Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 250

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

దిగ్గజ సరోద్ విద్వాంసురాలు జరీన్ దారూవాలా శర్మ:

18 ఏళ్ళ వయస్సులో సినిమాల కోసం సరోద్ వాయించటం ప్రారంభించినప్పుడు, బొంబాయి సినీ స్టూడియోస్‌లో అప్పట్లో అందరూ పురుషులే ఉండటం, మహిళలు లేకపోవడంతో, జరీన్ గారిని ‘ఆ పార్శీ పిల్ల’ అని పిలిచేవారట. తరువాతి కాలంలో జరీన్ గొప్పగా రాణించి, పాటలో అయినా, నేపథ్య సంగీతంలోనైనా సరోద్ వినిపించాలంటే, తనే కావాలి అనేంతగా పేరు తెచ్చుకున్నారు. ఉన్నతస్థాయి కళాకారిణిగా, సరోద్ విద్వాంసురాలిగా కీర్తిప్రతిష్ఠలు పొందారు.

9 అక్టోబరు 1946న జన్మించిన జరీన్‌ను, భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించమని పోలీసు అధికారైన ఆమె తండ్రి ప్రోత్సహించారు. నాలుగు సంవత్సరాల వయస్సు నుండి హార్మోనియం నేర్చుకోవడం ప్రారంభించి, ఆరేళ్ళ వయసు నుంచి వేదికలపై ప్రదర్శనలివ్వసాగారు. అయితే, 1952లో స్వామి హరిదాస్ సంగీత సమ్మేళనంలో రవిశంకర్-అలీ అక్బర్ ఖాన్ జుగల్బందీ విన్నప్పుడు ఆమె సరోద్‌‌ని ఇష్టపడ్డారు. పండిట్ హరిపాద ఘోష్ వద్ద మౌలిక శిక్షణ పొందారు, తరువాత పండిట్ భీష్మదేవ్ వేది, గాయకుడు ఎస్.సి.ఆర్. భట్, లక్ష్మణ్ ప్రసాద్ జైపూర్వాలే, ఎస్.ఎన్. రతంజన్కర్, ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు వి.జి. జోగ్ వంటి వారి నుంచి కూడా మెలకువలు నేర్చుకున్నారు.

బాల మేధావిగా గుర్తింపు పొందారు. 50వ దశకం చివరిలో ‘మాసూమ్’ (1960లో విడుదలైంది) కోసం టైటిల్ మ్యూజిక్‌ని ప్లే చేయడం ద్వారా ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. ఈ చిత్రంలో ‘నానీ తేరీ మోర్ని కో’ పాట అత్యంత జనాదరణ పొందింది. అయితే, నాలుగు సంవత్సరాల తర్వాత సినీ పరిశ్రమతో ఆమె అనుబంధం బలపడింది. పీరియడ్ డ్రామా ‘చిత్రలేఖ’ (1964) టైటిల్ మ్యూజిక్ కోసం సంగీత దర్శకుడు రోషన్ ‘సితార్-సరోద్’ల యుగళం కోరినప్పుడు, సితార్ వాద్యకారుడు ఇమ్రత్ ఖాన్, జరీన్ గారి పేరు సూచించారు. జరీన్, ఆమె తండ్రీ దీన్ని ఊహించలేదు. సరేనన్నారు. రికార్డింగ్ బాగా జరిగింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రికార్డ్ చేయడానికి మరుసటి రోజు జరీన్ రాగలరా అని రోషన్ ఆమె తండ్రిని అడిగారు.

దాంతో, మర్నాడు, తండ్రీ కూతుర్లిద్దరూ బాంద్రా పరిసరాల్లోని మెహబూబ్ స్టూడియోకి వచ్చారు. ఈసారి ఆర్కెస్ట్రా మొత్తం బృందం అక్కడే ఉంది. దాంతో యువ జరీన్ కాస్త బెదిరిపోయారు. మరైతే వెళ్ళిపోదామా అని తండ్రి అడిగితే, అది మంచిది కాదని ఆమె భావించారు, వేచి ఉన్నారు.

కొన్ని గంటల తర్వాత, ఆమె వంతు వచ్చింది. కొన్నాళ్ల తర్వాత, ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ, “నేను సరోద్ వాయించడం ప్రారంభించినప్పుడు, చుట్టూ నిలబడి ఉన్న సంగీతకారులందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను స్త్రీని, సరోద్ వాయించే స్త్రీలు చాలా చాలా అరుదు. పైగా, సినీరంగంలో చాలా తక్కువ మంది మహిళలు ఉన్నారు, కాబట్టి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఇంతకు ముందెన్నడూ సరోద్‌ని చూడలేదేమోనని అనిపించింది. నేను సినిమాల కోసం సరోద్ వాయిస్తున్న 18 ఏళ్ల పార్సీ అమ్మాయిని కాబట్టి నా గురించి ప్రజలు తెలుసుకున్నారు” అని చెప్పారు జరీన్.

సరోద్‌ నేర్చుకోవడం కష్టమని చాలా మంది అనుకుంటారనీ, ఎందుకంటే దాన్ని వాయించడానికి ఎంతో ఓర్పు అవసరమని అన్నారు జరీన్. “సరోద్‌పై నైపుణ్యం సాధించటం కష్టం అనటం ఒక అపోహ. సితార్‌కు మెట్లు ఉంటాయి, దాన్ని వాయించేవారు ఐదు లేదా ఆరు నోట్‌ల వరకు ఒత్తిడి కలిగించడానికి ఒకే మెట్టుని ఉపయోగిస్తారు. అంటే, ప్రతి వాయిద్యానికీ దానికంటూ స్వంత మార్గం ఉంటుంది” చెప్పారామె.

సినీ సంగీత విద్వాంసుల పట్ల ఆ రోజుల్లో శాస్త్రీయ సంగీత కళాకారులకు చిన్న చూపు ఉండేది. సినీ సంగీత కళాకారులు – స్వరకర్తలు, మ్యూజిక్ కండక్టర్స్ వ్రాసిన నొటేషన్స్ ద్వారా సంగీతం వాయించే సెషన్ మ్యుజీషియన్స్ అనీ, వారికి సొంతంగా సృజనాత్మకత ఉండదనే దురభిప్రాయం ఉండేది. జరీన్ దారువాలా శర్మ రెండు చిత్రాలలో మెరిసారు, అలాగే శాస్త్రీయ సంగీతంలో కూడా విశేషంగా రాణించారు.

“నేను దృఢ సంకల్పంతో సంగీతం నేర్చుకున్నాను, జైపూర్‌వాలే ఒకసారి ఓ టప్పా (ఉత్తర భారతదేశపు జానపద గీతం) హమ్ చేయడం గమనించాను. నాకు నేర్పించమని అభ్యర్థించాను. ఆ కష్టమైన నమూనాలను సరోద్‌పై పలికించటం సాధ్యం కాదని ఆయన భావించారు. కఠోరమైన అభ్యాసం తరువాత, నేను దానిని చేయగలను” ఆమె తెలిపారు. జరీన్ సరోద్‌పై టప్పాలను అలవోకగా ప్రదర్శిస్తూ, తనదైన శైలిని రూపొందించుకున్నారు – గాయని, వాద్యకారిణిల ఆకర్షణీయమైన సమ్మేళనం అది.

మొదటిసారిగా ‘మాసూమ్’ (1960) సినిమాకి టైటిల్ స్కోర్‌ ఇచ్చారు జరీన్. తర్వాత, ఆమె రోషన్, శంకర్ జైకిషన్, రవీంద్ర జైన్, కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్.డి. బర్మన్ మొదలైన అగ్రశ్రేణి స్వరకర్తలందరితోనూ పనిచేశారు.

 

బాంబే ఫిల్మ్ స్టూడియోలో పరిచయమైన సితార్ విద్వాంసుడు, హుస్న్‌లాల్ – భగత్‌రామ్ స్వరకర్తల జోడీ లోని భగత్‌రామ్ గారి కుమారుడు, పండిట్‌ అశోక్ శర్మను జరీన్ వివాహం చేసుకున్నారు. పండిట్ జైరామ్ ఆచార్య, ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్, ఉస్తాద్ రైస్ ఖాన్ తదితర సితార్ కళాకారుల సితార్ నైపుణ్యాలకు తన సరోద్ నైపుణ్యాలని జోడించారు జరీన్.

జరీన్ దారువాలా అనేక పాటల్లో సరోద్‌పై ఎన్నో సోలో పీస్‌‌లు వాయించారు. ఆమె సరోద్ పలికించిన కొన్ని పాటలను చూద్దాం:

బోలే రే పాపిహార | ఇస్ మోడ్ సే జాతే హై | నామ్ గమ్ జాయేగా | మేరే నైనా సావన్ భాదో | పియా బావరి | మన్ రే తు కాహే నా | బేచారా దిల్ క్యా కరే | కోయీ మత్వాలా ఆయా మేరే ద్వారే | సజన్వా బైరి హో గయే | బీతీ నా బితాయి రైనా | ఆ రి పవన్ డుంఢే కిసే | హుమే తుమ్సే ప్యార్ కిత్నా |

జరీన్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డు, మహారాష్ట్ర గౌరవ్ పురస్కారంతో పాటు అనేక పురస్కారాలను గెలుచుకున్నారు. హర్ మెజెస్టీ, బ్రిటీష్ క్వీన్ – భారతదేశాన్ని సందర్శించినప్పుడు వారి ముందు ప్రదర్శన ఇచ్చే అవకాశం జరీన్ గారికి లభించింది.

ఏప్రిల్ 8, 2011న ముంబైలో జరిగిన ‘స్వర్ ఆలాప్‌’ అనే కార్యక్రమంలో, పండిట్ జరీన్ దారువాలా శర్మ, పండిట్ అశోక్ శర్మలను ఘనంగా సత్కరించారు. లెజెండరీ కంపోజర్ రవీంద్ర జైన్, డాక్టర్ సుశీలా రాణి పటేల్, పద్మశ్రీ డాక్టర్ ఎన్. రాజం, ప్రముఖ హాస్యనటుడు జానీ లీవర్ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. పండిట్ జరీన్ దరువాలా శర్మ మాట్లాడుతూ.. “ప్రతి పాటకు సమాన విలువలు ఉంటాయి. నేను ‘స్వర్ ఆలాప్‌’కు కృతజ్ఞురాలిని. వారు మా ఇద్దరి పట్ల గౌరవంగా ఉన్నారు. స్వర్ ఆలాప్ భవిష్యత్తులో మరింత విస్తరించి ఉన్నత స్థితికి చేరుతుందని ఆశిస్తున్నాను. వారి ప్రయత్నాలు గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సరోద్ విద్వాంసురాలిగా ఆమె కృషికి – పండిట్ జరీన్ దారువాలా శర్మను సంగీతంపై అభిరుచి ఉన్నవారు; ఎంచుకున్న రంగంలో తమ వృత్తిని కొనసాగించడానికి ఇష్టపడే మహిళా సంగీతకారులు ఆమెను స్ఫూర్తిగా స్వీకరిస్తారు. ఆమెను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. తరువాతి కాలంలో, పంటిట్ జరీన్ దారువాలా తన భర్త అశోక్ శర్మతో కలిసి అంధేరిలో నివసించారు. జరీన్ 20 డిసెంబర్ 2014 తేదీన మరణించారు.

Exit mobile version