Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 271

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

నటి దీప్తి నావల్ పుస్తకం నుంచి కొన్ని జ్ఞాపకాలు:

‘చష్మే బుద్దూర్’ తార దీప్తి నావల్ రాసిన తాజా పుస్తకం ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’. ఆమె ఈ పుస్తకం తన చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుచేసుకున్నారు, వాటి ద్వారా, కొత్త ప్రారంభం అంచున ఉన్న అప్పటి నగరం, దేశం చిత్రపటాన్ని చిత్రీకరించారు.

“నిజమైన యుద్ధమా? అమృత్‌సర్ సరిహద్దులోనా?”, భారత-పాకిస్తాన్‍ల మధ్య యుద్ధానికి కారణమైన 1965 నాటి బాంబు దాడి గురించి విన్నప్పుడు తనకు కలిగిన ఉత్సాహాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె రాశారు. “చివరకు, మా జీవితాల్లో ఏదో జరుగుతోంది!” అన్నారు. ఆ సమయంలో దీప్తి వయసు 13 సంవత్సరాలు. ఆమె రక్షిత, ఊహాత్మక మనస్సుకు యుద్ధం అంటే సాబెర్ జెట్‌లు తలపైన ఎగరడమే అని అనిపించింది; నిజమైన బాంబు దాడికి పౌరులను సిద్ధం చేయడానికి మాక్ సైరన్‌లు మోగినప్పుడు దాక్కునే ఆనందం అది. “మా నాన్న నన్ను, నా సోదరిని సరిహద్దుకు తీసుకెళ్లే వరకు ఎవరూ మాతో యుద్ధపు తీవ్రత గురించి చర్చించలేదు. నాన్న అమ్మతో, “వాళ్ళు యుద్ధం యొక్క వాస్తవికతను తెలుసుకోవాలి” అని చెప్పారు. గాలిలో వ్యాపించిన లోహపు వాసన, కాలిపోయిన భూమి, దుమ్ములో పడి ఉన్న మృతదేహాల గురించి దీప్తి నావల్ రాశారు. కాకులు కూడా మౌనంగా ఉన్నాయని ఆమె గుర్తుచేసుకున్నారు. “నా హృదయంలో వేదన మొదలైంది” అని అన్నారు. “అప్పటి నుండి నా మనస్సులో యుద్ధం జ్ఞాపకాలు స్పష్టంగా ఉన్నాయి.”

నావల్ పుస్తకం కేవలం జ్ఞాపకాల కలబోత మాత్రమే కాదు, అంతకంటే ఇంకా ఎక్కువ; ఇది అమృత్‍సర్ జీవితం యొక్క రికార్డు, దేశ చరిత్రలో రాజకీయంగా అత్యంత వివాదాస్పద క్షణాలలో ఒకదాని సజీవ పత్రం. నటి తన జ్ఞాపకాలు తనను నడిపించడానికి అనుమతిస్తూ, అవసరం వచ్చినప్పుడు స్నేహితులు, ఇంకా కుటుంబ సభ్యులతో క్రాస్-చెక్ చేసుకున్నారు, కానీ ఎక్కువగా ఆమె జ్ఞాపకాలను కాలపు వంచన నుండి కాపాడుకున్నారు. “పుస్తకం రాయడం పూర్తి చేసేవరకు, నేను కొత్త స్వర్ణ దేవాలయం లేదా కొత్త జలియన్ వాలాబాగ్‌ను సందర్శించాలనుకోలేదు. నేను చిన్నప్పుడు వాటిని గుర్తుంచుకున్న విధంగా ఈ చారిత్రక ప్రదేశాల గురించి రాయాలనుకున్నాను” అని ఆమె చెప్పారు.

తెల్ల తిమింగలంగా ఆమె పోల్చిన ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ పుస్తకం తయారీకి రెండు దశాబ్దాలు పైనే పట్టింది. కొన్ని అధ్యాయాలు సులువుగా రూపుదిద్దుకున్నాయి, మరికొన్నింటికి శ్రమతో కూడిన పరిశోధన, బంధువులు మరియు స్నేహితులతో ఖచ్చితమైన వాస్తవాలను తనిఖీ చేయడం ద్వారా, ఆ సంఘటనలు ఎలా బయటపడ్డాయో వేరే వెర్షన్ ఉన్న ఇతర బంధువులు మరియు స్నేహితులతో ఆ వాస్తవాలను మరింతగా తనిఖీ చేయడం అవసరం పడడంతో ఆలస్యంగా సిద్ధమయ్యాయి. చాలా కథలను ఆమె తల్లిదండ్రులు ఆమెకు చెప్పారు, వారు యునైటెడ్ స్టేట్స్‌కు మకాం మార్చినప్పుడు మాత్రమే వారి జీవితాలను బహిర్గతం చేశారు. “నా తల్లిదండ్రుల జీవితాన్ని చూసే అవకాశం నాకు లభించింది – వారి పురోగతి, వారి పోరాటాలు, వారి ఆకాంక్షలు, ఇంకా మా కోసం జీవితాన్ని అందించడానికి వారు చేసిన అన్ని ప్రయత్నాలను చూడగలిగాను” అని దీప్తి తెలిపారు. “నా తల్లిదండ్రులు నిజంగా ఎలాంటివారో తెలుసుకోవటానికి ఒక అడుగు వెనక్కి తీసుకున్నట్లుగా ఉంది.” అని వ్యాఖ్యానించారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో జపనీస్ దళాలు బర్మాను ఆక్రమించినప్పుడు మాండలేలో తన తల్లి బాల్యం గురించి, అస్సాం కొండలపై తన కుటుంబం చేసిన ప్రయాణం గురించి ఏదో ఒకరోజున రాయాలని దీప్తి ఆశిస్తున్నారు. “నేను బడీ మమ్మీ అని పిలిచే మా అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళినా తన గ్రామఫోన్‌ను తనతో తీసుకెళ్ళేది, ఈరోజున, ఆ గ్రామఫోన్ నా దగ్గర ఉంది,” ఆమె నవ్వుతూ చెప్పారామె. “నేను ఆమె గురించి నా ఇంగ్లీష్ తరగతిలో రాశాను. ఇది నేను రాసిన మొదటి వ్యాసం. నేను దానికి ‘లిటిల్ ఉమెన్ అండ్ ద గ్రామఫోన్’ అని  పేరు పెట్టాను” అన్నారు.

చివరికి, దీప్తి నావల్ చిత్ర పరిశ్రమలో తన ప్రయాణం గురించి కూడా రాయాలని యోచిస్తున్నారు, కానీ ‘ఆత్మకథ’ అనే పదాన్ని ఉపయోగించడానికి ఇష్టపడడం లేదు. “నా కవిత్వమే నేను రాయబోయే ఏకైక ఆత్మకథ” అని ఆమె అంగీకరించారు. నిజానికి, ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్‌’లో ఆమె చెప్పే కథలు తనకంటే చాలా పెద్దవి, ఆమె స్వంత జీవితం కంటే చాలా ఎక్కువ మాట్లాడతాయి. అవి పాఠకుడు తన బాల్యంలోని అమృత్‌సర్‌లోని ఒక చిన్న భాగాన్ని చూడగల రికార్డు. అవి కుటుంబం, వైవిధ్యత, కొత్త ప్రారంభంలో ఉన్న దేశపు వేడుక. ముఖ్యంగా, “ఇది బాలికల పసితనం గురించి. ఇది బాలికగా ఉండటం వల్ల కలిగే ఆనందం గురించి” అని దీప్తి నావల్ జోడించారు.

Exit mobile version