సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
బాలీవుడ్‍లో మెరుపులా మెరిసి మాయమైన స్టార్‍లు:
అరూన్:
అరూన్ అసలు పేరు గుల్షన్ సింగ్ అహుజా. ఆయన 1918 జనవరి 26న ప్రస్తుత పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని గుజ్రాన్‌వాలాలో జన్మించారు. 1937లో లాహోర్‌లోని మొఘల్‌పురా కాలేజీ నుంచి సైన్స్‌లో డిగ్రీ పాసయ్యారు. దీంతో ఆయన తన చదువు ముగించి, జీవనోపాధి కోసం లాహోర్ చేరుకున్నారు.
అప్పట్లో – నిర్మాత/దర్శకుడు మెహబూబ్ కొత్త ప్రతిభాశాలురని అన్వేషిస్తూ లాహోర్ వచ్చారు. 1000 మంది పోటీదారులలో అందమైన రూపం, చక్కటి శరీర సౌష్టవంతో చురుకుదనంతో ఉన్న అరూన్‌పై ఆయన దృష్టి పడింది. 1939లో మెహబూబ్ గారి ‘ఏక్ హి రస్తా’ లో హీరోగా నటించడానికి ఉత్తరాదికి చెందిన ఈ సిక్కు బొంబాయి వచ్చారు. ఆ సినిమా హిట్ అయి, అరూన్ రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. ఆఫర్లు వెల్లువెత్తాయి. తర్వాత అరూన్ – జియా సర్హాది గారి చిత్రం ‘భోలే భలే’ (1939) లో, 1940లో రాంచందర్ ఠాకూర్ గారి చిత్రం ‘సివిల్ మారైజ్’ లోనూ నటించారు. తదుపరి అవకాశం – అరూన్‌ని బొంబాయికి రప్పించిన మహబూబ్ గారి నుంచి వచ్చింది. ‘ఔరత్’ లో సదర్ అక్తర్ సరసన, హీరోగా నటించారు. మెరుగైన, నిజాయితీతో కూడిన నటన ఆయన్ని స్టార్‌ని చేసింది. నిత్య జీవితంలోనూ, సినిమాలలోను వైవిధ్యం చూపిన వ్యక్తి అరూన్.
1940లు, 1950ల ప్రారంభంలో నేషనల్ స్టూడియోస్, రంజిత్ స్టూడియోస్, సాగర్ మూవీటోన్ వంటి చలనచిత్ర నిర్మాణ సంస్థలకు ప్రముఖ నటుడిగా, సహాయక పాత్రలను పోషిస్తూ 30కి పైగా చిత్రాలలో నటించారు అరూన్. నేపథ్య గానానికి నేపథ్య గాయకులను ఉపయోగించే ముందరి రోజుల్లోని పద్ధతి ప్రకారం ఆయన తన చాలా చిత్రాలలో పాటలు పాడారు. తన కెరీర్ మొత్తంలో శోభనా సమర్థ్, మోనికా దేశాయ్, మఖుర్షీద్ బానో వంటి నటీమణులతో జతకట్టారు. తనతో సవేరా (1942), చాలిస్ కరోడ్, ఘున్‌ఘట్ (1946) వంటి చిత్రాలలో నాయికగా నటించిన నిర్మలా దేవినే వివాహం చేసుకున్నారు. వెండితెరపై వీరిది ఆకర్షణీయమైన జోడీ [సవేరా చిత్రానికి పని చేస్తున్నప్పుడు వారు వివాహం చేసుకున్నారు]. 1948లో, ఆయన స్వంత నిర్మాణ సంస్థ ‘అరుణ్ ప్రొడక్షన్స్’ ను స్థాపించి ‘సెహ్రా’ అనే చిత్రాన్ని నిర్మించి, నటించారు. సెహ్రా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. అరూన్ ఆర్థిక నష్టాలను చవిచూశారు, ఈ కారణంగా ఆయన కెరీర్ కూడా పతనమైంది. తర్వాత ‘జో హై సాజన్’ అనే మరో చిత్రాన్ని నిర్మించారు, అది అసలు విడుదల కాలేదు.
1950వ దశకం ప్రారంభంలో, సినిమా ఆఫర్లు పూర్తిగా ఆగిపోయాయి, ‘ఔలాద్’ (1954, చివరి చిత్రం) తర్వాత ఆయన చిత్ర పరిశ్రమను విడిచిపెట్టారు. తన హోమ్ ప్రొడక్షన్స్ నుండి నష్టాలను చవిచూసిన ఫలితంగా, ముంబైలోని బాంద్రాలోని కార్టర్ రోడ్‌లోని తన బంగ్లాను విక్రయించారు. 1960ల ప్రారంభంలో కుటుంబాన్ని విరార్‌లోని చాల్‌కి మార్చారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యం పాడయ్యింది. దాంతో భర్తనీ, ముగ్గురు కుమార్తెలు పుష్ప, పద్మ, కామిని; ఇంకా ఇద్దరు కొడుకులు కీర్తి కుమార్, గోవింద లను పోషించడానికి అరూన్ సతీమణి నిర్మల రేడియోలోనూ, టూరింగ్ కచేరీలలో గాయనిగా పని చేయాల్సి వచ్చింది. చిన్న కొడుకు గోవింద 1980-90లలో సూపర్ స్టార్‌గా ఎదిగారు.
సినిమా రంగాన్ని విడిచిపెట్టి ఏకాంత జీవితాన్ని గడిపిన అరూన్ 1998లో 81 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు.
ఎ. హిమాలయావాలా:
మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న ది హిమాలయా డ్రగ్స్ కంపెనీలో తమ అన్నగారికి సహకరించేందుకు చదువు మధ్యలోనే ఆపేసారు.
కానీ 10 ఏళ్ల తర్వాత తన సోదరుడితో విభేదాల కారణంగా కంపెనీ నుంచి వైదొలిగారు.
సినిమాల్లో చేరాలనే కలను సాకారం చేసుకునేందుకు బొంబాయికి వెళ్లారు.
తన అందంతో, MS మీర్జా దర్శకత్వం వహించిన ‘కిస్ – కీ – బీవీ’లో కథానాయకుడి పాత్రలో చక్కగా రాణించారు. సినిమా హిట్ అయింది. తరువాత – మాతా, విశ్వాస్, ఆంఖ్ కీ శరమ్, దోస్త్ మొదలైన 15 చిత్రాలలో హీరోగా నటించారు. ‘హుమాయాన్’లో హైదర్ మీర్జాగా ఆయన పాత్ర చాలా ప్రశంసలు తెచ్చిపెట్టింది.
కానీ, కొన్నేళ్ళకే ఆయన చిత్ర పరిశ్రమలో నిరుత్సాహానికి గురై, సినిమాలకు దూరమయ్యారు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.