సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
నటుడు ఆఘా:
భారతదేశంలోని పూణేలో మార్చి 21, 1914న జన్మించిన ఆఘా, ఇరాన్‌కు చెందిన కుటుంబం నుండి వచ్చారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో ఆయన 300లకు పైగా సినిమాలలో నటించారు. హాస్యానికి, సమయస్ఫూర్తికి ప్రసిద్ధి చెందిన ఆయన, బాబ్ హోప్ నటనా శైలి నుంచి ప్రేరణ పొందారు.
ఆఘా నటనా ప్రస్థానం 1935లో మెహతాబ్, నజీర్ నటించిన కన్వల్ మూవీటోన్ వారి ‘స్త్రీ ధర్మ’ సినిమాతో ప్రారంభమైంది, ఆ తర్వాత ‘దౌలత్’ (1937), ‘రంగీలా మజ్దూర్’ (1938), ‘కహాఁ హై మంజిల్ తేరీ’ (1937), ‘అనురాధ’, ‘కెప్టెన్ కిషోరి’ (రెండూ 1940) వంటి సినిమాలు కమెడియన్‍గా ఆయనను స్థిరపరిచాయి.
1953లో, ఆఘా – దేవ్ ఆనంద్, ఉషా కిరణ్‌లతో కలిసి ‘పతిత’ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ఆఘా ‘మస్త్రామ్’ అనే ముఖ్యమైన పాత్రని పోషించారు; తలత్ మెహమూద్ ఆలపించి, తర్వాతి కాలంలో క్లాసిక్ సాంగ్‍గా పేరుపొందిన ‘అంధే జహాన్ కే, అంధే రాస్తే, జయే టు జాయెన్ కహాఁ’ పాట ఆఘాపై చిత్రీకరించబడింది. దిలీప్ కుమార్ నటించిన ‘ఇన్సానియత్’ (1955) లో కూడా ఆఘా ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు.
జ్వార్ భటా (1944), ఎలాన్ (1947), జుగ్ను (1947), షికాయత్ (1948), బాలమ్ (1949), నజరే (1949), మంగళ (1950), సంసార్ (1951), బాదల్ (1951), దో రాహ్ (1952), అంబర్ (1952), షహెన్ షా (1952), పహ్లీ తారిఖ్ (1954), దేవత (1956), కాలా పానీ (1958), రాజ్‌తిలక్ (1958), నవరంగ్ (1959) వంటివి ఆయన నటించిన మరికొన్ని చెప్పుకోదగ్గ చిత్రాలు.
తరువాతి కాలంలో, ఊమర్ ఖైద్ (1961), అధీ రాత్ కే బాద్ (1965), పడోసన్ (1968), బాంబే టు గోవా (1972), తేరే మేరే సప్నే (1971), పియా కా ఘర్ (1972), రోటీ కపడా ఔర్ మకాన్ (1974), హమ్ కిసీసే కమ్ నహీఁ (1977) వంటి హిట్ సినిమాల్లో నటించారు. 1960లో వచ్చిన ‘ఘూంఘట్’ చిత్రానికి గాను ఆయన ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు.
ఆఘా 1992 ఏప్రిల్ 30న పూణేలో గుండెపోటుతో 78 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు.
పతిత (1953) సినిమాలోని ‘అంధే జహాన్ కే, అంధే రాస్తే, జయే టు జాయెన్ కహాఁ’ పాటని యూట్యూబ్ లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=T_QKUWk6anI
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.