సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
శిధిలమై, ఒకనాటి వైభవానికి ఆనవాలుగా మిగిలిన ఎన్.టి.ఆర్. ఇల్లు:
చెన్నై నగరం ఆధునికమవుతూ, విస్తరిస్తూ పోతోంది. ఈ క్రమంలో ఎన్నో అలనాటి సుప్రసిద్ధ భవంతులు, కొందరు ప్రముఖుల ఇళ్ళు శిధిలమై కనుమరుగయ్యాయి. అలాంటి వాటిలో ఒకటి, ఒకప్పుడు నటరత్న నందమూరి తారకరామారావు గారు నివసించిన ఇల్లు. మద్రాసులోని టి నగర్‌లోని 59/28 బజుల్లా రోడ్‌లోని ఎన్టీఆర్ ఇల్లు ఒకప్పటి వైభవానికి చిహ్నం.
నటుడిగా మద్రాసులో స్థిరపడిన తర్వాత ఎన్.టి.ఆర్. రంగరాజపురంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నారు. అప్పట్లో ఆయన ఓ కుక్కని కూడా పెంచుకునేవారు. తర్వాత 1953లో ప్రముఖ తెలుగు హాస్యనటుడు కస్తూరి శివరావు నుంచి కొనుగోలు చేసిన బజుల్లా రోడ్డులోని ఇంటికి మారారు. పాత ఇంటిని, పెంపుడు కుక్కను తన తమ్ముడు త్రివిక్రమరావుకు అప్పగించారు.
కొత్త ఇంటిని రామారావు తనకు కావల్సిన విధంగా రీ-మోడల్ చేయించుకున్నారు. ఎన్టీఆర్ గది, పిల్లల గదులు మొదటి అంతస్తులో ఉండగా, గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీసు, మేకప్ రూమ్, ఇంకా విజిటర్స్ రూమ్ ఉండేలా ఆ 8000 చదరపు అడుగుల ఇంటిని మార్చుకున్నారు.
నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, చాలా మంది అభిమానులతో రామారావు గారి ఇల్లు చాలా హడావిడిగా ఉండేది.
తిరుపతికి వచ్చేవారు ఎన్టీఆర్‌ని చూసేందుకు ఈ ఇంటికి కూడా వచ్చేవారు. దూరప్రాంతాల నుంచి వచ్చే అభిమానులకు భోజనం, ఉండేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు ఎన్.టి.ఆర్. చాలా మంది ఆ ఇంటిని ఓ దేవాలయంగా భావించేవారు.
ఎన్టీఆర్ తెల్లవారుజామున 3:30 గంటలకు నిద్ర లేచి 6 గంటలకు అల్పాహారం తీసుకునేవారు. ఉదయం 7 గంటలకు మేకప్‌తో సిద్ధమై – గేట్ వద్ద వేచి ఉన్న తన అభిమానులను ఆప్యాయంగా పలకరించేవారు. వారి స్వస్థలాలను అడిగి, షూటింగ్ చూపించేందుకు ఏర్పాట్లు చేసేవారు. అదంతా ఉజ్జ్వలమైన గతం!
ఇప్పుడు బజుల్లా రోడ్ చాలా మారిపోయింది. ఈ రహదారిని రంగరాజపురంకి కలుపుతూ పొడవైన ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల రామారావు గారిల్లు మరుగుజ్జుగా మారింది. అప్పటికే, ఆ ఇంట్లో ఎవరూ నివసించనందున పాడుబడింది.
రాజకీయ నాయకుడిగా మారిన నటుడి మరణంతో ఆ ఇంటి వైభవం పోయింది. రోజులు గడిచే కొద్దీ నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడం వల్ల ఆ ఇల్లు శిధిలంగా మారిపోయింది.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.