[ఇటీవల కన్నుమూసిన సినీనటి పద్మశ్రీ బి.సరోజాదేవికి నివాళిగా ఈ రచన అందిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]
ఆమె స్వరంలో పంచవన్నెల చిలుకల పంచదార పలుకులు ఉన్నాయి. కృష్ణవేణీ తరంగాల గలగలలున్నాయి. కోకిల కలకూజితాలు ఉన్నాయి. ఆమె కదలికలో రాయంచ నడకల కులుకులు ఉన్నాయి. ఆమె నవ్వులో శతకోటి చంద్రికల శరత్ జ్యోత్స్నులు ఉన్నాయి. ఆమె సోయగానికి ముగ్దులై కవులు కవిత్వం చెప్పారు. ఆమే సినీనటి బి.సరోజాదేవి.
‘అద్దములో నీ చెలువు తిలకించకు ప్రేయసీ, అలిగేవు నీ సాటి చెలిగా తలపోసి! ఆ సుందరి నెఱ నీకు నీ గోటికి సమమౌనా!’ అన్నారు సముద్రాల ‘అమరశిల్పి జక్కన’ చిత్రంలో. చెలువు, చెలువము అంటే సౌందర్యము అనీ, నెఱ అన్నా అందం అనీ అర్ధాలు. అద్దంలో నీ సౌందర్యం చూడకు ప్రేయసీ! అది నీ ప్రతిబింబమని మరిచి ఇంకో సుందరి ఎవరో నీకు పోటీ వస్తుందని అలక బూనుతావేమో! ఒకవేళ అలాంటి సుందరి ఎవరైనా ఉన్నా ఆమె సౌందర్యం నీ కాలిగోటికి కూడా సరిపోదు అని భావం. ఇది సినిమాలో ప్రేయసీ ప్రియులను ఉద్దేశించి రాసినా బి. సరోజాదేవి సౌందర్యం చూస్తే అలాంటి కవిత్వం అలవోకగా వస్తుందేమో! అనిపిస్తుంది.
సౌందర్యానికి తోడు ఏ పాత్రనైనా సమర్ధవంతంగా తెరపై ఆవిష్కరించగల నటనా ప్రతిభ తోడై సువర్ణానికి సువాసన అబ్బినట్లుంటుంది సరోజాదేవిని చూస్తే! అందుకే ప్రేక్షకులు ఆమెను ‘అభినయ సరస్వతి’ అని అభిమానంగా పిలుచుకుంటారు. ప్రభుత్వం అయితే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి బిరుదులతో ఆమెను సత్కరించింది.
పద్మభూషణ్ పురస్కారం ప్రకటించినప్పుడు వార్తా పత్రికలు అన్నీ ఆమె పేరు ‘బైరప్ప సరోజాదేవి’ అని ప్రచురించాయి. కానీ ఆమె ‘బైరప్ప అనేది మా తండ్రిగారి పేరు. నా పూర్తి పేరు బెంగుళూరు సరోజాదేవి’ అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. కన్నడిగురాలైనా ఆమె నటించిన సినిమాలు చూస్తే అచ్చ తెలుగు ఆడబడుచు అనిపిస్తుంది.
‘జగదేకవీరుని కథ’ లో కథా రచయిత పింగళి నాగేంద్రరావు పుట్టించిన కొత్తకొత్త పదాలు సరోజాదేవి పలకటం వల్లనే ఒక సొంపు, సార్ధకత ఏర్పడ్డాయి. ఇంద్రకుమారి, నాగకుమారి, వరుణకుమారి, అగ్నికుమారి నలుగురు దేవకన్యలూ భూలోకంలో కలుసుకుని మలయపర్వతం దగ్గర గల పారిజాత వనంలోని పన్నీటి కోనేరులో జలక్రీడలు ఆడుతూ ఉంటారు. సరోజాదేవి ఇంద్రకుమారిగా నటించారు. మనం ఫోన్ లో మాట్లాడేటప్పుడు ‘హలో’ అని అంటూ ఉంటాము. ఆ పదాన్నే కొంచెం మార్చి ‘హలా’ అని చెప్పారు రచయిత. నలుగురు దేవకన్యలూ ‘హలా సఖీ!’ అంటూ పలకరించుకుంటారు.
“ఇంద్రకుమారి వైనందుకా ఈ సొగసు, రాణా?” అని ఒకామె అంటే, “మరి, వరుణకుమారి వైనందుకా ఈ సౌరు, రువాణా?” అని అడుగుతుంది మరొకామె. ఇక్కడ సొగసు అంటే అందం, రాణా అంటే ఠీవీ అని అర్ధం. అవి ఇంకొంచెం ఎక్కువ మోతాదులో ఉంటే అవి సౌరు, రువాణా అవుతాయి అని పింగళి వారి భావం.
సాధారణంగా ‘జలకాలు’ అని అంటాము. కానీ వాటికి ‘ఆటలు’ చేర్చి, ‘జలకాలాటలు’ అని చేర్చారు ‘జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా’ పాటలో. అ పాటలో శరీరం మొత్తం నీటిలో ఉండి తల మాత్రమే మెడ వరకూ కనిపిస్తుంది. ఆమె ముఖం చూస్తుంటే కోనేటిలో విరిసిన నిండు తామరపుష్పంలా అనిపిస్తుంది. ఒకచోట ఇంద్రకుమారిని చూసి చెలి ‘తరుణకాలమేలే అది వరుని కొరకు పిలుపే’ అంటుంటే అంగీకరిస్తున్నట్లు. సిగ్గుపడుతున్నట్లు సరోజాదేవి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూస్తే పూలబాణంతో సూటిగా గుండెల్లోకి గురిచూసి కొట్టినట్లు మనసు ‘ఝుమ్మని’ అంటుంది మగవాళ్ళకి.
‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ లో సరోజాదేవి అందచందాలతో వెండితెర ‘జిగేల్’ మన్నది. ఆమె శ్రీకృష్ణుడి సోదరి సుభద్రగా నటించింది. ప్రధాన కథ గయుడి గురించి.. గయోపాఖ్యానము రంగస్థల నాటకంలో స్త్రీ పాత్ర ఏదీ లేదు. అంతవరకే చూపిస్తే ఆ చిత్రం అంతగా ఆకట్టుకునేది కాదేమో! ఆ కథకి సుభద్రా కళ్యాణ ఘట్టం చేర్చటం వల్లనే ఆ చిత్రం విజయవంతం అయింది. ఇందులో శ్రీకృష్ణుడిని సుభద్ర గారాబంగా ‘చిన్నన్నియ్యా!’ అంటుంది. సినిమా చూసిన తర్వాత ఆరోజుల్లో చెల్లెళ్ళు అందరూ వాళ్ళ అన్నలను గారాబంగా ‘చిన్నన్నియ్యా’ అనేవారు.
సుభద్రను దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేస్తున్నట్లు పెద్దన్నగారు బలరాముడు చెప్పగానే సుభద్ర తన మందిరానికి వెళ్లి, కన్నీరు కారుస్తూ తల్పం మీద పడుకుని ఉంటుంది. ఆమె అర్జునుడికి మనసిస్తుంది. ఇంతలో శ్రీకృష్ణుడు, రుక్మిణి అక్కడకు వస్తారు. “ఎందుకమ్మా విచారం? మేమంతా లేమూ!”, అంటాడు. “ఎవరున్నారేమిటి నన్ను అందరూ విడిచిపెట్టేశారు!” అంటుంది అలకగా. “అందరూ అంటే మీ చెల్లికి మీరేగా! ఓదార్చండి” అంటుంది రుక్మిణి నవ్వుతూ. “అర్జునుడికీ నీకూ కళ్యాణం జరిపించే భారం నాది” అని చేతిలో చెయ్యి వేస్తాడు. విప్పారిన కళ్ళతో ఆనందంగా చూస్తుంది అన్నగారి వంక. కన్నీళ్ళతో నిండిన ఆ కళ్ళు మంచుకు తడిసిన గులాబీ రేక ల్లాగా కనిపిస్తాయి. అర్జునుడితో వివాహం అయిన తర్వాత వివాహితగా గంభీరమైన నటన ప్రదర్శించారు సరోజాదేవి.
సరోజాదేవి మాతృభాష కన్నడం. కానీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించారు. “ఏ భాషలో నటించినా ఆ భాష కష్టపడి నేర్చుకుని పాత్రలకి మేమే డబ్బింగ్ చెప్పుకునే వాళ్ళం. అప్పట్లో మరొకరు మాకు డబ్బింగ్ చెప్పటం అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళం. వాచికంతోనే నటనకు సంపూర్ణత్వం వస్తుందని భావించేది మా తరం” అని చెప్పారు సరోజాదేవి ఒకసారి ఆంధ్రప్రభ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వూ లో.
‘శకుంతల’ చిత్రంలో దుష్యంతుడిగా యన్.టి.ఆర్., శకుంతలగా సరోజాదేవి నటించారు. దుష్యంతుడు మొదటిసారిగా శకుంతలను చూసినప్పుడు ఒక శ్లోకం ఉన్నది. ఆమె సౌందర్యానికి సమ్మోహితుడై తన శిబిరానికి వచ్చి ఇలా తలపోస్తూ ఉంటాడు.
‘అనాఘ్రాతం పుష్పం కిసలయ మలూనం కరరుహైః
అనావిద్ధం రత్నం మధునవమనా స్వాదిత రసమ్
అఖండం పుణ్యానాం ఫలమివచ తద్రూవ మనఘం
న జానే, భోక్తారం, కమిహ నమునస్థాప్యతి విధిః’
అంటే ‘ఎవరూ వాసన చూడని పుష్పం, విరగదీయని చిగురు, గోళ్ళతో చీల్చనిది, దారం ద్వారా రంధ్రం చేయని రత్నం, కొత్తగా రుచి చూడని తేనె వంటిది శకుంతల సౌందర్యం. ఎన్నోజన్మల పుణ్యం ఉంటేగానీ ఆమె దొరకదు. అలాంటి శకుంతలను వరించే అదృష్టం ఆ బ్రహ్మదేవుడు ఎవరికి కల్పించాడో తెలియదు కదా!’ అనుకుంటాడు. కాళిదాసు ఈ శ్లోకం సరోజాదేవిని చూసి రచించక పోయినా, ఆయన వర్ణనకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. శకుంతల వేషంలో ఆమె. రత్నాభరణాలు వంటి అలంకారాలు ఏమీ లేకుండా పువ్వులు, తీగలతో అలంకరించుకున్న ఆమె సహజ సౌందర్యం, నిర్మలమైన మనసు ముఖంలో ప్రతిఫలిస్తున్నట్లుగా ఉన్న ఆమెను చూస్తే నిజంగా శకుంతల ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది.
అత్తవారింటికి పంపేటప్పుడు పడవలో నది దాటుతూ ఉంటారు శకుంతల, ఆర్య గౌతమి, కణ్వమహర్షి శిష్యులు. అప్పుడు పడవవాడు ఆమెను చూస్తూ ‘చెంగాయి గట్టిన చిన్నదీ, చారెడేసి కళ్ళు ఉన్నదీ, మనసులోన అది ఏవో ఏవో మడిచి పెట్టుకుంటున్నది’ అంటూ పాడుతూ ఉంటాడు. భర్తతో గడపబోయే భావి జీవితం గురించి మధురోహలలో తేలిపోతూఉన్నట్లు, సిగ్గుతో, అరమోడ్పు కనులతో, నీటిలో చేతిని పెట్టి అటూ ఇటూ కదిలిస్తూ ఇస్తున్న ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అపూర్వం. శకుంతల ఆనందం చూసి ఆర్య గౌతమి మునికుమారుల వంక కంటిసైగతో చూపుతూ కొంటెగా నవ్వుతుంది. ఈ సన్నివేశంలో సరోజాదేవి డైలాగ్స్ లేకపోయినా చాలా బాగా నటించింది. తర్వాత వచ్చే శకుంతలా దుష్యంతుల సంవాదం కూడా రోమాంచితం చేస్తుంది.
‘సీతారామ కళ్యాణం’ చిత్రంలో సరోజాదేవి అందం చూడటానికి రెండు కళ్ళూ చాలవు. యన్.టి.ఆర్. రావణాసురుడుగా, సరోజాదేవి మండోదరిగా నటించారు. మండోదరి పాత్ర చాలా చిన్నది. ప్రధాన స్త్రీపాత్ర సీత. సీతగా గీతాంజలి నటించింది. అది ఆమెకు మొదటి సినిమా కావటం వలన భయంతో బిగుసుకుపోయి, ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా కనిపిస్తుంది. రాముడిగా నటించిన హరనాథ్ కూడా అప్పటికి చాలా జూనియర్. అలాకాకుండా యన్.టి.ఆర్., సరోజాదేవి సీతారాములుగా, యస్.వి. రంగారావు రావణాసురుడిగా నటిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ చరిత్రను మార్చలేం కదా! ప్చ్! ఏం చేస్తాం?
‘ఇంటికి దీపం ఇల్లాలే’ చిత్రంలో హీరో తమ్ముడిని ప్రేమించి, విధివశాత్తూ అతడి అన్నని (హీరోని) పెళ్లి చేసుకుంటుంది. అంటే వివాహం కాకముందు అతడికి ప్రేయసిగా ఉండి, వివాహం అయిన తర్వాత వదినగా మారుతుంది. అన్న పెళ్లి చేసుకున్నది తన ప్రేయసినే అని తెలియని తమ్ముడు వదినను చూడాలని ఊరి నుంచీ ఉత్సాహంగా వస్తాడు. ఆమె వంటింట్లో అన్నం వండుతూ ఉంటుంది. అన్నం కుతకుతా ఉడుకుతూ పొంగిపోతూ ఉంటుంది. వెనకనుంచీ అతడి మాటలు వినబడి వెనుదిరిగి చూస్తుంది. ఆమెను చూసి నివ్వెరపోయి ‘సుగుణా!’ అంటాడు. ‘కాదు. వదిన’ అంటూ పొంగు మీద గ్లాసుడు చన్నీళ్ళు పోస్తుంది. ఉరకలు వేసే అతడి మనసు మీద ‘నేను నీ వదినను’ అంటూ చన్నీళ్ళు చల్లినట్లు ఉడికే అన్నం మీద చన్నీళ్ళు గుమ్మరించటం సింబాలిక్‌గా చాలా బాగా చూపించారు. భార్య ప్రేమించింది తన తమ్ముడినే అనే విషయం హీరోకి తెలిసి, ఆమెను ద్వేషిస్తూ ఉంటాడు. భర్త మనసుకు దగ్గర కాలేక, నిజాన్ని కాదనలేక నలిగిపోతూ ఉంటుంది సుగుణ. మానసిక సంఘర్షణతో కూడుకున్న సుగుణ పాత్రను చాలా ప్రశంసనీయంగా నటించారు సరోజాదేవి.
‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ లో మూడు పాత్రల్లో నటించారు సరోజాదేవి. ఉమ పాత్రకు పి. సుశీల, చండి పాత్రకు యల్.ఆర్.ఈశ్వరి, గౌరి పాత్రకు యస్.జానకి నేపధ్యగానం అందించారు. రాజకుమార్తె ఉమగా రాజసం, సామాన్యస్త్రీ గౌరిగా సౌకుమార్యం, అటవిక స్త్రీ చండిగా మొరటుతనం ఇలా మూడు పాత్రల్లోనూ వైవిధ్య భరితమైన నటనను చూపించారు.
‘ప్రమీలార్జునీయం’ రాణీ ప్రమీలగా రాజసంతో కూడిన అభినయం ప్రదర్శించారు. వీరరసం ప్రధానమైనా స్త్రీ సహజమైన సౌకుమార్యం, సిగ్గు, బిడియం చక్కగా చూపించారు ప్రమీల పాత్రలో. సాధారణంగా ప్రమీలార్జునీయం కల్పిత కథ అనుకుంటారు. కానీ అది కల్పన కాదు. వ్యాస మహర్షి శిష్యుడైన జైమినీ మహర్షి రచించిన ‘జైమినీ భారతం’ లోనిది ఆ వృత్తాంతం.
పౌరాణిక చిత్రాల్లో మండోదరిగా రెండుసార్లు, పార్వతీదేవిగా రెండుసార్లు, సీత, సుభద్ర, ప్రమీల, శకుంతల, కర్ణుడి భార్య ప్రభావతి పాత్రల్లో నటించారు. మాతృభాష తెలుగు కాకపోయినా సంస్కృత సమాస భూఇష్టమైన సంభాషణలు స్పష్టంగా, సరైన భావ వ్యక్తీకరణతో అలవోకగా చెప్పేవారు సరోజాదేవి.
“ఉన్నతమైన నటిగా నిలదొక్కుకోవాలనుకునే వారికి మీరిచ్చే సందేశం ఏమిటి?” అని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు “చేపట్టిన వృత్తిని గౌరవించటం, శ్రమించటం, క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని గడపటం, ఆత్మగౌరవం కాపాడుకోవటం, జీవితంలో ఒడిదుడుకులని సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞత కలిగి ఉండటం, ఇవే నేను చెప్పాలనుకునేవి” అన్నారు సరోజాదేవి.
ఇప్పుడు ఆమె మన మధ్య లేకపోయినా ఆమె చలాకీతనం, చెరగని చిరునవ్వు, చిలకపలుకులు ఎప్పుడూ మనలను పలకరిస్తూనే ఉంటాయి ఆ చలన చిత్రాల ద్వారా.
తెలుగులో బి.సరోజాదేవి నటించిన చిత్రాలు:-
పాండురంగ మహాత్మ్యం (1957), భూకైలాస్ (1958),పెళ్లి సందడి (1959), పెళ్లి కానుక (1960), జగదేక వీరుని కథ (1961), సీతారామ కళ్యాణం (1961),ఇంటికి దీపం ఇల్లాలే (1961), శ్రీకృష్ణార్జున యుద్ధం (1963), మంచి చెడు (1973), దాగుడుమూతలు (1964),అమరశిల్పి జక్కన (1964) ఆత్మబలం (1964), ప్రమీలార్జునీయం (1965), శకుంతల (1966), రహస్యం (1967), ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968), భాగ్యచక్రం (1968), విజయం మనదే (1970), మాయని మమత (1970), పండంటి కాపురం (1972), మాతృమూర్తి (1972), ఎర్రకోట వీరుడు (1973), మనసు మనువు (1973)మనుషుల్లో దేవుడు (1974), శ్రీరామాంజనేయ యుద్ధం (1970), దానవీర శూర కర్ణ (1977), సీతారామ వనవాసం (1977), అల్లుడు దిద్దిన కాపురం (1991) సమ్రాట్ అశోక (1992).
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.