సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
పేరు ప్రఖ్యాతులు పొందిన బాలనటులు:
సాజిద్ ఖాన్
తరువాత, మెహబూబ్ ఖాన్, ఆయన భార్య సర్దార్ అక్తర్, ఆ పిల్లవాడిని తమ కుమారుడిగా పెంచి, చదువుకునేందుకు అమెరికాకి పంపారు. అక్కడ సాజిద్ ‘మాయ’ (1966) సినిమాలో ప్రధాన పాత్ర పోషించి – యుక్తవయస్సులో సంచలనం సృష్టించాడు.
సాజిద్ ఖాన్ డిసెంబర్ 28, 1951న బొంబాయిలోని మురికివాడలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. మెహబూబ్ స్టూడియోస్ స్థాపకుడు, దిగ్గజ దర్శకనిర్మాత మెహబూబ్ ఖాన్ అతనిని గుర్తించాకా, అతని జీవితం మారిపోయింది. మెహబూబ్ ఖాన్ గారు తీస్తున్న ‘మదర్ ఇండియా’ (1957) సినిమా కోసం చిన్నప్పటి సునీల్ దత్ పాత్ర చిన్నారి బిర్జు పాత్ర కోసం కొంటె బాల నటుడు అవసరం. సాజిద్ సమయస్ఫూర్తి, కొంటెతనం మెహబూబ్ ఖాన్‌కు నచ్చాయి, చివరికి అతనిని ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నారు. ‘మదర్ ఇండియా’లో సాజిద్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
సాజిద్ ఖాన్ 1966 నాటి ‘మాయ’ చిత్రంలో తన పాత్ర ద్వారా, జే నార్త్‌తో కలిసి అమెరికాలో గుర్తింపు పొందాడు. ఈ సినిమా ప్రజాదరణ పొందడంతో, అదే పేరుతో టెలివిజన్ ధారావాహికగా తీశారు, ఇది సెప్టెంబర్ 1967 నుండి ఫిబ్రవరి 1968 వరకు ఎన్.బి.సి.లో ప్రసారమైంది. ఈ ప్రదర్శన, 18 ఎపిసోడ్‌లకు విస్తరించింది. సాజిద్ ఫోటోలు ప్రముఖ మ్యాగజైన్‌ల కవర్ పేజీలపై రావడంతో ‘టీన్ ఐడల్’ స్థాయి వచ్చింది. నటన మాత్రమే కాకుండా, సాజిద్, కొంత కాలం గాయకుడిగా కూడా ప్రయత్నించాడు. తన పేరుతోనే ఒక ఆల్బమ్‌ను కూడా విడుదల చేశాడు. అతని సింగిల్స్ ‘గెట్టింగ్ టు నో యు’, ‘డ్రీమ్’ US బబ్‌లో (బిల్‌బోర్డ్) వరుసగా 8 మరియు 19 స్థానాలకు చేరుకున్నాయి.
సాజిద్ టెలివిజన్ ధారావాహిక ‘ది బిగ్ వ్యాలీ’ లో ఒక ఎపిసోడ్‌లో అతిథి పాత్రలో నటించాడు. ‘ఇట్స్ హ్యాపెనింగ్’ అనే మ్యూజిక్ వెరైటీ షోలో అతిథి న్యాయనిర్ణేతగా కనిపించాడు. 1970ల తొలినాళ్ళలో, అతను ఫిలిప్పీన్స్ సినిమాల లోనూ విజయం సాధించాడు, ‘ది సింగింగ్ ఫిలిపినా’, ‘మై ఫన్నీ గర్ల్’, ‘ది ప్రిన్స్ అండ్ ఐ’ వంటి అనేక రొమాంటిక్ కామెడీ చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించాడు. ప్రముఖ ఫిలిప్పీన్స్ నటీమణులు నోరా అనోర్, విల్మా శాంటోస్ సరసన నటించాడు.
సాజిద్ ఖాన్ 1970లలో హిందీ చిత్రరంగానికి తిరిగి రావడానికి ప్రయత్నించాడు, 1972 – 1983 మధ్యలో అతని చిత్రాలేవీ ఆర్థికంగా విజయం సాధించలేదు. ఈ కాలంలో సాజిద్ – రెహానా సుల్తాన్‌తో ‘సవేరా’ (1972), ఆశా సచ్‌దేవ్‌తో ‘దో నంబర్ కే అమీర్’ (1974), ‘జిందగీ ఔర్ తూఫాన్’ (1974), యోగీతా బాలితో ‘మందిర్ మసీద్’ (1977) వంటి సినిమాల్లో నటించాడు. 1978లో సునీల్ దత్ గారి ‘డాకు ఔర్ జవాన్’లోనూ, ‘దహషత్’ (1981)లోనూ అతిథి పాత్రలలో నటించాడు.
70వ దశకం ప్రారంభంలో సాజిద్ ఖాన్‌కీ, నటి రేఖకి సంబంధం అంటూ పుకార్లు రేగాయి. అతను 1970లో జీనత్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు, వారికి సమీర్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. సాజిద్ 1990లలో తన భార్య నుండి విడిపోయి దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డాడు. తరువాత కాలంలో సాజిద్ ఆయుర్వేద చికిత్స కోసం కేరళలోని అలప్పుజాలోని కేరళీయమ్ రిసార్ట్‌లో ఉన్నప్పుడు పరిచయమైన సంజూషా ఖాన్ అనే మలయాళీ మహిళను వివాహం చేసుకున్నాడు.
తరువాత భార్యా బిడ్డలతో కేరళలోని అలప్పుజలో స్థిరపడ్డాడు. ఇక్కడే అతనికి కాన్సర్ సోకినట్టు గుర్తించారు. కాన్సర్‍తో సుదీర్ఘ పోరాటం చేసిన సాజిద్ ఖాన్ 22 డిసెంబర్ 2023న మరణించాడు. అతని కోరిక మేరకు అలప్పుజలో సమాధి చేశారు.
నటుడు సురేష్
సురేష్ అసలు పేరు నాసిమ్ అహ్మద్. 1928 డిసెంబర్ 28న పంజాబ్‌లోని ఖాడియాన్‌లో జన్మించాడు. సురేష్ ఒకటిన్నర నెలల శిశువుగా ఉన్నప్పుడే అతని తండ్రి మరణించాడు. దీని కారణంగా, ఆరుగురు తోబుట్టువులలో చిన్నవాడు కావడం వల్ల అతను చదువుకోలేకపోయాడు. అతని అన్న ఇనాయతుల్లా అప్పటికే బొంబాయిలో సినిమాల్లో పనిచేస్తున్నాడు.
సురేష్‌కి 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అన్న బొంబాయికి తీసుకువెళ్లి, బాలనటుడిగా సినిమాల్లో చేర్పించాడు. ‘సాకి’ అతని తొలి చిత్రం. అతను బాంబే టాకీస్, రంజిత్ ఫిల్మ్ కంపెనీ, సుప్రీమ్ పిక్చర్స్, ఈస్టర్ పిక్చర్స్ వంటి నిర్మాణ సంస్థలతో 25 సినిమాలు చేసాడు. బసంత్, నయా సంసార్, బంధన్, మీర్జా సాహిబాన్, థోర్, మై ఐస్, దీపావళి వంటి సినిమాలకు ప్రసిద్ధి చెందాడు. ‘దీపావళి’ తర్వాత అతన్ని భారతదేశపు ‘మిక్కీ రూనీ’గా పిలిచేవారు.
ఆ తరువాత కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలలో నటించాడు. వాటిల్లో ‘దులారీ’, ‘జాదూ’ ప్రసిద్ధం.
‘దులారీ’ సినిమాలో మహమ్మద రఫీ పాడగా, సురేష్ పై చిత్రీకరించిన ‘సుహానీ రాత్ ఢల్ చుకీ’ పాటని యూట్యూట్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=RPNMFQDISIY
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.