సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
స్వరకర్త ఎస్.ఎన్. త్రిపాఠి:
ఆయనకి మొదటి నుంచీ సంగీతంపై ఆసక్తి ఉండేది. అందుకే, శాస్త్రీయ సంగీతంలో శిక్షణ కోసం లక్నోలోని మారీస్ కళాశాలలో (ప్రస్తుతం వి.ఎన్. భత్కాండే సంగీత సంస్థ) చేరారు. అదే సమయంలో, ఆయన తేలికపాటి శాస్త్రీయ, జానపద సంగీతంలో ప్రైవేట్‌గా శిక్షణపొందారు. మారీస్ కాలేజీలో, ఆయన గురువు ఖుర్షీద్ మినోచెర్ హోంజీ. ఆవిడ సంగీత దర్శకురాలు సరస్వతీ దేవిగా ప్రసిద్ధులు. ఆవిడ త్రిపాఠి ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నారు. మూవీ మొగల్ హిమాన్షు రాయ్ [వారి ‘కర్మ’ చిత్రం ప్రదర్శనకు సంబంధించి] మారీస్ కాలేజీని సందర్శించినప్పుడు, బాంబే టాకీస్‌తో పనిచేసేందుకు ఆవిడతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆవిడ తనతో పాటుగా త్రిపాఠిని ఆహ్వానించారు. ఇది 1935 లో జరిగింది. ఆయన అక్కడ వయోలిన్ వాద్యకారుడిగా చేరి ‘జీవన్ నయ్య’ చిత్రానికి పనిచేశారు, ఆ సినిమాలో నటించారు కూడా. అది చిన్న పాత్ర అయినప్పటికీ, ఆయన ఒక పాట (అయి రి దైయ్యా లచక్ లచక్) పాడవలసి వచ్చింది. ఆ సమయంలో, నటన అనేది ఒక అభిరుచి మాత్రమే; ప్రాధాన్యత మాత్రం ఎప్పుడూ సంగీతమే. ఆయన 1939 వరకు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ చేరినప్పుడు, వారికి నెలకు 100 రూపాయలు జీతం ఇవ్వగా, క్రమక్రమంగా నెలకు 300 రూపాయల వరకు పెంచారు. సరస్వతీ దేవి గారి వద్ద పనిచేసిన కొద్దికాలంలోనే, ఆవిడ ఆయనకి నొటేషన్స్ ఎలా వ్రాయాలో, మ్యూజిక్‍ని ఎలా అరేంజ్ చేయాలో నేర్పారు.
నటుడిగా అరంగేట్రం చేసిన పదేళ్ల తర్వాత మళ్లీ నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం ‘ఉత్తర అభిమన్యు’ (1946). దీనికి ఆయనే సంగీతం అందించారు. రవీంద్ర సంగీతంపై తన స్వరాల ఆధారంగా, ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన మెలోడీలను అందించారు. ఈ సినిమా ఆయన నటజీవితానికి ఊపునిచ్చింది. 1948లో, అతను ‘శ్రీరామ్ భక్త హనుమాన్’ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చి, హనుమంతుని పాత్ర పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. దాంతో త్రిపాఠి దర్శకత్వం వైపు మళ్ళారు. తొలిసారిగా తన దర్శకత్వంలో ‘రామ్ హనుమాన్ యుద్ధ్’ (1959) తీశారు. తరువాత అనేక ఇతర పౌరాణిక సినిమాలలో హనుమంతుడిగా నటించారు.
అయితే కాలం మారింది, పౌరాణిక చిత్రాల స్థానంలో చారిత్రక, ఫాంటసీ సినిమాల రాక మొదలైంది. కానీ అనేక సంగీత శైలులలో ప్రావీణ్యం ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్.ఎన్. త్రిపాఠి మళ్ళీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు.
ఆయన ముక్కుసూటి మనిషి, స్నేహశీలి. ఎవరినైనా తన చిరునవ్వుతో గెలిచేవారు. ఆయన బాడీ బిల్డింగ్‌ను చాలా ఇష్టపడేవారు, ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేసేవారు. దాంతో ఆయనకి చక్కని ఆకృతి గల దృఢమైన శరీరం, ఆకర్షించే రూపం లభించాయి.
నటి వనమలను వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఆయన బొంబాయిలోని విలే పార్లేలోని రాసిక్ విల్లాలో నివసించేవారు.
75 సంవత్సరాల వయస్సులో 28 మార్చి 1988 నాడు మరణించారు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.