“తీవెనై పూలు పూసి నీ కనుల కళ నేనైనా మోవినై నీ మాటలు వినిపించాలని ఉంది” అంటున్నారు రాజావాసిరెడ్డి మల్లీశ్వరి “అక్షరమై నీతో” కవితలో.
అక్షరమై నీతో నే నిలవాలని ఉంది
లక్షణంగ నీతో కలిసుండాలని ఉంది
మది మౌనమైనా
ఆనందం పాట నేనైనా
ఆపలేని ఆత్మ సొదను
తెలపాలని ఉంది
తీవెనై పూలు పూసి
నీ కనుల కళ నేనైనా
మోవినై నీ మాటలు
వినిపించాలని ఉంది
శిశిర సౌందర్యమై నే
నీ ముందు నిలచినా
తీపి జ్ఞాపకమై నీలో
మెరవాలని ఉంది
ప్రేమంటే ఇదని నీకు
తెలియలేదుగా మళ్ళీ
వీడని గంధమై నిన్ను
అలుముకోవాలని ఉంది.
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి కథా రచయిత్రి, కవయిత్రి. గుంటూరు జిల్లాలో రేపల్లె తాలూకా మైనేనివారి పాలెంలో జన్మించారు. గుంటూరులో విద్యాభ్యాసం చేశారు హైదరాబాదులో బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో తెలుగు ఉపాధ్యాయినిగా పని చేసి పదవీ విరమణ చేశారు. ‘పదాల పరిమళాలు’, ‘ఇంద్రధనుస్సు’ అనే పుస్తకాలు వెలువరించారు.