Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అక్షయ పాత్ర

[తమిళంలో ఎస్‌.కె.పి.కరుణా రచించిన కథను తెలుగులో ‘అక్షయ పాత్ర’ పేరిట అందిస్తున్నారు జిల్లేళ్ల బాలాజీ.]

ది 1981 లేదూ 82 వ సంవత్సరం కావచ్చు.

ఒకరోజు ఉదయం మా నాన్న నన్ను మా పొలం దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఆరేడుగురు మంది యువకులు లుంగీ బనియన్లతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. బావి తవ్వటానికి వచ్చిన మనుషులేమోనని భావించాను.  ఎందుకంటే, బావి తవ్వటమంటే, మా నాన్నకు భలే కాలక్షేపంగా ఉండేది. ఎప్పుడూ, మా స్థలంలో ఏదో ఒకచోట ఏదో ఒక బావి తవ్వుతూనే ఉంటారు.

కారు నుండి దిగగానే, వాళ్లందరూ లేచొచ్చి, మా నాన్నకు నమస్కరించి మాట్లాడటం మొదలు పెట్టాకే నాకు ఆ తేడా కనిపించింది. వాళ్లు మాట్లాడిరది తమిళమే. అయితే తమిళం కాదు. నా జీవితంలో మొట్టమొదటిసారిగా శ్రీలంక తమిళాన్ని విన్నాను.

శ్రీలంక నుండి అప్పటి పరిస్థితుల్లో ఎందరో శరణార్థులు వస్తుండేవాళ్లు. దినత్తంది (డైలీ) పత్రికలో ఐదవ పేజీలో దొన్నెల్లో వచ్చి మండపం (ప్రాంతం) శిబిరంలో వాళ్లు దిగటాన్ని ఫోటోతో కూడిన వార్తలను ప్రచురిస్తూ ఉండేవాళ్లు. ఇప్పటిలాగా శ్రీలంక అని కాకుండా సిలోన్‌ అని రాసేవారని అనుకుంటున్నాను. అదే విధంగా, ‘తిరుగుబాటుదారులు’ అన్న పద ప్రయోగం అప్పుడున్నట్టుగా కూడా గుర్తులేదు.

అలా శరణార్థులుగా వచ్చేవాళ్లను రెవిన్యూ శాఖాధికారులు, కలెక్టర్లు, ఎందుకూ కొన్ని సమయాలలో మంత్రులు కూడా నేరుగా వెళ్లి ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చి రాష్ట్రమంతటా ఏర్పాటు చేయబడ్డ శరణార్థుల శిబిరాలకు పంపించేవారు. అనుమానం లేకుండా ముఖ్యమంత్రి ఎం.జి.ఆర్‌. ఈ విషయంపై ప్రత్యేక దృష్టిని సారించారు. పొరబాటున ఏదైనా జరగరానిది జరిగితే మరునాడు మురసొలి (దినపత్రిక) లో ప్రభుత్వ తీరును ఎండగడుతూ కలైంజ్ఞర్‌ (కరుణానిథి) ఒక్క కుదుపు కుదిపేవారు. ఆ మరునాడు నుండి మళ్లీ మంత్రుల ఆహ్వానాలు మొదలయ్యేవి.

మా నాన్న, వచ్చిన ఆ యువకులను చూస్తూ, “ఏమయ్యా, ఈ చోటు చాలా? మీకు సౌకర్యంగా ఉంటుందా?” అని అడిగాడు.

“అయ్యో, దొరా. ఇదే ఎక్కువ. మామిడిచెట్టు, బావి, పంపుసెట్టు, వరి పొలం! ఇంతకుమించి ఏం కావాలి? ఇది స్వర్గం కదా? అచ్చు మా దేశంలో లాగానే..” అన్నారు.

నడుము దగ్గరున్న పంచె మడతలో నుండి, పదిరూపాయల నోట్లకట్టను తీసి ఇస్తూ.. “కొన్ని సామాన్లను లారీలో పంపుతాను. ఇది చేతి ఖర్చుకు ఉంచుకోండి.” అన్నాడు.

అందులో ఒక యువకుడు, ఆ డబ్బును తీసుకుని, “మీరేమీ శ్రమ తీసుకోకండి దొరా. ఏది వీలవుతుందో అది చెయ్యండి చాలు. మాకన్నీ అలవాటేగా.” అన్నాడు.

“సరే, సరే!” అని బయలుదేరిన వ్యక్తి, కార్లో వస్తుంటే మా డ్రైవరుతో.. “రేయ్‌! వీళ్లు బ్రతకటానికి వచ్చిన వాళ్లు కారు. సిలోన్‌లో యుద్ధం చేస్తున్నవాళ్లు. అక్కడ పోలీసులు వెతుకుతున్నారని ఇక్కడికొచ్చేశారు. వాళ్లకు మీ చేతివాటం చూపించకండి.” అనగానే నేనర్థం చేసుకున్నాను. నేను చూసింది ఆశ్రయం కోరి వచ్చిన శరణార్థులను కాదు, శ్రీలంక పోరాట వీరులను అని!

ఆ సాయంత్రమే ఒక లారీలో, వెదురు కర్రలు, తాళ్లు, కొబ్బరి మట్టలు, చిరిగిన టార్పాలిన్‌ పట్టలు, వంట పాత్రలు, మూటల్లో బియ్యం, నిత్యావసర వస్తువులతో మళ్లీ పొలం దగ్గరికెళ్లాను. వాళ్లే, లారీలోకెక్కి అన్ని సామాన్లను దింపుకున్నారు. ఉదయం చూసిన చోటుకు, ఇప్పుడు చూడటానికీ ఎంతో తేడా కనిపించింది. కొన్ని పారలు, కొన్ని ఇనుప తట్టలు, ఒక కత్తి, గడ్డపారను పెట్టుకుని, ఖాళీ ప్రదేశంలో ఒక పెద్ద కంచెను, రాళ్లతో పొయ్యి, ముళ్లకంపలతో ఒక స్నానాల గది అంటూ.. ఏంటేంటో చేసేశారు.

కొబ్బరి మట్టలు, సామాన్లను చూడగానే ఉత్సాహంతో పాట పాడటం మొదలుపెట్టారు. బహిరంగ ప్రదేశంలో బస చెయ్యటానికి తయారుగా ఉన్న వాళ్లకు, ఇప్పుడొక గుడిసె దక్కనుండటంతో, ఆ సంతోషంలో పాడుతున్నట్టుగా నాతో చెప్పిన ఆ అన్న, వాళ్లు నరుక్కొచ్చి మిగిలిన ఓ పొడవైన వెదురు కర్రతో నాకు ఆడుకోవటానికి బిల్లంగోడును తయారు చేసిచ్చాడు.

నేను మళ్లీ మళ్లీ అక్కడికెళ్లి వాళ్లను చూసినట్టుగా నాకు గుర్తులేదు. అయితే, ఒకసారి వాళ్లల్లో ఒక అన్న నన్ను టౌన్లో చూసి, “మీ నాన్నతో చెప్పి ఒక లోడ్డు ఇసుకను దింపమని చెప్పగలవా?” అని అడిగాడు.

“దేనికి ఒక లోడ్డు ఇసుక అని మా నాన్న అడిగితే నేనేం చెప్పాలి?” అని అతణ్ణి అడిగేసరికి, “కబడ్డీ ఆడటానికి మైదానం ఏర్పాటు కోసం” అని చెప్పమన్నాడు.

ఆ విషయం మా నాన్నకు చెప్పగానే, “పోరా! పంట పండే స్థలంలో ఇసుకను దింపుతారా? వాళ్లకు బుద్ధి లేదంటే, నువ్వూ వచ్చి అడుగుతున్నావే?” అని తిట్టాడు.

వాళ్లు బస చేసిన మా పొలానికీ, టౌనులో ఉన్న మా బస్సు కంపెనీకి 4 కి.మీ.ల దూరం ఉంటుంది. రోజూ  సాయంత్రం వాళ్లు అక్కడికొచ్చేవాళ్లు. ఎప్పుడూ నడుచుకుంటూనే వచ్చేసేవాళ్లు.

“సైకిలు కొనివ్వనా?” అని మా నాన్న అడిగినా కూడా, “వద్దు దొరా! నడవటం శరీరానికి వ్యాయాయం అంటారు. మా ఊళ్లో, రోజూ 40 కి.మీ.లైనా నడవాల్సి ఉంటుంది.” అనేవాళ్లు.

మా నాన్న వాళ్లను ఏ పనినీ చెయ్యనిచ్చేవారు కారు. వాళ్లేమో, “బస్సు కంపెనీలో ఎంతో మంది, ఎంతో పని చేస్తున్నారు. మమ్మల్ని మాత్రం ఏ పనీ చెయ్యనివ్వనంటున్నారే.” అని నిజంగానే కోపగించుకునేవాళ్లు. సాయంత్రం నుండి రాత్రి వరకూ కాదనకుండా ఎన్నిసార్లు టీ ఇచ్చినా తాగుతూనే ఉండేవాళ్లు.

ఆ రోజు, మా నాన్న, తప్పుచేసి దొరికిపోయిన ఒక డ్రైవరునో, కండక్టరునో చావబాదుతున్నాడు. దానికోసమే, ఎప్పుడూ ఫాన్‌బెల్టు ఒకటి తయారుచేసి, ఆయన చేతికి అందుబాటులో తగిలించబడి ఉండేది. పూజ పూర్తిచేసి తిరిగొచ్చి కూర్చొన్న వ్యక్తితో, ఒకడు, “దొరా, మీరు మా ఊరికొస్తే మిమ్మల్ని పెట్టుకుని ఏదేదో సాధించుకోవచ్చులా ఉందే.” అన్నాడు.

మా ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఉన్న ఫిజికల్‌ ట్రైనింగు సెంటర్లో వీళ్లూ ప్రాక్టీసు చేస్తూ వచ్చారు. ఏదో కారణం చేత ఉండూరు మనుషులకూ, వీళ్లకూ గొడవలొచ్చి ఉండూరు మనుషుల్లో పదిమందికి పైగా దెబ్బలు తగిలి ప్రభుత్వాసుపత్రిలో చేర్చటం జరిగింది.

వీళ్లపైన పోలీసు కంప్లైంటు ఇచ్చి, జైల్లో పెట్టించాలని కలిసికట్టుగా వచ్చిన ఉండూరు మనుషులతో, “ఏం చెప్పి కేసు పెట్టాలి? వీళ్లు వేరే దేశస్థులు. మన దగ్గర ఆదరవు కోరి వచ్చారు. దండించి వదిలిపెట్టటం చెయ్యకుండా, మనమే జైల్లో పెడితే, రేపు సిలోన్‌ వాళ్లల్లో ఎవరైనా మన ఊరిని గౌరవిస్తాడా? వెళ్లండయ్యా! నేను చూసుకుంటాను, అని..” అందరినీ పంపించేశాడు.

వెంటనే, మరునాడు మా పొలంలో ఒక లోడ్డు ఇసుకను దింపారు. ఆచ్చారికి చెప్పి ఎన్నో కొలతలతో దండేలు కర్రలను చెయ్యించి తీసుకొచ్చారు. మా నాన్నే ఆయన యవ్వనంలో ఒక బాడీ బిల్డింగు ప్రియుడు కావటంతో ఆయనకు ఏమేమి అవసరమో అన్నీ తెలుసు. మా బస్సు షెడ్డులోనే Parallel Bar, Ring Bar లాంటివి ఏర్పాటు చెయ్యటం జరిగింది. ఒకే రోజులో ఆ ఏడెనిమిదిమంది వ్యక్తుల కోసం, తిరువణ్ణామలైలోనే ఓ గొప్ప బాడీ బిల్డింగు సెంటరు ఏర్పాటైంది.

సాయంత్ర సమయాలలో, బస్సు కంపెనీ గుమ్మం ముందున్న వేపచెట్టు నీడలో ఓ కుర్చీలో మా నాన్న కూర్చోనుంటే, చుట్టూ లుంగీ చొక్కాలతో వీళ్లు నేలమీద కూర్చుని సిలోన్‌లో జరుగుతున్న విషయాలు మాట్లాడుకుంటూ వుండేవాళ్లు. మెకానిక్‌ అసిస్టెంట్‌ ఓ పదిసార్లయినా టీలు, బీడీ కట్టలు తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు. దెబ్బలు తిన్న ఉండూరు యువకులూ, వాళ్లకు సంబంధించిన  వాళ్లూ ఆ దృశ్యాన్ని చూసి గొణుక్కుంటూ వీధిలో వెళుతూ ఉండటాన్ని ఎన్నోసార్లు చూశాను.

బస్టాండును దాటుకునే  నేను మ్యాథ్స్‌ ట్యూషనుకు వెళ్లాలి. అలా, నేను బస్టాండును దాటుకుని వెళుతున్నప్పుడల్లా, వీళ్లల్లో ఎవరో ఒక అన్న అక్కడ కూర్చుని ఉండటాన్ని ఎప్పుడూ చూస్తుండేవాణ్ణి.

“ఏంటన్నా ఇక్కడున్నారు?” అని అడిగితే, “ఉత్తినే, వేడుక చూస్తున్నాను. నువ్వెళ్లు తమ్ముడూ.” అని పంపించేసేవాళ్లు.

ఒకరోజు, వాళ్లల్లో ఒకతను మా బస్సు షెడ్డుకొచ్చి, వాళ్లను వెతుక్కుంటూ, ఎవరైనా వస్తే అలా ఎవరూ ఇక్కడ లేరని చెప్పమని కోరాడు. అప్పుడు, మా అకౌంటెంటు “మిమ్మల్ని వెతుక్కుంటూ ఎవరొస్తారు?” అని అడిగేసరికి, ఏదో అయోమయంగా ఒక సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.

అలవాటుగా మా మోడర్న్‌ రైసుమిల్లు నుండే వాళ్లకు బియ్యం పంపిస్తుండేవాళ్లం. ఇడ్లీ, దోసెలు తినే అలవాట్లేవీ వాళ్లకు లేవు. మూడు పూటలా వరి అన్నమే. కాబట్టి మూటలు మూటలుగా బియ్యాన్ని పంపించేవాళ్లం. అలా పంపిన బియ్యం మూటలను ఒకసారి వాళ్లు వెనక్కు తిరిగి పంపించేశారు.

“ఎందుకురా? వెనక్కు తీసుకొచ్చేశావు?” అని మా నాన్న డ్రైవరును అడగగానే, “బాగా కొవ్వెక్కి పోయిందయ్యా వాళ్లకు. బియ్యంలో పురుగులు మేస్తున్నాయి. దుర్వాసన వస్తోందని చాలా ఫిర్యాదులు చేస్తున్నారు. పోండ్రా అని వెనక్కు తీసుకొచ్చేశాను.” అన్నాడు.

ఈ విషయం విన్న మా నాన్నకూ కోపం నషాళానికెక్కింది. ఆయన తిట్ల దండకం మొదలుపెట్టారు. (మా నాన్న కోపమూ, కోపంలో ఆయన తిట్లూ చాలా ప్రసిద్ధి.)

“కృతజ్ఞత మరిచిన కుక్కలు. దానమిచ్చిన ఆవు పన్నునే పీకటానికి చూస్తున్నార్రా?” అని గట్టి గట్టిగా అరిచి ఇంటికెళ్లిపోయారు

ఎవరినో పిలిచి, “ముందు వాళ్లను మన జాగా నుండి ఖాళీ చేసి వెళ్లిపొమ్మని చెప్పు. తెల్లవారి అక్కడికెళ్లేసరికి, ఒక్కరు కూడా ఉండకూడదు.” అని కేకలేశారు.

ఈ ఒక సంవత్సరంలో, మా కంపెనీలో పనిచేసే కొందరు వాళ్లకు స్నేహితులుగానూ, కొందరు శత్రువులుగానూ మారారు. స్నేహితులుగా మారటానికి కారణం పశ్చాత్తాపం. శత్రువులు కావటానికి కారణం ఈర్ష్య.

‘బ్రతకటానికొచ్చి, మన యజమానితో సరిసమానంగా కూర్చుని బీడీ తాగుతున్నారే’ అన్న ఒకమాట అక్కడ ఎప్పుడూ ఉండేది. వాళ్లపై మా నాన్నకు ఫిర్యాదు చేసిన డ్రైవరు ఆ శత్రువులలో ఒకడు.

మరునాడు తెల్లవారి వాళ్లు బయలుదేరి వెళ్లిపోయారు. ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నట్టుగా, అక్కడికి వెళ్లి చూసొచ్చినవాళ్లు చెప్పారు. వాళ్ల సొంత బట్టల్ని కూడా తీసుకెళ్లకుండా, మా ఇంటికొచ్చి మా అమ్మతో, “మేము వెళ్లొస్తాం.” అని చెప్పి వెళ్లిపోయారు. మేమెవరమూ వాళ్లను ఆపేందుకు ప్రయత్నించక, నిర్ఘాంతపోతూ నిలబడ్డాం. నాకు ఏడుపును ఆపటానికి వీల్లేకపోయింది.

ఆ రాత్రి, మా నాన్న భోజనం చేసి ఇంటి బయట కుర్చీలో కూర్చుని సిగరెట్టు తాగుతున్నప్పుడు, రైసుమిల్లులో పనిచేసే ఒక మహిళ ఆయనను కలవటానికి వచ్చింది.

“ఏంటి విషయం?” అని నాన్న అడిగేసరికి, ఆ పన్నాగం బయటపడింది.

మామూలుగా, మా నాన్న పంపమని చెప్పిన నాణ్యమైన బియ్యాన్ని ఆ డ్రైవరూ, రైసుమిల్లులో పనిచేసే ఓ పనివాడూ ఒక అంగట్లో అమ్మి, ఆ డబ్బును పంచుకుని, రైసుమిల్లులో చివరగా మిగిలిన అడుగు బియ్యాన్ని వాళ్లకు పంపించారు. అది మామూలుగా పందులకు ఆహారం కోసం తీసుకెళ్లేవాళ్లు. ఆ అమ్మిన డబ్బును కూడా రైసుమిల్లును శుభ్రం చేసే పనివాళ్లకు పంచబడుతుంది.

తర్వాత ఒక గంట సమయంలో ఆ డ్రైవరూ, సాయపడ్డ పనివాడూ కట్టివెయ్యబడి తీసుకు రాబడ్డారు. రాత్రి 10 గంటలకు నేను చొక్కా కూడా వేసుకోకుండా, ఇంట్లో నుండి షెడ్డుకు పరుగెత్తి ఆ దృశ్యాన్ని చూశాను. ఆ ఇద్దరూ ఒక గది మూలన కూర్చోపెట్టబడ్డారు. బాగా దెబ్బలు తిన్నట్టుగా గుర్తులు కనిపించాయి. నాకు ఆ దృశ్యం చూసేందుకు చాలా సంతోషంగా అనిపించింది.

శ్వాస తీసుకోవటానికి వచ్చి కుర్చీలో కూర్చున్న మనిషి, ఒక సిగరెట్టును వెలిగించి, “రేయ్‌, వెంటనే వెళ్లి ఆ యువకులు ఎక్కడున్నా వెంటబెట్టుకుని రండ్రా.” అని అక్కడున్నవాళ్లతో చెప్పాడు. వెంటనే, ఎన్నో వాహనాలలో చాలామంది ఆ యువకులను వెతకటానికి బయలుదేరారు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ ఏ సమాచారమూ లేదు. మా నాన్న ముందురోజు రాత్రి వచ్చిన వాడు, మళ్లీ ఇంటికి వెళ్లలేదు. కుర్చీలో కూర్చుని సిగరెట్టును పీలుస్తూ మామూలుగా వాళ్లొచ్చే రోడ్డుకేసే చూస్తూ ఉన్నాడు.

మాకెవరికీ ఆయన దగ్గరికెళ్లి, “ఏమైనా తింటారా?” అని అడగటానికీ భయం.

“ఏమయ్యా! వాళ్లు కనిపించకపోతే, యజమాని ఏమీ తినరా, ఏంటీ? ఎవరైనా వెళ్లి ఆయనను ఇంటికి తీసుకెళ్లండయ్యా.” అన్నాడు అకౌంటెంటు.

“ఏం! ఆ విషయాన్ని నువ్వెళ్లి చెప్పూ.” అని ఎవరో చెప్పటంతో, అతనికేసి తిరిగి కోపంతో చూడటం ఇం.నా.గు.(ఇంకా నాకు గుర్తుంది).

ఆ సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగెళుతున్న ఒక ప్రభుత్వ బస్సు డ్రైవరు, మా బస్సు షెడ్డులో గుంపుగా ఉండటాన్ని చూసి లోపలికొచ్చి, “ఏం నాన్నా, ఎందుకు బయట కూర్చోనున్వావు?” అని మా నాన్నను అడిగేసరికి, (పదేళ్ల పిల్లవాడు మొదలుకొని ఎనభై ఏళ్ల పెద్దాయన వరకూ మా నాన్నను ‘నాన్నా’ అనే పిలుస్తారు.) అక్కడున్న ఎవరో ఆయనకు విషయమంతా చెప్పారు.

“అరె! ఆ పిలకాయలా? నా బండ్లోనే కదా వచ్చారు. టిక్కెట్టుకు కూడా వాళ్ల దగ్గర డబ్బుల్లేకపోతే, నేనే కదా ఇచ్చి ‘ఊత్తంగరై’ లో దింపాను.” అని చెప్పేసరికి కొన్ని వాహనాలు ఊత్తంగరై కేసి బయలుదేరాయి. ఆ రోజు రాత్రిలోపు, వాళ్లందరూ మళ్లీ తిరువణ్ణామలైకు తీసుకు రాబడి, వాళ్లకు అలవాటైన చోటే ఉంచబడ్డారు.

ముందురోజు భోజనం చేశాక, మరుసటి రోజే మా నాన్న మళ్లీ భోజనం చేశారు. మరునాడు ఉదయం ఆయనతో కలిసి నేనూ పొలం దగ్గరికెళ్లాను. కారు నుండి కిందికి దిగుతుండగానే, వాళ్లందరూ తలలు వంచుకొని నిలబడ్డారు. పైన చొక్కాలు లేకుండా, ఒఠి లుంగీలతో వాళ్లు అప్పుడు నిలబడున్న దృశ్యమూ నాకు ఇం.గు.

కారు నుండి దిగగానే, నాన్న వాళ్లను అడిగిన మొదటి ప్రశ్న, “ఏరా, దద్దమ్మల్లారా! ఏవైనా లోపాలుంటే నాకు చెప్పరా? రోజూ నన్ను కలవటానికి వస్తుంటారు కదా! అప్పుడంతా నోట్లో ఏం పెట్టుకోనున్నారు?” అన్నాడు.

“లేదు దొరా! మేము ఏదైనా కావాలని అడగటానికి ముందే అన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు, అక్షయ పాత్ర లాగా! బియ్యం బాగాలేదని మీతో ఎలా చెప్పమంటారు?” అన్నాడొకడు.

అదొక ఆదివారం. ఒక పెద్ద నేరభావన నుండి బయటపడ్డ సంతోషంలో ఉన్నాడు మా నాన్న. ఉదయం టిఫిన్‌గా అందరికీ పెద్ద పాత్రలో ఇడ్లీలు, కోడికూరతో వచ్చింది మా అమ్మ. రాత్రి భోజనానికి ఒక మేకపోతును తీసుకొచ్చి, వాళ్లకు ఇవ్వమని ఆనందంగా డ్రైవరుతో చెప్పాడు నాన్న.

ఆ రాత్రి, వాళ్లకంటూ నాన్న పంపించిన ఒక పెద్ద సారా క్యానును (అప్పుడు ఒక సారా అంగడి మా షెడ్డుకు పక్కనే ఉండేది) వాళ్లు తిప్పి పంపించేశారు.

‘వాళ్లెవరూ మన దేశంలో తాగరంట’ అని చెప్పి, సారా క్యానును మళ్లీ నాన్న దగ్గరికే తీసుకొచ్చిన డ్రైవరుకు పడింది ఒక దెబ్బ.

“ఏరా, ఇక్కడికి తీసుకొస్తున్నావు? తీసుకెళ్లి ఇంకెవరికైనా ఇవ్వూ.” అన్నాడు (నాన్న తాగరు).

ఒకరోజు అర్థరాత్రి పూట వాళ్లున్న చోటుకు (మా పొలం) బయటున్న హైవేపై ఓ బస్సుకు ప్రమాదం జరిగింది. పెద్ద ప్రమాదం అది. అక్కడికక్కడే కొందరు చనిపోగా, చాలామంది ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొస ప్రాణాలతో ఊగిసలాడుతున్నారు. శబ్దం విని బయటికొచ్చిన వీళ్లు, ఆ బస్సులో చిక్కుకుని కొస ప్రాణంతో ఉన్నవాళ్లను కాపాడి ఆ దారినే వచ్చిన ఒక ఒంటెద్దు బండిలోకి చేర్చారు.

ఆ ఒంటెద్దు బండి వేగంగా వెళ్లటం లేదని, ఎద్దును తప్పించి వాళ్లలో కొందరు, ఆ బండిని వేగంగా లాక్కుంటూ వచ్చి మా బస్సు కంపెనీకి ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అలా ఒకసారి కాదు, ఎన్నోసార్ల్లు గాయాలపాలైన వారిని బండ్లల్లో ఎక్కించుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించారు.

మరునాడు ఉదయం, ఈ విషయం తెలియగానే, ఊరు ఊరే ఆశ్చర్యపోయింది. బస్సులో ప్రాణం పోయినవారు, గాయాలపాలై వీళ్ల ద్వారా కాపాడబడిన వాళ్లందరూ ఉండూరువాళ్లు కావటంతో వీళ్ల సహాయం గొప్పగా ప్రశంసించ బడింది. ఈ కారణంగా వీళ్ల పట్ల కొంతమందికి ఉన్న కోపమూ తగ్గిపోయింది. అందరూ స్నేహభావంతో మెలగసాగారు.

భోజనం చెయ్యటం, శారీరక వ్యాయామం, నిద్రపోవటం తప్ప వీళ్లు చేసిన ఒకే ఒక పని మా ఇంటికి ఎదురుగా ఉన్న సినిమా థియేటర్‌లో సినిమాలు చూడటం. అందులో ఒక స్వారస్యమైన విషయం ఏంటంటే, వీళ్లందరూ శివాజీ గణేశన్‌ సినిమా మాత్రమే చూసేవాళ్లు. అందులోనూ, చూసిన సినిమానే, లెక్కలేకుండా మళ్లీ మళ్లీ చూసేవాళ్లు.

ఒకసారి, ఏదో ఒక పండుగనాడు, వాళ్లలో ఒక అన్న నన్ను ఒంటరిగా పిలిచి, తన లుంగీలో దాచిపెట్టిన చేతి తుపాకీని చూపించాడు. చెక్క పిడితో మూడు భాగాలుగా ఉన్న ఆ తుపాకీని, కొన్ని నిమిషాలలోనే జతచేసి చూపించాడు. ఆ తుపాకీతో ఒకసారి కాల్చి చూపించమని నేను అనగానే, “గుండ్లు ఏవీ మనకింకా దొరకలేదు.” అన్నాడు.

వాళ్లు బస చేసిన అప్పటి పరిస్థితిలో, వాళ్లు ఎప్పుడూ ఎవరి కోసమో ఎదురుచూసినట్టుగా ఇప్పుడు నాకు అనిపిస్తోంది. బస్టాండులో కాపలా ఉండటం, పదేపదే ఒకే చోటుకు వెళ్లకుండా ఉండటం, వీలైనంత వరకూ కొత్త వ్యక్తులు ఎవరితోనూ అలవాటుపడకుండా ఉండటం అంటూ ఎంతో జాగ్రత్తగానే ఉన్నట్టున్నారు. వాళ్లు ఎలా, ఎవరి ద్వారా మా నాన్నను వెతుక్కుంటూ వచ్చి సాయం అడిగారన్నది చివరి వరకూ నాన్న మాతో చెప్పలేదు. అయితే, వీళ్లెవరు? అన్నదీ, ఏ గ్రూపుకు చెందినవాళ్లు అన్నదీ మాకు ఒకరోజు తెలిసొచ్చింది.

ఆ ఒకవారం రోజులుగా, శుభ్రంగా బట్టలు ధరించి, ఎక్కడికో బయలుదేరటానికి తయారై ఉన్నట్టే ఉన్నారు. ఒకరోజు ఉదయం, వాళ్లల్లో ఒకడు, ఇంటికొచ్చి మా నాన్నను లేపి మా పొలానికి పిలుచుకొని వెళ్లాడు. తర్వాత, నాన్న కూడా అక్కడుండగానే, వాళ్లకు కావలసిన మధ్యాహ్నపు భోజనాన్ని ఇంటి నుండి చేసి తీసుకు రమ్మని చెప్పాడు.

ఆయన ఆ సాయంత్రం, ఇంటికి తిరిగొచ్చాకే అమ్మతో విషయం చెప్పాడు. వాళ్ల నాయకుడు సిరి.సభారత్నం ముందురోజు సాయంత్రం వచ్చి వాళ్లతో ఉన్నాడని అప్పుడే మాకు తెలిసొచ్చింది. ఇన్ని రోజులు, తమ బిడ్డల్ని భద్రంగా ఉంచుకొని కాపాడినందుకు, మా నాన్నకు నేరుగా వచ్చి కృతజ్ఞతలు చెప్పటానికే వచ్చాడట. ఆ వారం చివర్లో వాళ్లు విడివిడిగా బయలుదేరి వెళ్లిపోగా, దాదాపు ఏడాదిన్నర కాలం మా పొలంలో నివసించిన ఆ యువకుల ఆనవాళ్లు ఒక ముగింపుకొచ్చి, ఆ స్థలమే బోసిపోయింది. ఆ తర్వాత చాలారోజుల దాకా వాళ్లు వ్యాయామం చేసిన ఒక దండేన్ని భద్రంగా దాచుకున్నాను.

నాన్న చనిపోయిన చాలా ఏళ్ల తర్వాత (1996 లేదూ 1997) ఒక కార్తీకదీపం రోజున సాయంత్రం వేళ, మా బస్సు షెడ్డులో దీపం వెలిగిద్దామని ఎదురుచూస్తున్నాను. దీపం వెలిగించే ఆ క్షణంకోసం ఊరంతా ఎదురుచూస్తోంది. ఎందరో బయటి ఊరి ప్రయాణీకులు, మా షెడ్డు లోపలికొచ్చి, కొండ శిఖరం కేసి చూస్తున్నారు. షెడ్డు లోపలి నుండి కొండ శిఖరం బాగా కనిపిస్తుండటంతో, ఆ రోజు మాత్రం గుడికి వచ్చే బయటి ఊళ్ల ప్రయాణీకులనూ లోపలికి అనుమతించటం నాన్న అలవాటు. ఆ అలవాటు ఈ రోజు వరకూ కొనసాగుతోంది. సందడిగా ఉన్న ఆ సమయంలో, ఆ గుంపులో బట్టతలతో, గడ్డం పెట్టుకున్న ఒక సన్నని వ్యక్తి నన్ను పిలిచి, “మీరు కరుణానే కదూ?” అని అడిగాడు.

“ఔను మీరెవరు?” అని అడిగేసరికి, “నేను నీకు గుర్తుండను తమ్ముడూ. అప్పుడు నువ్వు చాలా చిన్నపిల్లవాడివి.” అన్నాడు.

“పెద్ద దొర ఎక్కడికెళ్లారు?” అని ఆసక్తితో ఆయన అడగగానే, “నాన్న చనిపోయి ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి.” అన్నాను. కొంతసేపు మౌనంగా ఉన్న తర్వాత, “ఎలాంటి మనిషి ఆయన? అక్షయ పాత్రలాగా.” అన్నాడు. మెరుపు వేగంతో నాకు ఆయనెవరో గుర్తుకొచ్చాడు.

1986 సంవత్సరం, సిరి.సభారత్నం, విడుదల పులుల (ఎల్‌.టి.టి.ఇ.: లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం) ముఖ్య నాయకుడు.. కల్నల్‌ కిట్టూ చేత కాల్చి చంపబడ్డాడు.

ఆ ఒక్క సంవత్సరంలోనే జరిగిన అంతఃఘర్షణలో, దాదాపు 400 మంది టెలో(తమిళ్‌ ఈలం లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌) యువకులు, ఎల్‌.టి.టి.ఇ. పులుల చేత చంపబడ్డారు. సిరి.సభారత్నం, పద్మనాభా, బాలకుమార్‌ వంటి ఎన్నో తిరుగుబాటు సంస్థల నాయకులు ఒక్కొక్కరుగా చంపబడి, యుద్దరంగం నుండి తొలగించబడ్డాక, మిగిలింది వాళ్ల ప్రారంభ కాల స్నేహితుడు వేలుపిళ్లై ప్రభాకరన్‌ మాత్రమే.

తమిళ మూలం: ఎస్‌.కె.పి.కరుణా

అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ

Exit mobile version