సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
స్వరకర్త సర్దార్ మాలిక్:
సర్దార్ మాలిక్ (13 జనవరి 1925 – 27 జనవరి 2006), సంగీత దర్శకుడిగా 600 కి పైగా పాటలు స్వరపరిచిన సంగీత స్వరకర్త. అయితే, అనూ మాలిక్ తండ్రిగా గుర్తింపు రావడం ఆయన దురదృష్టం. అదే సర్దార్ మాలిక్ విషాద గాథ. భారతీయ సినిమా స్వర్ణ యుగంలో శంకర్ జైకిషన్, సి రామచంద్ర, ఓపీ నయ్యర్, నౌషాద్, ఇంకా ఎస్డీ బర్మన్‌లు అగ్రశ్రేణి తొలి ఐదుగురు స్వరకర్తలు.
సర్దార్ మాలిక్ ఉదయ్ శంకర్ సంస్థలో బ్యాలె, యోగాతో సహా కథకళి, మణిపురి, భరతనాట్యంలలో శిక్షణపొందిన కొరియోగ్రాఫర్. సారంగ వాద్యనిఫుణుడైన సర్దార్ మాలిక్ చలనచిత్ర సంగీతపు స్వర్ణ యుగానికి చెందినవారు. అతను తన సమకాలీనుల వలె వందలాది చిత్రాలకు సంగీతం అందించకపోవచ్చు, కానీ సర్దార్ మాలిక్ స్వరపరిచిన దేనికైనా ఆయన స్వంత ప్రత్యేక శైలి ఉంది.
సర్దార్ మాలిక్ 1925 జనవరి 13న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని కపుర్తలలో జన్మించారు. ఆయన ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ వద్ద సంగీతం నేర్చుకున్నారు. అల్మోరాలోని రెసిడెన్షియల్ స్కూల్‌లో ప్రఖ్యాత నాట్య గురువు ఉదయ్ శంకర్ వద్ద నృత్యంలో శిక్షణ పొందారు. అల్మోరాలో ఉన్న రోజుల్లో, గురుదత్ కూడా అక్కడే నృత్యం నేర్చుకున్నారు. గురుదత్ చిన్న వయసులోనే సినిమాల్లో చేరి తన సొంత రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఉదయ్ శంకర్ అంచనా వేశారు, సర్దార్ మాలిక్ తన తరువాతి రోజుల్లో ప్రసిద్ధి చెందుతారని ఆయన అంచనా వేశారు. ఉదయ్ శంకర్ తన ఇద్దరు శిష్యుల భవిష్యత్తును గురించి ఎంత గొప్పగా ఊహించారో!
సర్దార్ మాలిక్ మరో నృత్యకారుడు మోహన్ సెహగల్‌తో పరిచయం పెంచుకున్నారు. వారు సినిమాల్లో కొరియోగ్రాఫర్‌లుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయ్ శంకర్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, గురుదత్ పూనా (ఇప్పుడు పూణె)లోని ప్రభాత్ ఫిల్మ్ కంపెనీలో కొరియోగ్రాఫర్‌గా చేరారు, తరువాత దర్శకుడిగా మారి తన సొంత క్లాసిక్‌లలో నటించారు.
సర్దార్ మాలిక్, మోహన్ సెహగల్ కూడా కొరియోగ్రాఫర్‌లుగా ఒక చిత్రంలో అవకాశం పొందారు, వారికి రూ.3,000 పారితోషికం లభించింది. కానీ పరిస్థితులు వారికి అనుకూలంగా మారలేదు, పైగా తెలియకుండానే వారు వివాదంలో చిక్కుకున్నారు. భవిష్యత్తులో కొరియోగ్రాఫర్లుగా ఉండకూడదని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. మోహన్ సెహగల్ దర్శకత్వం వైపు మళ్ళగా, సర్దార్ మాలిక్ గాయకుడయ్యారు, సంగీత దర్శకత్వం వహించారు. ఆయన ఓ ప్రతిభావంతుడైన గాయకుడు. పాటలు పాడటం, స్వరపరచడం – రెండు విభాగాల్లోనూ అవకాశాలు పొందసాగారు. రఫీ, ముకేష్ వంటి స్వతంత్ర నేపథ్య గాయకుల ఎదుగుదలను చూసిన సర్దార్ మాలిక్ తాను వారితో సరిపోలనని గ్రహించి, సంగీత దర్శకత్వానికే పరిమితమై, బొంబాయికి వచ్చారు.
సర్దార్ మాలిక్ – శృంగార గీతాల రాజు హస్రత్ జైపురి సోదరిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అను మాలిక్, దాబూ మాలిక్, అబూ మాలిక్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ముగ్గురు కుమారులు తమ తండ్రి అడుగుజాడల్లో నడిచి బాలీవుడ్‌లో సంగీత దర్శకులుగా మారారు.
1947లో జయంత్ దేశాయ్ నిర్మించిన ‘రేణుక’ చిత్రంతో సర్దార్ మాలిక్‍కు స్వరకర్తగా తొలి అవకాశం లభించింది. ఆయన రెండు పాటలు స్వరపరిచారు, రెండు సోలోలు, ఇంకా జోహ్రాతో ఒక యుగళగీతం పాడారు. గాయకుడిగా మారడానికి లూథియానా నుండి బొంబాయికి వచ్చిన రాజ్ ఖోశ్లాకు కూడా ఆయన అవకాశం ఇచ్చారు.
అయితే, ఆయన తొలి చిత్రాలు రేణుక (1947), రాజ్ (1949), స్టేజ్ (1951) పెద్దగా ప్రభావం చూపలేదు. ఆయన తొలి చెప్పుకోదగ్గ చిత్రం ‘లైలా మజ్ను’ (1953), దీనికి ఆయన గులాం మొహమ్మద్‌తో కలిసి సంగీతం అందించారు. ఠోకర్ (1953)లో తలత్ పాడిన ‘ఏ ఘమ్-ఏ-దిల్ క్యా కరూఁ..’ సంచలనం సృష్టించింది, అయితే ఆ చిత్రం గొప్ప విజయం సాధించలేదు. ‘ఆబ్-ఏ-హయాత్’ (1955)లో హేమంత్ కుమార్ పాడిన ‘మై గరీబోం కా దిల్ హూఁ వతన్ కీ జుబాన్..’ సర్దార్ మాలిక్ సృజించిన అమితంగా గుర్తుండిపోయే పాటలలో ఒకటి.
1955 నుండి 1959 వరకు, సర్దార్ మాలిక్ సంవత్సరానికి ఒక సినిమాకి మాత్రమే సంగీతం అందించారు. కానీ 1960లో విశేషంగా రాణించారు. ఆ సంవత్సరంలో అతిపెద్ద మ్యూజికల్ హిట్ అయిన ‘సారంగ’ సినిమాను అందించారు, ఇందులో సుదేష్ కుమార్, జయశ్రీ గడ్కర్ నటించారు. ఈ చిత్రం కోసం మాలిక్ 23 పాటలను రికార్డ్ చేసి, పదిహేను పాటలను ఉపయోగించారు. ‘సారంగ తేరీ యాద్ మే మై హూ బేచైన్’, ‘హాఁ దీవానా హూఁ మై ఘమ్ కా మరా హువా’ (ముకేష్), ‘లగీ తుమ్‍సే లగన్ సాథీ ఛూటే నా’ (లత/ముకేష్), ‘పియా కైసే మిలూం తుమ్‍సే మేరే పావ్ పడీ జంజీర్’ (లత/రఫీ), ‘లిఖ్ దే పియా కా నామ్ సహీ రే’ (సుమన్ కల్యాణ్‍పూర్), ‘సాథ్ జియేంగే సాథ్ మరేంగే’ (రఫీ/కోరస్) మొదలైనవి సూపర్ హిట్ అయ్యాయి. ‘సారంగ ‘(1960) చిత్రం ఒక సంగీత కళాఖండం, ఇందులో అనేక ఆల్ టైమ్ గ్రేట్ పాటలు ఉన్నాయి.
గొప్ప ప్రతిభ ఉన్నప్పటికీ, సర్దార్ మాలిక్ బి-గ్రేడ్ చిత్రాలకే పరిమితమవడం దురదృష్టం.
సర్దార్ మాలిక్ ఫిల్మోగ్రఫీ:
- 1947 రేణుక – సంగీత స్వరకర్త
- 1949 రాజ్ – సంగీత స్వరకర్త
- 1951 స్టేజ్ – సంగీత స్వరకర్త
- 1953 ఠోకర్ – సంగీత స్వరకర్త
- 1954 ఔలాద్, చోర్ బజార్ – సంగీత స్వరకర్త
- 1955 ఆబ్-ఎ-హయాత్ – సంగీత స్వరకర్త
- 1957 చమక్ చందాని – సంగీత స్వరకర్త
- 1958 టాక్సీ 555 : సంగీత స్వరకర్త
- 1959 మన్ కే ఆంశూ – సంగీత స్వరకర్త
- 1960 మెరా ఘర్ మేరే బచ్చే, సూపర్‌మ్యాన్ – సంగీత స్వరకర్త
- 1961 సారంగ, మదన్ మంజరి – సంగీత స్వరకర్త
- 1962 పిక్ పాకెట్ – సంగీత స్వరకర్త
- 1963 బచ్పన్, నాగజ్యోతి, నాగ మోహిని – సంగీత స్వరకర్త
- 1964 మహారాణి పద్మిని, జంతర్ మంతర్, రూప్ సుందరి – సంగీత స్వరకర్త
- 1965 పంచ రతన్ -సంగీత స్వరకర్త
- 1977 జ్ఞాని జీ – సంగీత స్వరకర్త
- 1978 ఆఖరీ డాకూ – స్క్రీన్ రైటర్
- 1987 మేరా లాహూ – గేయ రచయిత
సర్దార్ మాలిక్ గారి మరపురాని గీతాలు:
- సారంగ తేరీ యాద్ మే.. గానం ముకేష్, సారంగ (1960). సాహిత్యం భరత్ వ్యాస్
- హాఁ దివానా హుఁ మై.. గానం ముకేష్, సారంగ (1960).
- పియా కైసే మిలూం తుమ్‍సే.. గానం రఫీ, లతా మంగేష్కర్. సారంగ (1960)
- బహారోం కీ దునియా పుకారే తు ఆ జా.. గానం తలత్ మహమూద్, ఆశా భోస్లే. లైలా మజ్ను (1953). సాహిత్యం షకీల్ బదాయుని.
- తేరే దర్ పే అయా హుఁ ఫరీద్ లేకర్.. గానం తలత్ మహమూద్. లైలా మజ్ను (1953).
- ఏ ఘమ్-ఏ-దిల్ క్యా కరూఁ.. గానం తలత్ మహమూద్. ఠోకర్ (1953). మజాజ్ సాహిత్యం.
- మై గరీబోం కా దిల్ హూఁ వతన్ కీ జుబాన్.. గానం హేమంత్ కుమార్. ఆబ్-ఎ-హయాత్ (1955). సాహిత్యం హస్రత్ జైపురి.
- హుయె ఏ హమ్ సే నాదాన్ కీ హమ్ తేరీ మెహ్ఫిల్.. గానం లతా మంగేష్కర్. చోర్ బజార్ (1954), సాహిత్యం షకీల్ బదాయుని.
- బహారోం సే పూఛో మేరేర్ ప్యార్ కో తుమ్.. గానం ముకేష్, సుమన్ కల్యాణ్‍పూర్. మేరా ఘర్ మేరే బచ్చే (1960), సాహిత్యం హస్రత్ జైపురి.
- చందా కే దేశ్ మే రహ్తీ ఏక్ రాణీ.. గానం ముకేష్. మేరా ఘర్ మేరే బచ్చే (1960).
- సున్ మోరె రసియా సున్ మన్ బసియా.. గానం ముకేష్, సుమన్ కల్యాణ్‍పూర్. మదన్ మంజరి (1961). సాహిత్యం హస్రత్ జైపురి.
- ముఝే తుమ్‍సే మొహబ్బత్ హై మగర్ మై కహ్ నహీ సక్తా.. గానం మొహమ్మద్ రఫీ. బచ్పన్ (1963). సాహిత్యం హస్రత్ జైపురి.
- సున్ చాంద్ మేరీ యే దస్తాన్.. గానం ముకేష్, సుమన్ కల్యాణ్‍పూర్. జ్యోతి (1963). సాహిత్యం: భరత్ వ్యాస్
- యూం న హమే దేఖియే హమ్ బార్ బార్ కహ్తే హైఁ.. గానం రఫీ, సుమన్ కల్యాణ్‍పూర్. జంతర్ మంతర్ (1964). సాహిత్యం హస్రత్ జైపురి.
- ఆజ్ కీ రాత్ అజీ హోఠోం కో చుప్ రహ్నె.. గానం రఫీ, సుమన్ కల్యాణ్‍పూర్. రూప్ సుందరి (1964). సాహిత్యం భరత్ వ్యాస్
సర్దార్ మాలిక్ 2006 జనవరి 27న ముంబైలో మరణించారు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్‌లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.