సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
దర్శకనిర్మాత, స్క్రీన్ రైటర్ అమియా చక్రవర్తి:
అమియా చక్రవర్తి నవంబర్ 30, 1912 నాడు బెంగాల్ (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది) లోని బోగ్రాలో జన్మించారు. చక్రవర్తి చిన్నతనంలో స్థానిక నాటక సమాజాలలో చురుకుగా ఉండేవారు. ఆయన స్వాతంత్ర్యోద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు, గాంధీగారి అనుచరులు. దండి యాత్ర తర్వాత, ఉద్యమ నాయకులందరినీ అరెస్టు చేసినప్పుడు, సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఆయన జైలు పాలయ్యారు. 1935లో స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన కార్యకలాపాల కారణంగా ఆయన బెంగాల్ విడిచి వెళ్ళవలసి వచ్చింది.
చక్రవర్తి సినీ ప్రస్థానం 1940లలో ప్రారంభమైంది, ఈ కాలంలో భారతీయ సినిమా ఒక ముఖ్యమైన సాంస్కృతిక శక్తిగా ఎదిగింది. స్క్రీన్ రైటర్ నిరంజన్ పాల్ కుమారుడు కాలిన్‌కు ట్యూటర్‌గా చక్రవర్తి పనిచేశారు, ఫలితంగా ఆయన బాంబే టాకీస్‌లో చేరారు. హిమాన్షు రాయ్, దేవికా రాణి, ఎన్ఆర్ ఆచార్య, నజం నఖ్వీ, జ్ఞాన్ ముఖర్జీ వంటి ప్రఖ్యాత వ్యక్తుల మార్గదర్శకత్వంలో పనిచేస్తూ, స్క్రీన్ రైటర్‍గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. బాంబే టాకీస్‌లో, ఆయన నజం నఖ్వీ ‘పునార్ మిలన్’ (1940)తో తన కెరీర్‌ను ప్రారంభించారు, ఆ తర్వాత ‘బంధన్’ (1940)కు స్క్రీన్‌ప్లే రాశారు.
1941లో దేవికా రాణి, అశోక్ కుమార్ నటించిన ‘అన్‍జాన్’ చిత్రంతో అమియా చక్రవర్తి దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది, విమర్శకుల ప్రశంసలు పొంది, ఆయన్ని ప్రతిభావంతులైన దర్శకుడిగా స్థిరపరిచింది. వారి రెండవ చిత్రం ‘బసంత్’ (1941)లో, ముంతాజ్ శాంతి, ఉల్హాస, మధుబాల నటించారు, ఈ చిత్రంలో మధుబాల తొలిసారి తెరపై కనిపించారు.
చక్రవర్తి దర్శకత్వం వహించిన 1944 చిత్రం ‘జ్వార్ భాట’ ద్వారా దిలీప్ కుమార్ అరంగేట్రం చేశారు. అన్ని కాలాలలో అత్యంత విజయవంతమైన ఇద్దరు సినీ తారల అరంగేట్రంలో అమియా చక్రవర్తి ఎలా భాగమయ్యారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది, వారిద్దరు కూడా దురదృష్టవంతులైన ప్రేమికులు. తొలి విజయం తర్వాత, ఆయన మేరా సుహాగ్ (1947), గర్ల్స్ స్కూల్ (1949), గౌణ (1950), బాదల్ (1951) వంటి చిత్రాలను తీశారు.
1952లో, ఆయన దిలీప్ కుమార్, నిమ్మీ నటించిన ‘దాగ్’ చిత్రానికి దర్శకత్వం వహించారు, ఇది చక్రవర్తి రూపొందించిన కళాఖండాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. తన గతంతో పోరాడుతూ విముక్తి కోరుకునే వ్యక్తి కథను చెబుతుందీ సినిమా. ఈ చిత్రం శక్తివంతమైన కథనం, నటీనటుల చక్కని నటన విమర్శకుల ప్రశంసలు పొందాయి. సినిమా వాణిజ్యపరంగా గొప్ప విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి, దిలీప్ కుమార్ ఉత్తమ నటుడిగా ప్రారంభ ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు.
చక్రవర్తి కెరీర్‌లో మరో ముఖ్యమైన చిత్రం, ‘పతిత’ (1953). దేవ్ ఆనంద్, ఉషా కిరణ్ నటించారు. ఈ చిత్రం సామాజిక అన్యాయం, విముక్తి వంటి ఇతివృత్తాలను చర్చించింది, సంక్లిష్టమైన విషయాలను సున్నితత్వంతో నిర్వహించగల చక్రవర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
నూతన్, బలరాజ్ సాహ్ని నటించిన ‘సీమ’ (1955) సినిమా చక్రవర్తి అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో ఒకటి. సమాజంలో తన స్థానాన్ని కనుగొనేందుకు ఇబ్బందులు పడుతున్న ఓ యువతి కథ బాగా ప్రశంసలు పొందింది. ఉత్తమ కథకు ఫిలింఫేర్ అవార్డు, నూతన్‌కు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.
ఆయన చివరి చిత్రం ‘దేఖ్ కబీరా రోయా’ (1957), అనితా గుహ, అనూప్ కుమార్, జవహర్ కౌల్, అమీత వంటి ప్రతిభావంతులైన తారాగణం నటించిన హాస్య చిత్రం. ఈ సినిమా లోని లైట్-హార్టెడ్ నెరేటివ్, చిరస్మరణీయ నటనలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. రంజన్, కామిని కౌశల్, షకీలా నటించిన ‘షహెన్‌షా’ (1953),; ప్రదీప్ కుమార్, మాలా సిన్హా నటించిన ‘బాద్‌షా’ (1954); అలాగే వైజయంతిమాల, బలరాజ్ సాహ్ని నటించిన 1957 నాటి మ్యూజికల్ ‘కట్‌పుత్లీ’కి కూడా ఆయన దర్శకత్వం వహించారు.
భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి ఆయన సినిమాలకు మించి విస్తరించింది. దిగ్గజ నటుడు దిలీప్ కుమార్, మధుబాల, ఉషా కిరణ్, జవహర్ కౌల్ వంటి ఎందరో ప్రతిభావంతులను గుర్తించి, అవకాశాలిచ్చిన ఘనత ఆయనకు దక్కింది.
చక్రవర్తి – కమలా చక్రవర్తి అని కూడా పిలవబడే సరస్వతి శాస్త్రిని వివాహం చేసుకున్నారు. అమియా చక్రవర్తి మార్చి 6, 1957న 44 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన అకాల మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.