎక్కడి నుండి తెచ్చారో ఎవరికీ తెలియదు.
ఆమె సిక్కు సామ్రాజ్య చక్రవర్తి మహారాజా రంజిత్ సింగ్ గారి సాహసోపేత మిలిటరీ కమాండర్ జనరల్ ‘షామ్ సింగ్ అత్తారివాలా’ మనవడి కోడలు. ఆమె అత్తగారి నివాసం గ్రాండ్ ట్రంక్ రోడ్ నుండి లాహోర్ జిల్లాతో అమృత్సర్ జిల్లా సరిహద్దులో ఉన్న అత్తారి గ్రామంలో ఉంది. ఇది అమృత్సర్, లాహోర్ రెండింటి నుండి పద్దెనిమిది మైళ్ల దూరంలో ఉంటుంది. ఆమె భర్త ధనవంతుడైన భూస్వామి మోహిందర్ సింగ్ సిద్ధు (మోహిందర్ సింగ్ పాంపా అని కూడా పిలుస్తారు). ఈయన కూడా అతి గారాబంతో పెరిగినవారే. పంజాబ్‌లోని రెండు ప్రధాన నగరాలైన లాహోర్, అమృత్సర్ అందించే మంచి జీవితాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడ్డారు. లమ్స్‌డెన్ క్లబ్ ఆఫ్ అమృత్సర్, సర్వీస్ క్లబ్ ఆఫ్ అమృత్సర్, జింఖానా క్లబ్ ఆఫ్ లాహోర్, సర్వీస్ క్లబ్ ఆఫ్ లాహోర్, గోల్ఫ్ క్లబ్ ఆఫ్ లాహోర్ వంటి క్లబ్బులలో సభ్యుడు. విలాసవంతమైన జీవనశైలిని పాటించారు, చాలాసార్లు ఒకే రోజులో మధ్యాహ్నం భోజనం ఓ నగరంలోని క్లబ్లో, రాత్రి భోజనం మరో నగరంలోని క్లబ్లో చేసేవారు. యూరోపియన్, అమెరికన్ కార్ల తాజా మోడళ్లను కలిగి ఉండటానికి ఇష్టపడేవారు. ఆయన దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో; రెనాల్ట్, బేబీ మోరిస్, ఆస్టిన్ ముఖ్యమైనవి. షెవర్లెట్, కాడిలాక్, బ్యూక్, ఇంకా స్టూడ్‌బేకర్ వంటి టాప్ మోడల్ కార్లు ఆయనకి నచ్చేవి. లాహోర్, అమృత్సర్ లోని కార్ డీలర్లు అతని గౌరవార్థం ఎల్లప్పుడూ రెడ్ కార్పెట్ పరిచేవారట. ఆయన లాహోర్ లేదా అమృత్సర్లను సందర్శించకుండా ఒక్క రోజు కూడా గడపలేదట. ఆయన కపుర్తల మహారాజు జగత్జిత్ సింగ్‌కు మంచి స్నేహితుడు, శీతాకాలంలో వారి ఫ్రెంచ్ స్టైల్ ప్యాలెస్‌తో పాటు అద్భుతమైన జగత్జిత్ క్లబ్‌ను కూడా చాలాసార్లు సందర్శించేవారు. వేసవికాలంలో మహారాజా స్వయంగా తరచుగా ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాల పర్యటనలో ఉంటూ, కపుర్తలలో అరుదుగా అందుబాటులో ఉండేవారు. కుల్దీప్ భర్త ఎల్లప్పుడూ తన అందమైన భార్య భారతదేశంలోని ఏదైనా మహానగరంలో ఆధునిక మహిళలా జీవించాలనీ, అలాగ నడుచుకోవాలని కోరుకున్నారు. తన భార్య ఈత నేర్చుకోవాలని; లాహోర్, అమృత్‌సర్‌లో ఉన్న క్లబ్‌కు వెళ్ళే ఇంగ్లీష్ ఎలైట్తో స్నేహం చేయాలని కోరుకున్నారు. ఒకసారి క్లబ్ సంస్కృతికి అలవాటైన తర్వాత, కుల్దీప్ కౌర్ కూడా దాని చీకటి పార్శ్వం ద్వారా ప్రభావితమవడం ప్రారంభించారు. లాహోర్ ఒక ప్రసిద్ధ చలనచిత్ర నగరం కాబట్టి, కుల్దీప్ కౌర్ సినీ నటి కావాలని కలలు కనసాగారు.
ఒక కథనం ప్రకారం, 1940 నుండి లాహోర్‌లో సినీరంగంలో ఉన్న నటుడు ప్రాణ్ నాథ్ వృత్తిపరమైన లక్షణాలను కుల్దీప్ కౌర్ ఆరాధించడం ప్రారంభించారు, ఆయన పంజాబీ చిత్రం ‘యమ్లా జాట్’లో హీరోగా విజయవంతంగా నటించారు. ప్రాణ్ లాహోర్ యొక్క ఆధునిక, స్వేచ్ఛాయుత జీవనశైలిని ఇష్టపడ్డారు. 1947 జూలై – ఆగస్టు నాటికి, మత హింస ప్రధానంగా ముస్లింలు, సిక్కుల మధ్య పూర్తి స్థాయి జాతి ప్రక్షాళన చర్యగా మారింది. దాంతో లాహోర్, అమృత్సర్ రెండూ ఇటీవలి చరిత్రలో ఎన్నడూ ఎరుగని అత్యంత దారుణమైన జాతుల హింసలో మునిగిపోయాయి. కుల్దీప్ కౌర్‌కు ఇస్లాం మతం పట్ల ఎటువంటి ద్వేషం లేదు. అనేక మంది ముస్లింలు ఆమెకీ, ఆమె భర్త మోహిందర్ సింగ్ పాంపాకి మంచి స్నేహితులు. కానీ లాహోర్, అమృత్సర్ లలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. వేగంగా మారుతున్న పరిస్థితుల కారణంగా ప్రాణ్, కుల్దీప్ కౌర్ కుటుంబాలు లాహోర్‌ను వీడి, దాదాపు ప్రతి వస్తువును అక్కడే వదిలి వెంటనే బయలుదేరాల్సి వచ్చింది. ఆమె సొంత గ్రామం సరిహద్దులో ఉండటం వల్ల అక్కడా ప్రశాంతత లేదు. కాబట్టి కుల్దీప్ కౌర్ నేరుగా బొంబాయికి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు.
మరో కథనం ప్రకారం, నటుడు ప్రాణ్‌ని ఆకట్టుకోవడానికి, కుల్దీప్ కౌర్ మరో సాహసానికి పూనుకున్నారట. లాహోర్‌లో చిక్కుకుపోయిన ప్రాణ్ కారుని లాహోర్ నుండి బొంబాయికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఆమె అపూర్వమైన సాహసానికి చిహ్నంగా, బొంబాయి నుంచి అమృత్‌సర్‌కి, అక్కడి నుండి లాహోర్‌కు సురక్షితంగా ప్రయాణించి, ప్రాణ్ కారును తీసుకుని, మళ్ళీ అమృత్‌సర్‌కు చేరి, ఆపై బొంబాయికి నడుపుకుంటూ వెళ్ళి, అక్కడ కారుని ప్రాణ్ గారికి అప్పగించారట. ఈ చర్య పట్ల ప్రాట్ ఆశ్చర్యపోయారు, కృతజ్ఞత వ్యక్తం చేశారట.
కుల్దీప్ కౌర్ పాఠశాలలో తరచుగా నాటకాలు వేసేవారు. నటించేటప్పుడు ఆమె పాత్రలలో లీనమయ్యేవారు. అకస్మాత్తుగా ఆమె సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. 1947లో విధి ఆమెను బొంబాయికి చేర్చుంది. ఆమె స్టూడియోల చుట్టూ తిరగాల్సిన అవసరం రాలేదు. త్వరలోనే ఆమె పంజాబీ చిత్రం ‘జడ్జ్’లో అరంగేట్రం చేశారు, ఆ తర్వాత ‘గృహస్తి’, ‘చమన్’ అనే సినిమాల్లో నటించారు. ఆమె నటించిన ఏ చిత్రంలోనైనా ఆమె అద్భుతమైన పాత్రను పోషించడంతో ఆమె అత్యంత ప్రజాదరణ పొందారు. 1948లో విడుదలన ఆమె చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బాగా రాణించాయి. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు, మరింత ఎదిగారు. ఒక దశలో కుల్దీప్ కౌర్ తన సినిమా పాత్రల్లో చాలా బిజీగా ఉండటంతో చాలా కాలం పాటు పంజాబ్‌ను సందర్శించడానికి ఆమెకు సమయం దొరకలేదు. ఆమెకు ఇష్టమైన పంజాబీ చిత్రం ‘చమన్’. 1949లో, కుల్దీప్ కౌర్ ‘ఏక్ థీ లడ్కీ’, ‘కనీజ్’ అనే రెండు చిత్రాలలో పనిచేశారు. ‘ఏక్ థీ లడ్కీ’ బ్లాక్ బస్టర్. సంగీత దర్శకుడు వినోద్ ఈ చిత్రానికి కొన్ని గొప్ప బాణీలను సమకూర్చారు. గులాం హైదర్ సంగీతం అందించిన ‘కనీజ్’ అంతగా రాణించలేదు.
1950లో, కుల్దీప్ కౌర్ రెండు గొప్ప సంగీత హిందీ చిత్రాలు ‘సమాధి’, ‘ఆధీ రాత్’ లలోనూ, రెండు పంజాబీ చిత్రాలు ‘మదారి’, ‘ఛాయ్’ లలోనూ నటించారు. 1951 కుల్దీప్ కౌర్‌కు గొప్ప సంవత్సరం, ఆమె ‘స్టేజ్’, ‘రాజ్‌పుత్’, ‘నయీ జిందగీ’, ‘ఏక్ నజర్’, ‘అఫ్సానా’, ‘ముఖ్రా’ అనే ఆరు చిత్రాలలో వ్యాంప్ పాత్రలను పోషించారు. అశోక్ కుమార్ నటించిన ‘అఫ్సానా’ చిత్రంలో ఆమె పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
1952 కులదీప్ కౌర్‌కు మరో గొప్ప సంవత్సరం. ఆమె ‘శీషమ్’, ‘నౌ బహర్’, ‘బైజు బావ్రా’ మరియు ‘అంజామ్’ అనే నాలుగు సినిమాలలో పనిచేశారు. ‘బైజు బావ్రా’ సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. 1953లో కుల్దీప్ కౌర్ నటించిన ‘మషూకా’, ‘బాజ్’, ‘అనార్కలి’, ‘ఆబ్షర్’ అనే నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ‘అనార్కలి’ సూపర్ హిట్ అయింది, ఆమె పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. 1954 కుల్దీప్ కౌర్‌కి మరో గొప్ప సంవత్సరం. ఆమె ‘లాల్ పరీ’, ‘గుల్ బహార్’, ‘డాక్ బాబు’ అనే మూడు సినిమాల్లో నటించారు.
కుల్దీప్ కౌర్ అత్యంత బిజీగా ఉన్న వృత్తిపరమైన సంవత్సరాల్లో 1955 ఒకటి. ఆమె ‘తీర్ అందాజ్’, ‘మిస్ కోకా కోలా’, ‘మస్త్ కలందర్’ ‘జషాన్’ లలో చెడ్డ అమ్మాయి పాత్రలను పోషించారు. 1956 కుల్దీప్ కౌర్‌కి కాస్త లీన్ ఇయర్, ఆమె రెండు సినిమాల్లో పనిచేశారు, కానీ ఏదీ విడుదల కాలేదు. కుల్దీప్ కౌర్ 1956లో నటించిన ఆ రెండు సినిమాలు 1957 లో విడుదలయ్యాయి. అవి ‘షెరూ’, ‘ఏక్ సాల్’. 1958లో కుల్దీప్ కౌర్ ‘సహారా’, ‘పంచాయత్’ అనే రెండు చిత్రాలలో నటించారు. 1959లో, కుల్దీప్ కౌర్ ‘ప్యార్ కా రిస్తా’, ‘మోహర్’, ‘జాగిర్’ అనే మూడు చిత్రాలలో నటించారు. వీటిలో ‘మోహర్’ అనేది ఒక గొప్ప మ్యూజికల్ డ్రామా. దీనికి మదన్ మోహన్ సంగీతం అందించారు. చేతిలో హిందీ సినిమాలు తక్కువ ఉన్నప్పుడు, ఆమె పంజాబీ చిత్రాలలో పనిచేశారు.
1960 కుల్దీప్ కౌర్‌కు చాలా మంచి సంవత్సరంగా ప్రారంభమైంది. ఆమె అప్పటికే ‘మా బాప్’ అనే హిందీ చిత్రాన్ని, ‘యమ్లా జాట్’ అనే పంజాబీ చిత్రాన్ని పూర్తి చేశారు. మరికొన్ని చిత్రాలు వస్తున్నాయి. ఆమెకు సినిమాల్లో నటించడం చాలా ఇష్టం, కానీ ఆమె నిర్మాతలను ద్వేషించింది. తన కుమారుడు ‘డెన్నీ’ తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ, సెట్‌కి వచ్చి రిపోర్ట్ చేయమని ఫోన్లో తనను వేధించిన నిర్మాతతో ఆమెకు ఎదురైన చేదు అనుభవం దీనికి కారణం. ఆమె తన కుమారుడిని ప్రేమించారు, అతని చదువు కారణంగా అతన్ని పంజాబ్‌లోనే ఉంచారు. అతన్ని చాలా మిస్ అయ్యారు, దాంతో ఆవిడ ఎల్లప్పుడూ విచారంగా ఉండేవారు. తెరపై ఉత్సాహంగా కనిపించినా, వ్యక్తిగత జీవితంలో ఎంతో వెలితి ఉండేది. ఆమె ఈ విషయాన్ని ‘సినిమా వాయిస్’ పత్రికలో ఒక జర్నలిస్ట్‌తో పంచుకున్నారు. తన కుమారుడికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు. కానీ ఆ సంవత్సరంలోనే, ఆమె పాదాలలో, కాళ్ళలో కొన్ని ముళ్ళు గుచ్చుకోగా, ఆమె స్వయంగా వాటిని బయటకు తీయడంతో ఆమె జీవితం ముగిసింది. తాను పోషించే ధైర్యవంతురాలైన స్త్రీ పాత్రల వలె, ఆమె తన గాయాలను తేలికగా తీసుకున్నారు, వెంటనే వైద్యుల సలహా తీసుకోలేదు. దాంతో ఆమె పుండ్లు సెప్టిక్‌గా మారడమే కాకుండా, ధనుర్వాతం కూడా సోకింది, ఇది నయం కాలేదు. కుల్దీప్ కౌర్ 1960లో మరణించారు. ఆమె వేగవంతమైన జీవితాన్ని గడిపారు, ఆమె ముగింపు కూడా అంతే అకస్మాత్తుగా జరిగింది. ఆమె మరణంతో, ఆమెను అమితంగా ప్రేమించిన ఆమె భర్త గుండె బద్దలయింది. కొన్ని సంవత్సరాల తరువాత ఒక రోజు, కొత్తగా పెళ్లైన ఓ జంటను ఆశీర్వదిస్తూ, “మరణం వరకు కలిసి జీవించండి, ఒకరినొకరు విడిచిపెట్టవద్దు” అని చెప్పారాయన. ఈ సందేశం తన ప్రియమైన భార్య మరణం వల్ల కలిగిన తీవ్రమైన బాధను ప్రతిబింబిస్తుంది.
ఆమె మనోహరమైన జీవిత కథ నేటి తరం పాఠకులకు, భవిష్యత్తు తరాల వారికి అనేక పాఠాలను బోధిస్తుంది.
***
కుల్దీప్ కౌర్ అద్భుతమైన, సహజ కళాకారిణి. ఆమెను తలచుకోగానే ‘అఫ్సానా’ (1951) లోని ఆమె పాట గుర్తొస్తుంది. అది కుల్దీప్ కౌర్, ప్రాణ్ లపై చిత్రీకరించబడిన లతా మంగేష్కర్ పాడిన పాట.. ‘అభీ తో మై జవాన్ హుఁ..’
అవును ఆమె అభిమానులకు ఆమె ఎప్పుడూ నిత్యయవ్వని..
https://www.youtube.com/watch?v=CRIUscPwdTE
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.