[సముద్రాల హరికృష్ణ గారు రచించిన ‘అక్షర విన్యాసం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అక్షరాలు పదాలౌతున్నాయి
పదాలు వాక్యాలలో ఇమిడి పరుగులు తీస్తున్నాయి
ఆ ఒక్క అక్షరాన్ని ఆ రోజు
ఎందుకో అతని కలం పిలవలేదు
రూపు దాల్చని శిలలా
గళం నోచని గీతంలా
నిరీక్షించి నిరీక్షించి అలసిపోయింది
ఆ అక్షరం చిన్నవోయింది
అతని మీద కోపం తెచ్చుకుని మౌనం వహించింది
ఇది కాదు మార్గం అని అతని చుట్టూ తిరిగింది
ఆ కాయితం అంచుల తారాడింది
ఆ కలం మీద సోయగంగ వాలింది
అతను దాని విన్యాసాలు చూడకపోలేదు
చూస్తూనే ఉన్నాడు, రాస్తూనే ఉన్నాడు
ఆ ఉత్సాహం చూసి భళీ అన్నాడు
విలాసంగా నవ్వుకున్నాడు
వాజ్ఞ్మయబాల చైతన్యశీలత కబ్బురపడ్డాడు
ఆ రచన పూర్తయింది,లేవబోయి మళ్ళీ కూచున్నాడు
ఒక లేనవ్వు విరిసింది అతని పెదవులపై!
మొదటి పేజీలో ఇట్లా వ్రాశాడు —
ఓ అమృతాక్షరమా!
నీ మీద కోపంతో కాదు నిను వీడినది,
నిను వాడనిది!
నీ వంటి అక్షర వీరుడు వినా
నేనెంత దూరం వెళ్ళగలనో అని
నాకే ఒక సంప్రశ్న,
నాకై నే నారంభించిన ఒక సారస్వత సంశోధన!
నీ చిరు కినుకల, ఆప్యాయపు అలకల ఆశీస్సులతో
నే గమ్యం చేరాను, ఆ తృప్తిని సాధించాను!
నా ప్రేరణ నీవే, ఓ అతుల్యమా, అప్రమేయమా!
ఈ నా ప్రాణసమాన రచన నీకే, నీకే అంకితం!
నీ ఆరాధనలో సదా..
***
అంతా గమనించిన ఆ అక్షరహృదయం
పత్రరథమై ఎగసిపోయింది నింగి దారుల్లోకి!
సుఖీభవ, యశస్వీభవ సుశబ్దాలతో..